కాశీ అన్నపూర్ణక్షేత్రం - అచ్చంగా తెలుగు

కాశీ అన్నపూర్ణక్షేత్రం

Share This

 కాశీ అన్నపూర్ణక్షేత్రం

పోలంరాజు శారద 

(My Big Break సంస్థ వారి  సంక్రాంతి  కథల పోటీల్లో  ప్రథమ బహుమతి పొందిన కథ )


"ఏమిటోనే రాజ్యం. ఇట్లాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఎక్కడ క్రతువు ఉంటే అక్కడికి ఆదరంగా పిలుస్తూ ఉండేవారు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ దిక్కుమాలిన రోగము ఉన్నదని తెలిసే లోపలే కాలికి ఎదురు దెబ్బ తగలడమేమిటో! కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మారి కాలికి రెండు వేళ్ళు తీసేయాల్సి రావడమేమిటో! దాంతో నడవలేక ఇంట్లోనే పడి ఉండటమేమిటో!"

"ఊరికే అట్లా బాధపడవాకండి. మానసికంగా మధన పడితే షుగర్ మళ్ళీ పెరుగుతుందట.  ఎట్లా జరగాలో ఆ భగవంతుడే మార్గము చూపుతాడు. పిల్లాడు కూడా ఉద్యోగాలకు వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉన్నాడు. కానీండి. మంచి రోజులు వస్తాయని మనసు కుదుటపెట్టుకోవాలి."

"సరే పడుకో మళ్ళీ రేప్పొద్దున్నే బారసాల వంటకు వెళ్ళాలన్నావు. కాస్త అన్నం వండి పెట్టేయి. ఆవకాయ ముక్కో కందిపొడో వేసుకొని తినేస్తాములే. కూరానారా అంటూ హైరానా పడకు."

"ఎంతసేపులేండి. అన్నం ఉడుకుతూండగానే పక్కనే నాలుగు దొండకాయలు తిరగమాతేసి. తోటకూర మరో పక్క పెడితే అయిపోతుంది. ఆ మొక్కలు తల్లి కడుపు చల్లగా చేయి పెడితే చాలు దొండకాయలు ఎప్పుడంటే అప్పుడు వస్తూనే ఉన్నాయి. అట్లాగే ఒకటి తరువాత ఒకటి అరటి గెలలు తోటకూర అయితే చెప్పే అక్కరలేదు. దుబ్బులు దుబ్బులు నవనవలాడుతూ. సాయంత్రమే అన్నీ తరిగి పెట్టుకున్నాను. ఎంతలో మగ్గుతాయిలేండి. ఊరికే ఆ పచ్చళ్ళు తినబాకండి కడుపులో మంట."  

మామయ్యగారి హయాములో కట్టించిన ఇల్లు పెరడు ఉన్నాయేమో.... ఆ భూమాత కరుణ పెరట్లో అన్ని రకాల కూరలు ఆకుకూరలు విరగ కాస్తున్నయేమో కాస్త తెరిపిగా ఉంది.

**** 

పక్క గదిలో నిద్రపట్టక అటూఇటూ మసులుతున్న గౌతంకు తల్లితండ్రి మాటలు ఆగిపోయాక సాయంత్రం తన స్నేహితుడు నిఖిల్ ఇంట్లికెళ్ళినప్పటి సంభాషణ  గుర్తుకొచ్చింది.

"గౌతం రావయ్యా రా... చాలా కాలానికి కనిపిస్తున్నావే...అవునూ నాన్నగారు ఎట్లా ఉన్నారు. పాపం అట్లాంటి ఉత్తముడికి రావలసిన కష్టమా! ప్చ్.... ఆయన మంత్రం చదువుతూంటే ఖంగున మోగే కంఠం. ఆయన మంత్రాలకే పితృదేవతలు స్వయంగా వచ్చి కూర్చున్నట్టే ఉండేది. ఆయనకు తగ్గదే ఆ మహా ఇల్లాలు. సాక్షాత్తు అన్నపూర్ణతల్లే అనుకో. అంత అద్భుతమైన దంపతులు. దూరమైనా ఏటా మా ఊరికల్లా వచ్చి మా ఇంట్లో ఆబ్థికాలు నిర్వహించేవారు. ఇంతకూ ఎట్లా ఉన్నారు శాస్త్రిగారు?"

గడగడా అడగాల్సినవన్నీ అడిగి ఊపిరి తీసుకోవడానికి ఆగారు. 

"ఇప్పుడు కాస్త నయం బాబాయిగారూ. ఇంట్లో తన పనులు తాను చేసుకోగలుగుతున్నారు. కాలి బొటనవేలు, పక్కవేలు తీసేయాల్సి వచ్చేటప్పటికి బయటకు వెళ్ళలేకపోతున్నారు కాని, ఇంట్లో తన దేవతార్జన కింద  కూర్చొని భోజనానికి ఏ ఇబ్బంది లేకపోతుండటంతో కాస్తలో కాస్త నయం. సాయంత్రాలు పెరట్లో మొక్కలకు నీళ్ళు పెట్టడంతో కాస్త కాలక్షేపం. అమ్మ మాత్రం అవకాశమొచ్చినప్పుడల్లా వంటలకు పోతోంది. నాకే ......... ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కలిసి రావడం లేదు." 

"అదే వస్తుందయ్యా...... ఊరికే దిగులు పడమాక."

పార్క్‌లో కూర్చున్నారు ఇద్దరు మిత్రులు. 

"వచ్చే వారం తాతయ్య తద్దినం. నాన్న ఆ విషయంలో ఏ మాత్రమూ  కాంప్రమైజ్ కావడం లేదురా. ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎపార్ట్‌మెంట్‌లో శాస్త్రోక్తంగా చేయాలంటే అన్నీ ఆటంకాలే. మడి నీళ్ళ దగ్గర మొదలైతే, మడి బట్టలు ఆరేయడమూ. బ్రాహ్మణులకు కాళ్ళు కడగాలి, వారి భోజనాలయ్యాక పిండాలు ఆవుకు పెట్టడమో నీళ్ళలో కలపడమో అదీ వీలు కాకపోతే అగ్నిహోత్రంలో కలిపేయటమో. అన్నీ మడితోటే చేయాలి. భోక్తలు భోంచేసాక ఆ ఆకులను గుంట తవ్వి పెట్టాలి. వీటిల్లో ఏ ఒక్కటీ వీలుపడదు కదా! నిత్య సంధ్యావందనానికైతే ఆ మినరల్ వాటర్ లో ఒక మజ్జిగ చుక్క వేసి మమ అనిపిస్తున్నారు. కాని ఈ ఆబ్ధికాలకు ఎట్టి ప్రత్యామ్నాయమూ లేదు.". నిఖిల్ మొరపెట్టుకున్నాడు

"పోనీ ఏ రాఘవేంద్ర మఠంలోనన్నా పెట్టవచ్చు కదా!"

"అయింది. ఆ చర్చా అయింది. అక్కడ ఆచారాలు ఆయనకు సుతరామూ గిట్టడం లేదు. ఏదో గుంపులో గోవిందాగా చేసేస్తుంటారు. ససేమిరా వద్దు అనేసారు."

"అయ్యో! మరి ఎట్లారా?"

"ఆయన కోరిక ప్రకారము నాయనమ్మ తద్దినానికి అందరమూ కార్లో పిఠాపురము వెళ్ళి క్రతువు ముగించుకొని వచ్చాము. అది జనవరి నెలే అయినా ఆ కాకినాడ పిఠాపురంలో ఆ పాటికే కింద కాళ్ళు పైన తల మాడ్చేసే ఎండలు. ఇంక ఈ మే నెలలో ఎట్లా ఉంటుందో చెప్పు. నాకేమో ఆఫీసులో విపరీతమైన వర్క్ లోడ్. ఆయన మాటే ఆయనది కాని ఇట్లాంటి విషయాలలో ఎవరూ చెప్పలేరు.  మళ్ళీ మాట్లాడితే మా ఊరికి తిరిగి వెళ్ళిపోతామంటున్నారు. ఏమి చేయాలో ఏమిటో పాలుపోవడం లేదు. సరే పదరా బయల్దేరుదాము. చీకటి పడుతోంది"

**** 

ఏమిటో? దీన్నే కాబోలు అంటారు సీత బాధ సీతది. పీత బాధ పీతది.

అన్నీ ఉన్న నిఖీల్‌కు ఒక సమస్య అయితే అంత విద్వత్తు ఉన్న నాన్నది మరో సమస్య.  

ఒకప్పుడు తాతగారి కాలంలో శుభకార్యాలు చేయించే వారిని అపరకర్మలకు పిలిచేవారు కాదు. మరి ఎక్కడ ఆచారాలలో మార్పులొచ్చాయో నాన్న తరం వచ్చేటప్పటికి అపరకర్మలకు శుభకార్యాలకు కూడా పిలుస్తూండటంతో రోజులు గడిచిపోతూన్నాయి. చిన్నదైనా పొందికైన ఇల్లు చుట్టూ పెరడు మొక్కలతో ప్రశాంతంగా కాలం గడిచి పోతూండగా అవాంతరం వచ్చిపడింది.

***** 

ఆలోచనలతో నిద్ర కరువయింది ఎం.బి.ఏ చదివినా సరైన ఉద్యోగం దొరకని గౌతంకు ఎక్కడో ఒక్క మెరుపులాంటి ఆలోచన మనసులో మెదిలింది.

ఉదయమే లేచి ఇంట్లో వంట చేసిన తల్లిని తన బైక్ మీద బారసాల జరగబోతున్న ఇంటి వద్ద దింపి  మనసులో గట్టిగా అనుకున్నాడు. 

"ఏది ఏమైనా అమ్మకు ఇట్లా ఇంటింటికి తిరిగి వంటలు చేసే శ్రమ తప్పించాలి. నాన్నను కూడా బయటకు వెళ్ళలేకపోతున్నానన్న డిప్రెషన్ నుండి తప్పించాలి."

ఆలోచన వచ్చిందే తడవు నిఖిల్ ఇంటికి వెళ్ళాడు.

"ఏమిటోయ్ గౌతం పొద్దున్నే వచ్చావు? అదిగో నిఖిల్ ఇప్పుడే లేస్తున్నాడు. అరే అమ్మకు చెప్పి కాఫీ తీసుకొని రా."

"బాబాయిగారూ.....మీతోటే కాస్త మాట్లాడాలి........."చెప్పదలచుకున్నది చెప్పసాగాడు గౌతం.

ఆ మాటలు విన్న ఆ పెద్దమనిషి ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. ఆ పాటికే అక్కడకు చేరుకున్న ఆయన భార్య,  నిఖిల్ కూడా సంభ్రమంగా వింటున్నారు.

"బాబాయిగారు మీకు అభ్యంతరం లేకపోతేనే."

ఆయన భార్య వంక ప్రశ్నార్థకంగా చూసారు. ఆవిడ సమ్మతమేనన్నట్టు తల పంకించింది.

***** 

ఆనందంగా ఇల్లు చేరి తండ్రి వద్ద కూర్చొని తన మనసులో మాటలు వివరంగా చెప్పాడు. 

"ఎట్లా ఉంటుందంటారు నాన్నా?" 

ఆయనకు కూడా ఆ మాటలు సబబుగానే అనిపించాయి. "సరే. కానీయ్ నాన్నా. మొదలంటూ పెడితే తరువాత సంగతి తరువాత చూసుకోవచ్చు. అమ్మకు కూడా ఇల్లిల్లు తిరక్కుండా జరిగిపోతుంది. ఏర్పాట్లు చేసేయి."

***** 

రెండేళ్ళ  తరువాత........ 

"కాశీ అన్నపూర్ణ క్షేత్రం" అన్న బోర్డు ఇంటి ముందు కనిపించింది. 

ఇంటికి పైన మరో పెద్ద హాలు కట్టబడి అటూ ఇటూ గదులు కూడా వెలిసాయి.

మధ్యాహ్నం రెండయింది. అందరి భోజనాలు అయిపోయాక, నిఖిల్ తండ్రి వచ్చి శాస్త్రిగారి పక్కన కూర్చొని అభినందిస్తూ, "మంచి పని చేసావయ్యా గౌతం. మా నాన్న తద్దినం ఎట్లాగా అని మల్లగుల్లాలు పడుతుంటే మంచి మార్గం చూపించావు. ఇట్లాంటివి అక్కడక్కడా చేస్తున్నారు కాని చిత్తశుద్ధి ఉండటం లేదు. ఏదో మొక్కుబడిగా వ్యాపారం లాగా చేసేస్తున్నారు. శాస్త్రిగారి మంత్రమూ రాజ్యమ్మ చేతి గారెలు ఉంటే గాని  మా పెద్దలకు తృప్తి లేదు."

 ****

ప్రశాంతంగా పడుకున్న గౌతం మనసు తృప్తితో నిండిపోయింది. .........

మొదట్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించాడు. ఇంత చదువు చదివి చివరకు.....

మళ్ళీ తనకే నవ్వొచ్చింది. పెద్దపెద్ద చదువులు చదివి ఈవెంట్ మేనేజిమెంట్ అని మొదలెట్టి శుభకార్యాలు నిర్వహించగా లేనిది తనకెందుకు చిన్నతనం?

వాళ్ళందరూ సూటు బూట్లలో ఉంటారు. తాము పంచలు కండువాతో ఉంటాము అంతేగా తేడా?

ఒకరి మోచేతి కింద నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. 

బైటికి వెళ్ళి చేస్తేనే ఉద్యోగమా? తమకొచ్చే సంపాదన సంపాదన కాదా?

నిఖిల్ తాతగారి తిథి తమ ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసి .......  క్రతువు ముగించిన తరువాత ధైర్యం వచ్చింది.

సాధారణంగా మంత్రం చెప్పినందుకు భోక్తలకు వంటకు ఇచ్చేటంతే తీసుకున్నారు. అరటి ఆకులు, దొన్నెలు కుట్టడానికి కొబ్బరి మట్టలు కరేపాకుతో సహా కూరగాయలన్నీ పెరట్లోవే. 

ఏ ముహుర్తాన ఆలోచన వచ్చిందో, ఆ కార్యక్రమం కొనసాగుతూ అభివృద్ధిలోకి వచ్చి పైన కూడా హాలు వంటగది కట్టించి మరి కొందరు వంటవారికి పురోహితులకు ఉపాధి కల్పించే స్థితికి వచ్చారు.  

లాభాపేక్షలేకుండా పితృదేవతలకు తృప్తి కలిగే తీరున బతుకుబండి సాగిపోతున్నది.  ఆ తృప్తి చాలు.

****

No comments:

Post a Comment

Pages