విలువలు
డాక్టర్ . బీ. యన్ . వీ. పార్ధసారధి
రంగయ్య తిరుపతి లో కొండ మీద ఒక పెద్ద హోటల్ లో క్లీనర్ గా పనిలో చేరాడు. రంగయ్య నిజాయితీ, పనితనాన్ని గుర్తించి హోటల్ యజమాని ఏడుకొండలు అతనికి అంచలవారీగా బాధ్యతలతో పాటు, జీతం కూడా పెంచాడు. కొన్నాళ్లకే యజమాని లేనప్పుడు కాష్ కౌంటర్ దగ్గర కూర్చునే హోదాకి ఎదిగాడు రంగయ్య.
తమతో పాటే చేరిన రంగయ్య తమకన్నా ఎక్కువ స్థాయికి తక్కువ కాలంలో ఎదగడం మిగతా పనివాళ్ళకి మింగుడు పడలేదు. రంగయ్య ని ఎలా ఇబ్బంది పెట్టాలా అనే అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఒకరోజు యజమాని లేనప్పుడు రంగయ్య కాష్ కౌంటర్ లో కూర్చుండగా లెక్కల్లో తేడా వచ్చింది. అది పెద్ద మొత్తం అవటం మూలాన యజమాని ఏడుకొండలు వెంటనే రంగయ్య ని పనిలోంచి తొలగించాడు. తాను తప్పు చేయలేదని రంగయ్య కి తెలుసు. ఆరోజు హోటల్ లో ఒక కస్టమర్ సర్వర్ తో గొడవ పడ్డాడు. పరిస్ధితి శృతి మించి రాగాన పడుతుండటం తో రంగయ్య వెంటనే కాష్ కౌంటర్ నుంచి వచ్చి ఆ కస్టమర్ ని కొంత సేపటికి సముదాయించాడు. అతను అప్పుడు డబ్బులువున్న డ్రాయర్ సొరుగు కి తాళం వేయటం మరచాడు. ఇదంతా కేవలం మూడు, నాలుగు నిమిషాలకంటే ఎక్కువ సేపు ఉండదు. ఎప్పుడైతే కాష్ లో పెద్ద మొత్తం తేడా వచ్చిందో , తాను కాష్ కౌంటర్ లో లేని ఆ మూడు, నాలుగు నిమిషాలలో ఎవరో హస్తలాఘవం ప్రదర్శించారని రంగయ్య గ్రహించాడు. కానీ ఈ సంగతి యజమాని ఏడుకొండలుతో చెప్పలేదు. తన మీద ఎంతో నమ్మకం తో వున్న యజమాని తనని శంకించడం తో రంగయ్య మనస్తాపం చెంది మౌనంగా వుండిపోయాడు.
ఈ సంఘటన జరిగిన ఒక వారానికి రంగయ్య పొట్టకూటి కోసం ఏడుకొండలు హోటల్ కి ఎదురుకుండా ఒక చిన్న టీ దుకాణం ప్రారంభించాడు. రెండేళ్లలో కాఫీ, టీ లతో పాటు, టిఫిన్లు, భోజనం కూడా జత కావడంతో ఆ టీ దుకాణం పెద్దదై, నలుగురు హెల్పర్లని కూడా పనిలో పెట్టుకున్నాడు రంగయ్య. ఉదయం అయిదు గంటల్నుంచి రాత్రి పది గంటలవరకు మొదట్లో నడిచే రంగయ్య దుకాణం ఇప్పుడు రాత్రి పన్నెండు గంటలవరకు కస్టమర్లతో రద్దీగా ఉంటోంది.
ఇంతలో కరోనా మహమ్మారి వ్యాపించటంతో గుడికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గింది. పెద్ద దుకాణాలు, పెద్ద హోటళ్లు ఆదాయం లేక మూసేసారు. ఏడుకొండలు కూడా గత్యంతరం లేక నష్టాలు భరించలేక హోటల్ మూసేసాడు. హోటల్ వ్యాపారం బాగా వున్న రోజుల్లో వచ్చిన లాభాలతో ఒక మిత్రుడితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు ఏడుకొండలు. కరోనా సాకుతో ఆ మిత్రుడు నష్టాలని చూపించి మోసం చేయటంతో చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కు తోచని పరిస్ధితిలో నీరుగారిపోయాడు ఏడుకొండలు. ఈ సంగతి తెలిసిన రంగయ్య ఏడుకొండలుని కలిసి అతనిని తనతోనే తన హోటల్ లో వుండమన్నాడు. ఎంతైనా తనకి ఒకప్పటి యజమాని కాబట్టి ఏడుకొండలు ని కాష్ కౌంటర్ లో కూర్చోబెట్టి తాను మిగతా ఆజమాయిషీ చేయడం మొదలుపెట్టాడు రంగయ్య.
