నెత్తుటి పువ్వు - 33
మహీధర శేషారత్నం
(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన సరోజ అనే అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తాడు రాజు. బట్టల కొట్లో పనిచెయ్యనని చెప్పేస్తుంది సరోజ. ఒకరోజు లక్ష్మి రాజును సరోజ గురించి నిలదీస్తుంది. ఆమెను ఏమార్చి, సరోజ ఇంటికి వెళ్తుంటాడు రాజు. కడుపుతో ఉంటుంది సరోజ. ఆమెతో తాను సినిమాకు వెళ్తుంటే, ఎవరూ చూడకూడదని ఊరి చివరున్న సినిమా హాల్ కు తీసుకు వెళ్తాడు రాజు. )
“కనీసం నీతో కలిసి సినిమాకి వెళ్ళే అదృష్టం కూడా లేదు. వెధవ దొంగ బతుకయిపోయింది నాది” కళ్ళ నీళ్ళతో అంది సరోజ.
నాగరాజు మనసు చివుక్కుమంది.
“కొన్ని తప్పులకు పెనాల్టీ బాగా చెల్లించాల్సి ఉంటుంది. మరి ముందర మనం ఇవన్నీ ఆలోచించుకోలేదు.” కొంచెం సీరియస్‌గానే అన్నాడు నాగరాజు.
సరోజ చప్పున కళ్ళ నీళ్ళు తుడుచుకుంది.
“ఏదో బాధేసి అన్నాలే! ఏమనుకోబోకు!
“నాకూ ఉంటుంది బాధ. నే నిలాంటి తప్పు ఎలా చేసానో, ఎందుకు చేసానో నాకే అర్ధం కావడం లేదు” మంచం మీద కాల్ళు చాచుకుని పడుక్కుని కళ్ళమీద చేతులుంచుకున్నాడు.
మెల్లిగా సరోజ, పక్కన చేరింది 'సారీ' అంటూ.
“వెనక్కి అడుగు వెయ్యలేని తప్పుచేస్తాను, నామీద నాకే అసహ్యం వేస్తోంది.” నాగరాజు గొంతు బొంగురు పోయింది.
“ఛ! ఏదో అన్నావే! తెలివి తక్కువదాన్ని, వదిలెయ్” నాగరాజు మీద వాలింది.
నాగరాజు సుతారంగా లేపి కూర్చోపెట్టాడు.
సరోజ ముఖం చిన్న బుచ్చుకుంది.
“నువ్వన్నావని కాదు, ఇలాంటి సంబంధాలు ఊబిలాంటివి. దిగలాగేస్తాయి. తప్పించుకోలేం.” నాగరాజు ముభావంగా అన్నాడు.
సరోజ బావురుమంది.
“నేనంటే ఇష్టం పోయింది!” అంటూ
ఇష్టం ఉండడం, లేకపోవడం కాదు, ఇక్కడ విషయం, తప్పు చెయ్యడం, చెయ్యక పోవడం, నువ్వు చిన్నదానివి, ఆసరా లేనిదానివి, వెధవని నా బుద్ది ఏమయింది? ఎలా లొంగిపోయాను?”
నాగరాజు నుదురు కొట్టుకున్నాడు. హఠాత్తుగా లేచి నాగరాజు షర్టు వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు.
సరోజ కంగుతింది. బెదిరినట్లయింది.
ఆ వెళ్ళడం వెళ్ళడం నాగరాజు పదిహేను రోజుల వరకూ రాలేదు.
చూసి చూసి భయంవేసి సరోజ శంకరానికి ఫోన్ చేసింది. విషయం తెలుసుకున్న శంకరం నే మాట్లాడతాను అని ఓదార్చాడు.
నాగరాజుని ఒకసారి కదలేసాడు రోజా గురించి “నేను తప్పు చేసాను, ఎలా ఈ తప్పు దిద్దుకోవాలో నాకు తెలియటం లేదు” నిస్పృహగా తలవాల్చుకున్నాడు నాగరాజు. సరే! జరిగే ముందు ఆలోచించుకోవాలి ఇలాంటి వాటిని, ఇప్పుడు కాదు, ఇప్పుడు చేయవలసిన దానిని గురించి ఆలోచించు.” నెమ్మదిగా అన్నాడు శంకరం.
అది తెలియకేగా ఈ ఏడుపు విసుగ్గా అన్నాడు నాగరాజు ఆ అమ్మాయి మీద మోజు తీరిపోయిందా?” సూటిగా అడిగాడు శంకరం.
“ఒరేయ్! ఎవరలా అనుకున్నా బాధపడనురా! కానీ నువ్వుకూడా అలా అనకు రా! ఆ అమ్మాయిని తీసుకు వచ్చినప్పుడు నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. వెధవని పెద్ద సంస్కర్తలా చేసి ఇరుక్కుపోయాను.” నుదురు కొట్టుకున్నాడు. నాగరాజు.
సరే! జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడా అమ్మాయి కడుపుతో ఉంది. ఈ క్షణంలో మనం ఏమీ చెయ్యలేము. ముందు మీరిద్దరూ నాలుగు రోజులు అలా చిన్నటూరు తిరిగిరండి. వచ్చాక మెల్లిగా మా చెల్లెలని చెప్పి మా ఇంటికి మార్చేస్తాను. ఎంతయినా డెలివరీకి ఆడతోడు కావాలి కదా! గదికి అద్దెకిచ్చానని ఏదో చెప్పుకుంటాను, డెలివరీ అయ్యాక ఆలోచిద్దాం ఏం చెయ్యాలో సరేనా! ముందు మీరు నాలుగు రోజులు ఈ వాతావరణానికి దూరంగా వెళ్ళండి.
*****
నాగరాజుకి ఎప్పట్నుంచో గోదావరి జిల్లాలోని మారేడు మిల్లి అడవులు చూడాలని ఉంది. ముందు అడవులా అని గునిసినా ఒంటరిగా నాగరాజుతో ప్రయాణమంటే సరోజ ఉత్సాహపడింది. అదృష్టవశాత్తూ వాళ్ళ ఇంటి ఆచారమంటూ లక్ష్మి మూడో నెలరాగానే అన్న వదినవచ్చి వాళ్ళ ఊరు తీసుకెళ్ళారు. ఇదే అవకాశమని నాగరాజు, సరోజ మారేడుమిల్లి ప్రయాణం అయ్యారు.
సరోజ కంటే నాగరాజుకే ఎక్కువ నచ్చింది ప్రయాణం. రంపచోడవరం మీదుగా అల్లూరి సీతారామరాజు కర్మభూమిని మనసారా శ్లాఘిస్తూ... సీతారామరాజు పోరాటం, మన్యం వీరుల గురించి శ్రద్ధగా సరోజకి చెప్పడం మొదలెట్టాడు. చదువుకోని సరోజకి పెద్ద అర్ధం కాకపోయినా అతని ఉత్సాహానికి సహకరిస్తూ ఊ కొట్టింది. లోపలికి దట్టమైన అడవులలోకి వెడితే బ్రహ్మాండమైన వెదురుపొదలు. ఎత్తుగా ఎదిగే నేలను తాకుతూ నింగినీ నేలను తాకుతున్న అందమైన దృశ్యం. ఏమీ తెలియకపోయినా ఆ వెదురు పొదల అందం సరోజను కూడా ఆకట్టుకుంది.
“మాధవుని మోవిని తాకే అదృష్టం దీనికే పట్టింది.” అన్నాడు పరవశంగా.
“అంటే అంది సరోజ.
“మాధవుడు అంటే కృష్ణుడు, కృష్ణుడు మురళి వాయిస్తాడుగా. ఆ మురళిని ఈ వెదురు గడతోనే చేస్తారు. మోవి అంటే పెదవి” వివరించాడు నాగరాజు, మెట్టుమెట్టుగా చెక్కినట్టున్న మట్టిపై మొక్కలుచూసి సరోజ ఆశ్చర్యంగా చూసింది ఇదేమిటన్నట్టు.
“దీన్నే పోడు వ్యవసాయం అంటారు. కొండలుగా, గుట్టలుగా ఎత్తుగా ఉన్న ప్రాంతాన్ని మెట్లుగా చదునుచేసి ఇలాగే వ్యవసాయం చేసేవారు. దీన్నే పోడు వ్యవసాయం అంటారు. మనది మైదాన ప్రాంతం” అన్నాడు సరోజకి అర్ధమయీ, అర్ధం కానట్టుగా ఉంది. కాని నాగరాజుతో ఏకాంతంగా తిరగడమే ఆనందంగా ఉంది. మధ్యలో ఎక్కడనుండో పరుగులు పెట్టుకుంటూ పలచని ఆడపిల్ల చెక్కిళ్ళలా జాలువారే ఏటినీరు అడుగు కనపడనంత స్వచ్ఛంగా ఉంటే సరోజ చిన్నపిల్లలా అందులో నిలబడి కాళ్ళు తప తప లాడించింది. డాన్సు చేస్తున్నట్టు. నాగరాజు ఆ దృశ్యాన్ని సరదాగా సెల్ఫోన్లో ఫొటోతీశాడు. వీడియో తియ్యి, వీడియో తియ్యి అంటూ డాన్సు ఫోజులిచ్చింది.
ఆ రాత్రికి గెస్ట్ హౌస్ లో ఉన్నారు పొద్దున్నే లేచి ఫ్రెష్ అయి మళ్ళీ బయటికి బయల్దేరారు.
సరోజ ఇరుకు ప్రపంచంలోంచి బయటికి వచ్చిన ఆనందములో ఇదేంటి? అదేంటి? అని అడుగుతూనే ఉంది వసపిట్టలా.
“ఇవి కాఫీ మొక్కలు.... చూడు ఇంత చిన్న చెట్లు, చిన్న గింజలు అని మమ్మల్ని చిన్న చూపు చూడకండి. నేను లేకపోతే మీకు వెలుగేలేదు. తెల్లారదు అంటూ ఆ ఎర్రగా పండిన పళ్ళతో ఎక్కిరిస్తున్నట్లు లేవూ? ఇవి మిరియపు తీగలు. ఆకులు చూడు. అరచేయంత మందంగా, దృఢంగా చురుక్కు మనిపించే ఘాటు చిట్టి గింజలకి మేమే ఇచ్చామని గర్వంగా చెప్పుకున్నట్టు లేవూ? నాగరాజుకి ఎంతో ఆనందంగా ఉంది. సరోజ నాగరాజు భుజంమీద చెయ్యేసి నడుము చుట్టేసి అలా అడవులలోకి నిర్భయంగా సాగిపోయింది. లోపలికి వెడుతూ ఉంటే తన నీడలలో జాడలలో తన వెలుతురు కిరణాలు తాను వెతుక్కుంటూ చిన్నబోయిన సూరీడు.
(సశేషం)
No comments:
Post a Comment