పద్మినీ విద్య - అచ్చంగా తెలుగు
 ''పద్మనీ విద్య"
 -సుజాత.పి.వి.ఎల్.
  

ఒకప్పుడు స్వారోచిష మనువు ఓ సమయంలో ఒకేసారి ముగ్గురిని పెళ్ళాడాల్సి వచ్చింది. మొదటిగా మనోరమను, ఆ తర్వాత ఆమె స్నేహితురాళ్ళయిన విభావసి, కళావతి అనే మరో ఇద్దరు కన్యలనూ వివాహమాడాడు. 
దురదృష్టవశాత్తు ఒకసారి వాళ్లిద్దరూ రోగగ్రస్తులయ్యారు. స్వారోచిష మనువు తన భార్య మనోరమ కోరికపై తనకున్న ఆయుర్వేద పరిజ్ఞానంతో వాళ్లిద్దరికీ రోగం నుంచి విముక్తిని కలిగించాడు. 
మహారాజు చేసిన మేలుకు ప్రతిఫలంగా కళావతి పద్మినీ విద్యను, విభావసి పశు, పక్ష్య, వృక్ష, శిలా భాషలు తెలుసుకునే సర్వస్వరి విద్యనూ ఆయనకు ధారబోశారు. ఆ సందర్భంలో కళావతి నిధులకు ప్రతిరూపమైన మహాపద్మ పద్మినీ విద్య గురించి సవివరంగా తెలియజేసింది.
పద్మినీ పదం నిధులను సూచించే విద్య. ఈ విద్యకు అధిదేవత మహాలక్ష్మీదేవి. ఆమె నివశించే పద్మం ఆధారంగా ఈ విద్యకు 'మహాపద్మ పద్మినీ విద్య' అనే పేరు శాశ్వతమైంది.
ఈ విద్యలోని ఎనిమిది ఉప విభాగాలే అష్ట నిధులు. అవేమంటే- పద్మ, మహాపద్మ, మకర, కచ్ఛప, ముకుంద, నందక, నీల, శంఖ.
మానవులకు సంపద మూడు రకాలుగా లభిస్తుంది. అవి-దేవతా ప్రసాదం, సాధుజన సేవ, స్వయంకృషి.
ఇందులో మొదటిదాన్ని అదృష్టం. రెండవదాన్ని సుకృతం. మూడవదాన్ని తెలివితేటలు అని పిలుచుకోవడం లోకరీతి. అదృష్టవంతునికి కష్టపడకుండానే సంపదలు వచ్చిపడతాయి. సుకృతం ఉన్నవాళ్లే సాధుజన సేవ చేయగలుగుతారు. తెలివి ఉన్నవాళ్లు స్వయంకృషితో సంపదను సృష్టించుకుంటారు.
ఎవరివద్ద ’పద్మ’ అనే పద్మినీ విద్య తాలూకు ప్రథమ ఉప విభాగపు నిధి ఉంటుందో, వాళ్లకి ఏడు తరాల వరకు ఏ లోటూ ఉండదు. వీరు సహజ సౌమ్యులు.
‘మహాపద్మ’ నిధి ఉన్న వ్యక్తులు తాము సంపాదించిన సొమ్మును ఐదు తరాల వరకు అనుభవిస్తారు. ‘మకర’ నిధి వ్యక్తులు ఒక తరం వరకే సంపదను అనుభవించగలుగుతారు. వీరికి విసుగు, కోపం జాస్తి.
‘కచ్ఛప’ నిధి కల వ్యక్తులు కేవలం ఒకే ఒక్కతరం పాటు వారు పొందిన సొమ్మును అనుభవిస్తారు. సాధారణంగా లోభ మనస్తత్వంతో ఉంటారు. తాము దాచుకున్న సొమ్మును గురించిన వివరాలను తమ వాళ్లతో సహా ఎవరితోనూ పంచుకోరు.
’ముకుంద- నందక’ నిధులున్న వ్యక్తుల వద్దనున్న ధనం మూడు తరాల వరకు తరానికి మూడొంతుల చొప్పున వృద్ధిచెందుతూ ఉంటుంది. అనాధలను ఆదుకునే గుణం వీరి సొంతం.
‘నందక’ నిధి ఉన్న వాళ్లు ధనం ఏడుతరాల వరకు తరానికి ఎనిమిది రెట్ల చొప్పున వృద్ధి చెందుతుంది.
‘నీల’ నిధి కోవలోకి వచ్చే వ్యక్తుల వద్ద ధనం తాత, తండ్రి, కొడుకు తరాల వరకూ శాశ్వతంగా నిలిచి ఉంటుంది. తర్వాతి తరాలు దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతుంటాయి.
‘శంఖ’ నిధి వ్యక్తి సంపద కేవలం ఆ సంపాదనపరుడి దగ్గర మాత్రమే ఉంటుంది. మంచి వాటిని తాను అనుభవిస్తూ పనికిమాలినవాటిని ఇతరులకు ఇస్తూండడమనేది ఈతని గుణం.
స్వారోచిష మనువు కళావతి ద్వారా మహాపద్మ పద్మినీ విద్యను గ్రహించినట్లు మార్కండేయ పురాణంలో ఉంది.

***

No comments:

Post a Comment

Pages