ఎలుకలా!? మజాకానా!??
పి.యస్.యమ్. లక్ష్మి
సెల్ నెం. 9866001629
పిల్లలూ, ఒక సరదా కధ చెప్పనా? ఒక ఊళ్ళో ఒక మిఠాయి కొట్టు వుంది. అక్కడ రోజూ చాలా మిఠాయిలు, కారం తినుబండారాలు తయారు చేస్తూ వుంటారు. వాటికోసం శనగ పిండి, మైదా పిండి వగైరా పిండి పదార్ధాలు, జీడిపప్పు, కిస్ మిస్ వగైరా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎక్కువగా తెప్పించి నిలవ చేస్తూ వుంటారు. దానితో అక్కడ ఎలుకలకి బాగా ఆహారం దొరుకుతూ వుండటంతో అవి అక్కడ చాలా ఎక్కువగా చేరాయి. ఖాళీ అట్ట పెట్టెలలోనూ, గోనె సంచులలోను, బస్తాల వెనక వాటికి ఎక్కడ భద్రం అనిపిస్తే అక్కడ వుండి వాటి ఇష్టం వచ్చినట్లు ఆ ఆహార పదార్ధాలని తినసాగాయి.
పాపం దుకాణం యజమాని రామయ్యకి ఏమి చెయ్యటానికీ తోచలేదు. ఒక స్నేహితుడు వాటిని చంపటానికి మందు వుంటుంది అది తెచ్చి ఏదైనా తినే పదార్ధంతో కలిపి పెట్టు, అది తిని చస్తాయి అని చెప్పాడు. కానీ రామయ్యకి అలా చెయ్య బుధ్ధి కాలేదు. ఎలుకలు కూడా మనలాంటి ప్రాణులే కదా. వాటిని చంపటం ఎలా అనుకున్నాడు. పైగా అవి ఆ విషం తిని వెళ్ళి ఇంకేదన్నా తినే పదార్ధం తింటే? అమ్మయ్యో! ఇంకేమన్నావుందా? తాము చేసే మిఠాయిల్లో ఆ విషం వచ్చి, అవి తిన్న వాళ్ళకి వాటివల్ల రోగాలొస్తే...ఇంక ఆలోచించ లేక పోయాడు. 5, 6 బోన్లు కొనుక్కొచ్చి అక్కడక్కడా పెట్టి పడ్డ ఎలుకలని దూరంగా తీసుకెళ్ళి వదిలాడు కొన్ని రోజులు. అదో పెద్ద పని అయిందిగానీ ఉపయోగం కనబడలేదు.
ఇంకొక స్నేహితుడి ఒక పిల్లిని పెంచు .. ఆ పిల్లి ఎలుకలని తినేస్తుంది అని సలహా ఇస్తే ఇదేదో బాగానే వుందని ఒక పిల్లిని తీసుకొచ్చాడు. ఆ రాత్రి పిల్లిని మిఠాయి దుకాణంలో వదిలి నిశ్చింతగా నిద్రపోయాడు, మర్నాటికల్లా పిల్లి ఎలుకలనన్నింటిని తినేస్తుందని. ఆ రోజు పిల్లి కొన్ని ఎలుకల్ని తినేసింది. కానీ ఎలుకలు మాత్రం తక్కువవా? వాటికీ ప్రాణ భయం వుంటుంది కదా. అవి పిల్లికి దొరక్కుండా తప్పించుకోవటానికి వాటి ప్రయత్నాలు అవి చేశాయి.
రోజూ అందరూ వెళ్ళిపోయాక వాటికి ఏ అడ్డూ లేకుండా హాయిగా అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటూ అక్కడున్న ఆహార పదార్ధాలని కడుపునిండా తినేవి. ఆ రోజు పిల్లి వుండటం పసిగట్టి అవి స్వేఛ్ఛగా తిరగలేక పోయాయి. పిల్లితో దాగుడు మూతలు ఆడినట్లే పరిగెత్తుతూ తప్పించుకుంటూ, తింటూ మొత్తానికి ఆ మిఠాయి షాపంతా నానా ఆగం చేసి పెట్టాయి. పిల్లీ ఎలుకల మధ్య పోరాటంలో కొన్ని పిండి పదార్ధాలు, పంచదార కింద పోయాయి. డ్రై ఫ్రూట్స్ అయితే సరేసరి.
పిల్లి ఎలుకలమీద దూకబోవటం, అవి ఒడుపుగా తప్పించుకుని పారిపోవటం జరుగుతోంది. ఈ హడావిడిలో నాలుగు చిట్టెలుకలు కూడబలుక్కున్నాయి. ఆ పిల్లిని ఎలాగైనా అక్కడనుంచి వెళ్ళగొట్టాలని నిశ్చయించుకున్నాయి. వాటికి అక్కడ ఖర్జూరం పళ్ళ పొట్లాం కనబడింది. అవ్వన్నీ ఆ పొట్లాం దగ్గర సిధ్ధంగా వున్నాయి. చాటుగా వున్న ఈ ఎలుకలను పిల్లి చూడలేదు. అటు రాబోయింది. అంతే .. సమయం చూసి ఆ నాలుగు ఎలుకలూ ఖర్జూరాలు తీసుకుని పిల్లి మీద గురి చూసి విసిరాయి. అందులో చీకట్లో పిల్లి కళ్ళు మెరుస్తూ వుంటాయి కదా. ఆ కళ్ళకి గురి చూసి కొట్టాయి. పాపం పిల్లి చిట్టెలుకల దెబ్బ తట్టుకోలేక పారిపోయింది.
మర్నాడు యజమాని రామయ్య వచ్చి చూసుకుంటే ఏముంది. వంట చేసే ప్రదేశం అంతా నానా గందరగోళంగా వుంది అన్నీ కిందబడి. పిల్లి మూలంగా ఎలుకలు ఎన్ని చచ్చాయో తెలియదుగానీ, పనిమాత్రం ఎక్కువ అయింది. వంటిల్లంతా శుభ్రం చేసుకోవాల్సి వచ్చింది, పదార్ధాలు చాలా పాడయిపోయాయి. దీనికన్నా ఎలుకలే నయం అనుకుంటూ పనివాళ్ళని పిలిచాడు అంతా శుభ్రం చేయించటానికి.
చూశారా పిల్లలూ? ఎలుకలు చిన్నవైనా తెలివితో పిల్లిబారినుంచి ఎలా తప్పించుకున్నాయో. దీంతో మీకేం అర్ధమయింది? ఎంత బలహీనులైనా, తెలివితో బలమైన శత్రువుని ఎదుర్కోవచ్చు. కదా!?
***
No comments:
Post a Comment