వ్యసనం
భాగవతుల కృష్ణారావు
తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు వీర్రాజు.
తనకొడుకు.. తన రక్తం పంచుకుపుట్టిన కొడుకేనా అలా మాట్లాడేడు.
నిండా పదారేళ్లు లేవు..
గుండెలో గునపాలు గుచ్చినట్టయింది.
ఎంత మాటన్నాడు.!!
ఏ కొడుకూ తండ్రి గురించి అనకూడని...వినకూడని మాట.
కలుక్కుమంది ఎక్కడో.
వీర్రాజు రైల్వే లో కళాసీ.
ఉత్తరాంధ్ర వాళ్లంతా అప్పట్లో బెంగాల్ వలసవచ్చి రైల్వే లో వుద్యోగాలు సంపాదించేవారు.
స్థానికులైన బెంగాలీల కన్నా సమర్థవంతంగా, నిజాయితీగా పనిచేయటం వలన తెలుగు వారిని ఎక్కువగా పనుల్లోకి తీసుకునే వారు.
అలా రెండు తరాల నుండీ ఖరగ్పూర్ లో సెటిలయ్యారు.
వీర్రాజు తండ్రి రైల్వే వర్క్ షాప్ లో పనిచేస్తూ,సర్వీసు లో వుంటుండగానే తాగుడికి బలయ్యాడు.
కంపాషనేట్ గ్రవుండ్లో వీర్రాజు కి కళాసీ గా అక్కడే ఉద్యోగం దొరికింది.
తండ్రి ఉద్యోగం తో పాటు ,తాగుడు కూడా వారసత్వం గా సంక్రమించింది.
అక్కడున్న చిన్న తెలుగు సెటిల్మెంట్ లో వున్న ఏకైక సారా దుకాణానికి పర్మనెంట్ కస్టమర్ గా నమోదయాడు.
సారా కొట్టు సాంబడు గండుపిల్లిలా వుంటాడు.
మొహం దుమ్మరిగొండులా వుంటుంది.
చిన్నప్పుడే తల్లిదగ్గర నేర్చుకున్న అనుభవాలను వయసు తో పాటు పెంచుకున్న లోకజ్ఞానంతో జనాల బలహీనతనాధారం చేసుకుని కోట్లకి పడగలెత్తాడు.
అతడికి వడ్డీ వ్యాపారం కూడావుంది.
గూండాల్లాటి మనుషులు చేతికింద వున్నారు.
ఇంట్లో నోరెత్తని పెళ్లముంది.
ఒంట్లో కావలసినంత సుగరుంది.
వంటిమీద లచ్చింతల్లి ఉంగరాలు, గొలుసుల రూపం లో నాట్యం చేస్తూ వుంటుంది.
వీటన్నిటితో పాటు వయసొచ్చినా బుర్ర పెరగని పదేళ్ల కొడుకున్నాడు.
తాగొద్దని బతిమలాడుతూ వీర్రాజు తల్లీ, భార్యా ఎంత నెత్తీనోరూ కొట్టుకున్నా ఫలితం లేకపోయింది.
రోజూ సాయంత్రం రాగానే అక్కడ ముందు హాజరు వేయించుకుని,నానారకాల దుర్భాషలతో, మైకం లో ఇల్లు చేరేవాడు.
నెల జీతం లో మూడొంతులు తాగుడికే పోయేది.
తల్లి, భార్య రకరకాల పన్లు చేసి ఇల్లు నెట్టుకొచ్చేవారు. కొడుకు ను మాత్రం ముద్దుగా చూసుకునే వాడు.
రైల్వే ఇంగ్లీషు బడిలో వెయ్యటం వల్ల చదువు ఆటంకం లేకుండా పదో క్లాసు వరకూ వచ్చేడు.
బుద్ధిమంతుడు కాబట్టి శ్రద్ధగా చదువుకునేవాడు.
ఇంటి పరిస్థితులు చికాకుగా వున్నా,తండ్రి తనంటే ప్రేమగా వుండేవాడు కాబట్డి ఏమనలేకపోయేవాడు.
కానీ అంతర్గతంగా తండ్రి చేత యీ అలవాటు మాన్పించాలని వుండే ది.
కానీ ఏంచెయ్యాలో తెలిసేది కాదు.
అక్కడ ఉన్న క్వార్టర్స్ లో కుటుంబాలన్నీ అదే అవస్థ లో ఉండేవి.
దాదాపు వంద కొంపలున్న ఆ కాలనీలో శీతాకాలం వచ్చేసరికి లివర్ సిరోసిస్ జబ్బుతో తాగుడు వల్ల చనిపోయే వారి సంఖ్య ఎక్కువే.
ఈ మధ్య వీర్రాజు కూడా ఒకటి రెండు సార్లు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.
డాక్టర్ తాగుడు పూర్తిగా మానేయమన్నాడు.
***
సర్రున కారు పక్క నుంచి దూసుకు పోయీసరికి ,బూతులు తిట్టుకుంటూ పక్కకి గెంతేడు వీర్రాజు.
తొందరగా సారా కొట్టు చేరే హడావుడి లో వున్నాడు.
ఇవాళ తను కొంచెం లేటయ్యాడు.
తన సెక్షన్ లో పనిచేస్తున్న యూసుఫ్ తలపై రిపేరు చేస్తున్న బోగీ కిటికీ పడటం వల్ల రైల్వే హాస్పిటల్ లో జాయిన్ చేయించడం వగైరా హడావుడి లో తన రొటీన్ దెబ్బతింది.
అప్పుడు ...
అక్కడ..
సరిగ్గా దుకాణానికి వెనక వున్న మైదానం దగ్గర తన కొడుకుని ,స్నేహితుడిని చూసాడు.
ఇద్దరు బిగ్గరగా మాట్లాడు కుంటున్నారు.
అను కోకుండా తన చెవిని పడ్డాయా మాటలు.
స్నేహితుడు అడిగిన దానికి జవాబు గా చెప్తున్నాడు-
" మహా అయితే మరో యేడాది..అంతే మా నాన్న పోతే నాకు రైల్వే ఉద్యోగం వస్తుంది.ఇలా తాగిన వాళ్లు ఎంతకాలం బతుకుతారు..."
ఇంకా యేదో అంటున్నాడు.
మరేమీ విన బడలేదు.
తల దిమ్మెక్కింది.
ఫుల్బాటిల్ తాగిన నిషా కూడా దిగిపోయే మాట విన్నాడు తను.
తనెంతో ప్రేమగా
కొడుకు యిలా అనడం వీర్రాజుకి బాధ కలిగించింది.
కొడుకు వీపు తనవేపు వుంది.
వాళ్లు తనని చూడకుండా జాగ్రత్త పడుతూ , వెంటనే వెను దిరిగి ఇంటి వేపు నడవసాగేడు.
దుకాణం లో దూరకుండా ఇంటి దారి పట్టాడే గానీ కొడుకు మాటలు మెదుల్తునే వున్నాయి.
దారంతా వాహనాలతో నిండిపోయింది.
వర్క్‌షాప్ నుండి ఇళ్లకొస్తున్న జనాలు గుంపులుగా కనపడ్డారరు.
ఖాకీ యూనిఫాం లో ఎదురుగా వస్తున్న వాడు..సత్యనారాయణ కొడుకేనా?
తన కొడుకు కన్నా రెండేళ్లు పెద్ద.
సత్యనారాయణ తనతోనే పనిచేసేవాడు.
తన వూరివాడే.
ఇద్దరూ ఒకేసారి ఉద్యోగం లో ప్రవేశించారు.ఆర్నెల్ల
కిందట హఠాత్తుగా మరణించడంతో కొడుక్కి ఉద్యోగం దొరికింది.
తనుకూడా ఆఫీసులంట తిరిగి,వాళ్లనీ వీళ్లనీ పట్టుకుని సాధించాడు.
పెన్షన్ బాంకు వ్యవహారాలు కూడా చూసాడు.
చక్కగా చదువుకుంటున్న వాడల్లా చదువాపి ఉద్యోగం లో చేరవలసి వచ్చింది.
జాలేస్తుంది వాడి లేత మొహం చూస్తే.
రేపు కొడుకన్నట్టు తనకేదయినా అయితే...
ఎవరు చూస్తారు?
లోకజ్ఞానం లేని భార్య,సత్తెకాలపు తల్లీ ఎవరి కాళ్లు పట్టుకుంటారు?
ఊహే భయంకరంగా వుంది.
***
గుమ్మం లో భార్య మైకం లో కాక సజావుగా,పెందరాళే నడిచొస్తున్న భర్తను ఎనిమిదో వింతలా చూసింది.
వంట చేస్తున్న తల్లి కోడల్ని యేదో అడగబోతూ,ఇంట్లో అడుగు పెట్టిన కొడుకుని చూసి నోరు వెళ్ల బెట్టింది.
తిన్నగా గదిలోకి పోయి బట్టలు మార్చుకుని వరండాలోకి వచ్చి కుర్చీ లో కూర్చున్నాడు. వింతగా అతన్ని చూస్తూ దగ్గర కొచ్చారు ఆడవాళ్లిద్దరూ.
దగ్గర కొచ్చిన తల్లి ని పట్టు కుని
" అమ్మా! నేనివాళ నుంచీ తాగుడు మానేస్తునాను" అన్నాడు.
వాళ్ళిద్దరూ నీళ్లునిండిన కళ్లతో అతడినే చూస్తునారు.
ఏ దేవుడు కరుణించాడో వాళ్లకి అర్ధం కాలేదు.
అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టిన వీర్రాజు కొడుకు పెదాలపై విజయసూచకంగా చిరునవ్వు మొలిచింది .
***
No comments:
Post a Comment