నాకు నచ్చిన కథ - ముచ్చట
కొత్తపల్లి ఉదయబాబు
‘ ’ పైన మడత మంచం వేసి పక్క , దిండు ఏర్పాటు చేశాను. నేను వంటిల్లు సర్ది వచ్చేస్తాను. మీరు అంతలోనే గుర్రు పెట్టకండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.’’ అంది అరవింద . రాత్రిపూట భోజనం పూర్తయింది. లేచిన నేను ఆ మాటలకు ఊ కొట్టి, తుండు కప్పుకొని డాబా మీదకు చేరాను. వైశాఖ పౌర్ణమి కావడంతో నేలంతా వెన్నెల చీర కట్టుకుంది. డాబా మీదకు పెంచిన సన్నజాజి, విరజాజి, పందిరి మల్లెలు విచ్చుకుని ఆ పరిమళాలతో వీస్తున్న చల్లటి గాలి ఒక విధమైన మత్తును కలిగిస్తోంది. భగవంతుడు నాకు ఇచ్చిన వరం నిద్ర.
ఎవరైనా రాత్రి సమయంలో నాతో ఏ విషయం అయినా చెప్పాలి అనుకుంటే వాళ్ళు మొదలు పెట్టిన ఐదు వాక్యాలు పూర్తి కాకముందే నిద్రపో గలను.
‘’కడుపులో ఉన్న కష్టం కడుపార చెప్పుకుందాం అన్నా వినే దిక్కులేదు నా ప్రాణానికి’’ అని అరవింద విసుక్కోవడం తనకీ, విని నవ్వుకోవడం నాకూ అలవాటైపోయింది. ఆ ప్రశాంత వాతావరణంలో వెల్లకిల్లా మంచం మీద పడుకొని పూర్ణ చంద్ర బింబం చూస్తున్న నాకు నా పిల్లలు నిహారిక, పవన్ ముఖాలే కనిపించసాగాయి.
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి లో జరిగి, ఏప్రిల్ నెల ఆఖరికి ఫలితాలు ప్రకటించడంతో రాజమండ్రి లో నిహారిక ఇంటర్ చదువుతున్న రెసిడెన్షియల్ కాలేజీ లోనే పవన్ ని కూడా జాయిన్ చేసేసి వచ్చాను రెండు రోజుల క్రితమే.
‘’అమ్మయ్య మెలకువగా వున్నారా? అప్పుడే నిద్ర లోకి జారుకున్నారేమో ’ అని అనుకుంటూ కంగారుగా వచ్చాను. ఏమిటో ఈ చదువులు పేరు చెప్పి పిల్లలు దూరంగా వెళ్లిపోతే ఏదో వెలితిగా ఉందండి. నాకైతే తిరిగి వాళ్ళని తెచ్చుకోవాలని ఉంది. వూపిరి ఆడనట్టుగా విసుగ్గా ఉంటోంది.’’ అరవింద కంఠం గాద్గదికంగా అయింది. నాకు అర్థమైంది. ఆమె కన్నీళ్లు పెట్టుకుందంటే, అవతలి వాడు ఎంత కఠినాత్ముడు అయినా కరిగి పోవాల్సిందే. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే టాపిక్ డైవర్ట్ చేయడం మంచిది.
‘’ఇంతకీ ఏమిటోయి... ఎదో అర్జంట్ విషయం మాట్లాడాలన్నావ్ . అప్పుడే అరగంట నిద్ర వేస్ట్ అయ్యింది.’’ అన్నాను కావాలని ఆవలిస్తూ.
‘’మీ నిద్ర బంగారంగానూ. ముందు లేచి కూర్చోండి. అలా అయితే నేనే మాట్లాడతాను.’’ నేను లేచి కూర్చోక తప్పలేదు.
‘’నేను అడిగేది విని మీరు గొప్పగా కోప్పడరుగా.’’ గారంగా అడిగింది నా భుజం మీద చేతులు ఆనించి, నా ముఖానికి తన ముఖం దగ్గరగా చేర్చి.
‘’ఊహూ . కోప్పడను. ‘’
‘’నాకు... నాకు ఇంట్లో ఏమీ తోచడం లేదండి. నేను ఏదైనా కాన్వెంట్లో పని చేస్తాను’’ అంది గోముగా.
