మానసవీణ -22 - అచ్చంగా తెలుగు

మానసవీణ -22

దినవహి సత్యవతి


(ఒక అనాధాశ్రమంలో పెరుగుతున్న మానస సేవా మార్గంలో పయనిస్తూ, స్వయంకృషితో ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆమెను ప్రేమిస్తారు రాజేష్, అనిరుధ్ లు. కాని, మానస లక్ష్యం వేరు...)

కాలం ముందుకు కదిలి మానసని డిగ్రీ ఆఖరి సంవత్సరంలో పడవేసింది. వచ్చే నెలలోనే డిగ్రీ  ఫైనల్ పరీక్షలు కావడంతో, ప్రిపరేటరీ హాలిడేస్ ఇచ్చారు ఆఖరి సంవత్సరం విద్యార్థులకి. చదువుదామని పుస్తకం చేతిలో పట్టుకున్నా ఈ మధ్య ఎందుకనో ఏకాగ్రతతో చదవలేకపోతోంది మానస. అక్కడికీ క్రమం తప్పకుండా వ్యాయామం, మెడిటేషనూ చేస్తూనే ఉంది. అయినా కళ్ళు పుస్తకంలోని అక్షరాలమీద యాంత్రికంగా కదులుతున్నాయి కానీ  ఆలోచనలు మాత్రం పరిపరివిధాల పోతున్నాయి. ‘ఈ సంవత్సరంతో చదువు అయిపోతుంది.  డిగ్రీ తరువాత ఇంక అనాథాశ్రమంలో ఉండకూడదు. కనుక ఏదో ఉద్యోగం వెతుక్కుని తనను తాను  పోషించుకునే మార్గం చూసుకోవాలి. అయితే ఇంకేం ఒక చిన్న ఇల్లు తీసుకుని స్వతంత్రంగా ఉంటాను. అలా అని నన్ను కడుపులో పెట్టుకుని తల్లిలా కాపాడిన ఈ హేమలతా కుటీరాన్ని విడిచి పెట్టను. నా సాధ్యమైనంతవరకూ ఇక్కడ ఉన్నవాళ్ళకి  సేవలు అందిస్తాను. జి. టి.ఆర్. అంకుల్ నన్ను కూతురి కంటే ఎక్కువగా చూసుకుని ఎంతో ఆదరించారు. ఇంక ఆయనపై నా భారం పడనీయను. అయినా నా లక్ష్యం నెరవేరాలంటే నేను ఒంటరిగా ఉంటూ ధైర్యంగా నన్ను నేను సమర్థించుకోగలగాలి. ఒకవైపు నేను  భవిష్యత్తులో ఏంచేయాలా అని  ఆలోచిస్తుంటే ఇంకోవైపు ఈ రాజేష్ అనిరుధ్ ఇద్దరూ ప్రేమ పెళ్ళీ అని వెనకపడుతున్నారు!’ అన్న ఆలోచనతోటే ఒక్కసారిగా మనసంతా చికాకుగా తయారైంది!


‘అయినా అసలు అనిరుధ్ కానీ రాజేష్ గానీ అలా అనుకోవడానికి నేనెప్పుడూ వాళ్ళకి నా ప్రవర్తనతో గానీ మాటలతోగానీ ఆ విధమైన సంకేతాలు ఇవ్వలేదే? అయినా వాళ్ళు నన్ను ప్రేమిస్తే దానికి నేనేంతవరకూ  బాధ్యురాలిని? అయినా నాకర్థంకాదూ అసలు  ప్రేమ ప్రేమా అంటారు, అసలు ప్రేమంటే ఏమిటీ? ఏమో  నా మనసు ప్రస్తుతం దాని గురించి అలోచించే స్థితిలో గానీ, ఆ భావనకి స్పందిచే స్థితిలో గానీ లేదేమో అనిపిస్తుంది...


