కరుణ విజయపథం - అచ్చంగా తెలుగు
కరుణ విజయపథం
రవికుమార్ పీసుపాటి

ఎప్పట్లాగానే ఆలస్యంగా బడికి వచ్చిన కరుణని చూసి దివాకరం మాస్టారు చెప్పే పాఠాన్ని ఆపేసి "ఈరోజు కూడా ఆలస్యంగా  వచ్చిన నీకు తరగతిలో ప్రవేశం లేదు, బయటే నిలబడు" అని తనమానాన పాఠాన్ని చెప్పుకుంటూ పోతున్నారు. పాపం కరుణ మారుమాట్లాడక అలానే ఏడుస్తూ బయటే నిలబడింది.

అటువైపుగా వెళుతున్న ప్రధానోపాధ్యాయుడు గుర్నాథం గారు తరగతి బయట ఏడుస్తూ నిలబడిన కరుణను పక్కకి పిలిచి "ఎందుకమ్మా రోజూ ఆలస్యంగా పాఠశాలకొస్తున్నావు?" అని అడిగారు. భయంతో వణికిపోతున్న కరుణని చూసి "నేనేమి అనను. భయపడకుండా విషయాన్ని చెప్పు" అని అడిగారు. 

"నాకు చిన్నతనంలోనే తల్లి చనిపోయింది.నన్ను చూసుకోవటానికి ఇంకో ఆడమనిషి కావాలని, మా నాన్న రెండో పెళ్ళి చేసుకున్నారు. మా పిన్నికి నన్ను బడికి పంపటం ఇష్టంలేదు. అందుకని బడికి బయలుదేరే సమయానికే బజారుకి వెళ్ళి ఆ సరుకులు తీసుకురా, ఈ కూరగాయలు తెచ్చిపెట్టు అని ఏదో ఒక పని పురమాయిస్తుంది. బడికి వెళ్ళే సమయం అయిపోతోంది. నేను వెళ్ళను అని ఎదురు చెపితే బాగా తన్ని ఆ రోజంతా తిండి పెట్టదు మాష్టారూ! అందుకే నాకు ఆలస్యం అవుతోంది" అని ఏడ్చేసింది కరుణ.

"ఏడవకు కరుణ.. చూడూ! ప్రతీ సమస్య వెనుక ఒక సమాధానం, ప్రతీ కష్టానికి ఒక సుఖం ఎప్పుడూ ఉంటుంది. నీవెలాగూ చాలా తెలివైన దానివి. నేను చెప్పిన ఈ మాటను నువ్వు అర్థంచేసుకుని దీనిని ఎలా అవకాశంగా మార్చుకోవచ్చో ఆలోచించుకొని ఇక నుంచి బడికి ఆలస్యంగా రావద్దు. వెళ్ళు! దివాకరం మాస్టారికి నేను చెప్పానని చెప్పి ఈరోజుకి వెళ్ళి తరగతిలో కూర్చో" అని చెప్పి పంపించేసారు.

కరుణ మనసులో గుర్నాథం గారి మాటలు బలంగా నాటుకుపోయాయి. ఏం చేయాలా! అని ఆలోచించింది. మరునాడు పిన్ని ఎప్పటిలాగానే పనులు చెప్పటం మొదలుపెట్టింది. కరుణ వాళ్ళ నాన్నని అడిగి ఒక “స్టాప్ వాచ్” ని కొనిపించుకుంది. ప్రతీ పనికి ఇంత వ్యవధి లో రావాలి అనుకుంటూ పరిగెత్తటం మొదలు పెట్టింది. ఇలా రోజూ సాధన చేసింది. సమయానికి బడికి హాజరు అవుతోంది. పాఠాలు బాగా విని తరగతిలో మొదటి స్థానంలో ఉంటోంది.

ఒకరోజు బడిలో రాష్ట్ర స్థాయి పరుగుపందెం పోటీ లో పాల్గొనడానికి ఇష్టం ఉన్న వాళ్ళ పేర్లు ఇమ్మన్నారు. కరుణ తన పేరుని నమోదు చేసుకుంది. వాళ్ళ పిన్నిని బ్రతిమిలాడుకుని పోటీలో పాల్గొని రాష్ట్ర స్థాయి లో ప్రథమంగా నిలిచింది. కరుణ పరిగెత్తిన వేగానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ చాలా ఆశ్చర్యపోయారు. కరుణకి  గవర్నర్  బహుమతి ని అందిస్తూ-"నీకు ప్రత్యేకంగా నా డబ్బులతో శిక్షణ ఇప్పిస్తాం. అంతర్జాతీయ పోటీ లకు వెళతావా!" అని అడిగారు. కరుణ ఆనందంగా ఒప్పుకుంది. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పోటీ లో పాల్గొని స్వర్ణ పతకాన్ని గెలుచుకొని దేశానికి మంచి పేరు తెచ్చింది.

విలేఖర్లు కరుణని పొగుడుతూ, "నీ విజయానికి కారణం ఎవరు" అని అడిగితే.. "మా పిన్నే నా విజయానికి కారణం.నాకు పరిగెత్తే అవకాశం ఇచ్చింది" అని చెప్పగానే..  చెమర్చిన కళ్లతో  కరుణా వాళ్ల పిన్ని "నువ్వెంత మంచిదానివమ్మా.నేను ఎన్ని హింసలు పెట్టినా నువ్వు కష్టపడి పేరు తెచ్చుకొని , అందరి ముందూ నన్ను గొప్పదానివిగా నిలబెట్టావు. నన్ను క్షమించమ్మా!" అని కరుణని అక్కున జేర్చుకొని భోరున ఏడ్చేసింది.

"ప్రతీ సమస్య వెనుక ఒక సమాధానం ఉంటుంది.దానిని మనం తెలివిగా మలచుకోవటంలోనే నిజమైన సమాధానం." మీరేమంటారు?

***

No comments:

Post a Comment

Pages