పరివర్తన - నాటిక (మూడవ భాగం) - అచ్చంగా తెలుగు

పరివర్తన - నాటిక (మూడవ భాగం)

Share This

 పరివర్తన - నాటిక (మూడవ భాగం)

దినవహి సత్యవతి 


తృతీయ అంకం

    (పాత్రలు : లలిత  ,ఆనంద్ , నవ్య,  రాధిక , కమల,మేరీ, రజియ )

(1 వ స్థలం: ఆనంద్ ఇల్లు)

(నవ్య పుట్టినరోజు పార్టీ జరుగుతుంటుంది. ఆనంద్, లలిత  ప్రక్క గదిలోంచి చూస్తుంటారు) (నవ్య కేక్ కట్ చేస్తుంది)

స్నేహితులు :  హ్యాపీ బర్త్ డే టూ యూ.....హ్యాపీ లాంగ్ లైఫ్ టూ యూ

హ్యాపీ బర్త్ డే టూ యూ డియర్ నవ్యా...(ముక్త కంఠంతో 2 సార్లు పాడతారు)  

నవ్య : థాంక్యూ! థాంక్యూ అందరికి ( స్నేహితురాళ్ళు ఒక్కొక్కరినీ సంబోధిస్తూ ధన్యవాదాలు చెప్తుంది)

స్నేహితులు : ఇది మా గిఫ్ట్ (అందంగా ప్యాక్ చేసి ఉన్న ఒక పెద్ద బాక్స్ నవ్య చేతికి ఇస్తారు)

నవ్య : థాంక్యూ వన్స్ ఎగైన్ (ప్యాకెట్ అందుకుని ప్రక్కన పెడుతుంది)

రజియా: బర్త్ డే బేబీ ఇవాళ మాకోసం ఏమి స్పెషల్స్ చేసిందో?

నవ్య : అవునే నిజంగానే ఇవాళ మీకు ఒక స్పెషల్  పార్టీ.

మేరీ:  ఉత్తి స్పెషలేనా? లేక.........

నవ్య : అది సస్పెన్స్.  

స్నేహితులు : అబ్బా..త్వరగా చెప్పవే చంపక?

నవ్య : వేచిచూడండి. అందాకా ఇవిగో ఇవి తినండి (కేక్  తో పాటు స్నాక్స్ కూడా ప్లేట్లలో పెట్టి అందరికీ ఇస్తుంది. కబుర్లు చెప్పుకుంటూ తింటారు)

నవ్య : ఒకే ఫ్రెండ్స్! ఇప్పుడు మీకొక సర్ప్రైజ్!  ఉండండి ఇప్పుడే వస్తాను

(లోపలికి వెళ్ళి ఒక పెద్ద  ప్లేటులో చిన్న గాజు గ్లాసులు , విస్కీ అని వ్రాసున్న ఒక పెద్ద సీసా తీసుకొస్తుంది) ఇదిగో మీ ఎక్స్ట్రా స్పెషల్ !

స్నేహితులు : నవ్యా! (స్నేహితులందరూ  ఆశ్చర్యంగా చూస్తారు. లోపలినుంచి ఇదంతా చూస్తున్న ఆనంద్, లలిత నిశ్చేష్టులవుతారు)

నవ్య : మరి పార్టీలో ఎక్స్ట్రా స్పెషల్ ఉందా అని ఆ రోజు అడిగారుగా (చిన్నగా నవ్వుతుంది)

స్నేహితులు : అదికాదే...(అని ఇంకా ఏదో అనబోతుండగా ష్!అని సైగ చేస్తుంది. అందరూ ముఖాముఖాలు  చూసుకుంటారు)

నవ్య : ఎంజాయ్ చెయ్యండి.(అందరికీ సగం నింపిన డ్రింక్ గ్లాసులు ఇస్తుంది )

స్నేహితులు : చీర్స్ టూ  నవ్య (గ్లాసులు ఎత్తి పట్టుకుని ఒకదానినొకటి తాకించి నెమ్మదిగా సిప్ చేసి త్రాగుతూ కబుర్లలో పడతారు).   

నవ్య : ఇది మూడో సారి కదా మనం ఇలా ఎక్స్ట్రా స్పెషల్ పార్టీ చేసుకోవడం .

మేరీ: అవును! మళ్ళీ మళ్ళీ ఇలాంటి పార్టీలు చేసుకుంటే బాగుంటుంది కదా! ఏయ్ నవ్యా ఇది ఏ బ్రాండ్? చాలా బాగుంది ఇంకొంచం పొయ్యి(మేరీ గ్లాసు మరో సగం నింపుతుంది).

నవ్య : మీకు కూడా ఇంకా కావాలా ?(అందరినీ అడిగి తను కూడా ఒక గ్లాసు తీసుకుంటుంది)

(ఇదంతా దూరంనుంచి చూస్తున్న లలిత  ఆనంద్  ముఖాలు కత్తివేటుకు నెత్తురు చుక్క లేనట్లుగా పాలిపోతాయి)

లలిత  : ఏమండీ! మనం చూస్తున్నది నిజమేనా? లేక భ్రమా? (గొంతు గద్గదమవుతుంది  దుఃఖంతో)  

ఆనంద్ : నా పరిస్థితీ అలాగే ఉంది ( నెమ్మదిగా గొణుగుతాడు)

లలిత  : ఇది  నా కూతురేనా అనిపిస్తోంది?(ఆనంద్ అయోమయంగా లలిత  వైపు చూస్తాడు)

(మరో వైపు పార్టీలో..నవ్య తో సహా అందరూ డ్రింక్స్ త్రాగడం అయిపోతుంది)

నవ్య : మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ రోజుని నా జీవితంలో మరవలేను. 

స్నేహితులు : మరింక వెళతామే!  చాలా లేటయ్యింది.

నవ్య : సరేనే మరి. పార్టీకి వచ్చినందుకు అందరికీ మరో సారి థ్యాంక్స్ (అందరూ నిష్క్రమించాక నవ్య ప్లేట్లు , గ్లాసులు , విస్కీ సీసా ట్రేలో ఉంచి లోపల పెట్టడానికి వెళుతుంది)

లలిత : నవ్యా! (కోపంగా పిలుస్తుంది )

నవ్య : ఏంటమ్మా? (గబ గబా తల్లి దగ్గరకు వస్తుంది)

ఆనంద్ : ఏంటే ఇందాక పార్టీలో నువ్వు చేసిన పని? (గర్జిస్తున్నట్లుగా అడుగుతాడు)

నవ్య : (తండ్రి వైపు  చూస్తుంది కానీ సమాధానం చెప్పదు)

లలిత : నాన్న అడుగుతుంటే సమాధానం చెప్పవేం? ఎప్పటినుంచీ నీకీ తప్పుడు అలవాటు?

నవ్య : ఏ అలవాటు?

లలిత : అదే ఈ డ్రింక్స్ అవీ ..... ఇదంతా ఏమిటీ అని ?

నవ్య :  ఏం నాన్న తాగితే తప్పు లేదుగానీ నేనేదో సరదాగా ఫ్రెండ్స్ తో ఒక పెగ్ తీసుకుంటే తప్పెలా అవుతుంది? (నిర్లక్ష్యంగా తల ఎగరవేస్తుంది)

ఆనంద్ : నన్నే అనేంతదానివయ్యావా? ఎంత పొగరే నీకు (లాగిపెట్టి  గూబమీద కొడతాడు)   

నవ్య : అమ్మా...... (బాధతో గిలగిలలాడుతూ చెంప పట్టుకుని కన్నీటిని బలంగా అదిమిపెట్టడానికి విఫల ప్రయత్నం చేస్తుంది)

లలిత : అసలిలా కాదు పద  నీ పని చెప్తాను  (నవ్య బాధ పట్టించుకోకుండా  రెక్క పుచ్చుకుని  లోపలికి లాక్కెళ్ళుతుంది)

నవ్య : అమ్మా..వదులమ్మా నెప్పెడుతోంది(తల్లి ఉడుం పట్టునుంచి చెయ్యి వదుల్చుకోవడానికి గింజుకుంటూ చెవి పట్టుకుంటుంది బాధగా)

లలిత : నోరెత్తావంటే ఊరుకోను. అవతలికి రాకు పిలిచేదాక. పడుండు ఇక్కడే (నవ్యని విసురుగా గదిలోకి నెట్టి గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది వెనక నుంచి అబ్బా అబ్బాఅంటూ చెవిపట్టుకుని నొప్పితో మూలుగుతున్న నవ్యని పట్టించుకోకుండా)   

ఆనంద్ : (ఇక్కడ ..హాలులో కూతురు సమాధానానికి నిశ్చేష్టుడై కుర్చీలో ధఢాలున కూలబడతాడు) (స్వగతం) :  అసలు నేను త్రాగుతానని  నవ్యకి  ఎలా తెలిసింది? (ఇంతలో అక్కడికి వచ్చిన లలితను చూసి) నువ్వు గానీ దానికి చెప్పావా? నువ్వు చెపితే నేను వినడం లేదని  నీ కూతుర్ని నా మీదకి ఉసిగొల్పుతున్నావా?

లలిత : ఏం మాట్లాడుతున్నారండీ మీరు? నేనెందుకు అలా చేస్తాను? (బాధగా అంటుంది)  

ఆనంద్ : అయితే దానికెలా తెలిసింది ఈ విషయం?

లలిత : ఏమో నాకేం తెలుసు? నేనానాడే చెప్పాను ఇలాంటివి ఎక్కువ కాలం దాచలేరని మీరు నా మాట వింటేగా ? (లలిత  స్వరంలో తీవ్రత)

ఆనంద్ : ( వారింపుగా చెయ్యెత్తి) చాలు ఇక ఆపు. అవకాశం దొరికింది కదాని నీ పురాణం విప్పకు .

లలిత : ఇవాళ జరిగినదంతా కళ్ళతో చూసాక కూడా మీరిలా మాట్లాడటం ఏమీ బాగాలేదు. పైగా ఎదిగొచ్చిన పిల్ల మీద చెయ్యి చేసుకున్నారు! అసలిందులో  నవ్య తప్పేముందని దాన్ని కొట్టారు?  

ఆనంద్ : ఏంటీ దాన్ని వెనకేసుకొస్తున్నావు?

లలిత :  వెనకేసుకు రావటం కాదు. పిల్లలు తల్లిదండ్రులనుంచే నేర్చుకుంటారు మంచైనా చెడైనా. కళ్ళకి కనిపించేదే నిజం వాళ్ళకి. నవ్యది అన్నీ అర్థం చేసుకోగలిగే వయసు.  ఇంట్లో జరుగుతున్న విషయాలు దాని దృష్టిలో పడకుండా ఉంటాయా?

ఆనంద్ : అంటే నీ ఉద్దేస్యం?

లలిత  : ఇందులో ఉద్దేస్యానికేముంది జరుగుతున్నదదే కదా? మొన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు మన మధ్య జరిగిన వాదన విన్నట్లుగా దాని ముఖం చూడగానే అర్థమయింది నాకు. 

ఆనంద్ : ఆహా ! మనుషుల్ని చదవగల తెలివితేటలు కూడా ఉన్నాయన్న మాట నీకు? (గొంతులో వ్యంగ్యం)

లలిత  : అంత హేళన అక్కర్లేదు. నాన్న ఎందుకమ్మా ఈ మధ్యన అదోలా ఉంటున్నారు, చిరాకు పడుతున్నారు అని కూడా అడిగింది. ఇంతో కొంతో సంస్కారం ఉన్నది కనుక అక్కడితో ఆపింది. అది మిమ్మల్ని సూటిగా ప్రశ్నించి నిలదీసే దాకా తెచ్చుకోవద్దూ అంటున్నాను. అంతే!

ఆనంద్ : అంటే తప్పంతా నాదేనంటావా?

లలిత : ఆ ప్రశ్న మీకు మీరు వేసుకుంటే సమాధానం మీకే తెలుస్తుంది (కోపంగా అని లోపలికి వెళుతుంది)

ఆనంద్ : (స్వగతం ) ఇంత చిన్న వయసులో  నవ్యకి ఈ డ్రింక్ అలవాటేమిటీ? ఎవరి దగ్గరనుండి నేర్చుకుందో! (ఆ ఆలోచన రాగానే వీపుపై ఎవరో కొరడాతో ఛెళ్ళున కొట్టినట్లై ఉలిక్కిపడి వీపు తడుముకుంటాడు అసంకల్పిత ప్రతీకార చర్యగా)  

నా తెలివితక్కువగానీ ఎవరినో చూసి నేర్చుకోవాల్సిన అవసరం నవ్యకి ఏముందీ? కూతురికి  ఆదర్శంగా ఉండాల్సిన నేనే  ఇంట్లో ఇలాంటి పన్లు చేస్తుంటే ? అది త్రాగడం తప్పని అనుకుంటున్నానే  మరి నేను చేస్తున్నదేమిటీ? నేను తప్పు చేస్తూ దాన్ని ప్రశ్నించే హక్కుందా నాకసలు?  ఛ! ఛ! ఎంతపని చేసాను? ముందూ వెనకా ఆలోచించకుండా పాపం దాన్ని  కొట్టాను. ఎంత బాధపడుతోందో(బాధగా దోసిలిలో ముఖం దాచుకుంటాడు)

లలిత :  నవ్యా! (లోపలినుంచి గాభరాగా కేక వినిపిస్తుంది. ఆనంద్ పరిగెత్తుకు వెళతాడు.)

ఆనంద్ : ఏమైంది ఎందుకలా కేక పెట్టావు?

లలిత  : ( ఏడుస్తూ )నవ్య ఎంత పిలిచినా పలకడం లేదండీ. నాకేదో భయంగా ఉంది.

(ఆనంద్ కూడా నవ్యని కుదుపుతూ నవ్యా...నవ్యా అని పిలుస్తాడు కానీ సమాధానం రాదు)

ఆనంద్ : స్పృహ తప్పినట్లుంది. పద ఆస్పత్రికి తీసుకెళదాము.  

రాధిక:  అలాగే (పరుగున వెళ్ళి తాళాలు తీసుకొస్తుంది)

ఆనంద్ : రా నవ్యని లేవదీసి చెరోవైపూ పట్టుకుందాము. తల నీ భుజం పై వాల్చుకో(చెరో వైపూ చేయూతనిచ్చి కూతుర్ని నడిపించుకుంటూ ఆస్పత్రికి బయలుదేరతారు.)

No comments:

Post a Comment

Pages