అనిరుధ్ కీ, రాజేష్ కీ ఇప్పటిదాకా చెప్పీ చెప్పీ అలసిపోయాను. అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరే! మళ్ళీ ఇంకోసారి ఈ ప్రసక్తి వస్తే గట్టిగా చెప్పాలి. తండ్రులు సంపాదించింది ఖర్చుపెట్టడం కాకుండా ముందు మీ కాళ్ళ  మీద మీరు నిలబడండి అని చెప్పాలి. పెళ్ళికంటూ ఒక వయసూ అదీ ఉంది కదా!’… ఇలా అలోచనలో ఉండగా ఫోన్ మ్రోగింది.


టైం చూసింది. రాత్రి తొమ్మది కావొస్తోంది. ‘అరే ఆలోచనలలోపడి భోజనం సంగతే మర్చిపోయానే?’ అనుకుంది. ఫోన్ ఇంకా మ్రోగుతూనే ఉంది. ఎవరబ్బా ఈ పట్టువదలని విక్రమార్కులూ అనుకుని  చూస్తే ఏదో తెలియని నంబరు. వెంటనే కట్ చేసి భోజనం టైమవడంతో డైనింగ్ హాల్ వైపు కదిలింది. తెలియని నంబర్లనుంచి ఫోన్ వస్తే అసలు ఎత్తదు మానస.


అప్పటికే అందరూ డిన్నర్ చేస్తున్నారు. పరీక్షలు దగ్గర పడటంతో ఎవరికి వారు గబగబా తినేసి తమ తమ గదులకి వెళ్ళిపోతున్నారు. ఇదే మరోప్పుడైతే మాటలతో నవ్వులతో ఎంతో సందడిగా ఉంటుంది భోజనాలదగ్గర.


చపాతీలు కూరా ప్లేట్లో పెట్టుకుని తెచ్చుకుని ఒక టేబుల్ దగ్గర కూర్చోగానే ‘అక్కా ఇక్కడున్నారా మీకోసం మీ గదికి వెళ్ళాను” అంటూ వచ్చింది సమీర.


సమీర ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతోంది. సబ్జెక్ట్స్ లో ఏమైనా సందేహాలొస్తే మానసని అడుగుతుంది.


“చెప్పు సమీరా ఏం కావాలి?” అడిగింది మానస.


“ఎకనామిక్స్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయక్కా. మీరు చెప్తారేమోననీ” అంది.


“అలాగే చెప్తాను కానీ ముందు నువ్వా అక్కా మీరూ అనడం మానేయి. ఎన్నిసార్లు చెప్పాను నీకు?” అంది చిరు కోపం ప్రదర్శిస్తూ.


“సారీ అక్కా ఇంకెప్పుడూ అననులే. సరే నేను వరండాలో రీడింగ్ కార్నర్ దగ్గర  ఉంటాను. నువ్వు హడావిడి పడకుండా నింపాదిగా భోజనం చేసి అక్కడికి రా” అని చెప్పి వెళ్ళింది సమీర.   


మానస భోజనం కానిచ్చి సమీర సందేహాలు తీర్చి, అలవాటు ప్రకారం కాసేపు క్రింద వరండాలోనే పచార్లు చేసి  గదికి వచ్చి అలసటగా అనిపిస్తే మంచం పైన వాలింది. మళ్ళీ ఆలోచనలు చుట్టూముట్టాయి ఆమెని...


‘నా జీవిత లక్ష్యం వేరు. ముందు అది సాధించాలి. ఆ తరువాతే ఏదైనా, ఆఖరుకి పెళ్ళి గురించి కూడా, ఆలోచిస్తాను.  అసలు పెళ్ళనేది అంత ముఖ్యమా జీవితంలో? 


అందరికీ నేను ధైర్యవంతురాలైన మానసగానే తెలుసు కానీ అంతరంతరాలలో నేనెవరో, నా తల్లిదండ్రులు ఎవరో తెలియక నేనెంత క్షోభ పడుతున్నానో నాకు మాత్రమే తెలుసు.  


‘ముందు నేనెవరో, ఎవరికి పుట్టానో నా తల్లిదండ్రులెవరో తెలుసుకోవాలి. నిర్దాక్షిణ్యంగా ఒక పసిగుడ్డును  అనాథాశ్రమం మెట్ల దగ్గర వదిలేయాల్సినంత అగత్యం వాళ్ళకు ఎందుకు ఏర్పడిందో వాళ్ళని కనుక్కోవాలి!  అసలు అంత ఆలోచన లేకుండా నన్నెందుకు కన్నారో నిలదీసి అడగాలి!’ అలా అనుకోగానే తనకీ అమ్మ ఉండుంటే ఎలా ఉండేదో తన జీవితం అనిపించి ‘అమ్మా! ఎక్కడున్నావమ్మా? నన్నెందుకు వదిలేసావమ్మా? నీ మనసెలా ఒప్పిందమ్మా? ఒకవేళ నేను ఆడపిల్లనని వదిలేసావా? అదే మగపిల్లాడినైతే పెంచుకునేదానివా? ఓ భగవంతుడా నువ్వైనా నా సందేహాలకి సమాధానం చెప్పు లేదా  నాకు ఒక మార్గమైనా చూపించు’ అంటూ కనపడని దైవాన్ని ప్రార్థిస్తూ మూగగా రోదించింది. అమ్మని తలుచుకోగానే  ఆలోచనలు శ్రావణి వైపు మళ్ళాయి.


‘అమ్మెలా ఉంటుందో తెలియదు కానీ ఆవిడ దగ్గర ఉంటే అమ్మ ఇలానే ఉంటుందా అనిపిస్తుంది. అనిరుధ్ సహాయంతో ఆవిడ ఆ  స్థితికి  రావడానికి కారకులెవరో కనిపెట్టడానికి గత కొంత కాలంనుంచీ  విశ్వ ప్రయతం చేస్తోంది కానీ ఎప్పుడూ ఏదో ఒక అవరోధం వస్తోంది.


అనిరుధ్ సహాయం కోరడంతో అతడేమో నేనేదో అతడిని ఇష్టపడుతున్నననీ ప్రేమిస్తున్నాననీ  భ్రమపడుతున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట మాత్రం నిజం. అనిరుధ్ అంటే నాకు ఇష్టమే ఒక వ్యక్తిగా, స్నేహితుడిగా. అంతే. అంతకుమించి ఏ ఆలోచనలూ నాకు కలగడం లేదు.


గత కొన్ని నెలలుగా శ్రావణిగారిని కలుసుకుంటూ ఆవిడతో గడుపుతుంటే ఎంతో హాయిగా ఉంటోంది. ఆవిడలో కూడా చాలా మార్పు  కనిపిస్తోంది. నన్ను చూడగానే ఇదివరకు ఆవిడలో కనిపించే ఆందోళన స్థానే  నిలకడ చూస్తున్నాను. నేనెక్కడ వెళ్ళిపోతానో అని భయపడి ఆవేశంగా దగ్గరికి తీసుకుని ముద్దులు పెట్టడం కాకుండా నెమ్మదిగా నన్ను దగ్గరికి తీసుకుని తన ప్రక్కన కూర్చోబెట్టుకుని నాగురించి అన్నీ తెలుసుకోవడానికీ ఉత్సుకత చూపిస్తున్నారు. అలా ఒక అమ్మలాగా ఆవిడ గుచ్చి గుచ్చి  అడుగుతుంటే ఆవిడతో అన్నీ పంచుకోవాలని అనిపిస్తోంది.  కానీ ఏదో బెరుకు అడ్డువస్తోంది.


‘కానీ అలా ఆవిడతో మాట్లాడుతూ ఆ మాటల్లో ఆవిడ తన గురించి చెప్తేనైనా ఆవిడ ఎవరో, ఆవిడకి  ఆ స్థితి ఎలా కలిగిందో తెలుస్తుందేమో అని ఒక చిన్న ఆశ’ అనుకుంటున్నంతలో చటుక్కున తట్టింది... అసలు మొదట తనకి శ్రావణిగారిని పరిచయం చేసింది కృషీవలరావుగారే కదా అని! ఇంత కాలమూ ఈ విషయం ఎందుకు తట్టలేదా అనుకుంది!


ఆనాడు కృషీవలరావుగారిని అడిగినప్పుడు తనకి ఆవిడ తెలుసనీ, ఆవిడ తన బిడ్డని కోల్పోయినప్పటినుండీ అలా మతిస్థిమితం లేకుండా అయిపోయారనీ, అంతకంటే తనకింకేమీ తెలియదనీ  అన్నారు. ఆ సమయంలో ఆవిడ దీనస్థితికి బాధపడి ఇంకేమీ అడగలేపోయాను. పైగా నేనూ చిన్నదాన్నవడంతో అంతకుమించి ఆయనని ఏమి అడగాలో తెలియలేదు కూడా!


కానీ ఇప్పుడు తెలుసుకోవచ్చుగా? కానైతే ఇప్పుడు కృషీవలరావుగారిని కలుసుకోవడం ఎలా? ఈ మధ్య రాష్ట్రంలో జరిగిన కొన్ని రాజకీయ మార్పుల వల్ల ఆయనిప్పుడు ఇక్కడ ఉండటం లేదనీ, ఆయనకి పదోన్నతిపై వేరే చోటికి పంపించే ఆలోచనలో ఉన్నారనీ, ఆ పనుల మీద దేశ  రాజధానికి వెళ్ళారనీ చాలా సమయమక్కడే ఉంటున్నారనీ, అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ అదేరోజు తిరిగి వెళ్ళిపోతున్నారనీ అనిరుధ్ చెప్తే తెలిసింది.


అనిరుధ్ తండ్రీ కృషీవలరావుగారూ ఏదో ఒక ఫంక్షన్  లో కలుసుకున్నప్పుడు  ఆయన ఈ విషయం  జి.టి.ఆర్. అంకుల్ కి చెప్పారట.  


శ్రావణిగారి గురించిన తన అన్వేషణలో చిన్న అశాకిరణం కనిపించేటప్పటికి కొంత ఉత్సాహం వచ్చి, అప్పటిదాకా ఆవరించి ఉన్న చిరాకు దూదిపింజలా  ఎగిరిపోయి మనసు తేలికైంది మానసకి.  మర్నాడు అనిరుధ్ కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి అనుకుని, తెల్లవారుఝామున లేచి చదువుకోవడంకోసం అలారం పెట్టుకుని  ప్రశాంతంగా నిద్రకి ఉపక్రమించింది మానస.


ఇక్కడ మానసకి ప్రశాంతమైన రాత్రైతే అక్కడ మరో ఇద్దరికి మాత్రం కాళరాత్రే అయింది.


దేశ రాజధానిలో ఒక కార్యక్రమానికి హాజరై వెనక్కి వెళ్తున్న కృషీవలరావు కారుకి  యాక్సిడెంట్ జరిగి తలకి బలమైన గాయలతో ఆస్పత్రిలో చేరాడు!


మానస ఉంటున్న నగరంలోనే భూషణం ఆరోగ్యం విషమించి కోమాలోకి వెళ్ళాడు!


ఇలా మానస గురించిన నిజం చెప్పేవాళ్ళు ఇద్దరూ అపాయంలో పడ్డారు! మరిప్పుడు మానస  ఏం చేస్తుందో? శ్రావణి గురించిన నిజం ఎలా తెలుసుకుంటుందో!    

(సశేషం)


No comments:

Post a Comment

Pages