‘’ఎందుకు అరూ... సుఖాన ఉన్న ప్రాణం దుఃఖాన పెట్టుకోవడం. ముఖ్యమైన విషయం అంటే ఇలాంటిదేదో అయి ఉంటుందని నేను ఊహించాను.’’ తేలిగ్గా తీసి పారేసాను.
‘’అది కాదండీ . బోలెడంత డబ్బు ఖర్చుపెట్టి ఊరు కాని ఊర్లో చదువులకి పిల్లల్ని పంపాము కదా అని.’’ నసిగింది అరవింద.
‘’చూడు అరు. డబ్బు సంపాదన అయితే నువ్వు వెంటనే ఆ ఆలోచన మానుకో. ఎందుకంటే నువ్వు సంపాదించే 1000 రూపాయలు మన సంసార సముద్రంలో కాకి రెట్ట లాంటిది. ఆ 1000 లో 200డాక్టరుకు, 200 రిక్షాలకు, పోతే 600 నీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ చీరలకు చాలదు. ఏమంటావు?’’
‘’అబ్బా మొదలెట్టారా నస. మీకు ఎప్పుడూ నా చీరల మీదే దృష్టి. పూర్తిగా వినిపించుకోరేం? ఈ నా ముచ్చట 18 ఏళ్ల క్రితంది. డిగ్రీ పూర్తయి కాన్వెంట్ లో చేరి మూడు రోజులు అయిందో లేదో ‘పెళ్లి చూపులు’ అంటూ ఊడిపడి నా మెడలో తాళి కట్టారు. ఏ శుభముహూర్తాన కట్టారో గాని సంవత్సరం తిరక్కుండానే సంవత్సరం తేడాలో ‘మేము ఉన్నాం’ అంటూ పిల్లలు పుట్టేసారా పిల్లలు. వాళ్ళని ఎల్కేజీ నుంచి టెన్త్ పూర్తి చేయించే సరికి సగం మరలు ఎలాగూ అరిగిపోయాయి. మిగతా సగం అరిగే లోపుగా నా ముచ్చట ఇప్పుడైనా తీర్చుకుందామని. ప్లీజండీ’’
‘’ చూడు అరవింద. ఈనాడు విద్య పైసా పెట్టుబడి లేని వ్యాపారం. ఐదు సంవత్సరాలలో లక్షాధికారిని, పదిహేనేళ్లలో కోటీశ్వరుని చేయగలిగింది కేవలం విద్యా వ్యాపారం ఒక్కటే. అందుకే సందుకు ఒక పాకలో ‘పబ్లిక్ స్కూలు’, కాలనీకొక పెంకుటింట్లో ‘శాంతినికేతన్’ పేట కొక ‘అకాడమీ’, వార్డుకొక జూనియర్ కాలేజీ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిజంగా ఉద్యోగం ఏది దొరకక మగవారు ఈ వృత్తిని ఎంచుకుంటుంటే, వారి కన్నా పది ఆకులు ఎక్కువ చదివిన అధిక శాతంలో ఆడవాళ్ళు తమ తమ చిన్న చిన్న సరదాలు తీర్చుకోవడం కోసం, కొద్ది శాతం ఆడవారు భర్త దగ్గర ఆర్థిక స్వాతంత్ర్యం లేక మరి కొద్ది శాతం మంది నిజమైన అవసరం కోసం కుటుంబ సహాయార్థం ఈ వృత్తి లోకి వస్తున్నారు. నిన్నటి వరకు టెన్త్ క్లాస్ చదివిన అమ్మాయి మళ్లీ సంవత్సరం వాళ్ళ పేటలోని కాన్వెంట్లో ఎల్.కె.జీ. మేడం.
నెలకు 500 రూపాయలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు 8గంటలు విశ్రాంతి లేకుండా పని చేయడానికి నిజమైన విద్యార్హతలతో యువత ఎగబడుతుంటే, స్థానబలమో, ఆర్థిక బలమో, కులబలమో ఉండి పదవ తరగతి పాస్ అయ్యి లేదా డిగ్రీ ఫెయిల్ అయి ఏ మాత్రం బ్రతుకు తెరువు నేర్పే విద్యా పిల్లలకు నేర్పే సంస్కారం లేనివాళ్ళు ప్రిన్సిపల్, డైరెక్టర్ అనే హోదాలు వారికి వారే కల్పించుకొని, తమ అస్తిత్వం నిలబెట్టుకోవడం కోసం స్థానిక రాజకీయ నాయకులను ఆహ్వానించి, కాన్వెంట్లో ఓపెన్ చేసి పదేళ్లు తిరక్కుండానే లక్షాధికారులు అవుతున్నారు. వేలకు వేలు జీతాలు సంపాదించుకుంటున్న ఉద్యోగస్తుల దగ్గరనుంచి, పళ్ళు,పూలు, ఇల్లిళ్లూ తిరిగి బట్టలు అమ్ముకునేవాళ్ళు, చివరకి రిక్షా తొక్కుతున్న వాళ్ళు కూడా కాన్వెంటు చదువుల కోసం ఎగబడుతున్నారు.
వీళ్ళ దగ్గర నుంచి వేలకు వేలు వారి కష్టార్జితం గుంజి, తమ దగ్గర పనిచేసే టీచర్ కు మరో వంద రూపాయలు ఎక్కువిస్తే తమకు వచ్చే లక్షలు ఎక్కడ తగ్గిపోతాయో అనే భయంతో, సంవత్సరం గడిచాక వాళ్ళని తీసేసి కొత్త వారిని వేస్తూ ఉంటారు. నెలకు ఇద్దరు టీచర్లు చొప్పున మారుతూ ఉంటే ఏ టీచరు పద్ధతికి అలవాటు పడని పిల్లలు యాంత్రిక పద్ధతికి అలవాటుపడి, నేర్చుకోవడం మానేసి బట్టీయం వేస్తాడు తప్ప తమంతట తాముగా ఆలోచించి అర్థం చేసుకునే స్థాయికి ఎదగలేకపోతున్నారు.
‘’ఇది ఇవాల్టి కాన్వెంట్ ల పరిస్థితి. ఇంతకీ ఏ కాన్వెంట్లో చేరుదామని నీ ఉద్దేశం?’’ అడిగాను
“అమ్మయ్య ఆపారా మీ సోద. ఇన్ని తెలిసిన వారు మన పిల్లల్ని మరి కాన్వెంట్ లోనే ఎందుకు చేర్పించారు?’’ ‘’ఈవేళ సమాజమంతా పోటీ పద్ధతిలో నడుస్తోంది. నలుగురిలోనూ నా పిల్లలు చులకన కాకూడదు. తెలివితేటలలో వారి వయసు వారితో సమానంగా ఉండాలనే కోరికతో అలా చేశాను.’’
‘’ అలా రండి దారికి. అందుకే మన పిల్లలు చదివిన కాన్వెంట్ లోనే పని చేద్దాం అనుకుంటున్నాను. మొన్న ఒకసారి ఆ కామెంట్ ప్రిన్సిపాల్ అడిగాడు. ‘మీలాంటి హుందాకైగిన గృహీణులు మా స్కూల్ లో పని చేస్తే మా స్కూలు స్టాండర్డ్ పెరుగుతుంది మేడం’ అని. మీరేమంటారు?’’
‘’నాకైతే ఏ మాత్రం ఇష్టం లేదు. అలసి సొలసి ఇంటికి వచ్చే భర్తకి చక్కగా చిక్కని కాఫీ ఇచ్చి, కమ్మటి భోజనం పెట్టి, సరదాగా ఏ గుడికో వెళ్లి సంతోషంగా ప్రశాంత జీవనం సాగించాలని అనుకుంటుంది సగటు గృహిణి. కానీ దూరపు కొండలు నునుపు అనుకునే నీలాంటి స్త్రీలు తెలుసుకోలేరు అనుభవానికి వస్తే గాని తెలుసుకోలేరు.
ముందే చెబుతున్నా. నీ స్కూల్ సమస్యలు, విశేషాలు ఏమీ కూడా నాతో చర్చించడానికి వీల్లేదు. నా ఉద్యోగ సమస్యలు చెప్పి నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానా?లేదే. అలాగే నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు ఉద్యోగం చేస్తున్నట్లే నాకు అనిపించకూడదు. నీ టెన్షన్స్ నా మీద చూపిస్తే మాత్రం వూరుకొను. ఆపైన నీ ఇష్టం.’’ సీరియస్ గా పదునుగా అన్న నా మాటలకు ముందు నిరుత్తరురాలైనా అరవింద అంది.
‘’అమ్మయ్య. మీరు ఒప్పుకున్నారు, నా ముచ్చట ఇంత తొందరగా తీరుతుంది అనుకోలేదు. మా మంచి శ్రీవారు అంటూ నన్ను అల్లుకుపోయింది.
****
అరవిందకు ఆరోజే ఇంటర్వ్యూ. తన సర్టిఫికెట్స్ బూజు దులిపి అందంగా ప్యాక్ చేసి ఫైల్ లో పెట్టి ఇచ్చాను. వెళ్తుంటే నా పాదాలకు నమస్కరించింది అరవింద. ‘విషింగ్ యు ఆల్ గ్రాండ్ సక్సెస్. కానీ అరూ. ముచ్చటగా సంసారం తీర్చిదిద్దుకొక నీకెందుకు వచ్చిన అవస్థలోయ్?’’
‘’అదే మళ్లీ అదే మాట అంటారు... నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించడం అంటే ఇదే. నన్ను ముచ్చటగా ఉద్యోగం చేసుకొమ్మని ముద్దుగా ఆశీర్వదించి పంపండి’’ అంది గారాలు పోతూ.
నేను సంతృప్తి నిండిన మనసుతో ఆశీర్వదించాను. కాన్వెంటు దగ్గర తనని దింపేసి బ్యాంకు బయల్దేరాను. సాయంత్రం ఆఫీసు పని తొందరగా పూర్తి చేసుకుని తన ఇంటర్వ్యూ ముచ్చట్లు తెలుసుకోవాలని ఇంటికి బయల్దేరాను.
**********************
నేను ఇంటికి చేరేసరికి సంతోషంగా ఎదురు వచ్చింది అరవింద.
‘’ వెళ్లి స్నానం చేసి వస్తే టిఫిన్ పెట్టేస్తా’’ అంది చిరునవ్వుతో.
చేతిలో పూలు ఆమెకు అందించి స్నానం చేసి వచ్చాను. మనసుకు హాయిగా అనిపించింది. హాట్ బాక్స్ నుంచి వేడి వేడి కర్రీ, నిమ్మరసం పిండిన వెజిటబుల్ సలాడ్ వడ్డించింది. అసలే ఆకలి మీద ఉన్నానేమో మరో రెండు ఎక్కువే లాగించాను.
‘’మీరిలా అతిగా తినేసి బొజ్జ పెంచేసుకోండి. ఇంక డైటింగ్ అనే పేరు కూడా ఎందుకు? భగవంతుని దయవల్ల ఇప్పటివరకు షుగరు, బీపీ రాలేదు. ‘చేతులు కాల్చుకోవద్దండీ అంటే ఆకులు ఏవి ‘ అనే రకం. దొరికారు నా ప్రాణానికి. ‘’ అరవింద విసుగును గమనించి మాట మార్చాను.
‘’అన్నట్లు నీ మొదటిరోజు ఉద్యోగం ఎలా ఉందోయ్’’ అడిగాను ఆసక్తి కనబరుస్తూ.
అరవింద ఉత్తమ నటీమణి అవార్డ్ కొట్టిన నటిలా ఇలా చెప్పసాగింది.
‘’ వెల్లానాండీ? ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడని! వెళ్లిన వెంటనే తన ఛాంబర్లో తన ఎదురుగా కూర్చోమన్నాడు. వెంటనే కూల్ డ్రింక్ తెప్పించి ఇచ్చాడు. ఇంతలో ఒక్కొక్క టీచర్ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్లారు. తర్వాత ప్రార్థన జరిగింది.
ప్రార్థనలో కార్యక్రమంలో నన్ను పిల్లలకు, స్టాఫ్ కు పరిచయం చేశాడు. నన్ను చూసి ఒకరిని ఒకరు నవ్వుకున్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. తర్వాత నన్నుపాఠం చెప్పమన్నారు. తొమ్మిదవ తరగతి తెలుగు పాఠం చెప్పాను. పద్యభాగం. నేను చెబుతున్నంతసేపు ఆయన పర్సనల్ అసిస్టెంట్, ఒక సూపర్వైజర్ అక్కడే ఉన్నారు.
పాఠం పూర్తయ్యాక అంతా సంతృప్తి చెందినట్లు కనిపించారు. నేను పాఠం చెప్పడం అంతా క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలలో ప్రతీ తరగతి పిల్లలూ చూశారట. పిల్లలు కూడా అంతకు ముందు చెప్పిన మేడమ్ ముందే ‘మీరు చాలా బాగా చెప్పారు మేడం’ అనేశారు. ఆవిడ ఏమీ పట్టనట్టు కూర్చుంది. ఆ తర్వాత పద్ధతి మాత్రం నాకు నచ్చలేదు.’’
‘’ఏమైందేమిటి?’’ అడిగాను.
‘’పిల్లల ముందే నన్ను ఎవరికి తోచిన ప్రశ్న వాళ్ళు అడగడం మొదలు పెట్టారు. న,జ,భ,జ,జ,జ, ర... ఏ పద్య పాదం? దాని లక్షణాలు అన్నీ అప్పగించమని ఒకరు, తెలుగు భాషలో ‘ఆ’ ‘ఈ’ ‘ఊ’ లను త్రికములు అన్నారు కదా. వాటినే ఎందుకు అనవలసి వచ్చింది? అని మరొకరు... అలంకారాలు వాడేటప్పుడు వేటిని ఏ సందర్భంలో వాడతారు... ఆ సందర్భంలో ఆ అలకారం మాత్రమే ఎందుకు వాడవలసి వచ్చింది? ఆ పాఠ్యగ్రంధం లో ఉన్న మొత్తం కవుల అందరి పేర్లు... వారి ఇతర రచనలు చెప్పండి... ఒక్కటేమిటి అడగని ప్రశ్న లేదనుకోండి’’
‘’మరి అన్నీ చెప్పావా?’’
‘’అందరికీ కలిపి ఒకే సమాధానం చెప్పాను.’’
‘’ఏమని?’’
‘’నేను ఏమి ప్రీపేరు అయి రాలేదని. అలా అడుగుతారని తెలిస్తే , అన్నీ ప్రిపేర్ అయి వచ్చేదాన్ని అని. దానికి ఆ ముసలి సూపర్వైజర్ గంటు పెట్టుకున్న మొహంతో అనేశాడు. ‘టీచర్ అంటే అప్ టు డేట్ నాలెడ్జి ఉండాలమ్మా, లేకపోతే పిల్లల ముందు లోకువ అయిపోతారు మీరే’’ అనీ.
‘’చూడండి సార్. నాకు తెలిసినంతవరకూ అన్నీ వివరంగా చెబుతాను. పిల్లలు అడిగితే ‘రేపు రిఫర్ చేసి వచ్చి చెబుతాను.’ అంతానే తప్ప అన్ని నాకే వచ్చు అనుకునే మూర్ఖురాలిని మాత్రం కాదు.’ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాను. ఆయన టక్కున నోరు మూసేసాడు. ‘’
‘’జీతం ఎంత ఇస్తానన్నాడు?’’
‘’ నేను మాత్రం 3000 అని అప్లికేషన్ లో రాశాను. వాడు ఎంత ఇస్తే మనకి ఎందుకండి? మనకు డబ్బుకు లోటు ఉండి కాదు కదా.. అక్కడ చేరింది?’’
‘’సో నీ మొదటిరోజు ఉద్యోగం చాలా బావుంది అంటావు.’’
‘’రియల్లీ సో హ్యాపీ. ఇదంతా మీ సహకారం వల్ల. నా ముచ్చట తీర్చారు. భరించువాడు భర్త అని ఎవరన్నారో గాని ఆ పదానికి మీరు ఖచ్చితంగా సరిపోతారు. ‘’ అంది నా మెడచుట్టూ రెండు చేతులు వేస్తూ.
‘’నీకేనా? ఇంకెవరికైనా?’’ కొంటెగా నవ్వుతూ అన్నాను.
‘’మీకు ఆ అవకాశం నేను ఇస్తానా?’’ శృతి కలిపింది అరవింద.
*********************
ఆ రోజు శనివారం. సాయంత్రం ఫస్ట్ షో పిక్చర్ కు వెళ్దామని ఆశతో ఇంటికి వచ్చిన నేను హాల్ లో అడుగు పెట్టే సరికి హతాశుడిని అయ్యాను.
సోఫాలో సర్వం కోల్పోయిన దానిలా తల వెనక్కు వాల్చి కళ్ళు మూసుకుని వుంది అరవింద. ముక్కు, చెక్కిళ్ళు బాగా ఎర్రబడి చిదిమితే రక్తం చిందేటంత నిగారింపుగా ఉన్నాయి. అసలే పచ్చటి మనిషేమో, చాలా సేపటినుంచె ఏడుస్తున్నట్లు ఉంది. నా అలికిడి విని కళ్ళు తెరిచింది.
లేస్తూనే ‘’ఏవండీ’’ అంటూ బేలగా నా చేతుల్లో వాలి బావురుమంది. ఆమె వీపు నిమురుతూ అలాగే ఉండిపోయాను.
ఎవరైనా ఏడుస్తుంటే నేను ఆపను. దాని వల్ల కలిగే ప్రయోజనాలు రెండు. మొదటిది కళ్ళల్లో మాలిన్యాలన్నీ కన్నీళ్ళ రూపంలో బయటికి పోయి కళ్ళు స్వచ్ఛంగా కనిపించడం. రెండోది - మనసులోని బాధ తీరిపోవడం వల్ల తేలికగా దూదిపింజలా హాయిగా అనిపించడం.
ఆ తర్వాత ఆమెను నానుంచి విడదీస్తూ సోఫాలో కూర్చో బెట్టి తన కొంగుతో కళ్ళు తుడిచాను.
‘’ఇప్పుడు చెప్పు. ఏం జరిగింది?’’ అడిగాను.
ఆమె కళ్ళు విశాలంగా అయ్యాయి.
‘’నేను ఉద్యోగం మానేశాను. నా ముచ్చట ‘మూడునాళ్ళ’ ముచ్చట అయిపోయింది.’’ అరవింద మామూలుగానే అన్నా చివర ఆమె కంఠం వణికింది.
‘’అరూ...చెప్పు. వాడు నిన్ను ఏమైనా అన్నాడా... వెళ్లి కడిగేసి వస్తాను వెధవని’’ అంటూ ఒక్క ఉదుటన లేచాను. అరవింద కంట నీరు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అరవింద నా చేయి పట్టి ఆపింది.
‘’ఏమైంది ఆరూ?’’
‘’మీరు చెప్పిన వాక్యాలు అనుభవ సత్యాలు అయ్యాయి. ‘’ నా కళ్ళలోకి చూడలేక తలదించుకుంటూ అంది.
‘’మనసులో బాధ చెప్పుకుంటే తీరుతుంది. నీలో నువ్వు మధనపడుతుంటే నన్ను మరింత బాధ పెట్టినదానివి అవుతావు. అది మర్చిపోకు’’
‘’ ఏమీ లేదండీ... మన పిల్లలు ఆ కాన్వెంట్లో చదివినప్పుడు నేను పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పని చేశాను కదా. అప్పట్లో నేను ఏ మాట మాట్లాడినా వేదవాక్కులా భావించి అమలు జరిపేవాడు ఆ ప్రిన్సిపాల్. ‘మీరు మా కాన్వెంట్ లో ఈ హోదాలో ఉంటూనే గౌరవమైన టీచర్ గా పని చేస్తే మా కాన్వెంట్ కే గర్వ కారణం’ అన్నాడు ఒకసారి. ఈ వేళ ఇంతగా అవమానిస్తాడని అని కలనైనా ఊహించలేదు.
వాడు కేవలం అమాయకులైన తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తును భూతద్దాలలోనుంచి చూపించి భ్రమింపచేసి డబ్బులు గుంజే రక్త పిశాచి. వాడు దేశానికి అందించేది భావి భారత పౌరుల్ని కాదు. ర్యాంకుల రేసుల్లో ఎప్పుడూ ముందు ఉండడం కోసం ఏం చేయాలి? అవసరమైతే పిల్లల్ని డ్రగ్ ఎడిక్ట్ చేయడానికైనా వెనుకాడని ‘డ్రాకులా’ అని ఎవరో చెప్పగా విన్నాను. అది ఎంత వరకు నిజమో నాకు తెలియదు. అయినా అవన్నీ మనకు అనవసరం.
ఆరోజు నన్ను రిసీవ్ చేసుకున్నట్లు గానే ఈ వేళ ఒక ఆవిడను రిసీవ్ చేసుకున్నాడు. ఆరోజు నేను కూర్చుని ఉండగా టీచర్ అందరూ ఒక్కరే వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పినట్టుగానే నేను ఈ వారం రోజులుగా చెబుతూ వస్తున్నాను. నేను అలా గుడ్ మార్నింగ్ చెప్పిన వెంటనే ‘మేడం మీరు నైన్త్ క్లాస్ రెడీ చేయండి. ఈమె తెలుగు డిమాన్స్ట్రేషన్ లెసన్ చెప్తారు.ఇక మీరు వెళ్ళవచ్చు’’ అన్నాడు.
నేను ఒక్క క్షణం ఆగి 9వ తరగతి నేను చెబుతున్నాను కదండీ. మళ్లీ కొత్త టీచరు అవసరం ఏమొచ్చింది? అని అడిగాను. ‘ప్లీజ్ డూ వాట్ ఐ సే’ అని పళ్ల బిగువున అరిచాడు. అంతే నాలో మొండితనం రెట్టింపు అయ్యింది ‘చూడండి సార్. నా మీద ఏదైనా కంప్లైంట్ వచ్చి ఉంటే చెప్పండి. సరిచేసుకుని పని చేస్తాను. లేదా పిల్లలు గానీ మా కొలీగ్స్ గానీ నా ప్రవర్తన పట్ల ఏమైనా అభ్యంతరం తెలిపితే చెప్పండి.’ అని ఇంకా చెప్పబోతుంటే ఆవిడ ముందే నా మీద అరిచేశాడు.
‘ ఏంటండీ? ఏమనుకుంటున్నారు మీరు? ఐయామ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. నిన్నకాక మొన్న చేరారు. అప్పుడే అడ్మినిస్ట్రేషన్ ని ఏదిరించి మాట్లాడే స్థాయికి ఎదిగిపోయారా? మీరలా ఎదుగుతుంటే మేము చూస్తూ ఉంటాం... ఉరుకుంటాం అనుకున్నారా? ఏం? తెలుగులో మీరేమైనా ఆమెలా ఎం.ఏ. చేశారా? సబ్జెక్ట్ స్పెషలైజేషన్ చేశారా? అసలు ఇంటర్వ్యూ నాడే మీ పద్ధతి నాకు నచ్చలేదు.
అరె. గతంలో ‘మీ స్కూల్లో పని చేస్తున్నానని తెలిస్తే పదిమందిలో నాకు గర్వంగా ఉంటుంది’ అని అన్నారని మీరు టీచర్ గా చేరడానికి ఒప్పుకున్నాను. పిల్లలు అడిగిన ప్రశ్నలకు ఇంటర్వ్యూ నాదే సమాధానాలు చెప్పలేక పోయారు మీరు. ఇప్పుడు నన్ను నిలదీస్తారెంటి? వెళ్లండి . వెళ్లి చెప్పిన పని చేయండి’’ కటువుగా అన్నాడతను.
నేను ఓర్పుతో అన్నాను. ‘ అయితే కష్టపడి పిల్లలకు చక్కగా అర్ధమయ్యే రీతిలో బోధించేవారు మీకు అక్కర్లేదన్నమాట. కేవలం పదవ తరగతి పాస్ అయి, ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆరు వందల రూపాయలకు మీకు తమ శ్రమనంతా ధారపోసి, అదీ చాలక మీరు ట్యూషన్ పేరుతో డబ్బులు గుంజి జేబులో వేసుకుంటూ ఉంటే ఆ చాకిరీ కూడా చేసి ఏ రాత్రి ఎనిమిదింటికి ఇంటికి చేరే టీచర్లు మీకు కావాలన్నమాట.’
