తల్లీ నిన్ను దలంచి - అచ్చంగా తెలుగు

తల్లీ నిన్ను దలంచి

Share This

 తల్లీ నిన్ను దలంచి 

 మినీ కథా చక్రవర్తి, కథానిధి, కథా బ్రహ్మ, కథా విశారద

కె.బి. కృష్ణ. కాకినాడ. 



శ్రావణ మాసం సాయంకాలం. ఆకాశమంతా మబ్బులు కమ్మి చల్లని గాలి వీస్తూ వాతావరం చాలా ఆహ్లాదకరం గా వుంది. సుమారు వెయ్యి గజాల స్థలం లో ఒక ప్రక్కన మూడు అంతస్థుల భవనం, సుమారు 100 మంది ఉండడానికి గదులు, ప్రతి గది లో బెడ్, టెలివిషన్, బాత్ రూమ్, వగైరా సౌకర్యాలతో. బిల్డింగ్ మొత్తం సెంట్రల్లి ఎయిర్ కండిషనింగ్ చేసి వుంది. తెల్లని భవంతి. బిల్డింగ్ పై అంతస్థు లో స్టీల్ అక్షరాలతో “ అమ్మ శాంతి ఆశ్రమం.” అనే బోర్డు. ఆ బిల్డింగ్ ప్రక్కనే రెండు అంతస్థుల భవనం. అందులో ఆశ్రమ నిర్వాహకులు వుంటారు.

బిల్డింగ్ ముందు రెండు షామియానాలు వేసి ఉన్నాయి. సభికులు కూర్చోవ డానికి కుర్తీలు వేశారు. వేదిక ఎత్తు గా ఏర్పాటు చేశారు. వేదిక పై మదర్ థెరిస్సా చిత్రం, మరియు ఆశ్రమ నిర్మాత కరుణ గారి తల్లి శాంత గారి చిత్రం ఒక బల్ల పై ఉంచారు.

వేదిక ప్రక్కనే మదర్ థెరిస్సా , మరియు శాంత గారి కాంస్య విగ్రహాలు ప్రారం భోత్సవానికి సిద్ధం గా వున్నాయి. ఇద్దరు గూర్ఖాలు నిలబడి వున్నారు.

సభకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ ని ముఖ్య అతిధి గాను ఆశ్రమ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. వేదిక పై ఆశ్రమానికి స్థలం దానం చేసిన వారు, లయన్స్ క్లబ్ గవర్నర్ గారు, ఆశ్రమ డైరెక్టర్ సత్యమూర్తి గారు, కరుణ గారు కూర్చుంటారు. కరుణ క్యాంపు క్లర్క్ సభను నిర్వహిస్తారు.

సమయం తొమ్మిదినలభై ఐదు అయింది. మేళతాళాలతో లయన్స్ గవర్నర్ గారు, ఆశ్రమ స్థల దాత శ్రీహరి గారు, డైరెక్టర్ సత్య మూర్తి గారు, కరుణ తన శ్రీమతి వెంట రాగా సభావేదిక వద్దకు వచ్చారు.

ముందుగా మదర్ థెరిస్సా విగ్రహం శ్రీహరి గారు ఆవిష్కరించారు. తరువాత శాంతమ్మ గారి విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ కరుణ గారు ఆవిష్కరించి తన తల్లిని తన శరీరానికి హత్తుకుకుని జేబు రుమాలుతో కళ్ళు తుడుచుకున్నారు. ప్రక్కనే వున్న కరుణ అర్ధాంగి భర్త భుజాన్ని తట్టి ఓదార్చింది. అందరూ వేదిక ఎక్కారు. సభ మొదలైంది.

ప్రార్ధనా గీతం ఒక అమ్మాయి వచ్చి ఆలపించింది. 

ముందుగా లయన్స్ గవర్నర్ గారు మాట్లాడతారు -- అని ప్రకటించగానే ఆయన లేచి --

" ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన జిల్లా కలెక్టర్ కరుణ గారికి, నా జన్మ ధన్యం చేసి నందుకు కృతజ్ఞతాంజలి. మనం సమాజం లో ఎన్నో ప్రారంభోత్సవాలు చూశాము, చూస్తున్నాం. కానీ - ఈ " అమ్మ శాంతి ఆశ్రమం " ప్రారంభోత్సవం ఒక పరిత్రమైన దేవాలయం ప్రారంభోత్సవంగా నేను భావిస్తున్నాను. ఈ దేవాలయానికి సుమారు వెయ్యి గజాల స్థలం కరుణ గారు కోరగానే దానం చేసిన గౌరవనీయులు శ్రీహరి గారికి పాదాభివందనాలు చెల్లించుకుంటున్నాను.

" అమ్మంటే అనురాగం, అమ్మంటే అభిమానం, అమ్మంటే ఆదరణ. అమ్మ అంటే, ఆప్యాయత, అమ్మ వేయించే ప్రతి అడుగూ ఆరోహణ, అమ్మ వ్రాయించే అక్షరం ఆధారం. అమ్మ పలుకు అద్భుతం. అమ్మ పిలుపు అమృతం, అమ్మంటే అవని, అమ్మంటే ఆకాశం. అమ్మంటే ఆది కావ్యం, అమ్మంటే అంతు లేని ధనం, అమ్మంటే ఆశీస్సు, అమ్మకు అమ్మే సాటి, అమ్మ లేకుంటే అసలేదీ సృష్టి ?

అమ్మలారా --- ఈ అమృతాక్షరాలు రచించింది ఒక తల్లి అని మీకు తెలుసునా ? అటువంటి తల్లి ఈనాడు సమాజం లో భర్తతో పాటుగా తన సంతానంచే నిరాదరణకు గురి అవుతోంది. అటువంటి అమ్మల కోసం మన జిల్లా కలెక్టర్ గారు తన స్వంత డబ్బుతో ఈ ఆశ్రమం నిర్మించడం ముదావహం. తల్లికి మాత్రమే ఆశ్రమం ఏమిటి ? అని మీరు అనుకోవచ్చును. ప్రతీ స్త్రీ జీవితం భర్త గతించాక చాలా దయనీయంగా తయారవుతుంది. అందుకని అటువంటి మహిళల కోసమే ఈ ఆశ్రమం ఏర్పాటు చేసినట్లు గా నాకు కలెక్టర్ కరుణ గారు చెప్పారు. ఇప్పుడు శ్రీహరి గారు మాట్లాడతారు. -- అని గవర్నర్ గారు కూర్చున్నారు.

" నేను ఈ సభను ఈ వేదిక ను ఒక అమూల్యమైన పవిత్రమైనది గా భావి స్తున్నాను. మన జిల్లా కలెక్టర్ గారు కరుణ గారు ఇటువంటి కార్యక్రమం చేస్తానని నాతో ముందుగా చెప్పారు. వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా వారు తలపెట్టిన ఈ పుణ్యప్రదమైన కార్యక్రమానికి చంద్రునికో నూలుపోగు వలె నేను స్థలాన్ని దానం చేస్తానని చెప్పడంతో ఆయన ముఖంలోని కాంతిని, ఆనందాన్ని వర్ణించలేను. ఈ రకంగా నా జన్మ ధన్యమైంది. నగరంలో నాకు అంతులేని సంపద వుంది. నా కుటుంబం అన్ని రకాలుగా సిరిసంపదలతో, సుఖసంతోషాలతో తులతూగుతోంది. పెరిగేదే గాని తరిగేది ఏమీ లేదు. అందువలన నా కోసం ఉంచుకున్న ఈ స్థలాన్ని ఆశ్రమానికి ఇచ్చేశాను. నాకు ఈ మహత్తర అవకాశాన్ని ప్రసాదించిన కరుణ గారికి నేను ఆజన్మాస్తము రుణపడివుంటాను. చివరగా నాకు తెలిసిన ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. మహమ్మద్ ప్రవక్త గారిని ఒక భక్తుడు " మనిషి పై అత్యంత అధికారం గల వ్యక్తి ఎవరు ? " అని అడిగాడట. దానికి వారు తల్లి, తల్లి, తల్లి అని మూడుసార్లు చెప్పి తరువాత తండ్రి " అని సెలవిచ్చారుట. దీనిని బట్టి తల్లికి మానవ జీవితంలో గల ప్రాధాన్యత తెలుస్తోంది. -- అమ్మ కు జే జే లు -- " ఆయన కూర్చున్నారు. తరువాత కలెక్టర్ కరుణ గారు మాట్లాడతారని ప్రకటించారు. అప్పటి వరకూ తల వంచుకుని తన తల్లినే స్మరించుకుంటూకూర్చుండిపోయిన కలెక్టర్ కరుణ గారు లేచి నిలబడ్డారు. సభికులకు నమస్కారం. -- శ్రీహరి గారికి, లయన్స్ క్లబ్ గవర్నర్ గారికి పాదాభివందనాలు-- -

వేదాలలో " మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ, “ అని సూచిస్తూ మాతృమూర్తి కి మొదటి స్థానం కల్పించి తొలి నమస్కారం అమ్మకే అర్పించారు.

అమ్మ భావన ఏ భాషలోనైనా, ఏ జాతిలోనైనా, ఏ ప్రాణిలోనైనా, మధురాతిమధురంగా ఉంటుంది. అమ్మ ఒక ఆవేదన, ఒక ఆర్తి, ఒక మృదువైన సం స్పందన, నిత్యం నిరంతరం కదలాడే జీవ చైతన్యం. జన్మ తీసుకున్న ప్రతి జీవికీ -- అమ్మ తల్లి వేరు -- మూల మూర్తి -- విశ్వానికి నాయకుడైనా ఒక అమ్మకు కొడుకే. దేవుడూ తల్లి లేకుండా లేదు -- దైవానికి తలవంచని నాస్తికుడైనా జన్మ నిచ్చినందు కు అమ్మ ముందు తలవంచాల్సిందే ! -- అమ్మ అన్న తలపే ప్రేమతో -- కృతజ్ఞత తో -- హృదయం చెమ్మగిల్లుతుంది. సృష్టి లో తీయని పదం అమ్మ -- మనిషికి తప్ప ఆ పరమ శివునికి కూడా లేని వరం అమ్మ -- ఇలా ఎన్ని చెప్పను అమ్మ గురించి. నాకు ఊహ వచ్చే సమయంలో ఒక పెద్ద కంపెనీలో ఉన్నతోద్యోగంలో వెలిగే మా నాన్న గారు అకస్మాత్తుగా గతించారు. అప్పటివరకూ మేరు పర్వత శిఖరం ముందు వెలిగి పోయిన మేము చీకటి లోకే జారిపోయాం .

అమ్మ కొంచెం చదువుకుంది కాబట్టి, ఒక ఉద్యోగం ఇచ్చి కంపెనీకి రాకుండానే జీతం ఇంటికి పంపించే వారు. ఈ రోజుల్లో లాగ పెన్షన్స్ లేవు. నాన్న గారి మరణా నంతరం కంపెనీ ఇచ్చిన డబ్బు నాన్నగారిని చేర్పించిన కార్పొరేట్ హస్పిటల్ ఫీజులకు సరిపోయింది.

అప్పటికి నేను ఏడవ తరగతి చదువుతున్నాను. మంచి మార్కులతో క్లాస్ టాపర్ గా వున్నాను.

ఒక రోజు కంపెనీ ఓనర్ గారు మా ఇంటికి వచ్చి అమ్మను ఓదార్చి, నన్ను తన ఒడిలో కూర్చో బెట్టుకుని, సముదాయించి అమ్మతో -- “ నాకు మీ శ్రీవారు చాలా ఆత్మీయులు, ఒక నిరాడంబరమైన, నిజాయితీ, నిస్వార్ధమయిన వ్యక్తి. నేను చెప్పు కోకూడదు గాని సిరిసంపదలు వున్నాయి గాని, మనసారా, మనసున మనసై కష్ట సుఖాలు పంచుకోని సహధర్మచారిణితో ముఖం మీద నవ్వు పులుముకుని జీవిస్తు న్నాను. ఒక రకంగా చెప్పాలంటే " నానాటి బ్రతుకు నాటకమూ “ లా వుంది నా బ్రతుకు. నేను మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను, ఈ పిల్లవాడిని బాగా చదివించి ఆఫీసర్ ని చేద్దాము. మీరు అన్యధా భావించకుండా నాతో సహజీవనం చెయ్యండి క్షమించండి -- " అన్నారు ఆయన. అమ్మ ముఖం లో అంతవరకూ వున్న విచారం స్థానం లో విపరీతమైన కోపం గోచరించింది. నేను చాల భయ పడ్డాను.

" అయ్యా -- మా వారు గతించాక నన్ను కంపెనీ కి కూడా రానివ్వకుండా ఇన్ని రోజులూ జీతం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే హైందవ సంప్రదాయం లో భర్త గతించాక, మరో వివాహం చేసుకున్న మహిళలు చాలా తక్కువ మంది. అలాగే తమరు ప్రతిపాదించినట్లుగా సహజీవనం చేసేవారూ చాలా తక్కువ మందే ! మీ సహృదయానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. నేను త్వరలో నా నిర్ణయం తెలియ చేస్తాను. --" అంది అమ్మ కోపం, సంతోషం, కలగలిపిన ముఖకవళికలతో.

అంతే ! మర్నాటినుండి అమ్మ కంపెనీ దరిదాపులకు వెళ్లనే లేదు. మా దగ్గర వున్న కొంచెం డబ్బు తో కాలక్షేపం చేస్తున్నాం. ఒక రోజు మా అమ్మ సంతోషంతో నన్ను కౌగలించుకుని " నానీ నేను బి. ఏ పాసయ్యాను రా -- నాకు ప్రభుత్వోద్యోగం వచ్చేస్తుంది. --” అంటూ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసింది. మా నాన్నగారి ఆశీస్సులతో అమ్మకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసింది.

ఒక రోజు " అమ్మా-- నేను ఐ.ఏ.ఎస్ పరీక్ష పాస్ అయి నిన్ను కారు లో తిప్పుతానమ్మా పెద్ద కలెక్టర్ బంగ్లా లో నువ్వు ఉండాలి. అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను -- " అని నేను అంటే ఆనాడు అమ్మ నన్ను తన హృదయానికి హత్తుకుని " మా నాన్నే -- నా చిట్టి తండ్రి ఇప్పుడే నువ్వు కలెక్టర్ అయిపోయినట్లుగా ఉందిరా నాకు -- " అంటూ విలపిస్తోంటే నా చొక్కా తడిచిపోయింది.

అప్పటి నుండీ నేను వేరే ధ్యాస లేకుండా ఎప్పుడూ చదువు, చదువు చదువు అంతే ! డిగ్రీ పాస్ అయ్యాక నేను ఐ.ఏ.ఎస్ అకాడమీ లో చేరితే ఇరుగూ పొరుగూ, మా బంధువర్గమూ ఎగతాళిగా లోకువ గా చూసేవారు. అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది " నవ్విన నాప చేనే పండుతుంది " అని. నాన్నా నీ దీక్ష విరమించకు అనేది. నేను లైబ్రరీ లో స్వామి వివేకానంద గ్రంధాలు చదివేవాడిని. “ పట్టు వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది, ఒక్క రోజులో దేన్నీ సాధించలేంలే మేలుకో ! గమ్యం చేరేవరకూ విశ్రమించకు -- " అని వారి వాక్కులను ప్రతీ క్షణమూ చదువుకునే వాడిని. పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు మీద ఈ సందేశం రాసి నా గది లో ఎదురుగా పెట్టుకునేవాడిని.

ఆ రోజు నా చిరకాల ధ్యేయం నెరవేరిన రోజు. ఐ.ఏ.ఎస్ కు ఎన్నికై పరుగులతో ఇంటికి వచ్చాను. తలుపు తీయగానే ఎదురుగా అమ్మ దైవ స్వరూపమైన నా అమ్మ. కుంకుమ ఎఱుపు పసుపూ రంగుల కలనేత చీర లో పచ్చని మేని ఛాయ లో ముఖం నిండా పసుపు పూసుకుని నుదుటి మీద రూపాయ కాసంత కుంకుమ బొట్టు, కళ్ళల్లో చందమామ వెల్లసినట్లుగా వెన్నెల కిరణాలు ఆవరించిన అసమానమైన ప్రేమ పూరిత కరుణార్ధ చూపులు. బొట్టు లేని అమ్మను నేను ఊహించలేను. అమ్మ ఆనందడోలికల్లో తేలియాడుతున్న నన్ను చూసి, నా మాటలు విని పొంగిపోయింది. సంబరపడిపోయింది. వెయ్యి వోల్టుల బల్బ్ లా అమ్మ ముఖారవిందం వెలిగిపోయింది. “ నీ మాట నెగ్గించుకున్నావ్ నాన్నా -- " అంటూ నన్ను తన గుండెలకు హత్తుకుని అలాగే ఎంతకీ విడిచి పెట్టక పోతే " అమ్మా --" అన్నాను ఆందోళన తో -- అంతే ! అమ్మ నా ఒడిలో తుది శ్వాస విడిచింది. “ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని డాక్టర్స్ చెబితే మా అబ్బాయి కలెక్టర్ అవుతాడు అప్పుడు చేయిస్తాడని చెప్పేదయ్యా మీ అమ్మ గారు -- నీతో ఈ విషయం చెప్పొద్దని ఒట్టు వేయించుకుంది తన మీద “-- అని మా ఇంటి ప్రక్కనాయన వచ్చి కళ్ళు తుడుచుకుంటూ చెప్పారు. దేముడు ఆడించే నాటకాలలో ఇది ఒక వింత నాటకమే కదా అనుకున్నాను. ఆ రోజునే ఒక నిర్ణయం తీసుకున్నాను. మా అమ్మను ఎన్నటికీ సజీవంగా ఉంచాలని అందుకే అమ్మలందరి కోసం ఈ ఆశ్రమం నిర్మించాను. దీనిని ఎవరికీ పర్యవేక్షణ కు ఇవ్వకుండా నేనే జీవితాంతం నిర్వహించాలని నిర్ణయించుకున్నాను. 

నాకు తెలుసున్నంత వరకు నిరాదరణ కు గురైన అమ్మ ఎక్కడ వున్నా సరేమా అమ్మ శాంతి ఆశ్రమం లో చోటు వుంది. ఎవరైనా సరే దిక్కులేని అమ్మలను ఇక్కడకు తీసుకు రావచ్చును. వారి దగ్గర పైసా తీసుకోవడం జరగదు. అమ్మలందరూ నాఅమ్మలే ! కలెక్టర్ కరుణ గొంతు మూగబోతుంటే ఆయన శ్రీమతి వెనుకనుండి వాటర్ బాటిల్ ఇచ్చింది. ఆయన నీళ్లు తాగి --

నేను నా ఆలోచన చెప్పగానే ఆగర్భ శ్రీమంతులు శ్రీహరి గారు ఈ స్థలాన్ని ఉచితం గా ఇచ్చారు. నా జీతం లో సగ భాగం ఆశ్రమానికి ఖర్చు పెడతాను. ఇంకా అమ్మలు ఎక్కువ మందికి స్థానం కల్పించడానికి ప్రయత్నం చేస్తాను.

స్త్రీ జన్మ ఆడపిల్ల గా మొదలై ఒక భార్య, తల్లి, అత్తగారు, అమ్మమ్మ,నాయనమ్మ ఎన్నో పాత్రలు వహించాలి. ఈ సభ లో వున్న మహిళలు ఈ స్థానం లో ఏ వయసులో వున్నా ఒకరి నొకరు పరస్పరం గౌరవించుకోవాలి ఆదరించుకోవాలి సమసమాజ నిర్మాణం మీ చేతి లోనే ఉంది.

పాత చీరలన్నీ కాలం దారం తో కుట్టిన

బొంత మీద పడుకున్నప్పుడు 

అమ్మ అరచేతుల్లో పడుకున్నంత ఆనందం

అమ్మ చేతి చిత్ర వర్ణం బొంత – 

మా అమ్మ కాటన్, వాయిల్, పట్టు, చీరలతో తయారు చేయించాను ఈ రంగు రంగుల బొంత రోజు నా బెడ్ మీద పరచుకుని అమ్మ ఒడి లో పడుకున్నంత ఆప్యాయతానురాగాలు, హాయి, అనుభూతి చెందుతూ -- ఇదిగో -- అంటూ రంగు రంగుల బొంత ను ప్రేక్షకులకు చూపిస్తుంటే సభలోని వారంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేస్తోంటే, కొంత మంది యువతీ యువకులు వేదిక ఎక్కి కలెక్టర్ గారి పాదాలకు మొక్కసాగేరు.

చివరగా స్వర్గం ఎక్కడ ఉందంటే అమ్మ పాదాల దగ్గర అని పెద్దలు అన్నట్లు గా నేను ఈ స్వర్గం పక్కనే ఉంటాను జీవితాంతం.

సెలవ్ -- " అంటూ కలెక్టర్ కరుణ వేదిక దిగుతొంటే అమ్మ అనే అంశం మీద కవి సమ్మేళనం ప్రారంభమైంది.

" అమ్మంటే అనంతం, అమ్మంటే అస్తిత్వం, అరమీరికలు ఎరుగని ప్రేమ స్వరూపం, అతిశయమెరుగని అమృత ధార, అమ్మంటే అనంతం -- అంటూ స్థానిక ప్రముఖ కవి పండితులు డాక్టర్ కల్లూరి శివ సుందర వర ప్రసాద్ గారు కవితా గానం చేస్తున్నారు మొదటి గా...

***

అంకితం 

అమ్మ ఉన్న వారికి అమ్మను దేవతలా ఆరాధించమనీ – 

అమ్మ లేని వారు వచ్చే జన్మలో నైనా అమ్మ ప్రేమ ను ప్రసాదించమని దేవుని వేడుకోమని కోరుతూ --- 

నేను ఒక అమ్మ పిచ్చివాడిని. వయసు 75 నిండుకున్నా ఇద్దరు పిల్లలు పెద్దవాళ్లయినా మనవలు, మనవరాళ్లు ఉన్నా కూడా ఒక రాత్రి వేళ అమ్మ గుర్తుకు వస్తే నిశ్శబ్దం గా ఏడుస్తాను.

( ఈ కథ లో గవర్నర్ గారి ఉపన్యాసం లో " అమ్మంటే అనురాగం కవిత రచయిత్రి శ్రీమతి సోమంచి ఉషారాణి, “ పాత చీరల్ని బొంత -- " కవిత ప్రముఖ కవి పండితులు డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి గారు. వీరిద్దరికీ నా కృతజ్ఞతలు -- రచయిత.)

***

 

No comments:

Post a Comment

Pages