నెత్తుటి పువ్వు - 32 - అచ్చంగా తెలుగు

నెత్తుటి పువ్వు - 32

మహీధర శేషారత్నం 


“హాయ్! ఏమన్నావు? ఏమన్నావు? ఇంకోసారి అను” అంటూ హఠాత్తుగా మీదపడి నాగరాజు బుగ్గమీద ముద్దుపెట్టుకుంది.

ఆ అమ్మాయి కళ్ళల్లో హఠాత్తుగా నీళ్ళు తిరిగాయి. “చాలు, నాకు ఆ గొలుసు కంటే ఈ మాట గొప్పది 

“పిచ్చీ! నువ్వు సొసైటీ అంగీకరించినా, అంగీకరించక పోయినా నా భార్యవే.” 

ఆ పొట్లం లోంచి చిన్న గంటపుస్తెలు తీసి గొలుసులో వేసి మెడలో వేసాడు. 

“ఇంత మంచివాణ్ణి దేవుడు అచ్చం నాకే ఎందుకిచ్చేయ్యలేదో, దేవుడితో పోట్లాడాలి.” సంబరంగా అంది సరోజ.

సరోజ నాగరాజు భుజం చుట్టూ చేతులేసి ఆనుకు కూర్చుంది. ఇంత ఖర్చెందుకు పెట్టావు? ముందు ఖర్చుండగా... ఆరాగా అడిగింది.

రేపు డెలివరీకి హాస్పటల్ లో చేరినా నలుగురు నిన్ను చిన్నచూపు చూడకూడదని, అసలు ఇంతవరకు నీకు నేను ఏమీ ఇవ్వలేదు. చీటీ పాడాను కొనాలనిపించింది కొనేసాను.”

చాలా అయి ఉంటుంది. 

ఊఁ! చీటీ పాడాను కొంచెం అప్పుచేసాను. 

లక్ష్మికి ఒకటి, నీ కొకటి కొన్నాను. “నాగరాజు తన ధోరణిలో తాను చెప్పుకుపోయాడు. 

సరోజ ఆనందం, సగానికి తగ్గింది, లక్ష్మి కొకటి, అనే సరికి.

తనకే ప్రత్యేకంగా అనలేదుగా అనుకొంది మనసులో కాని అతని భార్య కదా! అని సర్ది చెప్పుకుంది. కాని ఒక వెలితి ప్రవేశించింది మనసులో.

పైకి మాత్రం ఏం మాట్లాడలేదు.

“లక్ష్మి బండి కొనుక్కో అని ఎప్పుడూ గోలపెడుతూ ఉంటుంది. అవసరం లేనప్పుడు ఎంతైనా ఇనప ముక్కలమీద ఖర్చుపెట్టడం నాకు ఇష్టం ఉండదు. అవసరానికి ఆదుకునేది బంగారమే. ఈజీ లిక్విడిటీ ఉంటుంది కదా! తన ధోరణిలో తాను చెప్పుకుపోయాడు.

లక్ష్మి... లక్ష్మి... అస్తమానం అనుకుంది మనసులో.

పైకి తెచ్చు కోలునవ్వుతో అంది. 

“సరే కాని సినిమాకు ఎప్పుడెడదాం?” 

“మూడు, నాలుగు రోజులలో వెడదాం! సరేనా?” 

ఉత్సాహంగా అన్నాడు. 

“ఏ సినిమానో నువ్వే సెలక్ట్ చెయ్యి, ఛాయస్ నీదే! కోరిక నీదే కదా మరి!” పెద్దగా నవ్వాడు. 

సరోజ కాస్త మళ్ళీ మంచి మూడ్లోకి వచ్చింది.

“మందులు వాడుతున్నావా? పాలు తాగుతున్నావా? బాయిల్డ్ ఎగ్ తిను మంచిగా తింటే మంచి కొడుకు పుడతాడు మరి “ఊఁ! నుదురు ఢీ కొట్టాడు.

******

లక్ష్మి కొడుకుతో కలిసి సినిమాకు వెడదామంది. ఆవిడకున్న ఏకైక ఇష్టం అదొకటే. టి.వి.లో చూసినా చూసినట్టుండదు. నెలకో సినిమా హాలులో చూడాలి, మధ్యలో పాప్ కార్న్ తినాలి. ఏమైనా అంటే అందరూ ఇంట్లో కూర్చుని టి.వి.లో చూస్తే సినిమా హాళ్ళేమయిపోవాలి. వాళ్ళెలా బతకాలి అంటుంది. వాళ్ళు బతకడం కోసమే తను సినిమాలు చూస్తున్నట్టు. నాగరాజు సాధారణంగా కాదనడు. ఎందుకంటే లక్ష్మి ఖరీదైన చీరలు, నగలూ కోరదు ఇంత చిన్న కోరిక కాదనడమెందుకు? అనుకుంటాడు.

లక్ష్మి అలా అనగానే సరోజ కోరిక గుర్తొచ్చింది. సరోజని కూడా రమ్మంటే పోలా? అనుకున్నాడు. రిక్షాలాగే సోమయ్య బాగా తెలుసు. అతన్ని పంపి సరోజని హాలు దగ్గరికి తీసుకు రమ్మన్నాడు. భార్యని కొడుకుని సీట్లలో కూర్చోబెట్టి బయట నుంచున్నాడు. సరోజ ఉత్సాహంగా వస్తూ కనపడింది. అది చూసాక తను చేసినదెంత తెలివితక్కుపనో అర్ధమయింది నాగరాజుకి. దగ్గరికెళ్ళి లక్ష్మి వచ్చినట్టు మెల్లిగా చెప్పాడు గాలి తీసినట్టయింది.

చేసేదిలేక మెల్లిగా అతని వెనకే వెళ్ళి, మౌనంగా పక్క సీట్లో కూచుంది. యాడ్స్ మొదలయ్యాయి. లక్ష్మి, బుజ్జిగాడు వదలకుండా చూస్తున్నారు. నాగరాజుని చూసి “యాడకి పోయావ్!” అంటూ ఆ పక్కన సరోజ కూర్చోవడం చూసి పరాయి ఆడపిల్ల పక్కన యిబ్బంది పడతాడేమోననుకుంటూ “నేనటురానా? నువ్వు ఇటు మారతావా?” అంది. “అక్కర్లేదు, బాగానే ఉంది. కూర్చో అన్నాడు. లక్ష్మి ఇంకేం మాట్లాడలేదు. తెరవైపు తిరిగిపోయింది. సరోజ కాస్త తృప్తిపడింది. సినిమా బిగనయ్యాక నాగరాజు చేతిమీద చెయ్యివేసింది. నాగరాజు ఇబ్బందిగా కదిలాడు. కాని చెయ్యి తీసెయ్యలేదు. లక్ష్మి, బుజ్జిగాడు సినిమాలో లీనమైపోయారు. సరోజ అన్యమనస్కంగానే సినిమా చూసింది. తనకిష్టమైన మహేష్ బాబు సినిమా టైనా అంత ఆకట్టుకోలేదు.

ఇంటర్వెల్లో నాగరాజు కూల్డ్రింక్స్ తెచ్చాడు. మెల్లిగా సినిమా బిగినయ్యాక తనచేతిలో బాటిల్ సరోజ కిచ్చాడు. సరోజ దానికే సంబరపడింది. సినిమా ఇంకా రెండు నిమిషాలుండగానే సరోజని రిక్షా ఎక్కించాడు జాగ్రత్తలు చెపుతూ సినిమాలో లీనమైన లక్ష్మి ఇదేం గమనించలేదు.

సరోజ ఈ సంఘటనతో కొంత అసంతృప్తికి లోనైంది. నాగరాజు గమనించినా గమనించనట్టు ఉండక తప్పలేదు.

ఏమైనా ఒకసారి సరోజకి తృప్తిగా, సంతోషం కలిగేట్టు ఏదైనా ఒక ట్రిప్పు ఒకటి రెండు రోజులు గడిపేట్టు వెయ్యాలని అనుకున్నాడు. అది కాస్త దూరమైతే ఎవరికీ తెలియదు ఇబ్బంది ఉండదు అనుకున్నాడు. సరోజతో చెప్పలేదు.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages