మార్పు - అచ్చంగా తెలుగు

 మార్పు

బి.ఎన్.వి.పార్థసారథి 


అది భాగ్యనగరం లో ఒక ప్రముఖ కేంద్ర పారిశ్రామిక సంస్ధవారి ఉద్యోగుల కాలనీ. అందులో దాదాపు అయిదు వందల ఇల్లు ఉంటాయి. పాతికేళ్ళక్రితం ఆ కాలనీ పచ్చదనంతో కళకళ లాడుతూ ఉండేది. కాలనీ లో బడి, పెద్ద మైదానం, పార్క్, శివాలయం నిత్యం సందడిగా వుండేవి. ఎండాకాలం లో కూడా కాలనీలో నీటి ఎద్దడి వుండేది కాదు. అరవై, డెబ్భై అడుగుల లోతులోనే బోరు నీరు పుష్కలం గా వచ్చేవి. దానికి తోడు రోజూ మునిసిపాలిటీ వారు త్రాగు నీరు సరఫరా చేసేవారు. నీటి ఎద్దడి లేకపోవటంతో కాలనీ లో అద్దెకి వచ్చేవాళ్ళ సంఖ్య పెరిగింది. క్రమేపి కాలనీలోని ఇళ్లలో వరుసగా పైన అంతస్దులు లేచాయి. భూమి విలువ కూడా బాగా పెరగడంతో కొందరు తమ ఇళ్ళని అమ్మేశారు. మరికొందరు దూర దృష్టి గలవారు తమ ఇళ్ళని విస్తరించి దుకాణాలకి అద్దేలకిచ్చారు. ఇళ్ళు భవనాలు అవటంతో క్రమంగా కాలనీలో చెట్లని నరికివేశారు. జానెడు భూమిని కూడా విడిచిపెట్టకుండా భవనాలు కట్టడంతో భూగర్భ జలాలు క్రమంగా క్షీణించాయి. బోరులు కనీసం వెయ్యి, పదహేను వందల అడుగుల లోతుకి తవ్వితే తప్ప నీటిచుక్క గగనం గా మారింది.

బోరు నీరు రాక పోవడంతో అందరూ ఇంక రొజూ వచ్చే మునిసిపాలిటీ వారి  త్రాగు నీరు మీద పూర్తి గా ఆధారపడవలసిన పరిస్ధితి వచ్చింది. అందరూ మోటార్లు పెట్టి రోజూ వచ్చే త్రాగునీరు ఎక్కువగా వాడటం మొదలు పెట్టారు.ఎప్పుడైనా ఒకటి రెండు రోజులు మునిసిపాలిటీ వారి త్రాగు నీరు రాకపోతే కాలనీ లో అంతా అల్లకల్లోలం అయ్యేది. కొందరు పెద్ద మోటర్లు కొందరు చిన్న మోటర్లు పెట్టుకోవడం వల్ల “మాకు నీళ్ళు తక్కువ వస్తున్నాయి . పక్కవారికి నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి “అని కాలనీ వాసులు సొసైటీ వారికి తరచూ ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. కొందరైతే వాగ్వాదాల నుంచి కొట్లాటలవరకు వెళ్లారు. రెండు మూడు సంఘటనలు పోలీసు స్టేషన్ గుమ్మం కూడా ఎక్కాయి.  ఇంతకాలం మునిసిపాలిటీ వారి త్రాగు నీటి సరఫరా కి మీటర్లు లేవుకానీ సజావుగా గడచిపోయింది. ఇప్పటి పరిస్ధితులలో మీటర్లు పెడితే ఈ సమస్యని కాస్త అదుపులోకి తేవచ్చని సొసైటీ వారు అనుకున్నారు. కానీ ఇటీవలే పక్క కాలనీ లో మీటర్లు పెట్టడానికి అక్కడిసొసైటీ వారు ప్రయత్నించగా జనాలు తన్నడానికి వచ్చారని తెలిసింది. దాంతో ఈ కాలనీ లో ఆ ప్రయత్నం కాస్తా విరమించారు. 

కాలనీ ప్రెసిడెంట్ కోటేశ్వర రావు ముందు చూపు గలవాడు, నెమ్మదస్తుడు. పరిస్ధితి ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో కాలనీవాసులు ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన అంచనా వేసాడు. ప్రజలకి నచ్చచెప్పి వారిచేత స్వచ్చందంగా సమస్యకి పరిష్కార మార్గం అవలంబించేలా చేస్తే ఈ సమస్య శాశ్వతంగా తొలగిపోతుందని , మరోవిధంగా అయితే సమస్య ఇంకా జటిలం అవుతుందని భావించాడు. దానికి తగినట్టు వ్యూహ రచన చేసాడు.

కాలనీ చివర సొసైటీ వారి ఖాళీ స్ధలం వుంది. దానికి ఆనుకుని ప్రభుత్వం వారి పౌర నీటి సరఫరా శాఖ వారి కార్యాలయం, పెద్ద వాటర్ ట్యాంక్ , నీటి లారీలు వుంటాయి. వారితో సంప్రదించి వారి సహకారం తో సొసైటీ వారి ఖాళీ స్ధలం లో మురుగునీటి పారిశుద్ధ్యకేంద్రాన్ని ప్రారంభించాడు కోటేశ్వర రావు. కాలనీ లో వ్యర్ధ జలాలు, మురుగు నీరు డ్రైనేజి పైపుల ద్వారా ఈ పారిశుద్ద్య కేంద్రానికి తరలించి వాటిని శుద్ధి చేయటం మొదలుపెట్టారు. ఆ శుద్ధి చేసిన నీటిని నీటి సరఫరా శాఖ వారికి ఉచితంగా ఇస్తే వారు ఆ నీటిని నగరం లోని పార్కులలో చెట్లకి మొక్కలకి ఉపయోగపడేలా పంపిణీ చేసి, ఆ నీటికి సమానంగా త్రాగు నీటి టాంకర్లని కాలనీ వాసులకి ఉచితంగా సరఫరా చేయడం ప్రారంభించారు. కాలనీ వాసుల సంతోషానికి అవధుల్లేవు. కాలనీ లో ఒక చెరువు వుంది. పాతికేళ్ళ క్రితం ఆ చెరువులో బాగా నీళ్ళు వుండేవి. ఇప్పుడు ఆ చెరువులో చెత్త, చెదారం పేరుకుపోయి ఒక పెద్ద మురికి గుంట లా తయారయింది. దానితో కాలనీ అంతటా దుర్వాసన, దోమల బాధ ఎక్కువ అయింది. మునిసిపాలిటీ వారి సహకారం తో చెరువులోని చెత్తని తేసేసి నీటిని శుభ్ర పరచారు. దానితో దుర్వాసన, దోమలు తొలగిపోయి వర్షాకాలం లో చెరువు నిండా నీటితో కళకళ లాడసాగింది. తత్ఫలితంగా కాలనీ లో భూగర్భ జలాలు కాస్త మెరుగు పడ్డాయి. ఈ ప్రయోగం విజయవంతం అవటం తో సొసైటీ వారు కాలనీ వాసులకి నచ్చచెప్పి అందరి ఇళ్లలో ఇంకుడు గుంటలు తవ్వించారు. ఆ తరవాత వచ్చిన వర్షాకాలం లో వానలు బాగా కురిసి ఇళ్లలో బోరు నీరు రావటంతో కాలనీ వాసులు ఆనందించేరు. ఇది జరిగిన కొన్నాళ్ళకి మునిసిపాలిటీ వారు నీటి చార్జీలు పెంచారు. కాలనీ సొసైటీ వారి సమావేశం లో కోటేశ్వర రావు ఈ విషయాన్ని ప్రకటించగా సభ్యులందరూ దాదాపు ఏకగ్రీవంగా ముక్తకంఠంతో “ అందరి ఇళ్లలో త్రాగునీటికి మీటర్లు పెట్టండి నీటి వాడకాన్ని బట్టి అందరం  చార్జీలు కడతాం “ అన్నారు. కోటేశ్వర రావు తన వ్యూహం ఫలించినందుకు ఎంతో సంతోషించాడు. సమావేశం ముగిసి కోటేశ్వర రావు ఇంటికి వెడుతుండగా , “ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదుర పోకుమా “ అమర గాయకుడు ఘంటసాల గానం ఒక ఇంట్లోంచి వినిపించసాగింది.   

***   

No comments:

Post a Comment

Pages