వెన్నెలకంటి - పాటైనా, మాటైనా వెన్నెల విరిజల్లు - అచ్చంగా తెలుగు

వెన్నెలకంటి - పాటైనా, మాటైనా వెన్నెల విరిజల్లు

Share This
వెన్నెలకంటి... పాటైనా , మాటైనా  వెన్నెల విరిజల్లు
డా. పోడూరి శ్రీనివాస్ రావు, 
98494  22239            



కొన్నిపాటలు వింటూంటే.. ఎంత  హాయిగా ఉందీపాట..పాట రచయిత ఎవరోకదా ! అనిపిస్తుంది.  ఆపాటలో సాహిత్యం అంత బాగుంటుంది. అలాగే,  కొన్నిపాటలు వింటూంటే, అసంకల్పితంగా ఆ సినిమాలో నటీనటుల అభినయం  మన కళ్ళముందు ప్రత్యక్షమవుతుంది.  అలాంటి పాటలు చిరస్మరణీయాలు.  సంవత్సరాలు గడిచినా అవి ప్రేక్షకుల గుండెల్లో, సంగీతప్రియుల హృదయాల్లో అజరామరంగా నిలిచిపోతాయి. 
అటువంటి గీతరచయితల కోవలోకి చెందుతారు శ్రీ వెన్నెలకంటి. ఆయన  రాసిన పాటలన్నీ సూపర్ హిట్టే. అనువాదచిత్రాల   పాటలెంత హిట్ అయ్యాయో,  స్ట్రెయిట్ చిత్రాల పాటలూ అంతే హిట్ అయ్యాయి.  డబ్బింగ్ చిత్రాలకు పాటలంటే, రచయితలకు ఎన్నో పరిమితులుంటాయి....భాష పరంగానే కాదు, పెదాల కదలికలకు అనుగుణంగా పదాలు పడాలి.  అంతేకాదు, పాటలో తెలుగుతనం వుండాలి.  వెన్నెలకంటి వ్రాసిన ఎన్నో అనువాదచిత్ర గీతాలు, బహుళ జనాదరణ పొందడమేకాకుండా.. ..ఆయనలోని ప్రతిభను తెలియచేస్తాయి.

శ్రీ వెన్నెలకంటి పూర్తిపేరు  “వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్”  అయినా ఇంటి పేరైన  “వెన్నెలకంటి”  పేరుతోనే,  ఆయన ప్రాచుర్యం పొందారు.  ఆయన స్వస్థలం నెల్లూరు.  శ్రీ కోటేశ్వరరావు, శ్రీమతి పద్మావతి దంపతుల రెండో సంతానంగా జన్మించారు. ఘంటసాల బలరామయ్య గారి ప్రతిభా పిక్చర్స్ సంస్థలో ప్రొడక్షన్ చీఫ్ గా పనిచేసేవారు శ్రీ కోటేశ్వర రావు గారు. అక్కినేని ణి చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనుడు శ్రీ బలరామయ్య గారు. అటువంటి ప్రముఖుని సంస్థలో పనిచేసేవారు, శ్రీ వెన్నెలకంటి తండ్రి శ్రీ కోటేశ్వర రావు గారు.  సినీపరిశ్రమలో  ప్రతిభా కోటేశ్వర రావుగా పేరు గడించారు. తండ్రిలాగే, తనపేరు కూడా సినిమాలలోచూసుకోవాలనే తపనతో రచయితగా మారారు, మన వెన్నెలకంటి.  బాల్యంనుంచే సాహిత్యం మీద మక్కువ ఏర్పడడంతో, చిన్నతనంలోనే, పదకొండవ ఏటనే “భక్త దుఃఖ నాశ పార్వతీశా” మకుటంతో ఏకంగా ఒక శతకం వ్రాసారు వెన్నెలకంటి.  గురువుల ప్రోత్సాహం, పెద్దల  ఆశీస్సులతో ఆ తర్వాత “రామచంద్ర శతకం”, “లలితా శతకం” కూడా వ్రాసారు.  కానీ వెన్నెలకంటి మనసంతా నాటకాలమీదే ఉండేది.  డిగ్రీ పూర్తి చేసిన తర్వాత  బ్యాంకు వుద్యోగంలో చేరినా, నాటకాలకు, సాహిత్యానికీ వెన్నెలకంటి ఎప్పుడూ దూరం కాలేదు. శ్రీ జంధ్యాల వ్రాసిన “ఏక్ దిన్ కా సుల్తాన్” నాటకంలోనూ, “ఈ చరిత్ర ఏ సిరాతో”, “ఎవ్వనిచే జనించు”,”దర్పణం” వంటి ఇతర నాటకాల్లో కూడా శ్రీ వెన్నెలకంటి నటించారు.

స్టేట్ బ్యాంకు లో క్యాషియర్ గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ, సినిమాలమీద ఉన్నవ్యామోహంతో, ఎలాగైనా సినీ పరిశ్రమలో  గుర్తింపు   తెచ్చుకోవాలన్న ఆసక్తితో గీతరచయితగా మారారు వెన్నెలకంటి.    

1986 లో నటుడు, నిర్మాత డా.ప్రభాకర రెడ్డి ప్రోత్సాహంతో   ‘శ్రీరామచంద్రుడు’  చిత్రంలో  తొలిపాట  ‘చిన్నిచిన్ని  కన్నయ్యకు వెన్నెలజోల’  అన్నపాట వ్రాసారు.   ఆపాట తో తన సినీప్రస్థానాన్ని మొదలుపెట్టారు శ్రీ వెన్నెలకంటి. ఒకప్రక్క సినిమా, మరోప్రక్క ఉద్యోగం ... ఎటువైపు కాలుమోపాలో, నిలద్రోక్కుకోవాలో తెలియక ఊగులాడుతున్నసమయంలో  శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో “అన్నాచెల్లెలు” చిత్రంలో “అందాలు ఆవురావురన్నాయి” అన్న మరోపాట వ్రాసారు.  అటువంటి పరిస్థితుల్లో, శ్రీ ఎస్పీ బాలు తదితర పలువురి సూచనలతో స్టేట్ బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి సినీ పరిశ్రమ వైపే మొగ్గుచూపారు.  అలా ప్రారంభమైన శ్రీ వెన్నెలకంటి గత 35 ఏళ్ళ సినీ సాహితీప్రయాణం లో 300  చిత్రాలకు పైగా సవ్యసాచిలా మాటలూ, పాటలూ వ్రాయడం జరిగింది.  తన సినీ జీవిత చరిత్ర లో ఎక్కువ బాలకృష్ణ సినిమాలకు పాటలు వ్రాసినట్లు శ్రీ వెన్నెలకంటి తెలిపారు.  ఇప్పటివరకు  స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలకు సుమారు 2000 కు  పైగా పాటలు వ్రాసారు.

ముద్దులమామయ్య  చిత్రంలో సోదరి సెంటిమెంట్ తో పాట వ్రాయాల్సివచ్చిన సందర్భంలో, తనకు తోబుట్టువులు లేని కారణంగా, ఆపాట వ్రాయడానికి విముఖత చూపినా... దర్శక నిర్మాతల సూచనలతో, గొప్ప హిట్ పాటగా నిలచిన “మామయ్య అన్న పిలుపు...” అనే హిట్ గీతాన్ని అందించారు.   

త్వరగా పాటను వ్రాసిచ్చే రచయితగా శ్రీ వెన్నెలకంటి గారికి మంచి పేరు, గుర్తింపు వుంది. పెదాల కలయికకు సరిపోయేవిధంగా, పాటలను వ్రాయడంలో శ్రీ వెన్నెలకంటి సిద్ధహస్తుడు.  అందుకే, డబ్బింగ్ చిత్రాల మాటల, పాటల రచయితగా పేరు తెచ్చుకున్నారు. పద్యం, పాట, గేయం, వచన కవిత్వం, అభ్యుదయ కవిత్వం, నాటకం....ఇలా ప్రక్రియ ఏదైనా...శ్రీ వెన్నెలకంటి ముందు తలవంచాల్సిందే...వారి మాటల్లో, పదాల్లో..ఒదిగిపోవాల్సిందే.  వైవిధ్యభరితమైన రచనా విశిష్టత, శబ్దాలంకారపు చమత్కారం, భావుకత విరజిమ్మిన పరిమళం శ్రీ వెన్నెలకంటి పాటల్లో గుబాళిస్తూ వుంటాయి. పండిత పామరులకు సైతం సులభశైలిలో అర్ధమయ్యేరీతిలో పాటలు వ్రాయగలిగిన సత్తా ఉంది, శ్రీ వెన్నెలకంటికి.  స్ట్రెయిట్ చిత్రాలతో ప్రయాణం మొదలైనా, అనువాద చిత్రాలకు చిరునామాగా మారారు శ్రీ వెన్నెలకంటి.

కమలహాసన్ “నాయకుడు” సినిమాతో అనువాదచిత్ర ప్రవేశం జరిగింది.  

ముఖ్యంగా నటుడు కమల్ హసన్ కు, ఇసైజ్ఞాని ఇలయరాజా కి శ్రీ వెన్నెలకంటి ఎంతో ప్రీతిపాత్రుడు. ఆయన సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయితే, ఆ చిత్రానికి మాటలు, పాటలు  శ్రీ వెన్నెలకంటి వ్రాయాల్సిందే.  

“మాటరాని మౌనమిది.. మౌనవీణ గానమిది ”, “అల్లిబిల్లి కలలా రావే.... అల్లుకున్న కథలా రావే”, “రాసలీలవేళా ....రాయబారమేలా”,”కలలో తెర... తీయాలా, తీయగా ఎద...వేగాలా”, “చల్తీ కా నామ్ గాడీ,  చలాకీ వన్నెలేడీ”, “చిరునవ్వుల వరమిస్తావా...చితినుంచి లేచొస్తా.. మరుజన్మకు కరుణిస్తావా...ఈ క్షణమే మరణిస్తా”, “మాటే మౌనమై మాయజేయనేలా “, “చలి చలి చంపుతున్న చమక్కులో” ,” రాజశేఖరా .. ఆగలేనురా..”, “మధురమే సుధాగానం”, “శ్రీరంగ రంగానాధుని దివ్యరూపమే చూడరే”, “వెన్నెల్లో హాయ్ హాయ్ ..” కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో”,,వంటి ఎన్నో బహుళ జనాదరణ పొందిన,  మాధుర్యభరితమైన పాటలు శ్రీ వెన్నెలకంటి కలంనుంచి జాలువారినవే.

జనవరి 5వ తేదీన తన ఇంటిలో బాత్రూం కి వెళదామని లేచిన శ్రీ వెన్నెలకంటి massive heartattack రావడంతో కుప్పకూలి మరణించారు. శ్రీ వెన్నెలకంటి కుమారులు శశాంక్ వెన్నెలకంటి, రాకేందుమౌలి కూడా చలనచిత్రసీమలో గీతరచయితలుగా పనిచేస్తున్నారు. 

శ్రీ వెన్నెలకంటి కలం నుంచి జాలువారిన మరికొన్ని మధురగీతాలు:

నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది, హృదయం ఎక్కడున్నాది (గజినీ), రాయినిమాత్రం కంటే (దశావతారం), కమ్మని నీ ప్రేమ (గుణ), హృదయం ఎక్కడ వున్నాది (గజినీ), మాటంటే మాటేనంట (ఏప్రిల్ 1 విడుదల), విజయావారి బృందావనం చిత్రం లోని పాటలు,  “చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల “(శ్రీరామచంద్రుడు), రాసలీల వేళా (ఆదిత్య 369),  ప్రణయమా..నీ పేరేమిటి ప్రణయమా (అల్లరి ప్రియుడు),  రావయ్యా.. ముద్దులమామ (సమరసింహారెడ్డి), అమ్మ నువ్వోక్కసారి (మా వూరిమారాజు), ప్రేమంటే ఏమిటంటే (శీను).........
ఇంకా..ఇంకా...ఇంకా.... ఎన్నో...ఎన్నెన్నో...మధుర గీతాలు.
శ్రీ వెన్నెలకంటి గారు సభ్యులుగావున్న రెండు గొప్ప సంస్థల్లో నేను కూడా సభ్యుడిని కావడం, రెండు సందర్భాలలో వారితోపాటు నేను కూడా ఆయా సభల్లో పాలుపంచుకోవడమేకాకుండా, అనేకమార్లు వారితో ఫోన్ లో సంభాషించే అవకాశం రావడం నేను చేసుకున్న పూర్వజన్మ పుణ్యంగా భావిస్తున్నాను.

***
                                                                          

No comments:

Post a Comment

Pages