పురాణ కధలు - బసవ పురాణం - 13
పి.యస్.యమ్.లక్ష్మి
దీపకదళియారు కధ
భక్తి అనేక విధాలని పురాణ కధలు చదువుతూంటే తెలుస్తుంది. కొందరయితే తమ తనువూ, మనస్సూ తాము నమ్మిన దైవానికే సమర్పించి తమ ధ్యాస కూడా లేకుండా ఆ భగవంతుణ్ణీ కొలిచి పునీతులవుతారు. మనం బసవ పురాణం ద్వారా అలాంటి భక్తుల కధలు తెలుసుకుంటున్నాము. ఇప్పుడుకూడా దైవం గురించి తప్ప తన గురించి ఆలోచించని ఒక అమాయక భక్తుడు .. పేరు .. దీపకదళియారు .. ఆయన కధ చెప్పుకుందాము.
కంబ అనే పట్టణంలో దీపకదళియారు అనే ఒక శివ భక్తుడు వుండేవాడు. అతడొకసారి వేరే పనిమీద ఇంకొక గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది. దోవ మధ్యలో ఒక అడవి, దానిలో ఒక పాడుబడ్డ శివాలయాన్ని చూశాడు. అది చూసి ఆయన ఆలోచనలు పరిపరి విధాల పోయాయి. ‘ఇదేమి వింత! శివుడీ అరణ్యం మధ్యలో వున్నాడు. శత్రువుల వల్ల ఇతనికేమి అపాయం వస్తుందో!? అసలే ఎప్పుడూ త్రిపురాసురులు వగైరా పెద్ద పెద్ద రాక్షసులతోనే శత్రుత్వమేర్పరచుకొని వాళ్ళని చంపేస్తూ వుంటాడు. ఈయనకేమో దయాళువు అని పెద్ద పేరు. మరి ఇలాంటి రాక్షసులని చంపి వాళ్ళ వాళ్ళతో విరోధం తెచ్చుకోవటం ఎందుకు? రాక్షసులు బలవంతులు. వారితో విరోధము మంచిది కాదు. అట్టి విరోధధులు కల ఇతడు కారు చీకట్లు కమ్మే ఇలాంటి దట్టమైన అడవిలో ఎవరి సహాయమూ లేకుండా ఒక్కడూ వుండవచ్చునా? పైగా ఈ గుడి కూడా శిధిలమైంది. గోడలు గట్టిగా లేవు. తలుపులు, ద్వార బంధములు లేవు. చుట్టూ ప్రాకారము కూడా లేదు. పార్వతీ దేవి వుండే చోటు కూడా లేదు. ఇలాంటి పాడుబడిన గుడిలో ఏ పూజా పునస్కారం లేకుండా ఇట్లా వుండే అవసరం ఈయనకేం వచ్చింది’ అనుకున్నాడు.
కొంచెం ఆలోచించి సరే, ఇక్కడ ఒక పెద్ద గోపురముతోను, చుట్టు ప్రాకారముతోను, నేనే పట్టుపట్టి ఒక మంచి ఆలయము నిర్మించెదను అనుకొని తిరిగి తన గ్రామమునకు పోయి తన ఆస్తినంతను అమ్మి, ఆ డబ్బు తీసుకువచ్చి అక్కడ ఒక గొప్ప ప్రాకారము కట్టించి దాని మధ్య ఒక పెద్ద ఆలయము అన్ని హంగులతోను నిర్మించి, పార్వతీ దేవికి కూడా ప్రత్యేకించి ఆలయం నిర్మించాడు. అంతేకాదు అక్కడ పూజలు యధావిధిగా జరపటానికి కావలసిన వారిని నియోగించి వారికి ఇళ్ళు కట్టించి, దుకాణాలను ఏర్పాటు చేసి, అన్ని రకాల వృత్తులవారిని ఏర్పాటు చేసి ఒక ఊరే నిర్మించాడు. తాను ధర్మకర్తగా వుండి పూజలు సక్రమంగా జరిపించేవాడు. అలా కొన్నేళ్ళు గడిచింది. తర్వాత డబ్బులన్నీ అయిపోయి, అందరికీ ఇవ్వవలసిన నెల బత్తెములను సకాలంలో ఇవ్వక పోవటంతో ఆలయంలో కొలువుకి నియమింపబడ్డవారంతా మానుకున్నారు. దీపకదళియారు కొన్నాళ్ళు వున్నంతలో గ్రామస్తులచేతనే పూజలు నిర్వహింపచేశాడు. కొన్నాళ్ళకి వాళ్ళూ ఇవ్వన్నీ మానుకుని ఊరు విడిచి వెళ్ళిపోయారు. అయినా దీపకదళియారు తన పట్టు విడవలేదు. తానే స్వయంగా పూజ చేసేవాడు. కొన్నాళ్ళకి పూజా ద్రవ్యాలు లేకపోయినా రాత్రింబగళ్ళు అఖండ జ్యోతి వెలిగేటట్లు మాత్రం చేసేవాడు.
కొన్నాళ్ళకి దీపానికి నూనె దొరకటం కూడా కష్టమయింది. అప్పుడాయన చుట్లపట్లనున్న చెట్లు కొట్టి తెచ్చి కాల్చుచు దీపపు కాంతి కలుగచేసేవాడు. అవి కూడా అయిపోయాక తాను కట్టించిన ఇళ్ళయొక్క పై కప్పును, దూలములు, వాసములు, ద్వార బంధములు, ఏ చెక్క దొరికితే దానిని తీసుకొచ్చి దీపంలాగా వెలిగించేవాడు. కొన్నాళ్ళకి అవి కూడా అయిపోయాయి. తానొక్కడే మిగిలాడు. స్వామి ఆలయములో దీపము లేదు. అదే అతని చింత. అప్పుడతనికి ఒక ఆలోచన వచ్చింది. తన జుట్టంతా పైకి కట్టుకుని దాని కొనలకు నిప్పంటించి అది వెలుగుతుండగా గుడి చుట్టూ తిరగసాగాడు.
వెండ్రుకలు కాలి, తలలోని మెదడంటుకొని కాలుచుండి వెలుగుచున్నను ఆయనకి తెలియక అలాగే తిరగసాగాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై, నీ భక్తికి మెచ్చితిని, వరమడగు అనగా మన భక్తాగ్రేసరుడు నాకే వరమక్కరలేదు. మనమీ అరణ్యంలో వుండద్దు. పద పోదాం. ఈ ఆలయంతో సహా కైలాసానికి వెళ్దాం అన్నాడు. అది విని శివుడు తన భక్తుని కోరిక తీర్చటానికి ఆ ఆలయముతో సహా అతనిని కైలాసమునకు తీసుకుపోయెను.
శివుణ్ణి అంతగా ఆరాధించి, ఆయన గురించే జీవించి, చివరికి వరమడగమన్నా తనకోసం కాక ఆయన కోసమే అడిగిన దీవకదళియారు కధ వల్ల నిస్వార్ధంగా భగవంతుణ్ణి సేవించినవారికి దక్కని వరాలుండవు అని తెలుస్తోంది కదా.
***
No comments:
Post a Comment