ఆసక్తి కలిగించే అనుభవాల మాల - దైవంతో నా అనుభవాలు - అచ్చంగా తెలుగు

ఆసక్తి కలిగించే అనుభవాల మాల - దైవంతో నా అనుభవాలు

Share This
ఆసక్తి కలిగించే అనుభవాల మాల -  దైవంతో నా అనుభవాలు

                                                                         పి.యస్.యమ్. లక్ష్మి




ఆసక్తి కలిగించే అనుభవాల మాల ఇది.  ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి శ్రీ వెంకట వినోద్ పరిమి గారు  అనుభవాలనందిస్తే, శ్రీ యం. రమేష్ కుమార్, నెల్లిమర్ల గారు అక్షరీకరించారు.  ఇద్దరూ ఒక్కరుగా వినిపించటంలో కృతకృత్యులయ్యారు.  ఆధ్యాత్మిక భావాలు కలవారందరూ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించినవేనేమో  అనిపించే ఈ భావాలు అందరి భక్తులవీ.  అందుకనే ఈ భావనా లోకంలో ప్రవేశించిన చదువరి  వీటితో మమైకం చెంది, పుస్తకం చివరి పేజీ దాకా చదివిగానీ వదిలి పెట్టడు. 

భక్తులు ఇబ్బందుల్లో వుంటే ముందు తలచుకునేది భగవంతుడినే.  మన ఇబ్బందులనుంచీ మనని బయటపడేసి కాపాడేది ఆ భగవంతుడే అనే నమ్మకం కారణం.  నమ్మిన భక్తుణ్ణి కాపాడటానికి ఆ భగవంతుడు స్వయంగా వచ్చి కనబడడుగానీ, అవసరమైనప్పుడు అనేక రూపాలలో మనల్ని కాపాడుతూనే వుంటాడనే ధైర్యం భక్తుడికి వుంటుంది.  ఆ ధైర్యమే అనేక ఆకారాలలో ఊహించని విధంగా వచ్చే సాయాలలో భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకుని, ఆయన ఉనికిని గమనించి, ఆయనకి మరింత దగ్గరగా చేస్తుంది.   దానితో భక్తునికి మరింత నమ్మకం, ధైర్యం పెరుగుతాయి.

శ్రీ వెంకట వినోద్ పరిమి  వుండేది సింగపూర్.  చేసే ఉద్యోగం మల్టీ నేషనల్ కంపెనీలో బాధ్యతాయుతమైనది. అయినా విదేశ వ్యామోహంలో పడకుండా తన దేశం, తన సంస్కృతి, తన ధర్మం అనుకునే మనిషి.  మనిషి అక్కడ వుండి ఉద్యోగం అక్కడ చేస్తున్నా మనసు మాత్రం తన సంస్కృతీ ధర్మాల మధ్యనే తిరుగుతూ వుంటుంది.  అందుకనేనేమో వీలయినంత తరచూ భారత దేశంలోని ప్రసిధ్ధ ఆలయాలను మళ్ళీ మళ్ళీ దర్శిస్తూ తన అనుభూతులను పెంపొందించుకుంటున్నారు.  దైవంతో తన సాన్నిహిత్యాన్ని పెంపొందింప చేసుకుంటున్నారు.  ఆ ఏడుకొండలవాడు సదా తనని అంటి పెట్టుకుని వుండి తనని అభివృధ్ధి పధాన నడుపుతున్నాడనే ఆత్మ విశ్వాసంతో విజయ పధంలో నడుస్తున్నారు.

మనుషులలో ఆలోచనలు రేకెత్తించి, అనుభవాలు పండించి, నమ్మకాలను పెంపొందించి, ఆత్మ స్ధైర్యాన్ని పండించే ఇలాంటి రచనలు  చదవటంవల్ల మనకి కూడా మనశ్శాంతి, మనో నిబ్బరం ఏర్పడతాయనటంలో సందేహం లేదు. ఆస్తికులైన ప్రతి ఒక్కరూ చదువ వలసిన పుస్తకం .. వెంకట వినోద్ పరిమిగారి దైవంతో నా అనుభవాలు.

200 రూ. విలువ చేసే ఈ పుస్తకం ప్రాప్తి స్ధానం : అచ్చంగా తెలుగు, ఫోన్ నెం. 8558899478(వాట్స్ ఆప్)


 ***

No comments:

Post a Comment

Pages