మానసవీణ -20
పి .వి.ఎల్.సుజాత.
చెట్ల చాటు నుండి చెవులను రిక్కించి వింటున్న అవతల వ్యక్తి తననెవరో గమనించారని గ్రహించి నెమ్మదిగా అక్కడ్నుంచి జారుకునే ప్రయత్నం చేయబోయి కంగారులో ఎండిన ఆకులమీద కాలు వేశాడు. ఆ శబ్దం స్పష్టంగా వినిపించడంతో వారంతా తల తిప్పి కిటికీ వైపు చూశారు. ఎవడో బ్లూ కలర్ జీన్స్, బ్లాక్ స్వెట్టర్, మంకీ క్యాప్ తో వేగంగా అడుగులు వేస్తూ వెళ్ళడం చూసిన అనిరుధ్, విజయ్ లు 'ఎవరక్కడా ?’ అంటూ ఒక్క ఉదుటన బయటికి పరిగెత్తారు. అంతలో ఆ ముసుగు మనిషి గోడ దూకి పారిపోయాడు.
’వచ్చిన వాడు ఎవడైయుంటాడు’ ఆలోచనలో పడ్డాడు అనిరుధ్.
’నెల రోజుల క్రితం కాలేజీ లో జరిగిన ఎలక్షన్స్ లో మానస గెలిచిందని రాజేష్ ఇదంతా చేయిస్తున్నాడా? లేక మానస నాకు చాలా క్లోజ్ అవుతుందనే ఈర్ష్య తో!?...యస్..ఇప్పుడు అర్థమౌతోంది..అందుకే మొన్న బస్ స్టాప్ లో ఒక యువతిని పంపించి, తన కడుపు లో బిడ్డకు తండ్రి నేనేనని నమ్మించేలా మానస ముందు తన చేత డ్రామా ఆడించి, జనాలముందు నన్ను దోషిలా చిత్రీకరించి, మానసకి నాపై మనసు విరిగేలా చేసే ప్రయత్నం అన్నమాట!, నిన్న మానస..నా మానస మీద యాసిడ్ దాడి... అసలు ఈ సంఘటనలకు కారకుడెవడో తెలుసుకోవాలంటే ఆ రోజు సిగ్గులేకుండా బస్ స్టాప్ లో నా కాళ్ళ మీద పడి ఆస్కార్ లెవెల్లో నటించిన కిలాడి లేడిని పట్టుకుంటే గానీ అసలు విషయం బయటపడదు.’ అనుకుంటూ అక్కడ్నుంచి లేచి వడివడిగా బయటికి వచ్చి తన బైక్ ని స్టార్ట్ చేసి బయలుదేరాడు అనిరుథ్.
పట్టువదలని విక్రమార్కుడిలా రెండ్రోజులు తిరిగి మొత్తానికి తన ఇంటికెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు అనిరుథ్.
కాలింగ్ బెల్ రింగ్ అవగానే తలుపు తీశాడు యాభైఐదేళ్ళున్న వ్యక్తి.
’ఎవరు మీరు? ’ అడిగాడు.
అదీ..నా పేరు అనిరుథ్.
హా..అయితే..మీకెవరు కావాలి?
ఒక్క క్షణం స్తబ్దత అనిరుథ్ ని ఆవహించింది. ఎందుకంటే ఆ అమ్మాయి పేరు తెలీదు. అసలు తను వచ్చింది కరెక్ట్ అడ్రెస్సేనా? అని అనుమానం.. ’నీకెవరు కావాలి?’ అని అడుగుతున్న ఆ పెద్దాయనకి ఏం చెప్పాలి..
హలో! నిన్నే..ఎవరు కావాలి బాబూ ?..మళ్ళీ ఆ ప్రశ్న.
అ...దీ.. నాల్రొజుల క్రితం..చౌరస్తాలో ఉన్న బస్ స్టాప్ కి ఒకమ్మాయి వచ్చి నా కాళ్ళ మీద పడి బోరున ఏడ్చింది..
ఎందుకు?
తన కడుపు లో ఉన్న బిడ్డకి తండ్రిని నేనని అంది.
అవునా?! ముఖంలో ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ, అంతలోనే.. అయితే ఏంటయ్యా..నీ గోల?అన్నాడు విసుగ్గా ఆ పెద్దాయన.
గోల కాదండీ..అసలు తను ఎందుకలా అన్నదో, ముక్కూ మొహం తెలియని వాడ్ని పట్టుకుని ఏ ఆడపిల్లా అలా అనే సాహసం చెయ్యదు కదా! కాస్త మీరు నన్ను లోపలకి రానిచ్చి, తనని దయవుంచి పిలిస్తే మీ ముందే విషయం తేల్చుకుని వెళ్ళిపోతాను..’అన్నాడు.
”ఏం పిచ్చి పిచ్చిగా ఉందా! ముందు వెళ్ళిక్కడ్నుంచి.”దబాయింపు ధోరణి లో అన్నాడు.
గుమ్మం దగ్గర జరిగే ఈ గొడవ...వంట గదిలో అమ్మకు వంట గదిలో కూరగాయలు కట్ చేస్తున్న ఆర్తికి వినబడి కంగారుగా వచ్చింది.
ఒక్కసారి షాక్ తిన్నట్టుగా నిలుచుండి పోయింది. వీడేంటి ఇంటిదాకా వచ్చాడు..అనుకుంది మనసులో.
‘అదిగో వచ్చిందిగా..తనే..తననే అడగండి..నేను చెప్పినమ్మాయి ఈమే..ఆగకుండా’ చెబుతూనే వున్నాడు అనిరుథ్.
అసలేం జరిగిందో, ఏం జరుగుతోందో ఏమీ అర్థం కాక నిశ్చేష్టుడయ్యాడు పెద్దాయన.
No comments:
Post a Comment