చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 6 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 6

Share This

 చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల)  - 6

అనువాద కర్త : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ) 

ఆంగ్ల మూలం :  The Moonstone Castle Mystery

నవలా రచయిత : Carolyn Keene

 


(అర్థరాత్రి ఆకలి వేయటంతో కిందకు వచ్చిన తను కిటికీ ముందునుంచి వెళ్తున్న వ్యక్తిని చూసానని కూతురికి చెబుతాడు కర్సన్ డ్రూ.  ఇంతలో అనుమానితుడు తప్పించుకొన్నట్లు డొన్నెల్లీ నుంచి ఫోను వస్తుంది.  న్యాయవాది హోర్టన్ కేసు పూర్తిగా వివరించి చెప్పి, తాను శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నందున, నాన్సీని తన స్నేహితురాళ్ళతో డీప్ రివర్ వెళ్ళమని చెబుతాడు.  మరునాడు కారులో తండ్రిని విమానాశ్రయంలో దింపి యింటికి వచ్చిన నాన్సీ స్నేహితురాళ్ళతో డీప్ రివర్ బయల్దేరుతుండగా, యింట్లో ఫోను మోగుతుంది. తరువాత. . . .) 

 

నాన్సీ తాళాన్ని ఇగ్నిషన్లో పెట్టి తిప్పే ముందు, డ్రూ యింటిలోని టెలిఫోను మోగింది.  హన్నా అది మాట్లాడి వచ్చేవరకూ ఆమె వేచి ఉంది.  కొన్ని క్షణాల తరువాత హన్నా పరుగున బయటకొచ్చి చేతులూపింది.  


  "నాన్సీ! ఆగు.  ఆ ఫోను మీ నాన్నగారి కోసం వచ్చింది.  కానీ ఆ వ్యక్తి నీతో మాట్లాడుతానంటున్నాడు.  ఇది అత్యవసరం!"


  వెంటనే నాన్సీ కారులోంచి దూకి ఫోను కోసం లోనికి పరుగెత్తింది.  మాట్లాడే వ్యక్తి మిస్టర్ బోవెన్.

 

  "ఓహ్ మిస్ డ్రూ!" కంపితస్వరంతో చెప్పాడతను.  "మాకిప్పుడే బెదిరింపు ఫోను కాల్ వచ్చింది.  ఎవరైనా మా మనవరాలి మిస్టరీని పరిష్కరించటానికి చొరవ జేస్తే, వారు పెద్ద ప్రమాదంలోకి నడిచినట్లేనట!"


  నాన్సీ ఆశ్చర్యపోయింది.  కానీ ఈ కేసులో పాల్గొన్న వ్యక్తి లేదా వ్యక్తులు, జరగబోయే దర్యాప్తుకి బాగా భయపడుతున్నారని ఆమె గ్రహించింది.  


  "నువ్వు, కొంతమంది మిత్రులు ఈ మిస్టరీలో ఆధారాలను కనుక్కొందుకు డీప్ రివర్ వెళ్తున్నారని మీ నాన్నగారు రాత్రి నాకు ఫోను చేసి చెప్పారు.  నాకు వచ్చిన ఈ బెదిరింపు తరువాత, మీరు వెళ్ళటం బహుశా తెలివి తక్కువ  కావచ్చు!  నాన్సీ! దయచేసి యింట్లోనే ఉండండి."  


  యువ గూఢచారి అప్పటికే ఏమి చేయాలన్న దాన్ని మనసులో నిశ్చయించుకొంది.  "లేదు మిస్టర్ బోవెన్!" చెప్పిందామె, "భయపెట్టి ఈ కేసు నుంచి నేను విరమించుకొనేలా ఎవరు ప్రయత్నించినా, అనుమతించను.   అయినప్పటికీ, నేను జాగ్రత్తగా ఉంటానని, నా అంతట నేను యిరుక్కొనేలా ప్రవర్తించనని మీకు మాట యిస్తున్నాను."


  ఆమె ధైర్యాన్ని మెచ్చుకొంటున్నానని బోవెన్ చెబుతూ, ఈ రహస్య బెదిరింపు పట్ల ఎచ్చరికగా ఉండమని వేడుకొన్నాడు.  


"నేను దానిని గుర్తుంచుకుంటాను" అని నాన్సీ వాగ్దానం చేసింది.


  ఆమె కారు వద్దకు  తిరిగి వచ్చి ఫోన్ కాల్ గురించి ఇతరులకు చెప్పింది.  బోవెన్ సలహాతో ప్రభావితమై యిద్దరు అమ్మాయిలు ఈ ప్రయాణాన్ని విరమించుకొందామని చెప్పే లోపునే, నాన్సీ మరొకసారి హన్నాను ముద్దాడి, స్టీరిగు వెనుక కూలబడి, ఆనందంగా చేతులూపుతూ గుడ్ బై చెప్పింది.  


  మిసెస్ గ్రూ వెళ్తున్న అమ్మాయిలను చూస్తూ తలను అడ్డంగా ఊపింది.  "నాన్సీ డ్రూని ఎవరూ బెదిరించలేరు, తననుంచి తప్పించుకోలేరు!  అదే నన్ను భయపెడుతోంది, కానీ ఆమె గుండె ధైర్యాన్ని ఆరాధిస్తాను."


  మధ్యాహ్నం బాగా పొద్దుపోయాక, అమ్మాయిలు డీప్ రివర్ అన్న చిన్న పట్టణానికి చేరుకొన్నారు.  వారు పర్వతప్రాంతంలో మెలికలు తిరుగుతూ, "లాంగ్ వ్యూ" మోటెల్ కెళ్ళే దారిని సులభంగానే తెలుసుకొన్నారు. 


     "ఎంత అందమైన దృశ్యం!" వారు పైకి చేరుకున్నప్పుడు బెస్ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది.  "ఎత్తు పల్లాలుగా ఉన్న లోయలోని ప్రాంతాన్ని కొన్ని మైళ్ళ వరకూ చూడొచ్చు."


"అవును" నాన్సీ అంది,  "మన సామాన్లను మూట విప్పిన వెంటనే, ఈ లోయంతా తిరిగి చూడాలనుకొంటున్నాను."  


  ప్రయాణీకులు ముగ్గురు మోటెల్ యజమాని, రమణీయంగా ఉన్న ముప్ఫై అయిదేళ్ళ మిసెస్ థాంప్సన్ని చూసారు.   మోటెల్ మనోహరంగాను, యింటి వాతావరణాన్ని తలపించేదిగాను ఉంది.  అమ్మాయిలు మూడు పడకలతో ఉన్న పెద్ద గదిని చూసారు. 

 

  "మీకు ఈ గది సౌకర్యవంతంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను" అని మిసెస్ థాంప్సన్ చెప్పింది.  "మీకేదైనా కావాలనుకొంటే, నాకు తెలియపరచండి."  ఆమె గదిని వదిలి బయటకొచ్చింది.  


 "ప్రస్తుతం నేను కోరుకొంటున్నది నా కాళ్ళను సాగదీయటం" అంటూ తన సామాన్ల మూటను విప్పే ముందు  కసరత్తు చేయటం మొదలెట్టింది నాన్సీ.  


  కొద్దిసేపట్లో అమ్మాయిలు తమ దుస్తులను గోడకు వేలాడదీసి, పెట్టెలోని యితర దుస్తులను పక్కన పెట్టి, టాయిలెట్ సామగ్రిని దేవదారు బీరువాల్లో సర్దారు.  నాన్సీ తన పర్సులోనున్న చంద్రకాంతమణిని పట్టుగుడ్డ పరచిన చిన్న కేసులో ఉంచింది.  దాన్ని సాయంత్రాల్లో వాడుకొనే బేగ్ లో ఉంచి, దాన్ని రెండు కండువాల మధ్య పెట్టి టేబుల్ సొరుగులో దాచింది. 

 

  తరువాత తను తెచ్చిన బైనాక్యులర్సును చేతిలోకి తీసుకొంది.  మిగిలిన వాళ్ళను తనతో పాటు డాబా మీద తిరగటానికి, డీప్ రివర్ లోయను చూడటానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగింది.


  "ఖచ్చితంగా!" జార్జ్ చెప్పింది.  నాన్సీ గదికి తాళం వేస్తూండగా, బెస్, జార్జ్ లు మైదానం చుట్టూ తిరగటం మొదలెట్టారు.  వాళ్ళు మోటెల్ ప్రాంగణంలో రెండు టెన్నిస్ కోర్టులను, ఒక ఈత కొలన్ని చూసి ఆనందించారు.  


  నాన్సీ, అదే సమయంలో, డాబా అంచు వరకు వెళ్ళింది.  ఆమె నిలబడ్డ చోటునుంచి, క్రింద నేల మీదకు ఏటవాలు మార్గము ఉంది.  ఆమె తన బైనాక్యులర్ని కళ్ళ ముందు ఉంచి, కింద ఉన్న లోయను, పట్టణాన్ని చూసింది.  


  "హోర్టన్ యిల్లు ఎక్కడ ఉందో"నని ఆలోచనలో పడిందామె.  దానికి సంబంధించిన వివరణతో తండ్రి యిచ్చిన కాగితాన్ని చూడలేదామె.  అకస్మాత్తుగా ఉరుములతో కూడిన గాలివాన పడేలా ఉండటాన్ని నాన్సీ గమనించింది.   కొద్ది క్షణాలు వేగంగా కదులుతున్న నల్లని మేఘాలను గమనించిందామె.  తరువాత బైనాక్యులర్ని దిగువన ఉన్న నది వైపుకు మళ్ళిస్తూ, ఒక అసాధారణ ప్రాంతంపై తిన్నగా దృష్టి పెట్టిందామె. 

 

  "ఒక కోట!" నాన్సీ తనలో గొణుక్కొంది.


 ఆ భవనం ఒక ద్వీపంలో ఉంది.  అది రెండు అంతస్తుల ఎత్తులో ఉండి, ఒక చివరలో బురుజుని కలిగి ఉంది.  భవనానికి మూడు వైపులా ఎండిపోయిన కందకం ఉంది.  ఆ కందకం గట్టున కోట గోడకు చేరవేసి ఎత్తయిన వంతెన ఉంది.  చూసేవాళ్ళకు అది ఆ గోడలో ఒక భాగంలా కనిపిస్తోంది.  బెస్, జార్జ్ ఆమె దగ్గరకొచ్చినప్పుడు,  బైనాక్యులర్ని తీసుకొని వంతులవారీ ఉపయోగించారు.  ఆ రకంగా వాళ్ళు కూడా ఆ కోటను గమనించారు.


  "ఎంత మనోహరమైన దృశ్యం!" బెస్ ఆశ్చర్యపోయింది.  "ఇక్కడ నిజమైన కోటకు మార్గం గురించి ఆలోచించటం అద్భుతం!" 


  "ఒకప్పుడు కందకం  ఆ నది నుంచి వచ్చే నీటితో నిండి ఉండేదని అనుకొంటున్నాను" జార్జ్ వ్యాఖ్యానించింది.   "మనం యిక్కడ ఉన్నప్పుడే, కిందకు వెళ్ళి దాన్ని దగ్గరగా చూద్దాం." 


  నాన్సీ అంగీకారసూచకంగా తలూపింది.  బైనాక్యులర్ మళ్ళీ వాడి, ఆ భవనాన్ని, చుట్టూ ఉన్న మైదాన ప్రాంతాన్ని అధ్యయనం చేసిందామె.  "పరిసరాలను చూస్తే నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.  ఎవరైనా అక్కడ నివసిస్తున్నారేమోనని ఆశ్చర్యపోతున్నాను."


  ముగ్గురు బాలికలు ఆ ప్రాంతాన్ని చూడాలని ఎంత సంకల్పంతో ఉన్నారంటే, తుఫాను మేఘాలు సమీపిస్తున్నాయన్న విషయంపై వాళ్ళు దృష్టి పెట్టలేదు.  విసురుగా వీచే గాలిదుమారం వారి గౌను అంచులను బలంగా తాకింది. 

 

  "వాన కురవబోతోంది" బెస్ అన్నది.  "మనం లోపలకు వెళ్ళటం మంచిది."


 వాళ్ళు వెనక్కు తిరిగి ఒక పెద్ద సింధూర వృక్షాన్ని దాటారు.  ఆ క్షణంలో పెద్ద శబ్దంతో పిడుగు ఆ చెట్టు బోదెకు ఒక పక్కన పడింది.  వెంటనే ఏదో పగులుతున్న శబ్దం భయంకరంగా వినిపించింది.   భూమి కంపించటంతో, నాన్సీ ఆమె స్నేహితురాళ్ళకు ఒళ్ళు జలదరించింది. 

 

  "చెట్టు కూలిపోబోతోంది" బెస్ అరిచింది. 


@@@@@@@@@@


అమ్మాయిల వెనుక భయంకరమైన విధ్వంసం చోటు చేసుకుంది.  భారీ సింధూరవృక్షం రెండుగా విడిపోగా, పడిపోతున్న చెట్టు భాగానికి ఉన్న బయటి కొమ్మలు నాన్సీ, ఆమె స్నేహితులను కొద్దిలో తప్పిపోయాయి. 

 

  "అమ్మయ్య! కొద్దిలో తప్పించుకొన్నాం!" ఊపిరిని కూడదీసుకొంటూ అంది జార్జ్.  "నాకు తిమ్మిరెక్కినట్లు ఉంది." 

 

  "నాకూ అలాగే ఉంది" అంది నాన్సీ.  "మనం పిడుగుకి దగ్గరగా లేకపోవటం మన అదృష్టం! లేదంటే మనం దెబ్బ తినేవాళ్ళం."


  "నేను పూర్తిగా నాశనమే" బెస్ ప్రకటించింది.  అయినప్పటికీ, ఆమె ఆగకుండా మోటెల్ వైపు వెళ్ళటం ఆపలేదు. 

  ముగ్గురమ్మాయిలు లోనికి వెళ్తుండగా, ప్రకాశవంతమైన మెరుపు మెరిసింది.  దాని తరువాత గూబ గుయ్యిమనిపించే ఉరుము ఉరిమింది.  

 (ఇంకా ఉంది)


No comments:

Post a Comment

Pages