ఈ దారి మనసైనది - 40
అంగులూరి అంజనీదేవి
(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది. జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా టూర్ వెళ్లి, ముగించుకుని తిరిగి వస్తారు. మెడికల్ కాలేజీ ఎక్సిబిషన్ కి వచ్చిన అనురాగ్ తల్లిదండ్రులకు అంతా తిప్పి చూపిస్తుంది దీక్షిత. ఆత్మహత్య చేసుకోబోయిన మన్వితకు ధైర్యం చెప్పి, మామూలు మనిషిని చేస్తాడు ధీరజ్. మన్విత నానమ్మను ఎక్కడైనా ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది.)
“ఆయిల్ విషయంలో అమెరికాకి ఇరాక్ కి మధ్య జరిగిన కోల్డ వార్ గురించి
ఆలోచిస్తున్నా సంజనా !” అంది మన్విత . సంజనను డైవర్ట్ చెయ్యడం కోసం ....
“అవునా ! అరవై ఆరు దేశాల్లో వెలిగిన సత్యం కంప్యూటర్స్
ఏడువేలఆరువందలకోట్ల కుంభకోణంలో చిక్కి చతికిల పడిందట ... ప్రస్తుతం అందులో పని
చేసే యాభైమూడువేల మంది ఉద్యోగుల గురించి కూడా ఆలోచించు. వాళ్లేం చేశారు పాపం!” అంటూ తను ఆశించిన సమాధానంరాలేదన్న నిరాశతో బ్లాంకెట్
నిండా కప్పుకొని పడుకొంది సంజన.
“హమ్మయ్యా ! తెల్లారేంత వరకు ఇది లేవదు... ” అనుకుంటూ కళ్లు మూసుకొంది మన్విత.
వేంటనే
బ్లాంకెట్ లోంచి కాస్త బయటకొచ్చి ...
“నానమ్మా ! నానమ్మా !” అంటూ పిలిచింది సంజన. అప్పటి వరకు నిద్రపోని వర్థనమ్మ
వెంటనే పలికింది.
“ ఇవాళ మా హాస్పటల్లో ఒకతను మా నర్స్ తో ...” తల్లి పుట్టిల్లు మేనమామకు తెలియదా!” అన్నాడు. తల్లి పుట్టిల్లు తప్పకుండా మేనమామకు
తెలుస్తుంది. ప్రత్యేకించి అలా అనటం దేనికి నానమ్మా? నాకేం అర్థం కాలేదు. వాళ్లను కొంతమందిని అడిగాను...
వాళ్లు కూడా నాలాగే అన్నారు. నీకు తెలిస్తే చెప్పవా?” అంది సంజన.
సంజన సందేహానికి ఆశ్చర్యపోలేదు.
ఇలాంటి అమ్మాయిలు చాలామంది వున్నారు. ఇంకొద్ది రోజులు పోతే ఇలాంటి సామెతలు వినటమే
కాని అర్థాలు తెలియక కనుమరుగై పోతాయి. ఎందుకంటే ఇలాంటి సామెతల్ని కాని, కధల్ని కాని ఇప్పటి పిల్లలకి ఓల్డేజ్ హోంలో వుండే
అమ్మమ్మలు, నానమ్మలు వినిపించలేరు
కదా?
అందుకే కొంతమంది పిల్లలు కంప్యూటర్
గేమ్ సెంటర్లలో వుండే పెద్ద పెద్ద మానిటర్లు , ఆడియో - విజువల్ ఎఫెక్టులు, కొత్త కొత్త గేమ్స్, టెర్రరిస్టులను మట్టుపెట్టటం .... మిలటరీ సాహస కృత్యాలు
అసక్తిగా
చూస్తూ ఆకర్షితులవుతున్నారు. తనమనవడు పగలంతా అవి చూసి రాత్రి వేళల్లో కలవరిస్తూ
సరిగ్గా చదువుకోవడం లేదని ఒక రోజు వాడ్ని అటువైపు వెళ్లకుండా చేసింది వర్థనమ్మ ...
అదిప్పుడు గుర్తొచ్చి మెల్లగా నవ్వినా
శబ్దం వచ్చేలా నవ్వింది వర్ధనమ్మ, నానమ్మ నవ్వటం చాల రోజుల తర్వాత విన్నది మన్విత.