రంగయ్య ఒకరోజు వేరే పనిమీద బయటికి వెళ్ళాడు. ఆ రోజంతా ఏడుకొండలు పూర్తిగా హోటల్ బాధ్యతలు చూసుకున్నాడు. రాత్రి పది గంటల సమయం లో రంగయ్య హోటల్ కి వచ్చాడు. ఏడుకొండలు చాలా దిగులుగా , ఆందోళనగా కనిపించడంతో ఎదో కీడు జరిగిందని రంగయ్య కంగారు పడ్డాడు. ఆ రోజు ఆదాయంలో దాదాపు సగానికి సగం తేడా వచ్చింది. ఈ సంగతి రంగయ్యకి ఎలా చెప్పడమా అని ఏడుకొండలు తటపటాయిస్తున్నాడు. అసలు విషయం తెలుసుకున్న రంగయ్య ఏడుకొండలుని పల్లెత్తు మాట అనలేదు. పైగా రంగయ్య ఏడుకొండలుని ఓదార్చాడు.
మర్నాడు రంగయ్య హోటల్ లో పనిచేసే ఒక కుర్రాడు పనిలోకి రాలేదు. రెండో రోజు కూడా ఆ కుర్రాడు పనిలోకి రాకపోవటం తో రంగయ్య కూపీ లాగితే ఆ కుర్రాడే హోటల్ లో డబ్బు కాజేశాడని తెలిసింది. తన మీద ఎటువంటి నింద రాకపోవటంతో ఏడుకొండలు ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు గతం లో రంగయ్య తనదగ్గర పనిచేస్తున్నప్పుడు జరిగిన నగదు దొంగతనం సంఘటన గుర్తుకి వచ్చింది ఏడుకొండలుకి. రంగయ్య ని తాను పనిలోంచి తీసేసిన పది రోజులకి తెలిసింది ఆ దొంగతనం రంగయ్య చెయ్యలేదని , రంగయ్య అంటే గిట్టని హోటల్ లో పనిచేసే ముగ్గురు క్లీనర్లు కలిసికట్టుగా ఆ నగదుని కాజేశారని. అప్పటికే రంగయ్య తన హోటల్ కి ఎదురుగుండా టీ దుకాణం పెట్టాడు. రంగయ్య ని మరలా తనదగ్గర పనిలోకి రమ్మనమని అడగటానికి తన అహం అడ్డు రావటం తో అప్పట్లో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు ఏడుకొండలు.
ఏడుకొండలు ఏదో దీర్ఘం గా ఆలోచిస్తున్నట్టు పసికట్టిన రంగయ్య అతనిని ఉద్దేశించి , " చిన్నప్పుడు మా అమ్మమ్మ అంటూ ఉండేది. నిజం నిలకడ మీద తెలుస్తుందని. సమస్యలు వచ్చినప్పుడు మన తొందరపాటు చర్యలవల్ల మనుషులపైన అనుమానాలు, అపోహలతో సంబంధాలు చెడగొట్టుకోవడం మంచిది కాదని మా అమ్మమ్మ చెప్పేది. " ఏడుకొండలు తన కన్నీళ్ళని ఆపుకోలేక పోయాడు. రంగయ్య అతనిని ఊరడిస్తూ , " డబ్బులు పొతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ మంచి మనుషులతో సంబంధం కోల్పోతే మాత్రం జీవితం లో కోలుకోలేనంతగా నష్టపోతాం. ఇది నేను నా జీవితం లో అనుభవపూర్వకంగా గ్రహించాను." అని ఏడుకొండలు భుజం తట్టాడు.
ఆ క్షణం లో ఏడుకొండలుకి ఎంతో ఎత్తుకి ఎదిగి కూడా ఒదిగి వుండే గొప్ప వ్యక్తిగా అనిపించాడు రంగయ్య. రంగయ్య వయస్సులో తనకన్నా బాగా చిన్నవాడు కాబట్టి మనస్సులోనే అతనికి జోహార్లు అర్పించాడు ఏడుకొండలు. ఏడుకొండలు దగ్గర రంగయ్య పనిచేస్తున్నప్పుడు హోటల్ లో జరిగిన నగదు దొంగతనం లో అసలు దొంగల ఆచూకీ కొంతకాలానికి తెలిసిందన్న విషయం రంగయ్య కి కూడా తెలుసన్న సంగతి ఇంకా పాపం ఏడుకొండలుకి తెలియదు.
***
No comments:
Post a Comment