శివ శతకము - అజ్ఞాత కవి
దేవరకొండ సుబ్రహ్మణ్యం
శివ శతకము రచించిన కవి వివరాలు ఏవియు ఈశతకము నందు లభించుటలేదు. ఈశతకము రచించిన కవి బహుశా వీరశైవుడు అయి ఉండవచ్చునని ఈశతకములోని పద్యములను విశ్లేషించిన పండితుల అభిప్రాయము. కవికాలము మిర్ణయించుటకు ఈశతకములో ఉదాహరించిన కొన్ని పద్యముల కొంతవరకు సాధ్యము అవుచున్నది. చరిత్రకారుల అభిప్రాయము ననుసరించి ఈకవి పదహారవ శతాబ్ధి తరవాతవాడుగా తోచుచున్నది. అందుకు నిద్రషనముగా ఈకవి ఉదాహరించిన దూర్జటి కథను బట్టి పద్యమును చరిత్రకారులు ఈ నిర్ణయానికి వచ్చారు. ఇంతకు మించి మనకు ఈకవి గురించి ఎటువంటి సమాచారము దొరకటం లేదు.
శతక పరిచయం:
"శివా" అనే మకుటంతో కందపద్య వృత్తాలలో లభించిన ఈశతకం అసంపూర్ణం. కేవలం 103 పద్యాలు మాత్రమే లభించాయి. పరిన్ని పద్యాలు నష్టమైఉండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయం.
ఈశతకము నందలి పద్యములు శివలీలలు, శైవులప్రభావములు తెలుపుతున్నాయి. పద్యములు మంచి భావములతో నిండి మంచి నడ్కతో ఉన్నాయి. ఈశతకంలో లక్ష్ణలోపములు తరచుగా కనిపిస్తాయి. ఉదాహరణకు ఇత్వ, అత్వములకు యతి కల్పించుట, మరికొన్నిచోట్ల గణనియమము కూడా పాటించలేదు.
ఇప్పుడు కొన్ని పద్యాలను చూద్దాం.
కం. వేదములు నాల్గుహయములు
నాదరముగ చర్నకోల నగణితప్రణవం
బావేదసారథౌటకుఁ
జేవెవరికి నీకుఁఫక్క జగదీశ శివ
కం. వలనొప్ప సూర్యచంద్రులు
నలరథచక్రములు విష్ణువంబుగ జ్యాయై
వెలయఁగను నాదిశేషుఁడు
వెలువడునే మేరువిల్లు వినుతింతు శివా
కం. పువ్వులు రువ్విన మదనుని
ఱివ్వున భస్మంబుచేతురే తగవగునే
వవ్వుచు సాంఖ్యము ఱాళ్లన్
రువ్విన మోక్షంబొసఁగ విరుద్ధంబు శివా
కం. తిన్నఁడు దిన్నఁగ నీకున్
ఎన్నికతోఁ బెట్టినట్టియెంగిలి పొలసుల్
పన్నగభూషణ రుచియే
మన్ననతో నేలినావు మమ్మేలు శివా
కం. మోకాలుమేఁపెంటిక
శ్రీకోమలికుచము నీకు శ్రేష్ఠంబయ్యెన్
లోకాధినాథ నీదగు
నాకారము జూపునాకు నదియేమొ శివా
శివలీలలు శివభక్తుల కథలు ఈశతకములో అనేకం కనిపిస్తాయి.
కం. చిఱుతొండభక్తునింటను
బరువడి శిశుమాంసమడిగి భక్షించిననీ
మరుగెల్లఁ దెలిసివచ్చెను
నెఱుఁగుదు నీగుట్టు లేలు మికనన్ను శివా
కం. పిట్టవ్వ బెట్టుపిట్టకుఁ
గట్టడిచేసికొని నీవు గావేరివెసం
గట్టిగఁ గట్టితి వందురు
కట్టడివిగదన్న నన్నుఁ గరుణించు శివా
ఇందలి వీరశైవులయిన చెన్నబసవడు, కక్కయ్య మొదలైన వారి లీలలు వర్ణించిన విధాన్నిబట్టి ఈకవి వీరశైవుడు కావచ్చుననెడి ఊహకు బలాన్నిస్తున్నాయి.
కం. బసవండిచ్చిన యానతి
పసగలభక్తుండు చెన్నబసవనితలపై
వెసనిడుకొని చెల్లించెడి
యసమానుని మదిఁదలంతు నఖిలేశ శివా
కం. వేదంబులు శునకముచే
వాదంబున జదువజేసి వప్పించినయా
ఖేదుండగు కక్కయ్యను
ఖేదం బెడబాసి గొల్తు బెంపొంద శివా
కం. కులహీనుఁ డీతఁ డన్నను
గులజులు చూడంగ వ్రేళ్లుకోసినపాలున్
అలిగురిసినట్టి పుణ్యుని
సలలితు శివనాగుమయ్య స్మరియింతు శివా
ఈకవి దూర్జటి కీవల వాడనే వాదనకు పద్యంద్వారా చెప్పిన ఈకథే ఆధారము అంటారు
కం. చెలిచంటిమీఁదఁ జేయిడి
చెలువొప్ప శివాయటన్నఁ జేడియనవ్వన్
జలపట్టి శివునిజూపిన
చెలువుని ధూర్జటిని దలఁతు చెన్నొంద శివా
ఈశతకంలో క్రిందిపద్యములు కొద్ది మార్పులతో కృష్ణశతకములోని పద్యముల వలే ఉన్నవి
కం. నీవేతల్లి దండ్రివి
నీవేనా తోడునీడ నీవేసఖుఁడౌ
నీవేఫురుఁడవు దైవము
నీవే నే నన్యు నెఱుగ నిజమిదియు శివా!
కొన్ని పద్యములు భాగవతము పద్యములను అనుకరించినవి.
కం నీపాదకమసేవయు
నీపాదసరోజభక్తి నిరతులయెడల
న్నేపారనిష్టజనదయ
నేపావనమౌదు నన్ను నెనగూర్చు శివా
చక్కని అందమైన కంద పద్యములతో శివలీలా విలాసాలను వర్ణించిన ఈశతకం అందరూ చదివి ఆనందించవలసినది.
మీరూ చదవండి, మీ మిత్రులచే చదివించండి.
***
No comments:
Post a Comment