నవ్య కవితా పితామహుడు రాయప్రోలు సుబ్బారావు గారు.
అంబడిపూడి శ్యామసుందర రావు.
"ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము"
"శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమయి వ్రాలినది ఈ భరతఖండము భక్తిపాడర తమ్ముడా వేదశాఖలు
పెరిగె నిచ్చట ఆదికావ్యం బందె నిచ్చట"
అంటూ భరత మాతను కీర్తిస్తూ దేశ భక్తిని పెంచే పాటను స్వతంత్ర ఉద్యమములో రచించినది నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు గారు మార్చ్ 17 అయన జయంతి సందర్భముగా వారిని స్మరించుకుంటూ వారి జీవిత విశేషాలను తెలుసు కుందాము.
తెలుగులో భావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో వ్రాసిన తృణకంకణముతో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార
తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్ళికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశాడు. రాయప్రోలు వారి తృణకంకణము నకు కట్టమంచి రామలింగారెడ్డి గారు వ్రాసిన సందేశములో "ఆధునిక కవులలో రాయప్రోలు వారి శైలి చాలా ప్రత్యేకమని" చెపుతారు. రాయప్రోలు వారు పనిచేసియాన ఏ సంస్థకైనా ఆయన వల్ల పేరు వస్తుంది అని అంటారు. "రాయప్రోలు ఒక మేధావిగా చెప్పవచ్చు" అని కట్టమంచి రామ లింగారెడ్డి గారు అంటారు.
సుబ్బారావుగారు 1892 మార్చ్ 17న గుంటూరు జిల్లాలోని గార్లపాడు గ్రామములో జన్మించారు. 1908లో విద్యార్ధిగా ఉండగానే అనేక కవితలు పద్యాలు వ్రాసేవారు. కాకినాడలో రఘుపతి వెంకట రత్నము నాయుడి గారి ప్రోత్సహముతో హైస్కూల్ విద్య, మెట్రిక్యులేషన్ పూర్తి చేసుకొని, ఉన్నత చదువులకు పోకుండా
హైదరాబాద్ లో కొమర్రాజు లక్ష్మణ రావు గారు ప్రారంభించిన ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము రూపొందించటంలో సహాయ సంపాదకుడిగా చేరాడు. విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ రచించిన గీతాంజలి పలుమార్లు చదివి స్పందించి, శాంతినికేతన్ లో ఉండటానికి రవీంద్రుని అనుమతి తీసుకొని అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఇతర కవి పండితుల సాహిత్యాన్ని అధ్యయనము చేసాడు. ఆ తరువాత కాశీ వెళ్లి సంస్కృత పండితుల వద్ద వివిధ శాస్త్రాల అధ్యయనము చేసాడు. ఆ తరువాత విజయవాడ వచ్చి తన సాహితి కృషి ప్రారంభించాడు. తన మేనమామ అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో కలిసి ఆశు కవిత్వము అవధాన ప్రదర్శనలలో పాల్గొన్నాడు.
కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత. 18వ శతాబ్దంలో జర్మనీ, ఫ్రాన్సు దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ చిత్రకారులను, రచయితలను శిల్పులను కవులను గాఢంగా ప్రభావితం చేసింది.
పాశ్చాత్యదేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మళ్ళించాడు. అయితే రాయప్రోలుది గ్రుడ్డి అనుకరణ కాదు. తెలుగు, సంస్కృత భాషా పటిమను ఆయన విడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాన రచయత. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. ఈయన రచనలు ప్రధానంగా ఖండ కావ్యాలు, తృణ కంకణము, ఆంధ్రావళి, కష్టకమల, రమ్యలోకము, వన మాల, మిశ్రమంజరి, స్నేహలతా దేవి, స్వప్నకుమారము, తెలుగు తోట, మాధురీ దర్శనం, రూపనవ నీయతం మొదలైనవి .
అనువాద రచనలలో అనుమతి, భజగోవిందము, సౌందర్య లహరి, దూత, మత్తేభము, లలిత, మధు కలశము మొదలైనవి. వాల్మీకి రామాయణము ,సుందరకాండలను గేయరూపములో అత్యంత రమణీయముగా రూపొందించారు.
రాయప్రోలు సుబ్బారావు మొదటి చూపులోనే చూపరులను ఆకట్టుకుంటారని ప్రతీతి. తమ బెట్టుతో, బింకంతో, ఠీవితో, పల్లెవాటుల వయ్యారంతో, చెక్కుచెదరని క్రాఫింగ్‌తో నిండుగా ఉండేవారు. ఐతే ఒక పక్క కవిత్వంలో మన వంటి ధీరులింకెందునూ లేరని, ఏదేశమేగినా జాతిగౌరవం నిలపాలని వ్రాస్తూనే, మరొక పక్క తెలంగాణలో ప్రజలు రాజ్యంతో వీరోచితంగా పోరాడుతూండగా నైజాం రాజ్యాన్ని పొగుడుతూ రగడ రచించారన్న పేరు మూటకట్టుకున్నారు. తెలుగు సీమ సొగసును, తెలుగువారి ఆచారాలను భాష సౌకుమార్యన్ని, భావ గంభీరలతో పాటు ఆంధ్ర ప్రాభవాన్ని మనోహరముగా చక్కని పదాల కూర్పుతో రమణీయముగా గానము చేసిన మహాకవి రాయప్రోలు సుబ్బారావు గారు 1921లో ఉస్మానియా విశ్వ విద్యాలయములో తెలుగు శాఖలో వివిధ హోదాలలో పనిచేశారు. వరంగల్లు కాలేజీ ప్రిన్సిపాల్ గాను, తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయములో తెలుగు శాఖాధిపతిగా పనిచేశారు. ఆ విధముగా దాదాపు 38 సంవత్సరాలపాటు పలు విద్యాసంస్థలలో వివిధ హోదాలలో పనిచేసి 1959 లో సికింద్రాబాద్ లోని మారేడ్ పల్లి లో స్థిరపడ్డారు.
నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షునిగా, ఆంధ్ర పండిత పరిషత్ అధ్యక్షునిగా, రేడియో సలహా సమితి, ఫిలిం సెన్సార్ బోర్డు ,కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీ సలహా సంఘ సభ్యనిగా విశేష సాహితి సేవలు అందించిన వ్యక్తి రాయప్రోలు సుబ్బారావుగారు. 1965 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది,తెలుగు
సాహితి లోకములో భావ కవిత్వ యుగ కర్తగా కిర్తించబడ్డ రాయప్రోలు సుబ్బారావు గారు 1984,జూన్ 30న సికింద్రాబాద్ లో తుది శ్వాస విడిచారు. వారి రచనలు నేటి యువ రచయితలకు ఆదర్శము, మరియు నూతన స్ఫూర్తిని ఇస్తాయి.
***
No comments:
Post a Comment