నీవెంత నేనెంత నీకు నాకు నెంతదవ్వు - అచ్చంగా తెలుగు

నీవెంత నేనెంత నీకు నాకు నెంతదవ్వు

Share This

 నీవెంత నేనెంత నీకు నాకు నెంతదవ్వు

తాళ్లపాక అన్నమాచార్య  ఆధ్యాత్మ సంకీర్తన (తాత్పర్యముతో)

డా.తాడేపల్లి పతంజలి



రేకు: 209-3  సంపుటము: 3-5


నీవెంత నేనెంత నీకు నాకు నెంతదవ్వు

దైవమా సిగ్గువడక తగిలే నేగాకా ॥పల్లవి॥

01

చెంది నీకు బ్రహ్మాదులు సేవలు సేయగాను

యిందు మా సేవలు నీకు నేడకువచ్చు

పొంది వసిష్ఠాదు లట్టే పూజలు సేయగాను

సందడి మాపూజలు సరకా నీకు ॥నీవెం॥

02

సనకాదియోగులు సారె నిన్ను దలచగా

యెనసి మాతలపు నీ కేడకెక్కును

నునుపుగా శేషాదులు నుతులు నిన్నుజేయఁగా

పనివడి మా నుతులు బాతేయనా నీకు ॥నీవెం॥

03

కిట్టి నారదాదులు నీకింకరులై వుండగాను

యిట్టె నీదాసుడ ననుటెంత కెంత

వొట్టి శ్రీవేంకటేశ మాకొకవుపాయము గద్దు

పట్టి నీదాసుల బంటుబంట నయ్యేనికను


తాత్పర్యం

వేంకటేశా ! 

 నువ్వెక్కడ?  నేనెక్కడ?  నీకు నాకు ఎంతో దూరం ఉంది.

 అయినా నిన్ను  ఆసక్తితో  భక్తితో తెలుసుకోవాలని సిగ్గు లేకుండా  నీ దగ్గరకు వచ్చాను.  ఎంత పిచ్చి వాడినో  కదా!

( తనకు సాధ్యం కాని పనులు చేయటం మొదలుపెడితే , తప్పు జరిగితే నలుగురు నవ్వుతారు. అప్పుడు సిగ్గుతో తల దించుకోవలసి వస్తుంది.   ఇది తెలిసి కూడా సిగ్గుపడవలసి వస్తుందని తెలిసి కూడా నీదగ్గరకు చేరానని నైచ్యానుసంధానం) 

01

చెంది నీకు బ్రహ్మాదులు సేవలు సేయగాను

యిందు మా సేవలు నీకు నేడకువచ్చు

పొంది వసిష్ఠాదు లట్టే పూజలు సేయగాను

సందడి మాపూజలు సరకా నీకు ॥నీవెం॥

వేంకటేశా ! 

అక్కడ ఆ లోకాలలో  ఆ బ్రహ్మ మొదలైన వారు నిన్ను మనస్సులో పొంది  నీకు సేవలు చేస్తుంటే - ఇక్కడ  మేము చేసే సేవలు నీకు లెక్కకు వస్తాయా ? ( వారి సేవల ముందు నా సేవ దిగదుడుపని భావం)

ఆ వసిష్ఠుడు మొదలైన మహర్షులు నిన్ను మనస్సులో పొంది-  నీకు అధికంగా (అట్టే) పూజలు చేస్తుండగా ఇక్కడ మా బోటివాళ్ళు  సందడిగా  చేసే పూజలు నీకు లెక్కకు వస్తాయా? ( రావని భావం) 

02

సనకాదియోగులు సారె నిన్ను దలఁచఁగా

యెనసి మాతలపు నీ కేడకెక్కును

నునుపుగా శేషాదులు నుతులు నిన్నుజేయఁగా

పనివడి మా నుతులు బాతేయనా నీకు ॥నీవెం॥

వేంకటేశా ! 

ఆ సనకుడు మొదలైన యోగాభ్యాసముచేయు మహోన్నతులు    మాటిమాటికి నిన్ను తలుస్తూ ఉండగా-  మా తలపులు ఆలోచనలు నీకు అసలు మనస్సులోకి ఎక్కుతాయా?  చక్కగా ఆ ఆదిశేషుడు మొదలైనవారు పదివేల నోళ్లతో  ఎప్పటికప్పుడు  నిన్ను కొత్తగా పొగుడుతూ ఉండగా  కావలెనని, ప్రయత్నపూర్వకముగా (పనివడి) మేము చేసే పొగడ్తలు నీకు పాతపడిపోతాయి కదా! 

03

కిట్టి నారదాదులు నీకింకరులై వుండగాను

యిట్టె నీదాసుడ ననుటెంత కెంత

వొట్టి శ్రీవేంకటేశ మాకొకవుపాయము గద్దు

పట్టి నీదాసుల బంటుబంట నయ్యేనికను

వేంకటేశా ! 

 నిన్ను సమీపించి ( కిట్టి) ఆ నారదుడు మొదలైన గొప్పవారు నీకు సేవకులయి ఉండగా, ఏ మాత్రం ఆలోచించకుండా   అర్హత లేని నేను-  నీ దాసుడిని అని వెంటనే, (ఇట్టె)  చెప్పటం తగినట్లుగా ( ఎంతకెంత)   ఉంటుందా?(ఉండదని భావం) 

నీపై భక్తి కలిగిన(( వొట్టి)  నామనస్సుకు ఒక ఉపాయం తోచింది.  నీ సేవకుని సేవకుని సేవకునిగా  మారటాన్ని ఒక అలవాటుగా ప్రారంభించి ( పట్టి)  ఇక  నా జన్మ  సార్థకం   చేసుకొంటాను. (త్వద్భృత్యభృత్యపరిచారక భృత్యభృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ అను కులశేఖరాళ్వారు పద్ధతిని అన్నమయ్య ఇక్కడ జ్ఞప్తి చేస్తున్నాడు)

--------------------------

రేకు: 209-3  సంపుటము: 3-5


***

No comments:

Post a Comment

Pages