పురాణ కధలు .. బసవ పురాణం – 7
పి.యస్.యమ్. లక్ష్మి
9. కైలాసంలో బసవేశ్వరుడు
ఆ కాలంలో సిధ్ధరామకృతి అనే ఒక గొప్ప యోగి వుండేవాడు. ఆయన ప్రతినిత్యం శివ పూజానంతరం ప్రమధ లోకానికి యోగ గమనంతో వెళ్ళి అక్కడి ప్రమధులతో సంభాషించి, తరువాత కైలాసం వెళ్ళి శివ పార్వతులను సేవించి తిరిగి సాయంకాలం వస్తాడని ప్రతీతి. ఒక రోజు కొందరు భక్తులాయనని మీరు రోజూ కైలాసం వెళ్ళి వస్తారని ప్రతీతి కదా. అలాగే బసవేశ్వరులవారు కూడా రోజూ కైలాసం వెళ్ళి శివుణ్ణి సేవించి వస్తారని అంటారు. చూసి వచ్చి చెప్పిన వారు లేరు. మీరు కైలాసం వెళ్ళినప్పుడు బసవేశ్వరులు అక్కడ వున్నారో లేదో చూసి చెప్పమని కోరారు. దానికి ఆయన సరేనన్నారు.
సిధ్దరామకృతి కైలాసానిక వెళ్ళి శివుని సభకు వెళ్తారు. అక్కడ శివుడు ఈయనను చూసి విశేషాలేమిటని అడిగితే భూలోకంలో భక్తులు తనని బసవేశ్వరుని గురించి అడిగిన సంగతి చెప్తారు.
అప్పుడు శివుడు, “సిధ్ధరామా, బసవని ప్రభావము తెలుసుకోవాలని వచ్చావా? భూలోకంలో భక్తులు ఆతనిని పరీక్షించాలనుకున్నారా? అలాగయితే బసవడి భక్తి గురించి చెప్పటం కాదు. స్పష్టంగా చూపిస్తాను. బసవలింగం ఇక్కడ అక్కడ అని ఏమిటి ఎక్కడ పడితే అక్కడే వున్నాడు. నాలోను, నా ప్రమధులలోను ఎల్లప్పుడూ వుంటాడు. లోకములో గురు లింగములు మూడు .. అంటే లింగ తత్త్వమును ఉపదేశించు గురువు, లింగ మూర్తిని ఆరాధించు భక్తుడు, బసవడు ఈ మూడూ ఒకే రూపము. ఇక్కడా అక్కడా అనటం ఎందుకు. బసవడు నా హృదయంలోనే వున్నాడు చూడు” అని శివుడు తన హృదంతరమును చూపించగా అందులో ధ్యాన మగ్నుడైన బసవని రూపాన్ని చూసి సిధ్ద రాముడు, అక్కడ వున్నావారంతా ఆశ్చర్యపోతారు.
అపుడు శివుడు పార్వతీదేవితో, “ఓ గిరిజా, నేనూ, నా ఆది వృషభవాహన రూపమయిన బసవడు ఒక్కటే రూపులమని నేనిదివరకు చెప్పాను కదా. బసవని మహాత్మ్యము చెప్తాను. బసవడు లోక పావనుడు. నేను లోకాధీశుడను. బసవడు సకల లోకోపకారి, నేను సకల లోక సంహారకుడను. బసవడు భక్తులకు రత్న భాండాగారము. నేను భక్త దేహుడను. భసవడు భక్తికి రాజు, నేను ముక్తికి రాజును. బసవడు చరాచర లోకాలలో చరించే చరలింగమూర్తి. నేను స్ధాణు లింగమూర్తిని. నేను భక్తులొసంగిన వారి ప్రాణ దేహార్ధాలను తీసికొందును. బసవడు భక్తులడిగిన ధన ప్రాణ దేహార్ధములు వారికి ఇస్తాడు. ఒక్కోసారి అడగకపోయినా తానే తెలుసుకుని ఇస్తాడు”.
అది విని శంకరుని హృద్పద్మంలో వున్న బసవడు శివుని, దేవా, నువ్వు భక్త స్వరూపుడవు. నేనారాధించే మీ భక్తులలో నేను నీ రూపాన్నేచూస్తాను. నేనే జన్మ ఎత్తినా నీ మీద భక్తి తగ్గకుండా వుండేటట్లు నన్నాశీర్వదించమని ప్రార్ధించాడు. భగవంతుడు కూడా బసవా నీవే నేను, నేనే నీవు అని అభయమిచ్చాడు.
సిధ్ధ రామకృతిని చూసి, “సిధ్ధ రామా, బసవని తృప్తిగా చూడు. నీకు నమ్మకం కుదిరిందా?” అని అడిగాడు శివుడు. వారిని పరి పరి విధాల ప్రార్ధించి, సిధ్ధరాముడు భూలోకానికి వెళ్ళి తనని అడిగిన భక్తులకు సంగతి అంతా చెప్తాడు.
మరోసారి మరో కధ.
(చదువరులకు ఒక మనవి .. బసవ పురాణంలో భాష నాలాంటివారికి పూర్తిగా అర్ధం చేసుకోవటం కష్టం. మా నాన్నగారి పుస్తకం దొరికింది, అందులో అన్నీ కధలున్నాయి, కొంచెం రాయటం అలవాటవటంతో, పురాణాలన్నీ అంతా చదవలేరు అని నా కర్ధమయినట్లు నా భాషలో చెప్పాలనిపించి ఇది రాస్తున్నా. తప్పులుంటే క్షమించండి. )
No comments:
Post a Comment