పరివర్తన - అచ్చంగా తెలుగు
పరివర్తన
(నాటిక)
దినవహి సత్యవతి 

((నాటిక లోని పాత్రలు : ఆనంద్,  లలిత, నవ్య (ఆనంద్ లలితల కూతురు), రాధిక, కమల, మేరి, రజియ(నవ్య స్నేహితులు), డాక్టర్ , అటెండర్)) 
నాంది 
ఆనంద్ ఒక బ్యాంకులో మేనేజరు. లలిత గృహిణి. వీరి కూతురు నవ్య పదవ తరగతి చదువుతోంది.  
ఒకనాడు స్కూలుకి  వెళ్ళిన నవ్య అనుకోకుండా మధ్యాహ్నం స్కూలుకి సెలవు ప్రకటించడంతో ఇంటికి వచ్చేసి తల్లిని పిలుస్తూ తలుపు తట్టబోయి లోపలినుంచి గట్టిగట్టిగా మాటలు వినిపిస్తుంటే ఆగిపోతుంది. 
ఇక చూడండి ...................................... 
ప్రథమ అంకం: 1 వ రంగం
(1 వ స్థలం : ఆనంద్ ఇల్లు) ; (పాత్రలు :  ఆనంద్, లలిత, నవ్య )
లలిత : అదికాదండీ నేను చెప్పేది కూడా కొంచం వినిపించుకోండి (బ్రతిమిలాడే స్వరంలో అంటుంది) 
ఆనంద్ : నువ్వు నాకు చెప్పేంతటిదానివయ్యావా? (హుంకరిస్తాడు)  
లలిత : ఈ విషయం నవ్యకి తెలిస్తే ఎంత బాధపడుతుందో కొంచమైనా ఆలోచించారా? 
ఆనంద్ : నువ్వు చెప్తే తప్ప దానికెలా తెలుస్తుంది? 
లలిత : ఇలాంటివి ఎన్నాళ్ళు దాచగలరు? అయినా అదేం చిన్న పిల్ల కాదుగా! ఇంట్లో పరిస్థితులూ మీ ప్రవర్తనలో మార్పూ ఏదో ఒకనాడు దాని దృష్టిలో పడకపోవు.  
ఆనంద్ : చాల్లే ఇంక ఆపు. నన్ను విసిగించక అవతలికి వెళ్ళు. 
లలిత : అది కాదండీ..... 
ఆనంద్ : ( విసురుగా ఏదో అనబోయేలోగా  నవ్య స్వరం వినిపిస్తుంది) 
నవ్య :  అమ్మా! అమ్మా! (నవ్య పిలుపు. తలుపు కొట్టిన చప్పుడు. ఆపై నవ్య ప్రవేశం)  
లలిత : ఏమ్మా స్కూలునించి అప్పుడే వచ్చేశావేం?
నవ్య : స్కూలు బోర్డ్ మెంబెర్ ఎవరో చనిపోయారని మధ్యాహ్నం నుంచీ సెలవు ప్రకటించారమ్మా (సమాధానం చెప్పి తల్లి వైపు చూసిన నవ్య, ఏడ్చినట్లుగా ఆమె కళ్ళు ఎర్రబడి ఉండడం గమనిస్తుంది. వెనుకగా వచ్చిన తండ్రిని చూసి) హలో నాన్నా (నవ్వుతూ పలకరిస్తుంది) 
ఆనంద్ : (కూతురికి సమాధానం చెప్పకనే లలితని ఉరిమినట్లు చూసి విస విసా వెళ్ళిపోతాడు)  
నవ్య : అమ్మా ఈ సమయంలో నాన్న ఇంటిలో ఉన్నారేం? ఎందుకలా కోపంగా ఉన్నారు? 
లలిత :  ఏమీ లేదమ్మా ఏవో బ్యాంకులో గొడవలు. 
నవ్య : ఊ..... సాలోచనగా తల్లి కేసి చూసి.. నాన్నలో ఏదో మార్పు కనిపిస్తోందమ్మా నాకు. ఇదివరకటిలా  చలాకీగా ఉండటం లేదు. బ్యాంకునుంచి రాగానే నన్ను నవ్వుతూ పలకరించేవారు. 
ఫ్రెష్ అయి వచ్చి నా దగ్గర కూర్చుని స్కూల్లో ఏం జరుగుతోందని అడిగేవారు. ఈ మధ్యన అవేం చేయటం లేదమ్మా. ఎందుకో మరి! నీకేమైనా తెలుసా? 
లలిత : చెప్పాను కదమ్మా బ్యాంకులో గొడవలని. ఆయనే సరవుతారు. నువ్వు ఎక్కువగా దిగులుపడకు. సరేనా? (కూతురి కేసి సూటిగా చూడకుండా అనేసి) సరి సరి ఈ మాటలకేంగానీ పద ఏదైనా తిందువుగాని. 
నవ్య :  (తల్లి మాట దాటేయడం, స్వరంలో రవంత చిరాకూ గమనించి) వద్దమ్మా. నువ్వు  బాక్సు లో పెట్టిన అన్నం తినేసాను (అనేసి లోపలికి వెళ్ళిపోతుంది)  
లలిత : (స్వగతం) భయపడినట్లే జరుగుతోంది. నవ్యకి సందేహం మొదలైంది ఈయన ప్రవర్తన పట్ల. ఈయనకెంత చెప్పినా అర్థం కావటం లేదు, భగవంతుడా నేనేం చేయాలిప్పుడు? (నుదురు కొట్టుకుంటుంది బాధగా) . 
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages