పరివర్తన (నాటిక) - 2 - అచ్చంగా తెలుగు

పరివర్తన (నాటిక) - 2

Share This

 పరివర్తన (నాటిక) - 2 

దినవహి సత్యవతి 


ప్రథమ అంకం :  2 వ రంగం

 (1 వ స్థలం : ఆనంద్ ఇల్లు) (పాత్రలు : వేదిక పై నవ్య, నేపథ్యంలో లలిత)

 నవ్య : అమ్మా! ఓ అమ్మా ! 

 లలిత : అబ్బ ఏమిటే ఆ గావు కేకలు? 

నవ్య : ఇక్కడ టేబుల్ పైన  నా లైబ్రరీ  పుస్తకం ఉండాలి కనిపించట్లేదు నువ్వేమైనా తీసావా?( పుస్తకం కోసం వెతుకుతూనే  తల్లిని అడుగుతుంది)

లలిత : లేదమ్మా నేను చూడలేదే! 

నవ్య : అయ్యో అదివాళ తిరిగి ఇచ్చేయాలే ‘ప్చ్’ (నిట్టూరుస్తుంది) 

లలిత : నిన్న రాత్రి మీ నాన్న ఏదో పుస్తకం చదువుతున్నారు. బహుశః  నీదేనేమో? (లోపలినుంచే అంటుంది)  

నవ్య : నాన్న తీసుకున్నారా? 

లలిత : అవును 

నవ్య : నేనింకా షూస్ వేసుకోవాలమ్మా ఇప్పటికే ఆలస్యమైంది , ప్లీజ్ నువ్వు తెచ్చియ్యవా!   

లలిత : ఇంకా నీకు  లంచ్  బాక్స్ సర్దాలి. ఇపుడు రాలేను. 

నవ్య : సర్లే నేనే తీసుకుంటాను (స్వగతం : ‘అబ్బా...అసలే  టైమైపోతుంటే మళ్ళీ ఇదొక ఆలస్యమా? అయినా నాన్నకి నా పుస్తకంతో ఏం పనో?అసలు వాళ్ళ గదిలో ఏవెక్కడ ఉన్నాయో కూడా నాకు తెలియదే?’ అనుకుంటూ తల్లిదండ్రుల గదిలోకి వెళుతుంది) 

లలిత : ముందు రోజే కావలసినవన్నీ తయారుగా పెట్టుకోమ్మా అంటే వినవు కదా. అన్నీ బయలుదేరే ముందరే జ్ఞాపకం వస్తాయి. అప్పుడింక హడావిడీ పరుగులూనూ...నీకు ఎప్పుడు తెలిసొస్తుందో ఏమిటో?(కూతురికి వినిపించేలా అంటుంది)  

నవ్య : (స్వగతం) అమ్మ అనుకున్నట్లు అది నా పుస్తకమే అయితే కనుక   నాన్న దాన్ని ఎక్కడ పెట్టారో తెలిసేదెలా?అమ్మయ్య ఇక్కడే ఉందిలే (మంచం ప్రక్కనే స్టూలు పైన ఉన్న పుస్తకం హడావిడిగా తీసుకోబోతుంటే చేయి తగిలి  అది కాస్తా మంచం క్రిందికి వెళ్ళి పడుతుంది) అబ్బబ్బా...(అనుకుని తండ్రి మంచం క్రిందకి వంగి పుస్తకం తీయబోతుంటే వెనకాలగా ఉన్న ఒక అట్ట పెట్టె  పై నవ్య దృష్టి పడుతుంది.)  ఏంటబ్బా ఇదీ? (ఆసక్తిగా అనిపించి, స్కూలు హడావిడి కాసేపు మర్చిపోయి మంచం క్రిందకి దూరి పెట్టె బయటకి లాగి తెరిచి లోపల ఏముందో అని చూసి నిర్ఘాంతపోతుంది..తెలియని భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి ) 

లలిత : నవ్యా పుస్తకం దొరికిందా? ఇదిగో నీ బాక్స్ రెడీ 

నవ్య : (తల్లి పిలుపు వినిపించి  గబ గబా పెట్టె మళ్ళీ యథా స్థానానికి నెట్టేస్తుంది) ఆ దొరికిందమ్మా. వస్తున్నా  

లలిత : అదేమిటే అంత చెమటలు? 

నవ్య : (చెమటలు తుడుచుకుంటూ) ఏం లేదమ్మా హడావిడిగా ఉన్నాను కదా అందుకై ఉంటుంది. మరి నే వెళ్ళొస్తాను (తన కంగారు తల్లికి కనిపించనీయక గబ గబా  వెళ్ళిపోతుంది) 

లలిత : (స్వగతం) ఏమిటో ఈ కాలం పిల్లలు!  అర్థం చేసుకోవటం చాలా కష్టం సుమీ! హూ...... దీర్ఘంగా  నిట్టూరుస్తుంది)       

ద్వితీయ అంకం

(పాత్రలు : నవ్య, రాధిక, మేరీ, రజియ, కమల); (2 వ స్థలం  : స్కూలు)

(సమయం : లంచ్ )

రాధిక:  నవ్యా..ఓ నవ్యా నిన్నేనే ! ఏమైందే? ఉదయం స్కూలుకి వచ్చినప్పటినుండీ చూస్తున్నాను పరధ్యానంగా దిగులుగా ఉన్నావు? ఇప్పుడేమో బాక్స్ తెరిచి అన్నం తినకుండా ఏదో ఆలోచిస్తున్నావు?  

నవ్య : ఎందుకో చాలా భయంగా అనిపిస్తోందే! 

రాధిక : మా అందరికీ ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని  చెప్తావు అలాంటిది  నీకు భయమా? ఎందుకే?

నవ్య : మా నాన్న  ఈ మధ్యన తాగుడుకి అలవాటుపడ్డారని అనిపిస్తోందే 

రాధిక : ఎవరూ అంకులే? నువ్వు చెప్పేది నిజమా? (నమ్మనట్లు చూస్తుంది) 

నవ్య : అవునే. అయితే నా సందేహం నిజమని ఇవాళ నిర్థారణ అయిందే! 

రాధిక : ఎలా? 

నవ్య : ఇవాళ  నా లైబ్రరీ పుస్తకం వెదుకుతూ అమ్మా వాళ్ళ గదిలోకి వెళ్ళాను (అంటూ జరిగినదంతా చెప్పి)  అక్కడ మంచం క్రింద వెనకగా దాచిన ఒక అట్ట పెట్టెలో విస్కీ సీసాలు చూసానే(దిగులుగా అంటుంది). 

రాధిక : అవునా?  

నవ్య : త్రాగుడు అసలు మంచిది కాదనీ, అలవాటైతే మానుకోవడం చాలా కష్టమనీ ఒకప్పుడు నాతో చెప్పిన నాన్నే ఇప్పుడు  త్రాగుతున్నారంటే నమ్మకం కలగడం లేదే.   

రాధిక : అవి వేరెవరి కోసమైనా తెచ్చి పెట్టినవేమో? నువ్వు అనవసరంగా అంకుల్ ని అనుమానిస్తున్నావేమో? 

నవ్య : నువ్వన్నదే నిజమైతే వాటిని అలా అంత రహస్యంగా దాచాల్సిన అవసరమేముందే? 

రాధిక : ఊ.........  

నవ్య : అయినా అలాంటిదేదైనా ఉంటే నా దగ్గర దాయాల్సిన పనే లేదు నాకు చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా. 

రాధిక : అదీ నిజమే 

నవ్య : అంతేకాదే ఈ మధ్యన నాన్న ప్రవర్తన లో మార్పు, ఎప్పుడూ సరదాగా కబుర్లు చెప్పుకునే అమ్మా నాన్నా ఈ మధ్య  ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోకపోవడం, తరచూ వాదులాడుకోవడం కూడా గమనించాను.  

రాధిక : అయ్యో అలాగా!

నవ్య : అవునే 

రాధిక : వాళ్ళు పోట్లాడుకుంటున్నారన్న అనుమానం నీకెందుకొచ్చింది? 

నవ్య : నిన్న మధ్యాహ్నం మన స్కూలు త్వరగా వదిలేసారు కదా. 

రాధిక : అవునూ అయితే దానికీ నువ్వు చెప్పేదానికీ సంబంధమేమిటీ?

నవ్య : అబ్బబ్బ! చెప్పేది పూర్తిగా వినవే మధ్యలో ప్రశ్నలు వేసి విసిగించక (చిరాకుగా అంటుంది) 

రాధిక : (స్నేహితురాలి చిరాకు చూసి దగ్గరగా వచ్చి చెయ్యి నొక్కి ) సరేలే ఇంక ఏమీ అనను. చెప్పు 

నవ్య : స్కూలునించి సరాసరి ఇంటికే వెళ్ళానా లోపలినుంచి బిగ్గరగా మాటలు వినపడేసరికి బయటే ఆగిపోయాను. లోపలినుంచి నాన్న స్వరం. నాన్న ఈ సమయంలో ఇంట్లో ఉన్నారేమిటా అనుకుంటూ తలుపు తట్టాను గట్టిగా. లోపలినుంచి మాటలు ఆగిపోయాయి. అమ్మ తలుపు తీసింది. అమ్మా నాన్నా  ఏదో విషయంపై గొడవపడ్డట్లు , అమ్మ ఏడ్చినట్లు నాకు స్పష్టంగా తెలిసింది. అప్పుడు ఎందుకో అనుకున్నాను గానీ ఇదే కారణమై ఉండొచ్చని ఇప్పుడు అనిపిస్తోంది.  

రాధిక : ఊ.....నువ్వు చెప్పిందంతా విన్నాక నాకూ అలాగే అనిపిస్తోంది.  

నవ్య : మాకు తెలిసిన ఒక ఆంటి అంకుల్ వాళ్ళు ఇదే విషయంలో పోట్లాడుకుని  డైవోర్స్  కూడా తీసుకున్నారే. 

రాధిక : అనవసరంగా ఏదేదో ఊహించకుండా మీ అమ్మగారిని అడుగు ఒకసారి. 

నవ్య : అమ్మని అడిగాను నాన్న ఎందుకలా ఉంటున్నారని. ఏదో బ్యాంకు లో గొడవలని చెప్పింది. 

రాధిక : అయితే అదే కారణం అయుండచ్చుగా? 

నవ్య : లేదే ఆ మాటలు చెప్పేటప్పుడు  అమ్మ నావైపు సూటిగా చూడలేదు. పైగా కొంచం విసుక్కుంది కూడా. అప్పుడే అనిపించింది నా సందేహం నిజమని. ఆ ఆంటీ వాళ్ళలా అమ్మా నాన్నా కూడా విడిపోతారేమోనని భయంగా ఉందే!  

రాధిక : మరీ ఎక్కువగా ఆలోచించి భయపడకే! ఎవరికో ఏదో జరిగిందని మీ ఇంట్లోనూ అలానే జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? నా మాట విని ఇంకోసారి  మీ అమ్మా నాన్నలతో కూర్చుని మాట్లాడి చూడు.  

నవ్య : ఊ....నేనూ అదే అనుకుంటున్నాను. (లంచ్ బాక్స్ తెరిచి అన్నం తినడానికి ఉపక్రమిస్తుంది)  

రాధిక :  సరేగానీ నిన్నటినుంచీ అడుగుదామనుకుంటున్నాను. వచ్చేవారమే నీ పుట్టిన రోజు కదా! ఈ సారి ఏం చేద్దామనుకుంటున్నావు?  

నవ్య : ఇది మనకి స్కూలులో ఆఖరి సంవత్సరం కదా! 

రాధిక : అయితే? 

నవ్య :  దగ్గరి స్నేహితులందరికీ చిన్న పార్టీ లాంటిది ఇంట్లోనే ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను. ఎక్కడైనా బయటకి అంటే చాలా సమయం వృధా అవుతుంది అసలే పరీక్షలు దగ్గర పడ్డాయి కూడా ! 

రాధిక : హేయ్! మంచి ఆలోచన. మరి మనవాళ్ళందరికీ చెప్పావా? 

నవ్య :  ఇంకా లేదే. అమ్మ నాన్నని అడిగితే సరేనన్నారు. ఇంక మనవాళ్ళకి చెప్పడమే తరువాయి.    

రాధిక :  భలే! భలే!  ఈ పరీక్షల హడావిడినుంచి కాస్త విరామం. 

నవ్య : అవునే నాకూ అదే అనిపించింది. అందరం మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు కదాని ఇలా ప్లాన్ చేసాను.

(ఇంతలో వారి మరికొంతమంది స్నేహితులు కమల, రజియా, మేరీ కూడా వచ్చి వీళ్ళతో కలుస్తారు) 

రాధిక : అందరూ వినండే ... నవ్య ఈసారి తన పుట్టినరోజుకి మనందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతోంది.  

స్నేహితులు : వావ్....ఏమిటే అది ? త్వరగా చెప్పవే ప్లీజ్...... 

నవ్య : ఆరోజు మా ఇంట్లో ఒక చిన్న పార్టీ మీ అందరికీ  

మేరీ : స్పెషల్ పార్టీనా లేక ఎక్స్ట్రా స్పెషల్ పార్టీనా? 

నవ్య :  అంటే ? 

మేరీ : స్పెషల్ అంటే కేకు స్నాక్స్, రిటర్న్ గిఫ్ట్స్ ..లాంటివి ఉంటాయన్న మాట 

కమల : మరి ఎక్స్ట్రా స్పెషలంటే? 

మేరీ : ఎక్స్ట్రా స్పెషల్ అంటే డ్రింక్స్ కూడా ఉంటాయన్నమాట! 

నవ్య : డ్రింక్సా? (ఆశ్చర్యంగా అని ఆలోచనలో పడుతుంది) 

కమల : అమ్మయ్యో డ్రింక్సే?  డ్రింక్స్  తీసుకోవచ్చా? తప్పు కాదూ! 

రజియ :  తప్పేకాదే అది అలవాటైతే వ్యసనంగా మారుతుంది కూడా. 

కమల : మా అంకుల్ ఒకరు ముందు కొలీగ్స్ తో కంపెనీ కోసమని మొదలు పెట్టి ఇప్పుడు దానికి బానిసై పోయారు. ఇప్పుడు ఆయనకి హెల్త్ ప్రాబ్లంస్ కూడా స్టార్ట్  అయ్యాయి.   

నవ్య : (భయంగా చూస్తుంది కమల వైపు) 

రాధిక : (నవ్య భయం గమనించి) అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావాలని ఏముంది?  

కమల : వ్యసనం గా మారితే వస్తాయి. ఆయనకి లివర్ పాడైపోయింది. అస్పత్రిలో ఉన్నారు.

రాధిక : ఊ.... ఈ మధ్య కొంతమంది పార్టీలలో తోటివారికి కంపెనీ ఇవ్వాలని మర్యాద కోసం త్రాగుతున్నారు. అయితే అది నువ్వన్నట్లు వ్యసనంగా మారితేనే ప్రమాదం. అలా జాగ్రత్తపడితే మంచిది కదే నవ్యా? 

నవ్య : అవును.    

మేరీ : ఇది వినండి.  మా ఫ్యామిలీ ఫ్రెండ్స్  ఒకళ్ళు  ఇంట్లో తల్లీ తండ్రీ డ్రింక్ చేస్తారు కానీ పిల్లలికి మాత్రం తప్పు అని చెప్తారట. 

రాధిక : ఇది మరీ బాగుంది! 

మేరీ : అదే కదా! అందుకని ఆ పిల్లలు తల్లిదండ్రులకి చెప్పకుండా బయట ఫ్రెండ్స్ ఇళ్ళల్లో డ్రింక్ చేస్తుంటారుట . 

రజియా :  అదింకా తప్పు.అయినా అసలు ఎందుకు తాగుతారో? అది ఒక స్లో పాయిజన్ లాంటిది!

మేరీ :  డ్రింక్ చేసిన వాళ్ళు తమని తాము అదుపులో ఉంచుకోలేరు. వాళ్ళ ప్రవర్తన కూడా మారుతుంది. వాళ్ళకి కోపం ఎక్కువవటం, అతిగా చిరాకు పడటంలాంటివి కూడా కలుగుతాయి.

కమల : మా అంకుల్ అని చెప్పానే ఆయనైతే బాగా తాగి వచ్చి ఆంటీని కొట్టేవారట కూడా. 

మేరీ : అదే నేనిప్పుడే చెప్పాను కదా...వయొలెంట్ గా బిహేవ్ చేస్తారు.  

రాధిక : అవునే నువ్వు చెప్పేది హండ్రడ్ పర్సంట్ నిజం. అయినా తాగేవాళ్ళు తాగుతూనే ఉన్నారు. అసలు ఇప్పుడు తాగడమనేది తప్పుగా ఎవరూ అనుకోవడం లేదు. అదొక ఫ్యాషన్ గా భావిస్తున్నారు.  

మేరీ : అంతే కాదే తాగము అన్నవాళ్ళని సాటి వాళ్ళు వేస్ట్ ఫెలోస్ గా చూస్తున్నారు కూడా. 

రాధిక : ఇదిలా ఉంటే పేదవారి కుటుంబాలలో కూడా ఈ త్రాగుడు అలవాటు ఎన్నో అనర్థాలను కలిగిస్తోంది.  

రజియా : అనర్థాలంటే?

రాధిక : మాపనమ్మాయి అమ్మతో చెప్తుంటే విన్నాను... అమె హస్బండ్ రోజూ తాగొచ్చి అమెను వేధిస్తాడట. అతను కూలి పని చేస్తాడు. ఆ మనీ అంతా త్రాగేసి ఇంకా డబ్బులు కావాలని వైఫ్ ని అంటే మా పనమ్మాయిని పీడిస్తాడట. ఇవ్వకపోతే తిడతాడట, కొడతాడట. 

రజియా : అయ్యయ్యో. వినటానికే ఇంత బాధగా ఉంటే పాపం ఆవిడ ఎలా భరిస్తోందో? 

మేరీ : అలాంటప్పుడు మీ పనమ్మాయి ఆమె హస్బండ్ ని వదిలి వెళ్ళిపోవచ్చు కదా? 

రాధిక : ఏంమంటున్నావే? పనమ్మాయి చదువుకోలేదు. ఎలా బ్రతుకుతుంది? అయినా అదంత తేలిక కాదే. 

మేరీ : అవును రాధిక  చెప్పింది నిజం. మా అంకుల్ అంత త్రాగుతున్నా, ఆంటీ చదువుకున్నదైనా ఇల్లు వదల లేదు. ఎప్పటికైనా అంకుల్ మారతారని ఆవిడ ఆశపడుతున్నారు. 

కమల : ఆయనేనా ఆస్పత్రిలో చేరారన్నావు? 

మేరీ : అవును. ట్రీట్మెంట్ జరుగుతోంది. 

రాధిక  : తాగేవాళ్ళు తాగడమే కాక, ఇందాక మేరీ చెప్పినట్లు తాగని వాళ్ళని ఎగతాళి చేస్తుంటారు కూడా. 

కమల : అవును అది మాత్రం నిజం. మా నాన్న అసలు డ్రింక్ తీసుకోరు. ఆఫీసులో ‘ఏంటండీ మీ ఆవిడ దెబ్బలాడుతుందా? ఇంటికి రానివ్వదా?’  అని   నాన్నపై  జోక్స్ వేస్తుంటారట! 

రాధిక : అలా అంటారా ఎవరైనా? మరి మీ నాన్న కి కోపం రాదా వాళ్ళపై? 

కమల : వస్తుందిట కానీ తమాయించుకుని ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుంటాను అని చెప్పారు. 

రాధిక : మీ నాన్న నిజంగా గ్రేట్ .

రజియా : అవునే నిజంగా గ్రేట్. అలా ఉండడం చాలా కష్టం.  

(స్నేహితురాళ్ళ మధ్య జరుగుతున్న సంభాషణ వింటూ సాలోచనగా చూస్తుంటుంది నవ్య) 

రాధిక : ఇక పదండే క్లాసు కి వెళదాము. (అందరూ లేవబోతుంటే...) 

నవ్య : ఒక్క నిమిషం ఆగండే (అందరూ నవ్య కేసి ప్రశ్నార్థకంగా చూసి కూర్చుంటారు. వాళ్ళతో సంభాషిస్తుంది. ఇంతలో లంచ్ అవర్ అయిపోయినట్లుగా బెల్ మ్రోగుతుంది. అందరూ క్లాసుకి వెళతారు)

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages