చిన్ని, చిన్ని ఆశ - అచ్చంగా తెలుగు

చిన్ని, చిన్ని ఆశ

Share This
చిన్ని, చిన్ని ఆశ
  -డా. లక్ష్మీ రాఘవ 
{పెయ్యేటి రంగారావు గారి స్పూర్తి తో }



కరోనా ఏమో గానీ ఏడో తరగతి చదువుతున్న రితీష్ కు ఆన్లైన్ క్లాసెస్ చాలా విసుగ్గా వుంది. 
ఆడుకోవడానికి అమ్మ బయటికి వెళ్లనివ్వటం లేదు. పోనీ కొత్తగా క్లాసెస్ కోసం కొన్న స్మార్ట్ ఫోనులో ఫ్రెండ్స్ కు ఫోను చేసుకోనివ్వటమూ లేదు. క్లాస్ అయిపోగానే ఫోను దాచేస్తే ఎలా? తన ఫ్రెండ్ రాహుల్ ఎన్ని గేమ్స్ ఆడుతాడు. వాడు అవన్నీ చూపించినా అప్పట్లో ఇంట్లో తనకంటూ ఫోను లేక పోవడం తో వాటికి దూరంగానే వున్నాడు. ఇప్పుడు ఫోను వున్నా అస్తమానం అందుబాటులో వుండదు. అందుకే వాడికి ఈ లాక్ డౌన్ ఆంక్షలు అస్సలు నచ్చడం లేదు. పోనీ మొండి చేద్దామా అంటే గలాటా చేయడానికి డాడీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆయే. 
             పని మనిషి కూడా లేదు కాబట్టి అమ్మకు బోలెడు పని. ఎప్పుడూ ఇంటిపనీ, వంటపనీ. సాయంకాలం మాత్రమే అందరూ హాయిగా కలిసి టి. వి. చూసేదీ. అందులో కూడా ఇబ్బంది వుంది. రితేష్ కు నచ్చే ఎప్పుడో  తప్ప పెట్టరు.  డాడీ అయితే ఎప్పుడూ న్యూస్ చానెల్శ్, అమ్మ సీరియల్స్, భక్తీ తప్పితే...అందరూ కలిసి చూసేవి  కేవలం సినిమాలే. 
ఇక రితేష్ కు ఛాయిస్ లేదు. స్నేహితులను కలవలేక, ఆన్లైన్ గేమ్స్ ఆడక, టి..వి. లో ఇష్టమయినవి చూడక, ఇంట్లోనుండీ బయటకే వెళ్ళక చాలా విసుగ్గా, కోపంగా వుంది. 
ఇంతలో డాడీ మాటలు వినిపించి చూశాడు. “రోడ్డు పక్కన బండి మీద వేడి వేడి దోశ తినాలని పిస్తావుంది శుభా.” “అదేంటి మనకు ఎప్పుడూ అలా రోడ్డు మీద తినటం అలవాటే లేదు.. ఇదేమి కోరిక?”శుభ ఆశ్చర్యపోయింది. 
“పెళ్ళికాకముందు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి అలా రోడ్డు పక్కన బండి మీద దోశలు తిన్నఅనుభవం గుర్తుకు వస్తూంది. నిజంగా వాడు వేడిగా మసాలా దోశ ఇస్తే ఎంతరుచో...”
“అవున్లే ఇంట్లో బాగా చేసిపెడుతున్నా... అలాటివే గుర్తు వుంటాయి” శుభ అలక. 
“అలా కొప్పడకే..బాచలర్స్ జీవితంలో కొన్ని జ్ఞాపకాలు అలా అంతే... పోనీ నీకేమి చేయాలనిపిస్తుందో  
చెప్పు. ..”భార్యను అనునయించాడు శ్రీహరి. 
“నాకు నిజం గా ఇప్పుడైతే బయటకు స్వేచ్ఛగా వెళ్లాలనీ, స్నేహితులను కలిసినా మాస్కులు లేకుండా మాట్లాడాలనీ వుంది. మాస్కు ధరించి మాట్లాడితే మన గాలి మనమే పీల్చుకున్నట్టుగా ఇబ్బందిగానే కాదు, ఒక్కోసారి వాసనగా కూడా వుంటుంది..”
“ఇంకా...”
“ఇంటికి సరుకులు ఆన్లైన్ లో కాకుండా, కావాల్సిన చోటికి వెళ్ళి తెచ్చుకునేలా, కూరగాయల బండి  ఇంటిముందుకు వచ్చేలా వుంటే ఎంతబాగుంటుందో అనిపిస్తుంది.. ఆ స్వేచ్చ లేకుండా పోయింది.“ బాధగా అంది శుభ.
ఇంతలో అత్తగారి నుండీ ఫోను..”ఎలావున్నారు శుభా.. అందరూ జాగ్రత్తగా వున్నారు కదా.”
“”ఆ బాగున్నామత్తయ్యా. మామయ్యగారూ, మీరూ ఎలా వున్నారు. మామయ్యకు ఇంట్లోనుండీ పని చేయడం అలవాటైంది కదా”
“మానేజరు అంటే అడ్డమైన చాకిరీ చేయించుకుంటారు. పైగా ఎప్పుడూ జూమ్ మీటింగులు, ఏదీ వదలలేము ఇక రిటైర్ అయ్యేదాకా ఇంతే అనుకుంటా..”
“మీరెలా వున్నారు?” స్పీకర్ ఆన్  చేసింది శుభ అందరూ వినేలా.
“ఎలా వుండటమేమిటి శుభా. తెగ బోరు కొడుతోంది ఒక గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందామన్నా కాకపోయే, అసలు ఎక్కడా మనుషులు కూడా తిరగక ఒక కోరిక కలుగుతోంది. తిరుపతి దేవుడిని కిక్కిరిసిన జనాల మధ్య నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాలని అనిపిస్తుంది. ఇక మనుషులూ, గుడిలో దేవుడి దర్శనాలూ కరువైపోతాయాయేమో అని భయంగా వుంది. పెళ్లిళ్ళూ, పేరంటాలూ లేవు పైగా దగ్గరగా వచ్చి ఆప్యాయంగా  చిరునవ్వుతో పలకరించే మనుష్యుల ముఖాలు కాకుండా మాస్కుల రంగులు చూడాల్సి వస్తోంది..” మనస్సులోని బాధనంతా కుమ్మరించింది అత్త సీతమ్మ. 
ఫోను శుభ చేతిలో నుండీ తీసుకుని “అమ్మా ఎలా వున్నారే, నాన్న బిజీగా లేకపోతే ఇవ్వు ఫోను ..”అన్నాడు శ్రీహరి. 
“ఎలావున్నారురా శ్రీ..”నాన్న గొంతు వినగానే ఆనందమైంది శ్రీహరికి. 
“మేము బాగున్నాము నాన్నా.. మీరేటి  డల్ గా వున్నారు? వుండండి వీడియో కాల్ చేస్తా..” అని వీడియో కాల్ చేశాడు శ్రీహరి. అందరూ ఎదురుగా చూసుకున్న ఫీలింగ్ కలిగింది.
“ఏముందిరా, ఇంట్లో కూర్చున్నా చాకిరీ తప్పదు ఈ పోస్టుకు. ఒక వైపు ఆఫీసు జూమ్ మీటింగులు అదర కొడుతూ వుంటే, నా సాహితీ మిత్రులు సభలూ, సమావేశాలూ కూడా ఆన్లైన్ లో చేస్తున్నారు. ఎప్పుడు ఆఫీసుకు వెళ్ళి అందరినీ ప్రత్యక్షంగా చూస్తామా? మిత్రులతో సభలూ, సమావేశాలకు  ఎప్పుడు కలిసి వెడతామా అనిపిస్తోంది. ఇంకోసంవత్సరంలో రిటైర్మెంట్ అయితే అందరం కలిసి తిరుపతి అయినా వెళ్ళాలి” ఆయన మాటలు పూర్తి కాకుండానే “తాతయ్యా “అని అరిచాడు రితేష్.
“వుండు నాన్నా, రితేష్ తో మాట్లాడ లేదని కోపంగా వున్నట్టు వుంది”అన్నాడు శ్రీ హరి. 
వీడియో కాల్ ల్లో తాతయ్యనూ, నాన్నమ్మ నూ చూడగానే భలే సంతోషం వేసింది రితేష్ కు.
“తాతయ్యా, నాకు చాలా బోర్ కొడుతోంది...”
“అందరికీ అలాగే వుంది. ఇన్నిరోజులు మనం కలవకుండా వుండినదే లేదు”
“అవును తాతయ్యా .. నాకొక డౌట్ నీవు సమాధానం చెప్పాలి... ఎప్పుడూ నాకు అన్నీ నీవే కదా చెప్పేది”
“అడుగు నాన్నా” 
“తాతయ్యా,
నాకు మాస్క్ లేకుండా స్కూలుకి వెళ్లాలని, వీధుల్లో స్వేచ్ఛగా ఫ్రెండ్స్ లో ఆడుకోవాలని వుంది. ఇంకా ఈ రోజు నాకు తెలిసిందేమంటే డాడీకి రోడ్డు పక్కన బడ్డీ హోటల్లో ఇడ్లీ, దోశ వేడి,వేడిగా వేయించుకుని తినాలనుందట. అమ్మకు ఆన్లైన్ లో కాకుండా సరుకులు తానే వెళ్ళి తెచ్చుకోవాలని వుందట  
నాన్నమ్మకు గుడిలో క్రిక్కిరిసిన జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి దైవదర్శనం చేసుకోవాలని, పెళ్ళిళ్ళకు వెళ్ళాలనుంది అన్నది ఇప్పుడే. 
నీవేమో  జూమ్ మీటింగులు కాకుండా ఆఫీసుకే వెళ్లాలని, ఆన్ లైన్ లో కాకుండా ప్రత్యక్షంగా సభలకు, సమావేశాలకు వెళ్లాలని వుంది అన్నావు”
“అవును అన్నాను” తాతయ్య సమాధానం.
“మరి ఇవన్నీ కరోనా వైరస్ వచ్చినందు వల్లే కదా. మీరు అందరూ ఇన్ని మాట్లాడు తున్నారు కానీ  
ఎందుకు  కరోనా వైరస్ ని ప్రపంచం మీదకు వదిలిన ఆ దేశం మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా, అన్ని దేశాలూ ఆ దేశాన్ని చితక్కొట్టకుండా అలాటి ఆలోచన చేయకుండా, అందరూ ఇలా మాట్లాడుతూనే వుండిపోతారా ?? నాకైతే ఆ దేశం మీదకు దండెత్తి  వెళ్లాలని వుంది ...తప్పంటావా ”ఆవేశం గా అడిగాడు రితేష్  
           రితేష్ చిన్ని బుర్రలో వచ్చిన ఆలోచనకు రితేష్ వేసిన ప్రశ్నకు కుటుంబం అంతా అవాక్కయ్యారు.

  *** 

No comments:

Post a Comment

Pages