అతను విచిత్రంగా కళ్ళు ఎగరేసి అన్నాడు ‘ఓ! చాలా సమాచారం సేకరించారే. మీరు అసలు క్లాస్ కి వెళ్ళ వలసిన పనిలేదు. ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై ఇన్స్టిట్యూషన్’’ అన్నాడు.
‘ వెళ్ళక పొట్ట కోస్తే అక్షరం ముక్క రాని ప్రతివాడు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పే కలేజా లేక, క్వశ్చన్ బ్యాంకులు, గైడు లతో బట్టి పట్టించే పవిత్రమైన కాన్వెంట్ లో పనిచేసే అంత గొప్పదాన్ని కాదు నేను. వెళ్తాను. వారానికో టీచర్ను మార్చి పసిపిల్లల నోట్లో మట్టి కొట్టి, తల్లిదండ్రుల మొహాన డ్రింకులు పోసే మీ సంస్కారానికి జోహార్లు. గుడ్ బై’ అని వచ్చేసాను.
అదీ సంగతి. ఇప్పుడు చెప్పండి. నేను చేసింది తప్పు అంటారా?’’
‘’ కాదు అరవింద. కానీ నీలా ఖచ్చితంగా ఉండే వాళ్ళు కాదు వాళ్లకు కావాల్సింది. చచ్చిపోయిన కళేబరం చుట్టూ కూర్చుని దాని దగ్గరకు ఎవరూ రాకుండా చేసే నక్క కుతంత్రంతో ఈ రోజు వందలాది మంది అలాంటి మేధావులు రాజాల్ల బతికేస్తున్నారు. వారి తినేసి విసిరేసిన బొమికలకోసం పాపం నాలుగు అక్షరం ముక్కలు వచ్చిన ప్రతీవాడు ఉద్యోగం కోసం వాడిని ఆశ్రయిస్తున్నాడు.
నీకు నేనున్నాను కనక ‘ నీ లెక్కేమిటిరా’ అని వచ్చేశావు. వాడి పాయింటాఫ్ వ్యూలో వాడు కరక్టే. అలా బ్రతక లేక పోతే వాడు లక్షలు సంపాదించి సందులకు సందులు కొనలేడు. పైగా నీలాంటి వాళ్ళు అక్కడే ఉంటే వాడి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ఏది ఏమైనా నీ ‘ముచ్చట’ తీరింది అది మంచిగా పూర్తి అయితే బాగుండేది..
ఇప్పటికైనా మించి పోయింది లేదు. మనకు డబ్బులు వద్దు. నీకు నిజంగా నీకు చదువు చెప్పాలని ఉంటే వీధిలో చిన్న పిల్లలందర్నీ చేరదీయి. చక్కని చదువు చెప్పు. 2005 నాటికి 95 శాతం అక్షరాస్యత సాధించాలన్నది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి నీ వంతు కృషి చెయ్యి. ఆ అక్షర యజ్నంలో పాలు పాలుపంచుకున్న తృప్తి మనకు చాలు. ఏమంటావు?’’ అనునయంగా అన్నాను.
‘’మీరు భర్తగా దొరకడం నా అదృష్టం అంటాను. మీ మాట మీరి గడప దాటినందుకు నన్ను క్షమించండి’’ అంది తల దించుకుంటూ.
‘’అనుభవంతో ఒక సత్యాన్ని గ్రహించావు. ఇందులో క్షమించాల్సినంత పొరపాటు నువ్వేమీ చేయలేదు. ఆ విషయం ఇంక వదిలేయ్. లేట్ అయిన పర్వాలేదు. నీకు ఇష్టమైతే పిక్చర్ వెళ్దాం. లేదంటే గుడికి వెళ్దాం. త్వరగా స్నానం చేసి తయారవు’’ అన్నాను.
తేలిక పడిన మనసుతో లోపలకు వెళ్తున్నా ఆమెను చూస్తూ సంతోషంగా నా గదిలోకి నడిచాను.
సమాప్తం
(ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రిక - నవంబర్ 2002 సంచికలో ప్రచురితం )
No comments:
Post a Comment