శ్రీరుద్రంలో విశేషాలు - 1 - అచ్చంగా తెలుగు

శ్రీరుద్రంలో విశేషాలు - 1

Share This
 శ్రీరుద్రంలో విశేషాలు - 1
శ్రీరామభట్ల ఆదిత్య 




వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం,
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిమ్।
వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం,
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివంశంకరమ్ ॥

కృష్ణయజుర్వేదంలోని తైత్తిరీయ సంహితలోని చతుర్థవైశ్వదేవ కాండంలోని పంచమ ప్రపాఠకమే శ్రీరుద్రం. నమకం మరియు చమకం ఈ రెంటి కలయికే శ్రీరుద్రం. నమకంలో మొత్తం 11 అనువాకాలు ఉన్నాయి. నమకంలో పరమేశ్వరుడి స్తుతి మనకు కనిపిస్తుంది. నమో... నమో...అనే శబ్దం యొక్క ప్రయోగం ఎక్కువసార్లు జరగడం చేత దీనికి 'నమకం' అనే పేరు వచ్చిందని చెప్తారు. మొత్తంగా నమకంలో 183 సార్లు 'నమో' శబ్దప్రయోగం జరిగింది. కానీ హోమముచేసే పద్ధతిలో మాత్రం పారాయణ చేసే సమయంలో సంధిప్రయోగాలచేత 170 సార్లే 'నమో'శబ్దం యొక్క ప్రయోగం కనిపిస్తుంది. 

ఇక చమకంలో కూడా 11 అనువాకాలు ఉన్నాయి. దీనిలో 'చ మే' అనే ప్రయోగం ఎక్కువసార్లు జరిగింది అందుకే దీనికి చమకం అనే పేరు వచ్చింది. నమకంలో పరమేశ్వరుణ్ణి స్తుతించిన సాధకుడు చమకంలో కోరికలు కోరతాడు. సంస్కృత భాషలోని 'అస్మద్' శబ్దం యొక్క చతుర్థీవిభక్తిఏకవచనరూపమే 'మహ్యం/మే'. ఇందులో మొత్తంగా 343 కోరికలు మనకు కనిపిస్తాయి. 

ఒకసారి నమకం-చమకం కలిపి చదివితే దానిని 'రుద్రం' లేక 'రూపకం' అని అంటారు. నమకంలోని 11 అనువాకాలు + చమకంలోని మొదటి అనువాకం, తరువాత మళ్లీ నమకంలోని 11 అనువాకాలు + చమకంలోని రెండవ అనువాకం, ఇలా మొత్తంగా చమకంలో ఒక్కో అనువాకాన్ని నమకం తరువాత జోడిస్తూ చదివితే దానిని 'ఏకాదశ రుద్రం' అని అంటారు. ఇలా పదకొండు సార్లు 'ఏకాదశ రుద్రం' పారాయణ చేస్తే దానిని 'లఘు రుద్రం' అంటారు. లఘురుద్రాన్ని పదకొండు సార్లు పారాయణ చేస్తే దానిని 'మహారుద్రం' అంటారు. మహారుద్రాన్ని పదకొండు సార్లు పారాయణ చేస్తే దానిని 'అతి రుద్రం' అంటారు. 

మొత్తంగా 'రుద్రం'లో నమకపారాయణ 1 సారి జరుగుతుంది. 'ఏకాదశ రుద్రం'లో 11 సార్లు నమకపారాయణ జరుగుతుంది. 'లఘురుద్రం'లో 121 సార్లు నమకపారాయణ జరుగుతుంది. 'మహారుద్రం'లో 1331 సార్లు నమకపారాయణ జరుగుతుంది. 'అతిరుద్రం'లో 14641 సార్లు నమకపారాయణ జరుగుతుంది. నమకచమకాల చివరన 'స్వాహా'ని జోడించి రుద్రహోమాలు నిర్వహిస్తారు. అలా జరిగేవే 'మహారుద్ర', 'అతిరుద్ర' హోమాలు.

నమః శివాయ 

( ఇంకా ఉంది )

No comments:

Post a Comment

Pages