మొగిలి చింతల స్వామి - అచ్చంగా తెలుగు
 మొగిలి చింతల స్వామి 
(మా జొన్నవాడ కథలు)
టేకుమళ్ళ వెంకటప్పయ్య
(9490400858)


సమయం ఉదయం పదకొండు గంటలు దాటింది. దేవళానికొచ్చే జనం క్రమంగా పలచబడుతున్నారు. చెంచయ్య అంగడిలో టీ గ్లాసులందిస్తూ, "ఇంక మూసెయ్యాల జనాలు లేరు. గ్యాసు దండగ" అని మనసులోనే గొణుక్కుంటూ యాదాలాపంగా దూరంగా వస్తున్న పొడవాటి నల్లని మనిషిని జూసి ఎవరబ్బా యీన! అని ఆశ్చర్యపోయాడు. అంత బలంగా లేకపొయినా ఆజాను బాహుడు. ఒంటి మీద గుడ్డ పేలిక లేదు.  గోచీ మాత్రమే పెట్టుకున్నాడు. తలమీద ఒక చెక్క పెట్టె ఉంది. మూడు కుక్కపిల్లలు ఆయన వెనకాల వస్తున్నాయి.
"ఒరే వెంకటేశ్వర్లా! ఎవుర్రా ఆ వచ్చే మడిసి?  కోతో… కొండముచ్చో...మాదిరిగా.. ఉండ్లా" 
"ఏమో అన్నా! అర్ధం గావడంలే.. మాటలు మిగలబాక! ఎవరో ఏమో!  రానీ ఇటే వత్తన్నాడు గదా! అడుగుతా."
నెత్తిమీద నున్న పెట్టె దించి టీ అంగడి ఎదురుగా ఉన్న ఒక అరుగు మీద పెట్టి, ఆయాసం తీర్చుకుంటూ కూర్చున్నాడు. వళ్ళంతా విబూధి పూసుకున్నాడు. తల జడలు గట్టింది. కుక్కలు తోకాడించుకుంటూ ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. విషయం   అర్ధమైనట్టుగా నవ్వి... "ఆగండ్రా!” అంటూ గోచికి ఉన్న ముడి విప్పి ఉన్న ఒక్క ఐదురూపాయల బిళ్ళ బైటికి దీసి "అయ్యా! నా దగ్గర ఐదురూపాయల బిళ్ళ ఒకటే  ఉంది. నాకు గ్లాసుడు పాలు. కుక్కలకు బిస్కత్తులు ఏమైనా ఇస్తావా?" 
"పొద్దు పొద్దున్నే మంచి బేరమేరోయ్…. ఎంకటేశ్వర్లా! అవ్వ దీసిన గంధమంటా.. తాత బుడ్డకు సరిపొయిందంట. అట్టాగుంది నీ ఎవ్వారం. నీకే బువ్వ లేదు... నీ యెనక కుక్కల దండొకటా మళ్ళా..."" అన్నాడు చెంచయ్య పెద్దగా నవ్వుతూ.
" ఎహె..  ఎవరో కనుక్కో అన్నా! ముంగల. తెలీకుండా ఎకసెకాలాడబాక!"
వాళ్ళ మాటలు వినగానే "నా పేరు మొగిలి. బండేపల్లి నుంచి తెల్లారు ఝామున నాలుగ్గంటలకు లేచి నడిచి వస్తున్నాను. కుక్కలు కూడా నా వెనకంబడి నడిచాయి ఇంత దూరం " అన్నాడు
"యోవ్! ఓరి నీయమ్మ బడవా! ఏందిదీ... అక్కణ్ణుంచి నడిచొచ్చినా? దాదాపుగా నలభై కిలోమీటర్లుళ్ళా... దూరము? ఏంది ఎంకటేశర్లా?" అవునన్నట్టు తలూపాడు.
"అవును అక్కడ నీళ్ళల్లో కల్తీ అయిందని, పురుగు మందులు కలిశాయని జనానికి వాంతులూ..బేదులూ.. అందరూ తలా ఒక మూలకు బోతున్నారు. నేను అమ్మణ్ణి దెగ్గిరికొచ్చేశా.. ఇంకేం బయం లేదు నాకు… దేవళం చాయల చూసి రెండు చేతులూ ఎత్తి దండం పెట్టాడు  ఈటి కోసమైనా దయ ఉంచి.." దండం పెట్టాడు.
" అట్నేలే! నీ పాసుగాల. నీమాటలో ఏదో మహత్తుందయ్యా. ఈడ.. ఏడుండాలని?"
"మీరే జెప్పాల?" అన్నాడు పాలు తాగి కుక్కలకు బిస్కత్తులు పెడుతూ.
"అటుబడి దచ్చినంగా పోబ్బా!  రెండు పేటలున్నాయాడ.  అక్కణ్ణే ఎక్కువ ఉండేది జనాలంతా... ఎవరో ఒకళ్ళు ఇంత జాగా ఈక పోరు బో …."
పెట్టె ఎత్తి నెత్తిన పెట్టుకుండగా...”యోవ్... మొగిలి సామీ.. పెట్టీడ బెట్టి కనుక్కోని రా….కుక్కలు గావాలంటే తోలుకొని పో.        నీ పెట్టెవరూ నూక్కోని బోరులే..మేముళ్ళా ఈడ! గబాల్న రా! పెట్టెలో వజ్రాలు రత్నాలు ఉన్నట్టు పెద్ద….. పెట్టుకున్నదేమో గోచిపాత" అని పెద్దగా నవ్వాడు.
వెళ్ళిన వాడు బేల మొగమేసుకుని అర గంటలో తిరిగొచ్చాడు. బాధగా "చెంచు సామీ..ఆళ్ళెవరూ రానీరంట నన్ను. ఏంజెయ్యాల? నీకులమేంది గోత్రమేంది?  అని అడగతా ఉన్నారు. నాకే దెలీదు. వాళ్ళకేంది ఇంక చెప్పేది?"
"ఒరీళ్ళ పాసుగాల! అవన్నీ గావలన్నారా?  ఏంజెయ్యాల?  అడుగో దేవళం పూజారి ఇటే వస్తా ఉన్నాడు. ఆయన్నడుగు. నేను జెప్పానని జెప్పబాకయ్యో! లేనిపోని పీకులాట మళ్ళీ"
"ఏం చెంచయ్యా! ఎట్టుంది యాపరం?" పూజారి రోడ్లోనే నిలబడి అడిగాడు.
"ఆ కామాక్షమ్మ తల్లిని నమ్ముకున్నాం గదా..అంతా బాగనే ఉందయ్యా!" నీ సంగతి జెప్పమన్నట్టు మొగిలికి సైగ జేశాడు.
ఎవరీ గోచిపాతాయన? అన్నట్టు జూశాడు పూజారి.
"సామీ దండాలు" విషయం చెప్పి, "ఈ వూర్లో ఉండేదానికి ఇంత చోటు జూపీండయ్యా..పుణ్యం వుంటుంది."
"నేను సర్పంచ్ దగ్గరకు బోతున్నాను. నా ఎంబడి రా.. నా పనయింతర్వాత నీ సంగతి కూడా జెప్తా"
****
పూజారి తన పనయ్యాక బయటికి వచ్చి "కుక్కల్ను అక్కడే ఉంచి..పెట్టె కూడా బయట్నే బెట్టి..  నువ్వు వరండాలోకి రా!" అన్నట్టు సైగ జేసాడు. ఇంతలో సర్పంచ్ బయటికి వచ్చాడు.
"దండాలయ్యా!"
"ఏంది నీ వాలకమూ..ఏంది నీ కతా..ఎవుర్నువ్వు అని?"
"అయ్యా..నా మతమేందో తెలవదు. కులం దెలవదు"
"మీ అమ్మా అబ్బా.."