సంజన సందేహాన్ని తీర్చడం కోసం ఆమెవైపు
తిరిగింది వర్థనమ్మ.
“ తనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ల దగ్గరికి వెళ్లి తమకు తెలిసిన కొన్ని
సంగతుల్ని గొప్పగా చెప్పేవాళ్లకి ...
” మన గురించి అన్నీ తెలిసిన వాళ్ల దగ్గరికి వెళ్లి
గొప్పలు చెప్పుకుంటూ బడాయిపోయేవాళ్లకి ఈ సామెత వర్తిస్తుంది. అదెలా అంటే మామయ్య
దగ్గరకి వెళ్లి “ మా అమ్మ చిన్నప్పుడు
ఇలా చేసేదట, అలాచేసేదట ... ” అని కబుర్లు చెస్తే ఎలా వుంటుందో
ఒక్కసారి ఊహించుకో ... అమ్మ చిన్నప్పుడు చేసిన పనులు కేవలం మనం విన్నాం... కానీ
మామయ్య నేరుగా చూసివుంటాడు. కొన్ని పనులు అమ్మతో కలిసి చేసి వుంటాడు. అంటే ఏదైనా
... మాట్లాడేటప్పుడు కాస్త విజ్ఞతతో వ్యవహరించాలని చెప్పేటప్పుడు ఈ సామెతను
వాడుతారు మనవరాలా!” అంది నానమ్మ. అమె అలాపిలుస్తుంటే తనకి నానమ్మ లేని లోటు
తీరినట్లైంది సంజనకి.
సంజనది హైదారాబాదు. ఇంగ్లీష్ మీడియం
చదివింది. అసక్తిగా అన్పిస్తూంటే ఇంకా కొన్ని సామెతల్ని, కాశీమజిలీ కథల్ని నానమ్మతో చెప్పించుకొంది..
ఎప్పుడైనా వర్థనమ్మ... ఎదుటివాళ్లు తన
ద్వారా ఏదైనా తెలుసుకుంటారన్నా ఉపయోగం వుందన్నా... ఉత్సాహం చూపిస్తుంది. ఒక్కోసారి
లేని హూషారు కూడా తెచ్చుకుంటుంది.
* *
* *
హాస్పిటల్ కి వెళ్లగానే ధీరజ్న
కలిసింది మన్విత.
“ఏం చేయాలో తెలియడం లేదు సర్ ! నానమ్మను చూస్తుంటే బాధగావుంది. అమెకు
ఈ వయసులో రావలసిన కష్టం కాదిది. నేను పక్కకి వెళ్తేచాలు ఏడ్చుకుంటుంది. కనీసం నా ఈ
హౌస్ సర్జన్ పూర్తి అయ్యేంత వరకు ఆమెకు ఎక్కడైనా షెల్టర్ దొరికితే బాగుండు...” అంటూ తన మమ్మీకి - నానమ్మకి మాటా, మాటా ఎలా పెరిగిందో ఆమె ఎలా బయట కొచ్చిందో చెప్పింది.
ఆలోచించాడు ధీరజ్.
నిన్న హాస్పిటల్లో జరిగిన గొడవకన్నా
... నానమ్మ నిరాశ్రయురాలు కావటమే మన్వితను ఎక్కువగా బాధిస్తున్నట్లు గ్రహించాడు
ధీరజ్.
“మా నానమ్మను ప్రస్తుతం మా ఊరు తీసికెళ్లి మా ఇంట్లో వుంచుతాను.
నువ్వేం బాధపడకు మన్వితా! ” అంటూ ఆమెకు ధైర్యం చెప్పి, వర్ధనమ్మను పాకాల తీసికెళ్లాడు.
మన్వితకి పెద్ద సమస్య తీరినట్లైంది.
ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం
వుంటుందని చెప్పే ధీరజ్ నానమ్మ విషయం చెబితే ఏదో ఒక సలహా యివ్వకపోతాడా అన్న ఆశతో
చెప్పింది. కానీ... అతనంత గొప్ప బుద్దితో తన ఇంటికి తీసికెళ్తాడునుకోలేదు. ధీరజ్
మాటల మనిషికాదు. చేతల మనిషి... అందులో సందేహం లేదు.
అతనిలో వయసుకి మించిన మెచ్చ్యూరిటి
వుంది. అందరు యువకుల్లా తేలిగ్గా మాట్లాడటం ... కోపం తెచ్చుకోవటం ... అవసరంలేని
జోకులు వెయ్యటం చెయ్యడు. అతని బాడీ లాంగ్వేజ్ కూడా ఉన్నతమైన వ్యక్తిత్వంతో కొంచెం
సీరియస్గా, కొంచెం గంభీరంగా ఒక
లెవెల్లో కన్పిస్తుంది.
అతను స్నేహంగా మాట్లాడే మాటలు...
సబ్జక్ట్ రిలేటెడ్ గా చేసే డిస్కర్షన్
వింటుంటే .... బోధి వృక్షం నీడలో, జ్ఞాన దీపం వెలుగులోనిలబడిన అనుభూతి
కలుగుతుంది. దాని వల్ల ఏదో బలమైన శక్తి ప్రవేశించినట్లే జీవితంలో మంచి పేరు, ఇండివిడ్యువాలిటీ సంపాయించుకోవాలన్న తహ తహ కలుగుతుంది.
అందుకే మన్విత దృష్టి కెరీర్ మీద నుండి ఇంచైనా కదలడం లేదు.
• •
• •
ధీరజ్ తండ్రి వివేకానందరెడ్డి మంచి కాంట్రాక్టర్, అయన సతీమణి సత్యాదేవి, అయనకు తగిన ఇల్లాలు. ఆ భార్యా, భర్తలిద్దరిని ఈ మధ్యన ఒక దురదృష్టకరమైన సంఘటన మానసిక
సంక్షోభానికి గురి చేసింది.
అదేమిటంటే ? వివేకానందరెడ్డి తండ్రి బాపిరెడ్డి. ఆ ఊరిలో ఒక హాస్పటల్
కట్టించి, అందులో తన మనవడు ధీరజ్ను
వుంచి, ఆ ఊరి ప్రజలకి మంచి వైద్య
సదుపాయం కల్పించాలని ప్రయత్నిస్తూ ... ఆ ప్రయత్నంలోనే ఓ రాత్రి నిద్రలోనే
చనిపోయాడు.
సత్యాదేవి మామగారిని మరచి పోలేక
పోతోంది. అయన అశల్ని ఆశయాలను మరిచిపోలేక పోతోంది. అటువంటి స్థితిలో... ఒంటరిగా
ఫీలవుతున్న సత్యాదేవి వర్ధనమ్మను చూడగానే తనకో పెద్ద దిక్కు దొరికినట్లు
మహదానందాన్ని వ్యక్తం చేసింది. ఆమెను తన ఇంట్లో మనిషిలాగే భావించి ప్రేమాభిమానాలని
చూపించింది.
ఆ ఇంట్లో ... వాళ్ల అప్యాయత నీడలో మనస్పూర్తిగా సేద తీరుతోంది
వర్ధనమ్మ.
వర్ధనమ్మను కారులో కూర్చోబెట్టుకొని
... వరంగల్ వెళ్లి ఆమెకు తగిన రంగుల్లో కొన్ని గద్వాల్ చీరెలు తీసింది సత్యాదేవి.
తిరిగి పాకాలకి చేరుకున్నాక ... తన
ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో సగం కట్టి ఆపేసిన ఒక బిల్డింగ్ ముందు కారాది... ఆ
భవన నిర్మాణం ఎందుకు ఆపేశారో చెప్పింది సత్యాదేవి.
శ్లాబ్ వరకు వచ్చి ఆగిపోయిన ఆల్డింగ్
మొత్తం తిరిగి చూసింది వర్ధనమ్మ.
అక్కడ ఒక గది చూపించి ... ఆగదిలో....వాళ్ల
మామగారు రాత్రీ, పగలు వుండి - వర్కర్స్ తో
ఎలా పని చేయించేవాడో చెప్పింది సత్యాదేవి.
పెద్దహాల్లో దక్షిణం వైపు సిమెంట్
బస్తాలు, ఇసుక, ఇటుక “మమ్మల్నేం చేస్తారు?' అన్నట్లు చూస్తున్నాయి. బావి కున్న మోటరీకి వందగజాల పైపు తగిలించి
వుంది. దాన్నెవ్వరు పట్టించుకోనట్లు అడ్డదిడ్డంగా జీవం లేనట్లు పడివుంది. చెక్కపని
చేస్తూ ఆగినట్లు .. అక్కడంతా చెక్కపొట్టు నిండి వుంది.
“గోడలకి నీళ్లు పడదాం ! మోటర్ స్విచ్ ఎక్కడుంది?” అంటూ పైపును చేతిలోకి తీసుకొంది వర్దినమ్మ ,
“గోడలకి నీళ్లు పడతారా? వద్దండి ! మన ఇంటికెళ్లాం రండి! ” అంది భయంగా చూస్తూ సత్యాదేవి.
వర్ధనమ్మ వినలేదు. అక్కడేవున్న స్వీచ్
ఆన్ చేసి గోడలకి నీళ్లు పట్టసాగింది..
సత్యాదేవి మరింత కంగారుపడుతూ...
వర్థనమ్మ చేయిపట్టుకొని ఆపింది.
“నా మాటవిని ఇంటికెళ్లాం రండి! ఇక్కడ మనం ఎక్కువ సేపు వుండొద్దు.” అంది. అప్పటికే కారులో వుండే డ్రైవర్ తో పాటు చుట్టుపక్కల
ఇళ్లలో వాళ్లు వర్ధనమ్మను వింతగా చూస్తున్నారు. ఈమె ఈ ఊరికి కొత్తనా అన్నట్లువున్నాయి వాళ్ల చూపులు ...
“ నేను రాను సత్యా ! నువ్వెళ్లు ... గోడలకి, శ్లాబ్ కి నీళ్లు పట్టి, నెమ్మదిగా వస్తాను.” అంది వర్థనమ్మా తన చేతిని మెల్లగా విడిపించుకుంటూ ...
“ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా ఏమిటీ మొండి పట్టు ...?” అంది ఆ బిల్డింగ్ వైపు అయిష్టంగా చూస్తు సత్యాదేవి.
" నీ మాటల్ని బట్టి ... అదిగో చుట్టు పక్కల వాళ్ల చూపుల్ని బట్టి
నాకంతా అర్థమైంది. ఇక నువ్వు నాకేం చెప్పొద్దు... ఈ బిల్డింగ్ ఆపేది లేదు. రేపటి
నుండి నేను ఇక్కడే వుంటాను. మళ్లీ పని మొదలు పెడదాం ... ” అంది.
“బ్రతుకుమీద ఆశ వుండే మాట్లాడుతున్నావా?” అంది సత్యాదేవి.
“ ఆశ ... నా బ్రతుకు మీద కాదు. ఇదిగో ఈ బిల్డింగ్ మీద ... ఎందుకంటే ...? ధీరజ్ ఏ పరిస్థితిలో నన్ను యిక్కడికి తీసుకొచ్చాడో నాకు
తెలుసు. అలాంటి నేను ధీరజ్ కోసం ... అతని భవిష్యత్ కోసం ఏమైనా చేస్తాను. ఈ
బిల్డింగ్ ని వాళ్ల తాతయ్య ధీరజ్ కోసం ఏ అశయంతో కట్టదలిచాడో, ఆ ఆశయాన్ని నేను నెరవేరుస్తాను.” అంది స్థిరంగా...
" ఇక్కడ దెయ్యాలు వున్నాయని అందరు అనుకుంటున్నారు. అవి తొక్కడం వల్లనే
మా మామగారు రాత్రికి రాత్రే చనిపోయారని ఊరంతా అంటున్నారు. మీ పట్టుదలకి అర్థం
లేదు... మీకేమైనా జరిగితే తర్వాత ఆలోచించటానికి ఏమి వుండదు.” అంది అదే తన భయం అన్నట్లుగా
... దెయ్యాలున్నాయని ప్రచారం చెయ్యడం భూగోళం వేడెక్కినంత ప్రమాదకరమైన
చర్య... ఎందుకంటే భూమి వేడెక్కితే సముద్ర జలాలు వేడెక్కుతాయి. నీటి ధర్మాలలో
మార్పులు వచ్చి రుతుపవనాలు గతి తప్పుతాయి. తరుచూ తుఫాన్లు వస్తాయి. రాకూడని
సమయాల్లో వర్షాలు వచ్చి ఎన్నో దుష్పలితాలు కలుగుతాయి. ఈ కారణాల వల్ల పంటలు
దెబ్బతిని ఆహార భద్రతకు ముప్పు వస్తుంది...
(సశేషం)
No comments:
Post a Comment