జర్నీ ఆఫ్ ఎ టీచర్ -40 (ఆఖరి భాగం)
చెన్నూరి సుదర్శన్
ఆనాడు పేపర్లో తానొకటి ప్రకటించిన అస్త్రం విఫలం గావడమే గాకుండా నేడు వివిధ పేపర్లలో ఫోటోలు.. ప్రశంసలు రావడం జోగయ్య కాలు గాలిన పిల్లిలా చిందులు వేయసాగాడు.
దానికి తోడు భాగ్యలక్ష్మి తనతో మాట్లాడక పోవడం మరింత పిచ్చివాడైపోయాడు.
బూటకపు వార్తకు మూల పురుషుడు జోగయ్య అని స్టాఫ్‌లో అందరికీ అర్థమయ్యింది. ఆనాటి నుండి తోటి లెక్చరర్లు అతడితో మనసు విప్పి మాట్లాడ్డం మానేసారు. దాంతో అతడిలో మార్పు రావాల్సింది పోయి మరింత పట్టుదల పెరిగింది. ఎలాగైనా సూర్యప్రకాష్‌ను దోషిగా అందరిముందు తలవంచుకునేలా చెయ్యాలనే కక్ష ప్రబలమయ్యింది.
‘మీరు మాట్లాడకపోతే నాకేం నష్టం?’ అనే ధోరణిలో జోగయ్య తలబిరుసుదనం ఆఫీసునాశ్రయించింది. ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ ఆశయ్యతో ఉన్న స్నేహం కాస్తా జిగ్రీ దోస్తానీగా మారింది.
సమయం చిక్కితే చాలు. ఆఫీసులో దూరడం.. ఆశయ్యతో చెట్టాపట్టాలేసుకొని హోటల్లో దూరడం.. గమనిస్తూనే ఉన్నాడు సూర్యప్రకాష్.
‘ఈమారు సునామి లాంటిదేదో పెద్ద ఉపద్రవం ముంచుకు రావచ్చు’ అనే సందేహం అతన్ని మరింత జాగరూకత పర్చింది.
కాని ‘తెగించిన వానికి తెడ్డే లింగం’ అన్నట్లు మనిషి పగ, ప్రతీకారంలో ఎంత విజ్ఞానవంతుడైనా రాక్షసుడుగా మారుతాడనే విషయం నిర్వివాదాంశం.
ఆరోజు శనివారం..
సాయంత్రం అయిదు కావస్తోంది. కాలేజీ కాలపట్టికానుసారం థియరీ క్లాసులైపోయాయి. ప్రాక్టికల్స్ లేవు. పునఃశ్చరణతరగతులూ లేవు.
విద్యార్థులంతా వెళ్ళిపోయారు. కాలేజీ నిశ్శబ్దంగా ఉంది. మరో పదినిముషాల్లో స్టాఫ్ అంతా వెళ్ళిపోతారు. సూర్యప్రకాష్ ఐదున్నర కానిదే కదలడు.
ఆశయ్య విద్యార్థుల స్కాలర్షిప్ ఫార్మ్స్.. ఫైల్ తీసుకొని ప్రిన్సిపల్ దగ్గరికి సంతకాల కోసం వెళ్ళాడు.
సూర్యప్రకాష్ ఒక్కొక్క విద్యార్థి వివరాలు చూస్తూ సంతకాలు పెడ్తున్నాడు.
జోగయ్య ఎదో పని ఉన్నవాడిలా “ఎక్స్ క్యూజ్ మీ సార్..” అనుకుంటూ ప్రిన్సిపల్ చాంబర్ లోకి దూరాడు పిల్లిలా.
సూర్యప్రకాష్ తలెత్తి చూసి కుర్చీ చూపించాడు. అందులో కూర్చోకుండా సూర్యప్రకాష్ సంతకాలు పెడ్తున్న స్కాలర్ షిప్ ఫార్మ్స్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
నెమ్మదిగా కబుర్లు చెబుతూ ఒక విద్యార్థి ఫార్మ్ తీసుకొని చూసాడు.
“సార్.. ఈ స్టూడెంటు ఎస్సి కాదు.. బి.సి. ఇందులోకేలా వచ్చింది?” అంటూ ఆశయ్య వంక చూసాడు.
సూర్యప్రకాష్‌కు అనుమానమేసి తిరిగి ఫార్మ్ తీసుకొని వెరిఫై చేసాడు.
“నో.. సార్.. ఎస్సీనే. క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేసాను” అంటూ సూర్యప్రకాష్ ఫార్మ్ ను పక్కకు పెట్టాడు.
“ఏంటీ..ఎస్సీనా..?” అంటూ రెట్టించాడు జోగయ్య.
“ఎస్సీ” వెరిఫై చేసానని చెప్పినా వినడం లేదన్నట్లుగా చిరు కోపం ప్రదర్శించాడు సూర్యప్రకాష్. కాని తనను రెచ్చగొడ్తున్నట్లు గమనించ లేకపోయాడు.
“నన్ను ఎస్సీ అంటావా..? ఆశయ్యా.. దీనికి నువ్వే సాక్షి..
నన్ను కులం పేరుతో దూషిస్తావా..?” అంటూ కుర్చీ నుండి లేచి తెచ్చి పెట్టుకున్న కోపంతో ఊగిపోయాడు జోగయ్య.
కుర్చీ తీసి బలంగా నేలకేసి బాదాడు. గట్టిగా కేకలు వేయసాగాడు..
అనుకోని సంఘటనకు మ్రాన్పడి పోయాడు సూర్యప్రకాష్. కలం చేతిలో పట్టుకొని అలాగే విస్మయంగా చూడసాగాడు జోగయ్య వంక.
ఆగమయ్య కొట్టిన కాలేజీ చివరి బెల్లు కంటే జోగయ్య శాపనార్థాలు అధికంగా వినరావడంతో స్టాఫ్ అంతా ప్రిన్సిపల్ ప్రాంగణంలోకి పరుగెత్తుకొచ్చారు.
జోగయ్య సూర్యప్రకాష్‌పై శివాలెత్తే దృశ్యం చూసి.. విషయం అర్థం గాక ఆశయ్యను ఆరా తీసారు.
“జోగయ్య సార్‌ను ప్రిన్సిపాల్ కులం పేరుతో తిట్టాడు” ఆన్నాడు.. పిల్లికి ఎలుక సాక్షిలా..
‘నిజమేనా..?’ అన్నట్లుగా ఆగమయ్యను చూసారంతా..
“ఎస్సీ.. అనిమాత్రం నాకు వినొచ్చింది. కాని ఎందుకన్నాడో.. ఎవరినన్నాడో.. నాకు తెలీదు.
నేను బెల్ కొట్టే హడావుడిలో ఉన్నాను. ప్రిన్సిపాల్ దేవుడు.. అలా జోగయ్య సార్‌ను అన్నాడంటే నేను నమ్మను.. ” అంటూ ఆగమయ్య చేతిలోని సుత్తితో ఒకటి కొడదామా అన్నట్లుగా ఉరిమి చూడసాగాడు ఆశయ్యను.
“నేను చెవులార విన్నాను.. నాముందే తిట్టాడు.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు” అంటూ ఎదురు తిరిగాడు ఆశయ్య.
స్టాఫ్ తెల్లబోయింది.
జోగయ్య కనుసైగనందుకొని గబా, గబా కంప్లైంట్ రాసి సాక్షి సంతకం చేసాడు ఆశయ్య.
జోగయ్య దాన్ని చదివి తృప్తి చెందాడు. తనూ సంతకం చేసాడు. ఇరువురు కలిసి పోలీసు స్టేషన్‌కు టూ వీలర్‌పై అదృశ్యమయ్యారు.
వారి వెనుకాలే ఆగమయ్య సైకిలుపై దౌడుతీసాడు.
సూర్యప్రకాష్ నిశ్చేష్టుడయ్యాడు.
స్టాఫ్‌లో గుస, గుసలు మొదలయ్యాయి.. వారి చూపులు అయ్యో! పాపం ప్రిన్సిపాల్.. అన్నట్లు సూర్యప్రకాష్‌ను బాధించసాగాయి. అయినా వాస్తవం చెప్పడం తన బాధ్యత అని స్టాఫ్‌ను కూర్చోమని జరిగిన విషయం వివరించాడు.
స్టాఫ్ విస్తుపోయింది..
“1955 లో ‘అంటరాని తనం’ నేరంగా పరిగణిస్తూ తెచ్చిన చట్టంలో లొసుగులున్నాయని 1976 లో సవరణ చేసారు. అదీ నీరుగారి పోయింది.
షెడ్యూళ్ళ కులాలు, షెడ్యూళ్ళ తెగలవారిపై జరిగే దాడులు, మహిళలపై జరిగే హత్యాచారాలు జరుగకుండా సమర్థవంతంగా నిరోధించాలన్న లక్ష్యంతో అట్రాసిటీ యాక్టును (దుశ్చర్య నిర్మూలన చట్టాన్ని) కేంద్ర ప్రభుత్వం 1989 లో అమలులోకి తీసుకొచ్చింది.
దీనిని కనీసం డిప్యూటీ సూపరింటెండెంటు ఆఫ్ పోలీసు ర్యాంకు స్థాయి ఆఫీసరుతో విచారణ జరిపింఛి కేసు ఫైల్ చెయ్యాలి. కాని ఈ చట్టమూ దుర్వనియోగం అవుతుండడంతో.. నాన్ బెయిల్ వారెంటు అరెస్ట్ విషయంలో తాత్సారం జరుగుతోంది. దానికి ప్రధాన కారణం డబ్బు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు.
‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలున్న’ట్లు ప్రభుత్వం తెచ్చే చట్టాలకు తూట్లు పొడవడం మానవ నైజంగా మారింది.
ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి గోధుమలు పంపడం ప్రభుత్వం నిషేధిస్తే గోధుమపిండి పంపడం..
గోధుమపిండీ పంపడం నిషేధిస్తే రొట్టెలు చేసి పంపించే తెలివితేటలుగల ఉద్దండపండితులున్న దేశం మనది’’ అంటూ తేలికపాటి లెక్చరిచ్చాడు సివిక్స్ లెక్చరర్.
ఇంతలో సైకిలు అలా విసిరేసి వగరుస్తూ.. పరుగెత్తుకుంటూ.. వచ్చాడు ఆగమయ్య.
“సార్.. జోగయ్య, ఆశయ్య సార్లు ఎస్సైని కలిసారు. ఈ రోజు ఆక్షన్ తీసుకోవద్దు. సోమవారం ప్రార్థనా సమయంలో వచ్చి పిల్లల ముందు ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేయండి.. అంటూ కొన్ని డబ్బులివ్వడం చూసాను” అంటూ అక్కడ జరిగిన తతంగమంతా పూసగుచ్చినట్లు చెప్పాడు.
“సార్..మీరు నిశ్చింతంగా ఉండండి. మేమంతా మీకు అనుకూలంగా వాంగ్మూలమిస్తాం..” అంటూ భాగ్యలక్ష్మి ధైర్య వచనాలు పలికింది. “సార్.. ఆశయ్య, జోగయ్య లిద్దరూ ఒకే కులస్తులు.. ఇలా కాలేజీలలో కులాల కుట్రలు జరపడం శోచనీయం” అంటూ తన ఆవేదన తెలిపింది.
స్టాఫంతా భాగ్యలక్ష్మి మాటలకు మద్దతు తెలిపింది.
అట్రాసిటీ కేసులో మొదట ఎవరైనా అలా కంప్లైంటిస్తే చాలు.. ఇలా అరెస్టు చేసే వారు. చట్ట సవరణలో కనీసం ఒక సాక్షి ఉండాలనే నియమం వచ్చింది. వెంటనే అరెస్టు చేయవచ్చు.
స్టాఫ్ అంతా తనకు మద్దతు పలికినా ఫలితముండదని సూర్యప్రకాష్‌కు తెలుసు..
అన్యమనస్కంగా లేచాడు.. అతడి వెనకాలే స్టాఫ్ కదిలింది.
ఆగమయ్య ఆఫీసుకు తాళం వేసే పనిలో నిమగ్నమయ్యాడు.
***
సూర్యప్రకాష్ మనసు స్థిమితంగా లేదు.. ఇంటికి వెళ్లాలంటే మనస్కరించటం లేదు.
ఈ ఆపదనుండి ఎలా బయటపడడమా..! అని ఆలోచిస్తూ స్కూటర్ వెనక్కి తిప్పాడు కాలేజీ వైపు.
కాలేజీలో మరి కాసేపు కూర్చోవచ్చనుకున్నాడు.
ఆగమయ్య సైకిలుపై ఎదురయ్యాడు.. సూర్యప్రకాష్ స్కూటర్ ఆపి తన గది తాళంచెవి అడిగి తీసుకున్నాడు.
“నాక్కాస్తా పనుంది.. చూసుకొని వెళ్తాను. నువ్వు వెళ్ళిపో” అంటూ స్కూటర్ వేగం పెంచాడు.
ఆగమయ్య కళ్ళు చెమ్మగిల్లడం సూర్యప్రకాష్ మనసు ద్రవించింది.
కాలేజీకి వెళ్లి కూర్చున్నాడే గాని మనసుకు ప్రశాంతత కొరవడింది. ప్రాంతీయ అధికారికి విషయం వివరిద్దామని సెల్ ఫోన్ కోసం జేబు తడుముకుంటుంటే అదే మోగింది. ఫోన్ తీసి చూసాడు. ప్రాంతీయ అధికారికి ఫోన్ అది. అప్పుడే అతడికి విషయం తెలిసిందా..! అనే అనుమానిస్తూ ఫోన్ ఎత్తాడు.
“గుడ్ ఈవినింగ్ సార్” అని జరిగిన సంఘటన వివరించబోతుంటే..
“నా కంతా తెలిసింది. నేనో వంక హెచ్చరిస్తూనే ఉన్నాను. జోగయ్యతో కాస్తా జాగ్రత్తగా ఉండమని.. వాడో మెంటల్ గాడు.. నేనేం చేసేది చెప్పు. నా సలహా విను.. జోగయ్యతో కాంప్రమైజైపో.. ఏ సమస్యా ఉండదు.. అనవసరంగా కేసులో ఇరుక్కొని చెడ్డపేరు తెచ్చుకోకు.. ఎవరైనా లాయర్‌ను సంప్రదించు.. జాగ్రత్తగా ఆలోచించి అడుగు వెయ్యి.
నీ పేరు ‘బెస్ట్ టీచర్ అవార్డు’ కోసం పరిశీలనలో ఉంది.. కాలదన్నుకోకు” అంటూ ఫోన్ పెట్టేసాడు.
తలపట్టుకొని అలాగే కుర్చీలో వాలిపోయాడు సూర్యప్రకాష్.
సూర్యప్రకాష్‌కు తన మునిపల్లి విద్యార్థి ప్రభాకర్ లాయరు గుర్తుకు వచ్చాడు.
ప్రభాకర్‌కు ఫోన్ చేసాడు. అతనూ అదే సలహా ఇచ్చాడు..
“కాంప్రమైజ్ కావడం తప్ప వేరే దారి లేదు సార్.. మీరు నిశ్చింతగా ఉండండి.. ఆపని నేను చూసుకుంటా” అన్నాడు ప్రభాకర్.
“నేను మళ్ళీ మాట్లాడుతాను” అంటూ నిర్జీవంగా ఫోన్ పెట్టేసాడు సూర్యప్రకాష్.
కాంప్రమైజ్ కావాలంటే ముందు ఆశయ్యను పట్టుకోవాలి. అతడు పూర్తిగా మందు మనిషి. విస్కీ క్వార్టర్ వితౌట్ వాటర్ అతడికొక పెగ్గు కింద లెక్క. అలాంటి పెగ్గులు నాలుగు లాగిస్తేనే గాని మన మాట వినడు..
మందుకు ఆమడ దూరం సూర్యప్రకాష్.
ఆగమయ్యతో సిట్టింగ్ చేయిద్దామా.. అనే ఒక ఆలోచన మదిలో మెదిలింది. ఇదో రకంగా వ్యభిచారమే అని మనసు వార్నిగ్ ఇవ్వడం.. మది నుండి ఆలోచన తుడిచేసాడు.
అపవాదు పాలైనా మంచిదే గాని.. ఇలాంటి బ్రోకర్ పనులు చేయొద్దని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ‘ఎదుటి వారికి నీ వల్ల వీలైనంత సహాయం చెయ్యి.. ఒకవేళ వీలుగాక సాయం చెయ్యక పోయినా నష్టం మాత్రం చెయ్యొద్దు’ అనే సిద్దాంతం మీద నడిచే తనకు ‘అన్యాయం జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా..!’ తను నమ్మిన సిద్దాంతం తననెప్పుడూ మోసంచెయ్యదని గట్టి నమ్మకం అతడిలో.
‘తనకు ముగ్గురు పిల్లలను ప్రసాదించిన దేవుడు వారికి మంచి భవిష్యత్తు కలిగించాడు. పెద్ద కొడుకు పోలియో బారిన పడినా తేరుకొని ఎం.బి.ఏ.కంప్యూటర్స్ చేసి అమెరికాలో స్థిరపడ్డాడు. మరొక కొడుకు బి.టెక్ కంప్యూటర్స్.. అమ్మాయి డాక్టరు.. అందరి పెళ్ళిళ్ళూ జరిగాయి.. హాయిగా వారి వారి కాపురాలు చేసుకుంటున్నారు.
అదృష్ట వశాత్తు అర్థాంగి విద్యావతి తన పిల్లలతో బాటుగా చదువుకొని ప్రైవేటుగా బియ్యే పాసయ్యింది.. ప్రభత్వ టీచరుగా ఉద్యోగమూ సంపాదించుకుంది..
అనవసరంగా కాలేజీ సమస్యలు చెప్పి ఆమెకు నిద్రరాకుండా చెయ్యడం సబబు కాదు. ఎలా జరుగనుందో..
అలా జరుగక మానదు..’ అని మనసుదిటవు చేసుకొని దేవుడిపై భారం వేసి ఇంటికి దారి తీసాడు సూర్యప్రకాష్.
***
ఆరోజు సోమవారం..
ప్రార్థన బెల్ మ్రోగింది..
గుండె అరచేతిలో పట్టుకొని బయలు దేరాడు సూర్యప్రకాష్. తాను ఏ తప్పూ చేయక పోయినప్పటికీ ఎదురుగా ఉంది పిచ్చివాడి చేతిలో రాయి. అందరి పిల్లల ముందు ఎస్సై వచ్చి ఎంత హంగామా చేస్తాడోననే గుండె లోని భయం.. కాళ్ళనావహించింది.
స్టాఫ్ ముఖాలలో ఆందోళన కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది.
జోగయ్య, ఆశయ్యల ముఖాలు వెలిగిపోతున్నాయి.. ప్రిన్సిపాల్ గడియలు దగ్గరపడ్తున్నాయి.. అని సెకన్లు లెక్కిస్తూ గాలిలో తేలుతూ వస్తున్నారు.
ఫిజికల్ డైరక్టర్ విజిల్ వేసాడు.. పిల్లల అలజడి ఆగింది.
చెట్టుమీద పిట్టలు సైతం ప్రార్థననాలకించాలని కొమ్మలకు బుద్ధి చెప్పి బహు బుద్ధిగా కూర్చున్నాయి. మరో రెండు విజిల్స్ తో ప్రార్థన ఆరంభమయ్యింది..
జోగయ్య, ఆశయ్యలు గుడ్లప్పగించి అటూ ఇటూ తలలు తిరుగసాగాయి గ్రౌండ్ టెన్నిస్ బంతిలా..
ప్రార్థన పూర్తయ్యింది..
విజిల్ మ్రోగడంతో సుశీల వచ్చి ప్రతిజ్ఞ చేయించింది.. నేటి వార్తల ముఖ్యాంశాలు కొన్ని చదివింది.
జోగయ్య గుండెలో గాబరా ఆరంభమయ్యింది. తేప, తేపకు ఆశయ్యను చూడసాగాడు. ఆశయ్య నాకు మాత్రమేం తెలుసు అన్నట్లుగా ముఖం పెడ్తున్నాడు.
అనాటి సూక్తి.. ‘చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద’. వివరించసాగాడు తెలుగు లెక్చరర్.
ఆ సూక్తి జోగయ్య మనోభావానికి దర్పణం పడ్తోంది. చిత్తం ప్రార్థనా గీతం పైన... భక్తి ఎస్సై పైన.. వచ్చి ప్రిన్సిపల్‌ను అరెస్టు చేస్తాడనే ఉద్వేగం.
“మనిషి ఏపని చేస్తున్నాడో.. దాని మీదనే మనసు లగ్నం చేయాలి. ఒకటి చేస్తూ మరొక దాని గురించి ఆలోచించడం మంచిది కాదు. ఒక్కోసారి ప్రమాదం కూడానూ.. ఉదాహరణకు ఒకరు ఏదైనా ఒక వాహనం నడుపుతూ మరొక సమస్య గురించి ఆలోచిస్తూంటే ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవచ్చు లేదా.. మరొకరి ప్రాణాలు తీయవచ్చు..” అని ముగించాడు తెలుగు లెక్చరర్.
విజిల్ శబ్దాలకు అనుగుణంగా విద్యార్థులు తమ, తమ క్లాసులకు దారి తీసారు.
జోగయ్య ఆశయ్యను వంక ఉరిమి చూస్తూ కళ్లెగరేసాడు.
పెదవులను మరోసారి చిత్రాతిచిత్రంగా తిప్పాడు ఆశయ్య.
సూర్యప్రకాష్ ఆశ్చర్యపోయాడు. పాపం! ఎస్సై పాపభీతి కలిగిన వాడేమో..! నిజా, నిజాలు విచారించి ఆగిపోయాడేమో..! ఈ రోజు గండం గడిచినట్లేనా..! అని పరి, పరి ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళాడు.
‘సార్.. ఒక గంట పర్మిషన్ కావాలి. అర్జంటుగా బయటికి వెళ్ళాలి.. నాతో బాటుగా ఆశయ్యను తీసుకు వెళ్తాను’ అంటూ జోగయ్య వచ్చి అడుగుతాడని ఊహించసాగాడు సూర్యప్రకాష్. అతడి ఊహ కరక్టే గాని.. జోగయ్య పర్మిషన్ తీసుకోకుండానే ఆశయ్యను తీసుకొని బండిమీద బయటికి వెళ్ళడం.. నిర్ఘాంతపోయాడు. తనతో తాడో పేడో తేల్చుకోవాలనే జోగయ్య అలా ప్రవర్తిస్తున్నాడని.. అర్థమయ్యింది. దీర్ఘంగా నిట్టూర్చాడు.
“సర్.. ఎక్ష్ క్యూజ్ మీ..” అంటూ పత్రికా విలేకరి నరహరి రావడం.. గుండె ఆగిపోయినంత పనయ్యింది సూర్యప్రకాష్‌కు.
అడుగంటిన చిరునవ్వునంతా తోడుకొని పెదవులపై ప్రదర్శిస్తూ..
“నరహరీ.. రా బాబూ..” అంటూ స్వాగతించాడు.
సూర్యప్రకాష్‌కు ‘గుడ్ మార్నింగ్’ చెబుతూ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. సూర్యప్రకాష్ గుండె వేగం పెరిగింది. ఏ ప్రమాదకరమైన వార్త వినాల్సి వస్తుందోనని గుండె బిగువు చేసుకొని ఆగమయ్యకు టీ కోసం పురమాయించాడు.
“టీ తెచ్చిపెట్టాను సార్..” అంటూ ఫ్లాస్కులో ఉన్న టీ ని రెండు కప్పుల్లో వంచి ఇద్దరికీ పంచాడు ఆగమయ్య.
“సార్.. ఏమిటి విశేషాలు..” అంటూ నరహరి చిరునవ్వుతో అడిగాడు.
సూర్యప్రకాష్ గుండె జారిపోయింది. తనను అపహాస్యం చేస్తున్నాడేమోనని అనుమానం కలిగింది. లేని ధైర్యం తెచ్చుకొని...
“వార్తాశేఖరులు.. మీకు తెలియని విశేషాలేముంటాయ్” అన్నాడు ఇదివరకున్న పరిచయ చనువుతో..
టీ స్విప్ చేస్తూ.. “జోగయ్య , ఆశయ్య సార్లు ఇద్దరూ బండిమీద ఏటో వెళ్తున్నారు సార్. నేను వారిని చూసా గాని వారు నన్ను చూసే ధ్యాసలో లేరు” అన్నాడు నరహరి.
“ఔను నరహరీ.. నాకూ చెప్పకుండానే వెళ్ళారు” అన్నాడు సూర్యప్రకాష్ టీ కప్పును చూస్తూ .. తాగడం మనస్కరించక.
“సార్..టీ తీసుకోండి చాల్లారుతుంది” అంటూ ఖాళీ అయిన తన కప్పున పక్కకు పెడ్తూ.. “నాకు తెలుసు సార్.. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో..” అన్నాడు నరహరి.
“తెలుసా..?” అంటూ ఆశ్చర్యంగా అడిగాడు.
సూర్యప్రకాష్ టీ కప్పు ఆగమయ్యకిస్తూ తాగమన్నాడు.
“మీకూ తెలుసని నాకు తెలుసు.. అయినా మీరేమీ భయపడకండి సార్.. ఎంత వేగంగా వెళ్ళారో అంతే వేగంగా తిరిగి వస్తారు..” అంటూ మళ్ళీ నవ్వాడు నరహరి.
సూర్యప్రకాష్ కేమీ అర్థం కావడం లేదు.. పోలీసు స్టేషన్ అని తనూహించాడు.. నరహరికీ తెలుసా..! తను ముందుగా బయట పడగూడదనుకుని..
“నేనూహించింది తెలుసా.. నరహరీ..” అన్నాడు కుతూహలంగా..
“యస్ సార్.. మీ ఊహ కరక్టే.. ఎందుకంటే కాన్సిక్వేన్సేస్.. అవేగాబట్టి” అంటూ సూర్యప్రకాష్‌ను చూస్తూ “సార్ మీరు నిశ్చింతంగా ఉండండి.. మీకేమీ గాదు. మీలాంటి మంచి మనిషికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా సార్.. ఇదివరకే నావల్ల ఒక తప్పు జరిగింది. దాన్ని సరిదిద్దుకునే అవకాశంకలిగింది” అన్నాడు నరహరి.
సూర్యప్రకాష్‌కు అర్థమయ్యింది.. నరహరికి విషయం పూర్తిగా తెలిసిందని. ఇక దాచి లాభం లేదనుకొన్నాడు.
జరిగిన విషయం చెప్పి “ఔను నరహరీ.. వాళ్ళు ఎస్సై దగ్గరికి వెళ్ళారని అనుకుంటున్నాను.
ఈ రోజు నన్ను అరెస్టు చేయించాలని పథకం పన్నారు..కాని ఎస్సై ఎందుకో రాలేదు” అన్నాడు సూర్యప్రకాష్..
“రాడు సార్..” నిశ్చింతంగా అన్నాడు నరహరి.
సూర్యప్రకాష్ మనసు కాస్తా నెమ్మదించింది. కాని నమ్మబుద్ధికావడంలేదన్నట్లు చూసాదు.
“ఇప్పుడు నేను పోలీసు స్టేషన్లో జరుగుతున్న తతంగమంతా వివరిస్తాను వినండి..” అంటూ నరహరి లైవ్ టెలికాస్ట్ చెయ్యడం మొదలు పెట్టాడు.
ఆసక్తిగా పెరిగింది.. సూర్యప్రకాష్లో..
“జోగయ్య సార్ స్టేషన్ బయట బండి పార్క్ చేసాడు. సెంట్రీని ఎస్సై ఉన్నాడా అని అడిగి తెలుసుకొని ఇద్దరు కలిసి లోనికి వెళ్ళారు..
ఎస్సై వారిని చూడగానే ముఖం చిట్లిస్తూ.. కూర్చోమన్నాడు. జోగయ్య , ఆశయ్యలు ఎస్సై ముఖకవళికలు గమనించి ‘డబ్బు తిన్నా.. మనిషికి రవంతైనా కృతజ్ఞత లేద’ని మనసులో గొణుక్కుంటున్నారు.
ఎస్సై తన ముందున్న లాప్టాప్ ఓపెన్ చేసి వారి ముందుంచాడు. అందులో ఒక సినిమా వస్తోంది.. జోగయ్య, ఆశయ్యల ముఖాలు మాడిపోతున్నాయి.. సినిమాలో ‘టు బి కంటిన్యూడ్’ అని రాగానే ల్యాప్‌టాప్ ఆఫ్ చేసాడు ఎస్సై.
జోగయ్య రాసిచ్చిన కంప్లైంట్ ముందు పెట్టాడు. అందులో నమోదు చేసిన సమయాలు.. సినిమాలో ఇరువురి మధ్య జరిగిన సంభాషణలో చర్చించుకున్న సమయాలు సరిగ్గా సరిపోయాయి..
“మరో సారి ఇలాంటి ఘటన పునరావృతమైతే ముందు మీ చర్మం వలుస్తా” అంటూ పోలీసు భాషలో వార్నింగ్ ఇచ్చాడు ఎస్సై.
తామిచ్చిన కంప్లైంట్ వాపసు తీసుకొని ‘బతుకు జీవుడా’ అంటూ బయటకు పరుగు తీసారు ఇద్దరూ..
చల్లచెమటలు పోసాయి ఇరువురికి.. పార్కు చేసిన బండి తీసాడు జోగయ్య. చేతులు వణుకుతున్నాయి.. నడపడం తనవల్ల కాదని బండి ఆశయ్య కిచ్చాడు. ఆశయ్య వెనకాల కూర్చున్నాడు జోగయ్య. బండి బయలు దేరింది. మరో పది నిముషాలలో తిరిగి వస్తారు” అంటూ చెప్పడం ఆపాడు నరహరి.
“సినిమా ఎంటి?” అంటూ ఆత్రుతగా అడిగాడు సూర్యప్రకాష్.
“సార్.. మీ మీద కక్షతో జోగయ్య కాలేజీ సమయపాలన గురించి నాతో తప్పుడు వార్తలు రాయించాడు కదా.. ఆరోజు నుండి నేనతడిపై ఒక డేగ కన్నేసి ఉంచాను.
ఈమధ్య ఆశయ్యను వెంటేసుకొని తిరగడం అనుమానమేసింది. వారిపై నిఘాపెంచాను. నన్ను గుర్తిస్తారని చెప్పి మరో స్నేహితుని సహాయం తీసుకున్నాను.
నా అనుమానం నిజమని తేలింది. నాలుగు రోజుల క్రితం బారులో కూర్చొని మీ మీద ‘అట్రాసిటి’ కేసు ఎలా బానాయించాలో సమయ సహితంగా పథకం రచించారు. అదంతా నా స్నేహితుడు పెన్ కెమెరా సాయంతో రికార్డు చేసాడు.
తిరిగి నిన్న నిన్న రాత్రి ఎస్సై తో సిట్టింగ్ చేసారు. ఈరోజు ఉదయం ప్రార్థన సమయంలో వచ్చి మిమ్మల్ని విద్యార్థుల ముందు అరెస్టు చేయాలని మరికొంత డబ్బు ముట్టజెప్పారు. అదీ రికార్డ్ అయింది.. ‘టు బీ కంటిన్యూడ్’ లో ఉంటుంది.
ఈ రోజు ఉదయం ఏడు గంటలకే పోలేసు స్టేషన్ వెళ్లాను. ఎస్సైకి చుక్కలు కనబడేలా నా ల్యాప్ టాప్ లో రికార్డు చేసిన వీడియో చూపించాను” అంటూ నరహరి చెబ్తుంటే సూర్యప్రకాష్ కళ్ళల్లో ఆనంద భాష్పాలు దొర్లాయి.
“నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. నరహరీ.. నాకు పునర్జన్మ ప్రసాదించావు.. నీ మేలు ఈజన్మలో మర్చిపోను..” అంటూ లేచి వచ్చి నరహరిని తన హృదయానికి హత్తుకున్నాడు సూర్యప్రకాష్.
“సార్.. వేయిమంది నేరగాళ్ళు తప్పించుకున్నా ఫరవాలేదు గాని మీలాంటి మేధావి మనసు క్షోభ పడిందంటే దేశానికి అరిష్టం..”
“చాలా రిస్క్ తీసుకున్నావ్ నరహరీ..”
“మా వృత్తిలో ఇది మామూలే సార్.. ఎస్సైకి విషయమంతా వివరించాను. ఇక మీ జోలికేవ్వరూ రారు సార్..” అంటూ కరచాలనం చేస్తూ అభయమిచ్చాడు.
ఇక నేను వస్తాను సార్..” అంటూ వెళ్తుంటే.. మరోసారి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు సూర్యప్రకాష్.
చేతులు కలిపి వెళ్ళిపోయాడు నరహరి.
ఇంతలో ఆశయ్య ఒక్కడే తిరిగి వచ్చాడు బండి మీద. జోగయ్య రాలేదు. సూర్యప్రకాష్ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు.
ఆగమయ్య కాలేజీ రెండవ పీరియడ్ బెల్లు గొట్టి కాసేపటికి వచ్చాడు.
“సార్..జోగయ్య సార్ మీకిమ్మన్నాడట..ఆశయ్య సారిచ్చాడు” అంటూ ఆగమయ్య ఇచ్చిన అప్లికేషన్ చూసాడు సూర్యప్రకాష్.
అది జోగయ్య దీర్ఘకాలపు సెలవు పత్రం.. మెడికల్ సర్టిఫికేట్ జతచేసి ఉంది.
నవ్వుకున్నాడు సూర్యప్రకాష్..
జోగయ్యకు అర్థమై పోయింది.. ముఖం చూపించే ధైర్యం కూడా కోల్పోయాడని అనుకున్నాడు.
స్టాఫ్రూంలోకి వార్త ప్రాకి పోయింది.
కొన్నాళ్ళకు జోగయ్య తిరిగి కాలేజీకి బదిలీ ఉత్తర్వులతో వచ్చి రిలీవై వెళ్ళిపోయాడు.
కాలేజీ నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది.
***
2008 లో ఉపాధ్యాయ దినోత్సవం నాడు సూర్యప్రకాష్‌ను ‘రాష్ట్ర ఉత్తమ టీచర్’ అవార్డు వరించింది..
గుమ్మడిదల జూనియర్ కాలేజీ విద్యార్థులు ఆ సంవత్సరం నూటికి నూరు శాతం పాసవ్వడమే గాకుండా..
కామర్స్ విద్యార్థిని చంద్రకళ పరీక్షల్లో రాష్ట్ర తృతీయర్యాంకు సాధించింది.
ఇంటర్మీడియట్ డైరక్టర్ ప్రిన్సిపాల్స్ సమావేశమేర్పరచి “ ఇంటర్మీడియట్ చరిత్రలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ గుమ్మడిదల పేరును సువర్ణాక్షరాలతో లిఖించదగిన సందర్భం” అంటూ అభివర్ణించాడు.
సూర్యప్రకాష్‌ను, చంద్రకళను ఘనంగా సన్మానించాడు.
సూర్యప్రకాష్ తన ఉపన్యాసంలో డైరక్టర్ గారికి ధన్యవాదములు తెలుపుకుంటూ జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లు మిగతా లెక్చరర్లతో బాటు సమానంగా కష్టపడుతున్నా జీతభత్యాలలో చాలా వ్యత్యాసముందని.. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసాడు.
సభకు హాజరైన ప్రిన్సిపాల్స్ అందరూ చప్పట్లతో తన విన్నపానికి మద్దతు తెలిపారు.
***
ఇలాంటి అపూర్వమైన అనుభూతులతో కొనసాగిన సూర్యప్రకాష్ ప్రభుత్వ లెక్చరరు ప్రయాణం 2010 వ, సంవత్సరం ఆగస్టు నెలాఖరున పదవీ విరమణతో ముగిసింది..
పదవీ విరమణ సభకు ఇంటర్ మీడియట్ రీజనల్ జాయింట్ డైరక్టర్ గారితో బాటు తదితర విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. గ్రామ సర్పంచ్.. గ్రామ పెద్దలూ పెద్దఎత్తున హాజరయ్యారు.
తన పూర్వ మునిపల్లి విద్యార్థి సుధాకర్ నేతృత్వంలో అనేకమంది పూర్వపు విద్యార్థులు హాజరయ్యారు.
మాణిక్యాన్ని సూర్యప్రకాష్ చూడగానే హృదయం ఉప్పొంగిపోయింది. మనిషి కాస్తా సన్నబడ్డాడు. ఇప్పుడు ఒక కర్ర సాయంతోనే సులభంగా నడుస్తున్నాడు.
మాణిక్యం మాట్లాడుతూ తాను పడ్డ కష్టాలు.. నేను అందించిన చేయూత వివరిస్తుంటే సభ యావత్తు హర్షించింది.
ఆ తరువాత మాణిక్యం మాట్లాడడం కొనసాగిస్తూ.. తను గ్రూప్ టు పరీక్ష రాసి అసిస్టెంట్ కమర్సియల్ టాక్సాఫీసరయ్యానని ఉద్వేగభరితంగా చెప్పినప్పుడు సభ చప్పట్లతో మారుమ్రోగి పోయింది.
సూర్య ప్రకాష్ లేచి వెళ్లి అభినందించాడు.
సూర్యప్రకాష్ కాళ్ళకు నమస్కరిస్తూ ఆశీర్వాదాలు కోరాడు మాణిక్యం.
సభలో చప్పట్లు మ్రోగుతూనే ఉన్నాయి.. సభలో చప్పట్లు మ్రోగుతూనే ఉన్నాయి.. మ్రోగుతూనే ఉన్నాయి.. మ్రోగుతూనే ఉన్నాయి..
సూర్యప్రకాష్ కళ్ళల్లో ఆనందభాష్పాలు...
ఆ మరునాడు తనను సన్మాననించిన కార్యక్రమం నరహరి నేతృత్వంలో దినపత్రికలన్నీ శ్లాఘిస్తూ లోకానికి చాటి చెప్పాయి.
జీవితంలో మర్చిపోలేని మధురస్మృతులు...
***
హాల్లో విద్యార్థుల అలికిడికి తేరుకున్నాడు సూర్యప్రకాష్.
మరో బ్యాచ్ పిల్లలకు పాఠాలు చెప్పాలని ఉద్యుక్తుడయ్యాడు. వాలు కుర్చీలో నుండి లేచి ఒక గ్లాసు మంచి నీళ్ళు తాగి హాల్లోకి వచ్చాడు కళ్ళద్దాలు సర్దుకుంటూ..
పిల్లలంతా లేచి అభివాదం తెలిపారు.
సూర్యప్రకాష్ మనసులో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున ఎగిసాయి..
విద్యాదానం తరగనిది.. చేసినకొద్దీ ద్విగుణీకృతమవుతుంది.
ఒక టీచర్‌కు నిజమైన తరగని పెన్నిధి అష్టైశ్వర్యాలు కాదు.. విద్యార్థులు. విద్యార్థులు ప్రయోజక వంతులైనప్పుడు ఒక టీచరు పొందే ఆనందం అనిర్వచనీయం..
అలాంటి విద్యార్థులకు తన కడశ్వాస వరకు ఇలాగే విద్యాదానం చేస్తూ.. టీచరు ప్రయాణాన్ని కొనసాగించాలని ధృఢసంకల్పంతో నిర్ణయం తీసుకున్నాడు సూర్యప్రకాష్.
***
( అయిపొయింది )
No comments:
Post a Comment