శ్రీరుద్రంలో విశేషాలు - 2
శ్రీరామభట్ల ఆదిత్య
వందే సర్వజగద్విహారమతులం వందేఽంధకధ్వంసినం, వందే దేవశిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభమ్ । వందే క్రూరభుజంగభూషణధరం వందే శివం చిన్మయం, వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ ॥
శ్రీరుద్రంలోని నమకభాగంలో మొత్తం 11-పదకొండు అనువాకాలు ఉన్నాయి. 'నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః' అనే మంత్రంతో నమకం మొదలౌతుంది. ఇక నుండి మనం ఒక్కో అనువాకంలో స్థూలంగా ఏం చెప్పారో చూద్దాం.
మొదటి అనువాకం:
'నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః' అనే మంత్రంతో ఈ అనువాకం ప్రారంభం అవుతుంది. అంటే 'ఓ మన్యు! నీకు, నీ బాణములకు నా నమస్కారములు' అని అర్థం. ఇందులో పరమేశ్వరుడిని 'మన్యు' అని సంబోధిస్తారు. ఎందుకంటే భాగవతపురాణంలో 3వ స్కంధంలోని చెప్పబడిన ఏకాదశ రుద్రులలో 'మన్యు' మొదటివాడు.
ఈ అనువాకంలో మొత్తం 16-పదహారు మంత్రాలున్నాయి. ఇందులో సాధకుడు రుద్రుడిని తన ఉగ్రరూపాన్ని శాంతపరచుకొని, తనని కాపాడమని, తన పాపాలను పరిహరించమని వేడుకుంటాడు. ప్రధానంగా తనను అన్నివిషయాలలో పురోగమించేలా చూడమని ప్రార్థిస్తాడు. ఈ అనువాకాన్ని రోగపీడ, భూతపీడల నుండి రక్షణకోసం విశేషంగా పఠిస్తారు.
రెండవ అనువాకం:
'నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్-మహాదేవాయ నమః'. అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ మంత్రంతో రెండవ అనువాకం ప్రారంభం అవుతుంది. ఇందులో మొత్తం 13 మంత్రాలు ఉన్నాయి. ఈ అనువాకంలో ప్రతి మంత్రంయొక్క మొదట ఇంకా చివర 'నమః' అని ఉండడం చేత వీటిని 'ఉభయతః నమస్కార మంత్రాలు' అని అంటారు.
ప్రకృతిలో ఉన్న పరమేశ్వరతత్త్వాన్ని ఈ అనువాకంలో చూడవచ్చు. రుద్రుడిని ఔషధ మొక్కలుగా, వివిధ ప్రకృతి రూపాలలో వర్ణించి, పరమేశ్వరుడి అనేకానేక గుణాలు కీర్తించారు ఇందులో. తనను సంసారబంధాల నుండి విముక్తుడిని చేయమని కూడా సాధకుడు కోరతాడు. శత్రునాశనంకోసం, ధనప్రాప్తికై, రాజ్రప్రాప్తికై ఈ అనువాకం పఠిస్తారు.
( ఇంకా వుంది )
No comments:
Post a Comment