"ఊహ తెలిసే లోపే దూరమయ్యారు.  ఎవర్నడిగినా దేవళం కాడ దొరికానని చెప్పేవాళ్ళు.  చానా రోజులు  దేవళం దగ్గర ఉన్నా. ఒక శెట్టి దయ తలచి, మంచి కుశాలుగా ఉన్నానని వాళ్ళ అంగట్లో పెట్టుకున్నాడు. కూడు పెట్టేవాడు. గుడ్డలు కొనిచ్చేది లే! చొక్కాచెడ్డీ ఎందుకురా దండగ.. బాగా గాలి ఆడుతుంది అని నాలుగు గోచి గుడ్డలు చేయించాడు. తర్వాత ఆయన దగ్గర మానుకున్నా. రచ్చబండ దగ్గర ఉండేవాణ్ణి. ఇదిగో ఇంతలో ఈ మాయరోగం వచ్చి అందరూ ఊరు ఖాళీ చేసేసారు.” అని విషయం మొత్తం చెప్పాడు.
"ఓరి… నీ యమ్మ బడవ! అట్నా! యోవ్... పూజారా..రచ్చబండంటే గమనానికొచ్చింది. మన రచ్చబండ కాడ, కాలవ పక్కన్నే సత్రం ఉళ్ళా... దాని పక్కమాల  5 అంకణాల ఖాళీ స్థలం ఉళ్ళా...  అక్కడ ఈనకు ఒక గుడిసె వేసిద్దాం. అందాక సత్రంలో ఉండమని నేను జెప్పానని జెప్పు. ఏమంటావు?" మొగిలి వైపు తిరిగి "యోవ్.. మొగిలీ..నీకాణ్ణే సత్రం కాడ వణ్ణం పెడతారు. దిగులుపడబళ్ళా..ఇక బో"  అని ఎవరో తలమనిషిని పిలిచి "రెండు తాటి చెట్లు కొట్టించి గుడిసెయ్ ఈ సామికి. డబ్బులు గిబ్బులు అడగబాకండీన్ను.. నీకే  పున్నెం" అన్నాడు.
"దైవేచ్ఛ" నమస్కారం చేశాడు పూజారి. మొగిలి కూడా దణ్ణం పెట్టాడు.  సంతోషంగా బయటకు వచ్చారు.
****
గుడిసె ఎయ్యడానికి అడ్డంగా చింత చెట్టు వచ్చిందని కూలీలు ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే, "పచ్చని చెట్టును కొట్టబాకండి. దాందీ ప్రాణమే కదా! అలాగే ఉంచేసి మాను గుడిసె లోపల మధ్యలో వచ్చేట్టు కట్ట”మని చెప్పాడు మొగిలి.  గుడిసె పూర్తయ్యాక   పెట్టెలోనుంచీ  శివ లింగం తీసి ప్రతిష్ట చేశాడు. ఒక పెద్ద శంఖం శివలింగం ముందు వుంచాడు. ఇంక పెట్టెలో మిగిలింది గోచి గుడ్డలే! వాటిని దండెం కట్టి దాని మీద వేశాడు. 
రోజూ తెల్లారగట్ల పెన్నా నదిలో స్నానం చేసి  పెద్దగా “ఓం నమశ్శివాయ” మంత్రం చదివేవాడు. శంఖం ఊదితే.  ఊళ్ళోకి వినబడేది.  ఆడంగులంతా ఆ శబ్దం విని ఉలిక్కిపడి నిద్రలేచి, మొగుళ్ళకు పాద నమస్కారం చేసి, మంగళ సూత్రం కళ్ళకద్దుకుని, పాచి పనులకు ఉపక్రమించేవారు.  
మొగిలి రచ్చబండమీద కూర్చుని  గంటలు గంటలు ధ్యాన్నం చేసే వాడు. సత్రం వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు బొయ్యి అంత ముద్ద తిని, అక్కడ మిగిలిన కూరా, నారా, అన్నం అడిగి కుక్కలకు తెచ్చి పెట్టేవాడు.  "ఈ సామికి పెట్టడమే దండగనుకుంటే..కుక్కలొకటి మధ్యలో!" అని మొదట్లో వాళ్ళు విసుక్కున్నా.."అవీ ప్రాణాలే గదా..విసుక్కోబాకండయ్యా!" అని నవ్వే వాడు. ఎక్కడికి వెళ్ళినా కుక్కలు మాత్రం  అతనికి వెంటే ఉండేవి.

****
ధ్యానం చేసే సమయంలో ఎవరొచ్చినా లేచేవాడు కాదు. ఒకసారి ఊర్లో సర్పంచ్ గారి ఢిల్లీ బఱ్ఱె ఒకటి జంగిడి గుంపు నుండి తప్పి పోయింది.  పది లీటర్ల పాలిస్తుంది. థర లక్ష రూపాయలు పెట్టి కొన్నది.  ఇంటికి రాలేదు. సర్పంచ్ కు విషయం తెలిసి ఆగ్రహోదగ్ధుడయి, వెంటనే వెదికి తీసుకురమ్మని వెంకయ్యను పంపాడు. ఊరు మొత్తం వెదికినా దొరకలేదు. వెంకయ్యకు నీరసమొచ్చింది. రెడ్డి పనిలో నుంచి తీసేస్తాడని వెక్కి వెక్కి ఏడుస్తూ.. రచ్చబండ దగ్గర కూర్చున్నాడు. ధ్యానంలో ఉన్న మొగిలి స్వామి లేచాడు. ఏమయిందని అడక్కుండానే.. ప్రశాంతంగా ‘ఓం నమశ్శివాయ’ అంటూ ఐదు నిముషాలు ధ్యాన్నం చేసింతర్వాత  “ఏడవబాక! పాత మినగంట్లో బందిలి దొడ్లో కట్టేసి ఉంది. వాళ్ళకు అపరాధ సుంకం చెల్లించి తెచ్చుకోపో!" అని చేతిలో ఒక చింతకాయ పెట్టి, నీకాడ ఉంచుకో తిరిగి వచ్చిందాకా. తర్వాత ఇంట్లో దేవుడి ముందు పెట్టు.  చింతలను దూరం చేసే ఈ చింతకాయ నీ కాడ ఉన్నంతవరకూ దిగుల్లేదు పో! " అని ఆశీర్వదించాడు. 
మొగిలి చెప్పినట్టే బఱ్ఱె పాత మినగల్లు బందిలి దొడ్డిలో ఉంది. డబ్బులు కట్టి విడిపిచ్చుకోని  ఆ సంగతి  ఊరు వాడా చాటింపు వేసేశాడు. విషయం విన్న సర్పంచ్ సంతోషపడి ఒక ఇత్తడి త్రిశూలం చేయించి స్వామికి ఇస్తే స్వామి పరమ సంతోషపడి "నీ కూతురు పెండ్లి ఇంకో నెలలో జరుగుతుంది. అమ్మణ్ణి దేవళంలో చేయించు. శుభం" అని ఆశీర్వదించాడు.  వెంకయ్య మహిమలు గల స్వామి అని ఆయనకు "మొగిలి చింతల స్వామి" అని పేరు బెట్టాడు. అప్పటినుండి అదే పేరు ఖాయం అయ్యింది.  వెంకయ్య ఆయనకు ప్రధమ భక్తుడయ్యాడు.  
అప్పుడే డిగ్రీలో చేరిన కూతురుకు పెళ్ళేందని సర్పంచ్ నవ్వుకుని "సరేలే సామీ… అట్నేలే..కానీ.. " అన్నాడు. ఒక నెలలో అమెరికా వెళ్ళాలని సర్పంచ్ భార్య అన్న కొడుకు వాళ్ళను పెండ్లికి  ఒప్పించాడు. లక్షల్లో జీతం. పైగా అబ్బాయి కూడా.. కూతురు మాదిరిగానే.. సినిమా యాక్టర్‌లా ఉండడంతో, అందరూ ఒప్పేసుకున్నారు. అమ్మణ్ణి సమక్షంలో నెలలో పెండ్లి జరిగి అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది. సర్పంచ్ ఆ సంఘటన జరిగినప్పటినుండి మొగిలి స్వామికి చెప్పకుండా ఏ నిర్ణయము తీసుకునే వాడు కాదు.  
స్వామి అప్పుడప్పుడూ కొన్ని మహిమలు చూపేవారని జనం చెప్పుకుంటారు. తెల్లవారు ఝామున పెన్నా నదిలో స్నానం చేసేటప్పుడు నీటిమీద నడిచే వాడని, పాములతో ఆడుకుంటాడని, ఉదయాన్నే పూజ చేసేటప్పుడు నాగుపాము శివలింగాన్ని చుట్టుకుని ఉంటుందని చెప్పుకునేవారు. శివరాత్రి నాడు, కామాక్షమ్మ బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి శూలం ధరించి, శంఖం మెడలో వ్రేలాడదీసుకుని పల్లకీ ముందుగా  శివ తాండవ నృత్యం చేసేవాడు. ముఖ్యంగా నాలుగు రోడ్ల కూడళ్ళు వచ్చినప్పుడు ఈ నృత్యం 5-10 నిముషాలు సాగేది. ఆ సమయంలో శంఖం ఊదితే ప్రక్క ఊర్లకు వినిపించేది. ఎవరడిగినా ప్రశ్న చెప్పేవాడు కాదు. వచ్చిన వాళ్ళకు ఒక చింతకాయ ఇచ్చి “దేవుడి దగ్గర పెట్టుకోండి. కామాక్షమ్మకు, మల్లన్నకు అర్చనలు, అభిషేకాలు చేయించుకోంటే  కష్టాలు గట్టెక్కుతాయి”  అనే వాడు. 
    
రోజు రోజుకూ స్వామి దగ్గరకు వస్తున్న భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో ఎక్కువ సమయం మౌన వ్రతంలోనే ఉండడం చేసేవాడు. వాళ్ళు వెళ్ళాక కాని కళ్ళు తెరిచే వాడు కాదు. వెంకయ్య మరీ బలవంతం చేసి "పాపం ఇంత దూరం మీకోసం వచ్చే వాళ్ళకు ప్రశ్న చెప్పొచ్చుకదా స్వామీ! అనడిగితే "సంపూర్ణ విశ్వాసంతో నమ్ముకొని ఈడకొస్తే చాలు..వేరే ఏంబల్లేదు అనుకున్నవన్నీ జరుగుతుండ్లాయ్యా!" అని చిరునవ్వు నవ్వే వాడు. ఎవరెంత బలవంత పెట్టినా పైసా కూడా తీసుకునే వాడు కాదు పైగా "డబ్బులెందుకు సన్యాసికి, తినేదానికి ఏమైనా పండ్లు ఇవ్వండి చాలు. నా పేరు మీద అన్నదానాలు చెయ్యండి మీ ఊళ్ళల్లో. మీరు నన్ను విడిచిపెట్టినా నీనొదలనయ్యో! ప్రతి నిముషం మిమ్మల్ని చూస్తా ఉంటా!" అని అనేవాడు. ఆయన పేరుమీద చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లో అన్నదానాలు, ధర్మ కార్యాలు జరిగేవి. నమ్మిన భక్తులు అనుకున్నవన్నీ జరిగేవని జనం అంటుండే వాళ్ళు.

****
కాలచక్రంలో కొన్ని సంవత్సరాలు ప్రశాంతంగా నడిచాయి. మొగిలి స్వామి ఒకరోజు ఎక్కడికో వెళ్ళి మూడు రోజులు కనిపించకపోయేసరికి జనం అతనికోసం చుట్టు ప్రక్కల ఊళ్ళ వాళ్ళకు ఫోన్లు జేసి, మనుషులను పంపించీ..తెగ వెదికించారు. ఎవ్వరూ ఒక ఆమడ దూరంలోపల అలాంటి సామిని ఎవ్వరూ ఎక్కడా చూడలేదన్నారు. జనానికి, భక్తులకు దిగులు పట్టుకున్నది.  నాలుగో రోజు, సోమవారం నాడు తెల్లవారు ఝామున, శంఖనాదం వినబడింది రావి చెట్టుక్రింద ధ్యానంలో కనిపించాడు. వెంకయ్య కళ్ళనీళ్ళతో స్వామి కాళ్ళు వదలకుండా గట్టిగా పట్టుకుని  "సామీ! యాడికి బొయ్యారు? మమ్మల్నొదిలేసి" అనంగానే. "వెంకయ్యా! మూడురోజులు లేకపోతే ఇంతిదిగా దిగులుపడి.. ఏడవాల్నా? చెప్పు? వచ్చే బేస్తవారం (గురువారం) శాశ్వతంగా శెలవు తీసుకోబుతుండ్లా! ఎప్పుడో ఒకప్పుడు ఈ కట్టె పోవాల్సిందే గదా! కాలంతో వచ్చినవన్నీ కాలంతో పోవాల్సిందే గదా వెంకయ్యా!" అని పెద్దగా నవ్వేసరికి దగ్గు తెరలు తెరలుగా వచ్చి ఆయాసపడ్డాడు. వెంటనే వెంకయ్య చిన్న పిల్లాడిలా "స్వామీ అట్టనబాకండి. మేం తట్టుకోలేము" అంటూ గుక్కబట్టి ఏడ్చాడు. చుట్టు ప్రక్కల జనం పోగయ్యారు.
****
తెల్లవారితే బేస్తవారం అనగా బుధవారం రాత్రినుంచే వెంకయ్యకు ఏదో అనుమానం వచ్చి ఇద్దరు మనుషులతో మొగిలి స్వామి దగ్గరే ఉండి వెంట వెంట తిరుగుతున్నాడు. గమనిస్తున్న స్వామి నవ్వుతూ  తెల్లవారు ఝామునే యధావిధిగా లేచి స్నానం ముగించి శివలింగ పూజ మొదలుపెట్టాడు. ఎక్కడినుంచో ఒక నాగు పాము వచ్చి శివలింగానికి చుట్టుకుంది. శంఖం  తీసి పెద్దశబ్దంతో చెవులు చిల్లులు పడేట్టు ఊదాడు. ప్రతిరోజూ ఊదే శంఖనాదానికి దీనికీ చాలా తేడా ఉంది. లింగానికి సాష్టాంగ నమస్కారం చేయడానికి బోళ్ళా పడుకున్నాడు. నాగుపాము మెల్లిగా లేచి చూరులో దూరి మాయమయింది. బయట ఏదో విమానం శబ్దం పెద్దగా వినిపించింది. వెంకయ్యా, స్నేహితులు అందరూ ఏమిటా శబ్దం అని బయటికి వచ్చి చూశారు. ఎవరూ లేరు. గుడిసెలోకి వెళ్ళేసరికి స్వామి అప్పటికే శివైక్యం చెందినట్టు తెలిసి గొల్లుమని పెద్దగా ఏడ్చారు. 
విషయం తెలిసి చుట్టుపక్కల ఊళ్ళనుండి జనం విపరీతంగా, వేల సంఖ్యలో  వచ్చారు. పార్ధివ దేహాన్ని అక్కడే పాతిపెట్టి ఒక అందమైన సమాధి నిర్మించారు. పూజారి కూడా  వచ్చి దర్శించి, ఉదయాన్నే ఏదో హంస లాంటి పెద్ద పక్షి, విమానం లాంటి శబ్దం చేస్తూ దేవళం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మాయమయిందని చూసిన కొంతమంది జనం చెప్పారని చెప్పాడు. జనం అందరూ అవునన్నారు.  సమాధిపై  "ఆకలిగొన్న వారికి అన్నం పెట్టండి. ఆపదలో ఉన్నవాళ్ళను ఆదుకోండి - మొగిలిచింతల అవధూత సందేశం" అని సర్పంచ్‌గారు వ్రాయించాడు. ఇప్పటికి పెన్న ఒడ్డున ఉన్న ఈ సమాధిని అనేక మంది భక్తులు సందర్శిస్తుంటారు.  కోర్కె ఆయనకు చెప్పుకున్నప్పుడు, ఆ కోరిక తీరాక సమాధిపై కొన్ని చింతకాయలను పెడుతూ ఉంటారు భక్తులు ఆచారంగా... ఒక చింతకాయ మాత్రం స్వామి ప్రసాదంలా తీసుకుంటారు. చింత చెట్టు నీడలో ఇప్పటికి ప్రశాంతంగా శాశ్వత నిద్రలో ఉన్న మొగిలి చింతల స్వామిని   నమ్మి కోరుకుంటే..ఎంతటి దుస్సాధ్యమైన కార్యమైనా జరుగుతుందని జనం విశ్వాసం. 
****

No comments:

Post a Comment

Pages