చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 7 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 7

Share This

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల)  - 7

అనువాద కర్త : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ) 

ఆంగ్ల మూలం :  The Moonstone Castle Mystery

నవలా రచయిత : Carolyn Keene


 

(ముగ్గురు అమ్మాయిలు డీప్ రివర్ బయల్దేరబోతున్న నాన్సీని అక్కడకు వెళ్ళవద్దని ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ చేసిన వ్యక్తికి ధైర్యం చెప్పి, ఆమె డీప్ రివర్ వెళ్తుంది. హోటల్ పరిసరాలనుంచి బైనాక్యులర్స్ లో చూసిన వాళ్ళకు పురాతనమైన కోట కనిపిస్తుంది. వాళ్ళు హోటల్ కి తిరిగి వస్తూ పిడుగుపాటుని తప్పించుకుంటారు.  తరువాత......)

@@@@@@@@@


ముగ్గురమ్మాయిలు లోనికి వెళ్తుండగా, ప్రకాశవంతమైన మెరుపు మెరిసింది.  దాని తరువాత గూబ గుయ్యిమనిపించే ఉరుము ఉరిమింది.  


  "వర్షం లేదు!" కంపితస్వరంతో అంది బెస్. "విషయమేంటి?"  


  "దీన్ని అందరూ పిలిచే డ్రై స్టార్మ్ అంటారు" అని బదులిచ్చింది నాన్సీ.  "తుఫానులన్నింటిలోకి యిది ప్రమాదకరమైనది."


  అయితే కొద్ది క్షణాల్లో వాన పడటం ప్రారంభమైంది.  మందంగా ఉన్న నీటితెరలా పడే వాన జల్లుకి, కిటికీలోంచి పది అడుగుల కన్నా ఎక్కువ దూరం  చూడలేకపోతున్నారు.  వారు తుఫాన్ని చూస్తూండగా, మిసెస్ థాంప్సన్ అమ్మాయిల గదికి వచ్చి వారి యోగక్షేమాలను ఆరా తీసింది.  నాన్సీ తాము బాగానే ఉన్నట్లు చెబుతూ, పిడుగు వల్ల చెట్టు పడిపోయినప్పుడు భయం వేసినట్లు ఒప్పుకొంది.  "మీ మనోహరమైన సింధూర వృక్షం నాశనమైనందుకు చాలా బాధ అనిపించింది" అని జాలిపడిందామె.  


  "నేను కూడా బాధపడుతున్నాను" మోటెల్ యజమాని బదులిచ్చింది.  "కానీ కూలిపోయిన భాగం మోటెల్ కు దూరంగా ఉంది.  బహుశా వృక్ష వైద్యుడు నాశనమైన భాగం కనిపించకుండా దాన్ని తిరిగి కలపగలడు." 


  "మీకు తరచు యిలాంటి తుఫాన్లు వస్తుంటాయా?" బెస్ అడిగింది.  


   తాను ఈ మోటెల్ నిర్వహణను చేపట్టాక యిది మొదటిదని మిసెస్ థాంప్సన్ చెప్పింది.  "కానీ యిక్కడ ప్రజలకు నేను కొత్త.  నేను యిక్కడకు వచ్చి ఏడాది కన్న తక్కువే!"  


  "అయితే నేను లోయలో చూసిన కోట గురించి మీకు పెద్దగా తెలియకపోవచ్చు" నాన్సీ వ్యాఖ్యానించింది.  "ఇదంతా మొహమాటం లేని ప్రాంతంగా కనిపిస్తోంది."


  మిసెస్ థాంప్సన్ చిన్నగా నవ్వింది.  "అందులో మాత్రం నాకెలాంటి సందేహం లేదు. నేనిక్కడకు వచ్చినప్పటినుంచి నాకు ఖాళీ దొరకనందున స్థానిక చరిత్ర గురించి తెలుసుకోవటానికి సమయం దొరకటం లేదు.  కానీ. . ." అంటూ ఒక్క క్షణం ఆగిందామె.  ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి. "మీరు డీప్ రివర్ గురించి గానీ లేదా డీప్ రివర్ లోయ గురించి గానీ ఏమన్నా తెలుసుకోవాలనుకొంటే, మిసెస్ హేంస్టెడ్ తో మాట్లాడమని సూచిస్తున్నాను.  ఆమె ఈ పట్టణంలోని వాణిజ్యప్రాంతంలో ఉండే బ్రాస్ కెటిల్ అనే టీ రూం యజమాని తల్లి."


  ముగ్గురు అమ్మాయిలు నవ్వారు.  "అంటే ఆమె ఈ పట్టణంలోనే అధిక ప్రసంగి అంటారా?" జార్జ్ వ్యాఖ్యానించింది.


  "అదే ఆమెకు తగిన పేరు అనిపిస్తోంది" మిసెస్ థాంప్సన్ బదులిచ్చింది.  "ఇక్కడ జరిగే ఏ విషయమైనా తనకు తెలియకుండా ఉండదని ఆమె గర్వంగా చెప్పుకొంటుంది."


  నాన్సీ ఏకాగ్రతతో వింటోంది.  మిసెస్ హోర్టన్ మనవరాలి గురించి కొంత సమాచారం తెలిసిన వ్యక్తి యిక్కడ ఉందన్నమాట!  


  "రాత్రి భోజనం బ్రాస్ కెటిల్ లో చేద్దాం" ఆమె మిగిలిన అమ్మాయిలతో చెప్పింది.  ఆమె సలహా యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు అర్ధం చేసుకొన్నారు.  


  వర్షం ఆగిపోయేవరకూ వాళ్ళు వేచి ఉండి, తరువాత ఆసక్తి గొలిపే గ్రామానికి బయల్దేరారు. నాన్సీ ప్రధాన రహదారి చివర వరకు కారును పోనిస్తూ, బ్రాస్ కెటిల్ కోసం బాటకి యిరుపక్కలా గమనిస్తోంది.  అది కనిపించక, కారుని వెనక్కి తిప్పి వచ్చిన బాటనే తిరిగి పోనిచ్చింది.  "టీ రూం పక్కవీధిలో ఉండి ఉంటుంది" అని వ్యాఖ్యానించింది.


ప్రతీ రెండు రోడ్ల కూడలి వద్ద కొంతసేపు ఆగి, వాళ్ళు ముందు కెళ్తుండగా, నాన్సీ రెండు వేర్వేరు కిటికీల మీద కార్యాలయాల పేర్లను గమనించింది.  ఆ రెండు కార్యాలయాల నిండా న్యాయవాదులు ఉన్నారు.  "హోర్టన్ ఎస్టేట్ ని పరిష్కరించిన న్యాయవాది వాళ్ళలో ఉండి ఉన్నాడా? ఒకవేళ ఉంటే, అతను సెలవు నుండి తిరిగి వచ్చాడా?" నాన్సీ పరాకుగా గొణుక్కొంది.  


  ఆమె రెండు బాంకులను కూడా గమనించింది.  మరునాడు ఆ నాలుగు ప్రాంతాలకు వెళ్ళి, తనకు వీలైనంత సమాచారాన్ని సేకరించాలని అనుకొంది.  


  అకస్మాత్తుగా జార్జ్ అరిచింది. "టీ రూముని చూసాను.  ఆపు! కుడివైపుకి తిప్పు!"  


  నాన్సీ కారుని వెనక్కి తిప్పి పక్క వీధిలోకి పోనిచ్చింది.  ఆ సందు మొగనుంచి రెండు గుమ్మాలు దాటాక బ్రాస్ కెటిల్ వచ్చింది.  


  ఆ ప్రాంతం చాలా ఆకర్షణీయంగా ఉంది.  పాత సంప్రదాయం ప్రకారం కట్టిన తెల్లని యింటికి మధ్యలో ప్రవేశ ద్వారం ఉంది.  దాని ముందు వాడిగా చెక్కిన తెల్లని కొయ్యలతో వేసిన కంచె, దాని లోపల అందమైన పూలతోట కనిపించాయి. 


  అమ్మాయిలు రెస్టారెంటులోకి అడుగుపెట్టారు.  లోపలి భాగం కూడా బయట ఉన్నట్లే సాంప్రదాయికంగాను, ఆకర్షణీయంగాను ఉంది.  మధ్య హాలు ఎడమ వైపున చేరబడడానికి వీలుగా ఉండే సోఫా, కుర్చీలు గల విశ్రాంతి గది ఉన్నాయి.  ఆ గోడలకు అలంకారాలుగా అమర్చిన అలమరాల్లో అనేక రకాల సామాన్లు నింపబడి ఉన్నాయి.  నిప్పుగూటిపై అమర్చిన బంగారు పూతతో ఆకర్షణీయంగా కనిపించే ఫ్రేములో, తెల్లని జుట్టు, పొడవైన గడ్డం గల వయసు మళ్ళిన ఒక ప్రముఖ వ్యక్తి చిత్రపటం ఉంది.  పెద్ద పూవు డిజైనుతో ఉన్న ముకమలు తివాచీ, యితర అలంకరణలతో నిండిన ఆ గది ముచ్చట గొల్పుతోంది.  


  నాన్సీ ఆమె స్నేహితురాళ్ళు గదంతా ఒకసారి వేగంగా పరికించారు.  వారి దృష్టి మాత్రం ఊగే పురాతన కుర్చీలో కూర్చున్న వృద్ధురాలిపై కేంద్రీకృతమై ఉంది.  ఆమె కట్టుకున్న నల్ల పట్టు దుస్తులు మాసి ఉన్నాయి.  దాని చివరలో మెడ దగ్గర సన్నని పట్టీ అల్లబడింది.  ఆమెతో పొట్టిగా, లావుగా ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు.  అతని వీపు అమ్మాయిల వైపు ఉంది.  


  అమ్మాయిలు ఆగి, ఆ ముసలామె అతనితో బిగ్గరగా చెబుతున్న మాటలను విన్నారు. "పేరు డ్రూ, అదేగా మీరు చెప్పేది?  నేను మీకు తెలియజేస్తాను."  


  బెస్, జార్జ్ యిద్దరూ నాన్సీ చేతుల్లో ఒక దాన్ని పట్టుకొన్నారు.  అపరిచితుడు మాట్లాడేది నాన్సీ గురించా లేక ఆమె నాన్న గురించా?


  తక్షణం నాన్సీ వారి దృష్టికి దూరంగా ఉండటమే తెలివైనదని నిశ్చయించుకొంది.  అమ్మాయిలిద్దరినీ ఒక పక్కకు లాగి వారితో గుసగుసలాడింది.  "నేను టీ రూము వెనుక మూలకి తప్పుకొంటాను.  మీరు చేయగలదేదో చేయండి.  ఒకవేళ పేర్లు చెప్పవలసి వస్తే మీ సొంత పేర్లు చెప్పండి.  నా పేరు గానీ, నేను యిక్కడ ఉన్నానని గానీ తెలియనీయవద్దు."


  తొందరగా ఆ గది మూలలో ఉన్న తలుపు దగ్గరకు పరుగెత్తింది నాన్సీ.  విశ్రాంతి గదిలో వాళ్ళకి కనిపించని ఒక బల్లను చూసిందామె.  బెస్, జార్జ్ వాళ్ళ మాటలు మరింతగా విందామని, అదే సమయంలో ఆ వ్యక్తి రూపాన్ని చూద్దామని హాల్లోనే తచ్చాడుతున్నారు.  చివరకు అతను వారికి కనిపించేలా కదిలాడు.


బెస్ తన జుట్టును అనేక రకాలుగా సవరించుకొని, మేకప్పు పెట్టెను తెరచి. ముక్కు దగ్గర పౌడర్ని అద్దుకొంటూ కొన్ని క్షణాలను గడిపింది.  జార్జ్ జుట్టు పొట్టిగాను, మరీ దగ్గరగాను కత్తిరించబడి ఉండటాన, తను హైయిర్ స్టైలు మార్చటం కష్టమైంది. అందుకే ముక్కు దగ్గర పౌడరు అద్దుకొంటూ కాలక్షేపం చేసింది.  తరువాత తన జాకెట్టుకి దుమ్ము పట్టినట్లు, దాన్ని దులుపుకొంటున్నట్లు నటించింది.  


  అకస్మాత్తుగా ఆ వ్యక్తి ముసలామెతో, "నేను తప్పక మిస్ డ్రూని కలవాలి.  ఆమెకు యివ్వటానికి నా దగ్గిర చాలా విలువైన వస్తువు ఉంది."


 బెస్ చిన్నగా గెంతింది.  అది నాన్సీకి బహుమతి కావచ్చు!


  "మరీ మంచిది మిస్టర్ సీమన్!" ఆమె బదులిచ్చింది.


"ఆమెనే నిజమైన డ్రూ అయితే, మనం నాన్సీని పిలిచి, అతని చేత తనకు విలువైన కానుకను యివ్వనిద్దాం"  బెస్ జార్జ్ చెవిలో గుసగుసలాడింది.


"వద్దు" జార్జ్ స్వరం తగ్గించినా దృఢంగా చెప్పింది.  "అతను నాన్సీ గురించే చెప్పి ఉన్నట్లయితే, అక్కడ బహుమతి ఉందని నేను నమ్మను.  బెస్! నువ్వు లోపల ఉన్న నాన్సీ దగ్గరకెళ్ళి, యిక్కడ జరిగినదంతా నాన్సీకి చెప్పు.  నేను ఆ వ్యక్తిని అనుసరించి, ఎంతవరకూ సమాచారాన్ని సేకరించగలనో అంత సేకరిస్తాను."  


  బెస్ ఒక్క క్షణం సందేహించింది, కానీ జార్జ్ పట్టుబట్టింది. "నా గురించి చింతించకు.  నేను జాగ్రత్తగానే ఉంటాను" అని మాటిచ్చింది.  "కేవలం అతను ఎక్కడికి వెళ్తాడో చూస్తాను."


(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages