మనసు-వాక్కు..!
-సుజాత.పి.వి.ఎల్.
ఓంకారం నుండి వాక్కు పుట్టింది. ఆ ఓంకారం అనుసరించి మనసు నాలుగు పురుషార్ధముల సాధనకు ప్రయత్నము చేస్తూ ఉంటుంది. మనసులో ఏదైనా సంకల్పిస్తే నోటి నుండి వాక్కులా బయటికి వస్తుంది. మరి అటువంటి సమయాన వాక్కును అనుసరించి మనసు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకునేందుకు ఒక ముని భార్య అడిగింది. అప్పుడా ముని "నీవన్నది వాస్తవమే.. కాని వాక్కు మనసు ఒక దానితో ఒకటి అనుసంధానమై పని చేస్తాయి. మనసు సంకల్పించింది తప్ప వాక్కు మరొకటి పలుక లేదు. ఒకసారి మనసు వాక్కు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తమలో ఎవరు గొప్ప చెప్పమని అడిగాయి. 'మనస్సే గొప్పది!' అని బ్రహ్మదేవుడు ఠక్కున సమాధానం చెప్పాడట. పక్కనే ఉన్న సరస్వతి నాధా ! నేను వాక్కు దేవతను. అలాంటి నేను మీ పక్కన ఉండగా మనస్సు గొప్పది అని మీరు ఎలా చెప్పారు ? అని అడిగింది. అందుకు బ్రహ్మ "దేవీ ! మనస్సు రెండు విధములు.
ఒకటి స్థిరమైనమనసు రెండవది చరమైనమనసు. స్థిరమైన మనసు నా వద్ద చరమైన మనసు నీ వద్ద ఉన్నది. నీ అనుగ్రహం వలన పుట్టిన అన్ని వర్ణములు, అక్షరములు, విద్యలు, మంత్రములు మొదలైన వాటిని చంచల మనసు అంటారు" అని..బ్రహ్మ దేవుడు అనిన మాటలు చెప్పాడు ముని.
అప్పుడు ముని భార్య "నాధా ! బ్రహ్మదేవుని మాటలకు చింతించిన సరస్వతి ఎలా తేరుకుంది?" అని అడిగింది. అందుకు ఆ ముని "తరుణీ ! వాక్కు అనునది ప్రాణము ఆపానము వలన కలుగుతుంది. అందులో ప్రాణవాయువే బ్రహ్మ. అది తెలియచెప్పి బ్రహ్మ సరస్వతి చింతను పోగొట్టగలిగాడు. కనుక వాక్కు మనసు యొక్క ధర్మమని తెలుసుకున్న వాడు మోక్షమునకు అర్హుడు. ఇంకా వాక్కు మనసు వీటి ధర్మాలను వివరిస్తాను. ప్రాణం అపానంలో కలిస్తుంది. అప్పుడు వాక్కు తన సహజమైన శబ్ధమును వదిలిపెట్టి పంచభూతములలో కలిసి వ్యానుడి ప్రేరణతో శరీరం అంట వ్యాపిస్తుంది. అప్పుడు మనసు ప్రశాంతత పొందుతుంది. మనసలా ప్రశాంతత పొందడమే ముక్తికిమార్గం. వాక్కు అనేది బయటకు ఉచ్ఛరించేది. దీనిని ఘోషిణి అంటారు. బయటకు కన్పించనిది అఘోషిణి. అఘోషిణి అంటే మనసులో అనుకునేది. ఇందు అఘోషిణి ఉత్తమమైనది. ఆ వాక్కు అవ్యయము. శబ్ధరూపం లేనిది ఉజ్వలంగా ప్రకాశించేది. ఆ వాక్కు బ్రహ్మస్వరూపము. జ్ఞానేంద్రియములు ఐదు మనసు బుద్ధి ఈ ఏడు జీవాత్మను ఆశ్రయించుకుని ఉంటాయి. దేని పని అది చూసుకుంటుంది. ఒకదాని పని ఒకటి చెయ్యవు. వాసన చూడడం అన్నది ముక్కు మాత్రమే చేస్తుంది. మిగిలిన వాటికి అది చేత కాదు. నాలుక రుచి చూస్తుంది మిగిలిన ఇంద్రియాలు ఆ పని చెయ్యవు. కళ్ళు రూపాన్ని చూడగలవు. మిగిలిన అవయవాలు ఆ పని చెయ్యలేవు కదా ! స్పర్శను చర్మము గ్రహిస్తుంది, చెవులు శబ్ధమును గ్రహిస్తాయి. ఏదైనా విషయం శకించడం మనసు ధర్మము. మిగిలిన ఏ అవయవములు ఈ పని చెయ్య లేవు. మంచి చెడు తెలుసుకోవడం జాగృతం చెయ్యడం బుద్ధి చేసే పని. ఆపనిని మిగిలిన అవయవములు చెయ్య లేవు.
ఒకనాడు మనసుకు ఇంద్రియములకు వాగ్వివాదం జరిగింది. మనసుతో ఇంద్రియములు ఒకసారి ఇలా అన్నాయి. ఓ మనసా ! మనస్సు ఇంద్రియములు ఒకటే కదా ! ఇందులో మనసు గొప్ప ఏమిటి ? అని అడిగాయి. అప్పుడు మనసు ఇంద్రియములతో ఇంద్రియములారా ! నేను సంకల్పించక ఉన్న మీరు ఏపని చెయ్య లేరు. నేను లేకపోతే కళ్ళు, ముక్కు, చెవులు, పని చెయ్య లేవు. నేను లేకున్న ఇంద్రియములు ఉన్నా లేకున్నా ఒకటే కనుక మీ కంటే నేనే గొప్ప అన్నది. ఇంద్రియములు మనసా ! అంతమాత్రం చేత నీవు గొప్పదానివి అయ్యావా ! మేము లేకుండా నీవు దేనినీ అనుభవించ లేవు. ముక్కు లేకుండా నీవు వాసన చూడలేవు, కళ్ళు లేకుండా నీవు రూపమును గ్రహించ లేవు. మాలో ఏ ఒక్కటి లేకున్నా నీవు ఏమీ చెయ్య లేవు. పోనీ ఒక దానితో మరొక్క దాని పని చేయించగలవా అంటే అదీ చెయ్యలేవు. కనుక మేమంతా ఉంటేనే నువ్వు అన్నీ అనుభవించగలవు. ఇందులో నీ గొప్పతనం ఏమిటి ? అదీ కాక మేము అనుభవించిన తరువాతే నువ్వు అనుభవిస్తున్నావు. అంతేకాదు నీవు ఏ కారణం చేత అయినా పని చేయ లేక పోతే నీవు మా లోని ప్రాణశక్తి వలననే నీవు తిరిగి పనిచెయ్యగలవు. మేము ఉంటేనే నీవు అనుభవించగలుగుతున్నావు. లేకున్న నీవు ఏమీ అనుభవించ లేవు. కనుక నీకు స్వతఃసిద్ధంగా ఏమీ అనుభవం లేదు కనుక మామీద అధారపడక తప్పదు. కనుక నువ్వు మేము కలిస్తేనే ఈ శరీరం సుఖములను అనుభవిస్తుంది. ఇందులో ఎవరి గొప్పతనం లేదు అన్నాయి ఇంద్రియములు. ఆ వాదనకు మనసు బదులు చెప్పలేక పోయింది".. అని వివరించాడు మునీశ్వరుడు.
******
No comments:
Post a Comment