శ్రీభద్రశైల రామ శతకము - పొడుగు అప్పలానందము - అచ్చంగా తెలుగు

శ్రీభద్రశైల రామ శతకము - పొడుగు అప్పలానందము

Share This
 శ్రీభద్రశైల రామ శతకము - పొడుగు అప్పలానందము
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 




కవి పరిచయము:

పొడుగు అప్పలానందకవి విశ్వకర్మ కులమునకు చెందిన వాడు. గంగమ్మ మల్లికార్జునుడు తల్లి తండ్రులు. విశ్వనాధుని పౌత్రుడు. విశాఖపట్టణ నివాసిగా తెలుస్తున్నది. ఈకవి శతకాంతపద్యాలలో తనగురించి ఇలాచెప్పుకొనినాడు.

కం. శ్రీవిశ్వకర్మకులజుడ
పావనుడగు విశ్వనాధ పౌత్రుడ నేనీ
సేవకుడను గనుగొనుమ శ్రి
తావన శ్రీ భద్రశైల ధామా! రామా!

కం. గుణవతియగు గంగమకున్
అనుపమధీశాలి మల్లికార్జునకునే
తనయుడ నీదగు దాసుడ
దన్య్జాంతక భద్రశైల ధామా! రామా!

కం. వరవిభవ వత్సరంబున
బరగెడు భాద్రపదశుద్ధ పంచమి బుధవా
సరమున నీశతకము నీ
దరినుంచితి భద్రశైల ధామా! రామా!

ఈకవి బహుగ్రంధకర్త. వీరి రచనలు 1. శివశతకము, 2. భద్రశైల శతకము, 3. రామప్రభుస్తోత్ర పద్యవింశతి, 4. రామస్తోత్ర కదంబము, 5. శంభుస్తోత్ర నక్షత్రమాల, 6. నూతనమేలుకొలుపులు, 7. ఆనంద భగవన్నామ సంకీర్తనలు, 8. రామకథాగీతము, 9. దశావతారస్తోత్ర దండకము, 10. దామోదరాష్టోత్తర శతపదతోత్రము.
ఈకవి ఈశతకాన్ని 1930 ప్రాంతాలలో రచించాడు.

శతక పరిచయం:

"భద్రశైల ధామా! రామా!" అనే మకుటంతో రచింపబడిన ఈశతకం భక్తిరస ప్రధానమైన కందపద్య శతకం. 108 కందపద్యాలున్నాయి. 

ఈశతకమునందలి పద్యములు సరళముగా ఉండి చదివేవారికి సులభంగా అర్థం అయ్యేట్లుగా ఉన్నాయి. శతకారంభమున సకలదేవతా ప్రార్థనచేసి అంతమున మంగళముతో ముగించారు.
కొన్ని పద్యాలను చూద్దాం.

కం. శ్రీపార్వతీతనూజుని
శ్రీపదాంభోజములను చింతించెదనా
ప్రాపై విఘ్నములుడుపగ
తాపసినుత భద్రశైల ధామా!రామా!

కం. వనజజురాణిని బలుమారు
వినితించెద వదనగుహను వెలయుటకొరకై
మునిసేవిత పద దశరధ
తనయా!శ్రీభద్రశైల ధామా!రామా!

కం.రంగా! కలుషతుషార ప
తంగా! ఖగరాట్తురంగ, ధరణిజహృత్సా
రంగమిళిందా! సురస
త్సంగా!శ్రీభద్రశైల ధామా!రామా!

కం. కలుముల చెలి ప్రాణేశ్వర
చిలువలదొర సెజ్జపైన చెలగెడువాడా!
కలుషముల బాప నినుమది
దలచెద శ్రీభద్రశైల ధామా!రామా!

ఈశతకములో 70వ కందపద్యము మొదలుగా 99 వపద్యము వరకు ప్రతిపద్యములలోని ప్రథమాక్షరములను కలిపిన "ఈ శ్రీరామ శతకము విశాఖపుర నివాసి పొడుగు అప్పలానందముచే విరచితము" అనే వాక్యము వస్తుంది.

ఈసతకములో 60వ పద్యము నుండి దశావతార స్తుతి సాగించినాడు. మరి కొన్ని పద్యాలను చూద్దాము.

కం. సురులసురులు సుధకై మం
దరగిరిచే వనధితరచు, తరిగిరిగృంకన్
వరకమఠమగుచు దేల్చవె
ధరమును శ్రీభద్రశైల ధామా!రామా!

కం. వామనుడవగుచు దానవ
స్వామిని పాతాళమునకు బంపవె త్రిదశ
స్తోమము సంతస మందగ
దామోదర భద్రశైల ధామా!రామా!

కం. కూళయగు కంసుజంపను
పాలింపను భక్తవరుల భాసురముగ గో
పాలుండవైతివిల ప
ద్మాలయ వర భద్రశైల ధామా!రామా!

కం. కలియుగంబున సజ్జనులను
పలుబాముల బెట్టుచున్న పాపులదునుమన్
వెలసెదట కల్కివనభూ
తలమున శ్రీభద్రశైల ధామా!రామా!

చక్కని సరళమైన భాషలో అందరికి అర్థ్మయ్యేలాగున రచింపబడిన ఈ భక్తిరస శతకము అందరూ తప్పక చదవతగినది. మీరూ చదవండి మీ మిత్రులచే చదివించండి.

***

No comments:

Post a Comment

Pages