ఒసగితివిన్నియు నొకమాటే
డా.తాడేపల్లి పతంజలి
రేకు: 0354-05 సం: 04-319
పల్లవి: ఒసగితివిన్నియు నొకమాటే
వెస నిక జేసే విన్నపమేది
చ.1: నారాయణ నీనామము దలచిన -
నీరానివరములిచ్చితివి
చేరి నిన్ను నిటు సేవించిననిక
గోరి పడయ నిక గోరికలేవి
చ.2: హరి నీకొకమరి యటు శరణంటే
గరిమల నన్నిటు గాచితివి
నిరతముగా నిక నిను నుతియింపుచు
అరగొరతనివి నిను నడిగేదేదో
చ.3: శ్రీవేంకటేశ్వర చేయెత్తిమొక్కిన
భావమే నీవై పరగితివి
యీవరుసల నీవింతటిదాతవు
ఆవలనిను గొనియాడెడిదేమి
భావం
పల్లవి:
నారాయణ! ఒకసారి అన్నీ ఇచ్చావు.
ఇక నీకు నేను చేసే విన్నపమేది? (కోరిన విన్నపాలన్నీ ఇచ్చావు. ఇక నీకు చేసే విన్నపము ఏది లేదని భావం)
చ.1:
నారాయణ! నీనామము తలిస్తే -ఇయ్యరానివరములు ఇచ్చావు.
నిన్ను ఇటు సేవించి పొందుటకు ఇక కోరికలేవి? (కోరిన కోరికలన్నీ ఇచ్చావు. ఇక నిన్ను కోరే ఏ కోరికలు లేవని భావం)
చ.2:
హరి! నీకొకసారినేను శరణంటే –గొప్పతనములతో నన్ను రక్షించావు.
ఎప్పుడు నిను పొగుడుతూ – ఇంకా న్యూనతతో నిన్ను అడిగేదేది?(ఎప్పుడూ నువ్వు రక్షిస్తున్నావు కనుక ప్రత్యేకంగా రక్షించటానికి నిన్ను అడిగేదేమీలేదని భావం)
చ.3:
శ్రీవేంకటేశ్వర! చేయెత్తి మొక్కితే-భావమే నీవై ఉన్నావు.
ఈవరుసలలో (ఇంతమంది మహానుభావులయిన దాతల వరుసలలో ) నీవు ఇంతటిదాతవు( మిగతా దాతలు అడిగితే ఇస్తారు. నేను ఇంకా అడగకుండానే నా భావాన్ని గ్రహించి నాకు కావలసినది ఇచ్చావు. అందుకే నువ్వు గొప్పదాతవని భావం)
ఇక నిను పొగడటానికి ఏముంది?(నీ అంత గొప్పదాతను పొగడటానికి నా దగ్గర ఏ మాట మిగలలేదని, నీ అంత గొప్పవాడిని పొగడటానికి నాకు మాటలు చాలటం లేదని భావం)
No comments:
Post a Comment