శివమానస పూజా స్తోత్రము - ఆదిశంకరాచార్య విరచితము
భావవివరణ: భావరాజు పద్మిని
అందరికీ ఆలయాలకు వెళ్లి, లేక ఇంట్లో అన్నీ ఏర్పాటు చేసుకుని, ఆ పరమేశ్వరుని పూజించే అవకాశం కలుగకపోవచ్చు. అందుకే, మనవంటివారికోసమే శ్రీ ఆదిశంకరులు 'శివమానస పూజా స్తోత్రాన్ని' రచించి, అందించారు. ఈ స్తోత్రాన్ని భావం తెలుసుకుని చదివితే ఇంకా బాగుంటుంది కదూ! శివాయ గురవే నమః.
శ్రీ శివమానస పూజా స్తోత్రము:
రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ |
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||
భావము: ఓ దయాసముద్రుడా! నీవు ఆసీనుడవగుటకు ఒక రత్నఖచితమైన సింహాసనాన్ని, నీకు స్నానము చేయించుటకు చల్లని గంగాజలాన్ని, నీకు ధరింపజేయిటకు మణిమయాలంకృతమైన దివ్య వస్త్రాలను, నీకు మైపూతగా కస్తూరి కలిపిన చందనాన్ని, నీ పూజకొరకు మల్లెలు, సంపెంగలు వంటి పుష్పలను, బిల్వపత్రాలను, అగరు ధూపాన్ని, దీపాన్ని నా మనసులో ఊహించుకుని, వీటితో నిన్ను పూజిస్తున్నట్లుగా భావిస్తున్నాను. నిర్మలమైన మనసుతో నేను చేసే ఈ పూజను స్వీకరించు పశుపతీ!
సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||
భావము: నవరత్నఖచితమైన బంగారు పాత్రలో నీకోసం పరమాన్నాన్ని, పాలు, పెరుగుతో చేసిన ఐదు విధాలైన భక్ష్యాలను(పంచ భక్ష్యాలు), అరటిపండ్లను, పానకాన్ని, పచ్చకర్పూరం, కొన్ని శాకములు కలిపిన తియ్యని రుచికరమైన నీటిని, తాంబూలాన్ని, భక్తిగా నీకోసం నా మనసులో ఊహించుకుంటున్నాను. ప్రభూ! దయతో వీటన్నిటినీ స్వీకరించండి.
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||
భావము: ఛత్రాన్ని, ఛామరాన్ని, విసనకర్ర ను, పాముపడగ నీడను, స్వచ్ఛమైన అద్దాన్ని, వీణను, ఢమరుకాన్ని, మృదంగాన్ని, ఢక్కను, నృత్యగానాదుల వంటి ఉపచారాలను, సాష్టాంగ నమస్కారాన్ని, అనేక విధాలైన స్తుతులను నీకు చేసినట్లుగా నా మనసులో భావిస్తున్నాను. ప్రభూ! నా సంకల్పం ద్వారా సమర్పించబడిన ఈ పూజలన్నింటినీ దయతో స్వీకరించండి.
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||
భావము: నా ఆత్మవు నువ్వే. పార్వతి నా జ్ఞానము. నా పంచప్రాణాలే నీ సేవకులు, నా దేహమే నీకు ఇల్లు, నా పంచేంద్రియాల ద్వారా అనుభవించే సుఖాలన్నీ నీ పూజోపకరణాలు. నా నిద్ర నీకు ధ్యాన సమాధి స్ధితి. నా నడకలే నీకు ప్రదక్షిణాలు, నా మాటలన్నీ నీ స్తుతులు, నేను చేసే చర్యలన్నీ నీ ఆరాధనలే, ఓ దయగల శంభుడా!
కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో || 5 ||
భావము: నా చేతులు, కాళ్ల ద్వారా, మాట, దేహము, చర్యల ద్వారా, చెవులు, కళ్లు, బుద్ధి ద్వారా, తెలిసైనా తెలియకైనా ఏవైనా తప్పులు చేసి ఉంటే, దయతో వాటన్నింటినీ క్షమించండి. ఓ కరుణాసముద్రా! ఓ శుభకరా, శంభో! ఓ మహాదేవా! నీకు జయమగుగాక!
No comments:
Post a Comment