పురాణ కధలు - బసవ పురాణం - 12 - అచ్చంగా తెలుగు
 పురాణ కధలు - బసవ పురాణం -12 

  పి.యస్.యమ్. లక్ష్మి


12  గొడగూచి కధ

 పూర్వం శివదేవుడనే శివ భక్తుడు వుండేవాడు.  ఆయన ప్రతి రోజూ పాలు తీసుకెళ్ళి ఆలయంలో వున్న శంకరుడికి సమర్పించి వచ్చేవాడు.  ఒకసారి ఆయనకీ, ఆయన భార్యకీ అవసరమైన పని మీద వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది.  తమ  కూతురు గొడగూచి ఒకతే ఇంట్లో వుండవలసి వచ్చింది.  ఆమెని పిలిచి అన్ని జాగ్రత్తలూ చెప్పి ఆలయంలో శివునికి ఏ రోజూ పాలు ఇవ్వటం మర్చిపోవద్దని, తాను రోజూ తీసుకువెళ్ళే కొలపాత్ర చూపించి, దాని నిండా పాలు తీసుకెళ్ళి రోజూ శివుడికి సమర్పించటం మర్చిపోవద్దని, ఆ పని అయ్యాకే మిగతా పనులేమైనా వుంటే చూసుకోమని, శివుడికి ప్రతి రోజూ పాలు సమర్పించకపోతే తాను వూరుకోనని కూడా గట్టిగా చెప్పాడు.  గొడగూచి కూడా తాను తప్పక తల్లిదండ్రులు చెప్పిన పనులన్నీ చేస్తానని చెప్పింది.   వారు ఊరు వెళ్ళారు.
 

మర్నాడు గొడగూచి పొద్దున్నే స్నానం చేసి పాలు పితికి, వాటిని చక్కగా కాచి, తండ్రి చూపించిన పాత్ర నిండా పోసి దానిని ఆలయానికి తీసుకువెళ్ళి శివుడి ముందు పెట్టి తాగమని ప్రార్ధించింది.  కొంచెం సేపు చూసి తనక్కడ వుంటే తాగటం లేదని బయటకి వెళ్ళి కూర్చుంది.
 

కొంచెం సేపయ్యాక వచ్చి చూస్తే పాలట్లాగే వున్నాయి.  శివుణ్ణి పరి పరి విధాల బతిమాలింది.  రోజూ మా నాన్న ఇస్తే తాగేవాడివి ఇవాళ ఎందుకు తాగవు?  నేను చిన్న పిల్లననా?  పాలు శుభ్రంగా తీశాను. చక్కగా కాచాను.  నాన్న చెప్పిన పాత్రలోనే తీసుకు వచ్చాను.  నాన్న తెచ్చేదానికన్నా కొంచెం కూడా తక్కువ కాలేదు.  కావాలంటే చూసుకో.  దోవలో కూడా ఒక్క బొట్టుకూడా కింద పోకుండా చాలా జాగ్రత్తగా తెచ్చాను.  నేనింత శ్రధ్ధ తీసుకున్నా నేను తెచ్చిన పాలు నువ్వెందుకు తాగటం లేదు.  నువ్వీ పాలు తాగక పోతే నాన్న వచ్చాక విషయం తెలుసుకుని నన్ను బాగా కొడతాడు.  నేనా దెబ్బలు భరించలేను.  అందుకని నువ్వు నాకోసమన్నాఈ పాలు తాగాల్సిందే.  అని పట్టు పట్టి కూర్చుంది.  ఆ అమాయకురాలు రోజూ తన తండ్రి సమర్పించే పాలు శివుడు తాగుతున్నాడనుకుంది.
 

అంత వేడుకున్నా శివుడు పాలు తాగక పోయేసరికి నేను చిన్నపిల్లనని నేను తెచ్చిన పాలు నువ్వు తాగటంలేదుకదా. లేక పంచదార వెయ్యలేదనా?  నాన్న నాకు పంచదార సంగతి చెప్పలేదు.  అందుకే వెయ్యకుండా తీసుకువచ్చా.  నీకు కావాలంటే చెప్పు.  పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి క్షణంలో తెస్తాను.  ఎట్లా అయినా నువ్వీ పాలు తాగాల్సిందే.  లేకపోతే నాన్న వచ్చాక నాకు దీనికి చాలా పెద్ద శిక్షే వేస్తాడు.  బాగా కొడతాడు. ఆయన చేతుల్లో దెబ్బలు తిని చచ్చిపోయే బదులు నేను నీ దగ్గరే మరణిస్తాను అని శివ లింగానికి తల కొట్టుకోసాగింది.  భోళా శంకరుడు లింగంలోంచి రెండు చేతులూ బయట పెట్టి ఒక చేతితో పాల గిన్నెలో పాలు ఒక్క చుక్కగూడా మిగల్చకుండా ఖాళీ చేశాడు, రెండో చేత్తో ఆ పాప తల కొట్టుకోకుండా ఆపాడు.  గొడగూచి కూడా శివుడు పాలు తాగాడని సంతోషంగా ఇంటికెళ్ళింది.
 

కొన్ని రోజులు రోజూ అలాగే జరిగింది.    ఒక రోజు గొడగూచి ఖాళీ పాల దుత్తతో ఇంటికి వస్తుండగా అదే దారినే వూరునుంచి వస్తున్న తల్లిదండ్రి కలిశారు.  దుత్తలో పాలేమయినాయని తండ్రి అడిగితే సంతోషంగా శివుడు తాగాడని చెప్పింది గొడగూచి.  తండ్రి నమ్మలేదు.  రాతి శివుడు పాలు తాగటమేమిటని నిలదీశాడు.  ఆ పాలేంచేశావు చెప్పు?   మీ స్నేహితులకిచ్చావా?  లేకపోతే నువ్వే తాగావా? నిజం చెప్పమని గద్దించాడు.  ఎంత అడిగినా గొడగూచి సమాధానం ఒకటే. 
 

విసిగిపోయిన తండ్రి మర్నాడు గుడికెళ్ళి నిజం తెలుసుకోవచ్చని ఆ రోజుకి వూరుకున్నాడు.  మర్నాడు గొడగూచి చేతే పాలు కాయించి తీసుకెళ్ళారు.  ఎంత సేపు చూసినా శివుడు పాలు తాగలేదు.  మనం వున్నామని తాగటంలేదు,  మనం బయటకి వెళ్దామని తండ్రిని బయటకి తీసుకువచ్చింది.  కొంచెం సేపు తర్వాత చూస్తే పాలన్నీ అలాగే వున్నాయి.  తండ్రికి చాలా కోపం వచ్చి గొడగూచి అన్నీ అబధ్దాలే చెబుతోందని ఆ అమ్మాయిని శివుడి ఎదురుగానే బాగా కొట్టసాగాడు.  గొడగూచి చిన్న పిల్ల.  ఆ దెబ్బలు తట్టుకోలేక శివ లింగం మీద వాలింది.  లింగం రెండుగా బద్దలయ్యి మాటలు వినిపించాయి.  నీకేం భయం లేదు.  నువ్వు నా దగ్గరే వుందువుగానీ రా అని.  గొడగూచి ఆ లింగం మధ్యలోకి వెళ్ళటం తండ్రి చూసి తాను తప్పు చేశాడేమోననే భయంతో గొడగూచిని ఇవతలకి లాగటానికి ప్రయత్నంచాడు.  కానీ అప్పటికే ఆ అమ్మాయి సాంతం శివలింగం లోపలకి వెళ్ళి పోయింది.  వాళ్ళ నాన్న చేతికి మాత్రం గొడగూచి జుట్టు కొంచెం చిక్కింది.  దానికి సాక్ష్యంగా ఇప్పటికీ ఆ ఆలయంలో శివలింగానికి జుట్టు వుంటుందనీ, అది పెరుగుతూ వుంటుందనీ, అందుకే ఆరు నెలలకొకసారి పెరిగిన జుట్టును కత్తిరిస్తారని చెబుతారు.

 
ఇన్ని చెప్పారుగానీ, ఆ ఆలయం పేరేమిటో, ఎక్కడ వుందో చెప్పలేదు.

 
గొడగూచికి భక్తి, దేవుడు ఏమిటో తెలియకపోయినా, తండ్రి మాట కోసం దేవుణ్ణి అంత అమాయకంగా నమ్మి, ఆ దైవాన్నే చేరుకుంది చూశారా!

***

No comments:

Post a Comment

Pages