నెత్తుటి పువ్వు - 34
మహీధర శేషారత్నం
(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన సరోజ అనే అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తాడు రాజు. బట్టల కొట్లో పనిచెయ్యనని చెప్పేస్తుంది సరోజ. ఒకరోజు లక్ష్మి రాజును సరోజ గురించి నిలదీస్తుంది. ఆమెను ఏమార్చి, సరోజ ఇంటికి వెళ్తుంటాడు రాజు. కడుపుతో ఉంటుంది సరోజ. ఆమెను మారేడుమిల్లి అడవులకు తీసుకు వెళ్తాడు రాజు. )
“దీన్ని పాము లేరు
అంటారు. ఈ నీటి ఒరవడిలో కనపడకుండా భయపెట్టే నీటి సుడిగుండాలు... నీటి ప్రవాహం
జలతరంగిణిలా లేదూ! ప్రకృతిని మించిన సంగీతమే లేదు. వయసు శరీరానికే కాదు మనసుకూ
వయసుంటుందని గుర్తుచేస్తూ చిన్నదయిపోయిన మనసు. “ఓహ్! ఏమందం”
గాలికి ఎగురుతున్న క్రాప్ అదుముకుంటూ అన్నాడు నాగరాజు. “ఇదుగో, అక్కడేవో మెట్లు ఉన్నాయి. అటేముందో వెడదామా?”
అంది సరోజ.
“వద్దులే వెళ్ళి మళ్ళీ
వెనక్కి రావాలంటే చీకటి పడుతుంది. అదీ కాక సగం సగం విరిగిమెట్లు సరిగాలేవు.”
“వెడదాం... వెడదాం!”
గునిసింది సరోజ.
“వద్దన్నానా! నీ కోసం
కాదు, నా కొడుక్కోసం, ఇంత అలసిపోకూడదు.
ఇంత ఎంజాయ్ చేసాం. రేపు ఇంకో చోటికి” నుదుటిమీద ముద్దు
పెట్టుకుంటూ అన్నాడు.
“ఊఁ! రేపటితో ఆఖరా!
మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. నేనా గదిలో ఒంటరిగా... నిరుత్సాహంగా అంది సరోజ.
“రేపటి గురించి
ఆలోచించాలి కాని ఈరోజు ఆనందం పోగొట్టుకోకూడదు. ఈ ఆనందం ఒక తీపి జ్ఞాపకంగా
మిగలాలంటే ఈ క్షణం మీదే మన దృష్టి ఉండాలి. నిజమా! కాదా!” నవ్వుతూ
అన్నాడు నాగరాజు.
“నిజమే! నిజమే!
అయ్యగారు ఎప్పుడూ నిజాలే చెప్తారు” నాలిక బయట పెట్టి వెక్కిరించింది
సరోజ. “ఇక్కడ బొంగులో చికెన్ తినేసి రేపు ఒక అద్భుతమైన
ప్రదేశానికి వెళ్ళబోతున్నాము. చూసుకో!” ఊరించాడు నాగరాజు.
“ఓ! ఏదో సినిమాలో
విన్నానా మాట బొంగులో చికెన్....పకపక నవ్వింది సరోజ. మనసారా గలగలా నవ్వుతున్న సరోజ
ముఖం నిజంగా సరోజంలాగే కనిపించింది నాగరజుకి. అందులోనూ కడుపులో ఉందేమో బుగ్గలు
నిండి ముఖం మరింత అందంగా మారింది.
*****
ఎక్కువసేపు నడవడంవల్ల సరోజ అలసటగా
ఉండి పడి నిద్రపోయింది. నాగరాజు మాత్రం సరోజని లేపకుండా తను ఫ్రెషప్ అయి అలా
ప్రకృతిని ఆస్వాదిస్తూ బయట తిరిగి తిరిగి లోపలికి వచ్చేసరికి సరోజ లేచి రెడీ
అయింది.
“లేపకుండా ఎక్కడికి
పోయావు? నాకెంత భయం వేసిందో తెలుసా!” అలిగింది.
“భయమెందుకు? నువ్వు అలసిపోయి పడుకున్నావు. నేను హాయిగా కాసేపు తిరిగి వచ్చాను.
ఏముందిందులో సరే తరువాత తీరుబడిగా అలగచ్చు, పద పద” కోరంగి అభయారణ్యాలు... చెక్కవంతెన దాటుకుంటూ ముందుకు ముందుకు నడుస్తుంటే దట్టమైన
చెట్లు, లోయలో ఎదిగిన వృక్షాలు.... ఒకళ్ళిద్దరు ప్రేమికుల
జంటలు గుసగుసలాడుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ..
ఇంత నిర్జనమైన చోటుకి వీళ్ళు ఎంత
నిర్భయంగా వచ్చారో కదా! ఆ మగాడిమీద ఈ ఆడపిల్లలకి అంత నమ్మకమా? లేక తెంపరితనమా? అనుకున్నాడు. అక్కడికి దగ్గరలో ఏదో
ఇంజనీరింగు కాలేజి ఉన్నట్టుంది.
“ఏంటి అంత ఆలోచనలో
పడ్డావు?” సరోజ భుజం తట్టింది.
“ఏం లేదు, చూడు ఆ పిల్లల్ని...” అన్నాడు.
సారూ! మనము అంతేగా!” కిల కిల లాడింది.
ప్రేమ ఎంత మధురము హమ్ చేసింది.
మళ్ళీ లక్ష్మి గుర్తొచ్చి నాగరాజు
మనసులో ఒక చిన్న కుదుపు తనమీద లక్ష్మి కెంత నమ్మకము. నాగరాజు ముఖం ఒక్క క్షణం
మౌనమైంది.
ఇదేమీ గమనించని సరోజ నోటికొచ్చిన
పాటలు పాడుకుంటూ, ఎగురుకుంటూ స్వేచ్ఛగా నడవసాగింది. ఒకచోట రాయిని
చూసుకోకుండా తట్టుకుని పడబోయి ఆపుకుంది. కాలి బొటనవేలికి దెబ్బతగిలి రక్తం
వచ్చింది. నాగరాజు ఈ లోకంలోకి వచ్చి కసిరాడు. ఏమిటా పరుగులు అంటూ దెబ్బ గట్టిగా
తగిలి రక్తం వస్తుంటే జేబులో కర్చీఫ్ తీసి కట్టాడు మట్టి, దుమ్ము
పడతాయంటూ.
సరోజ ఆ చిన్న పనికే కదిలిపోయింది.
ఇంతవరకూ తనమీద ఈ మాత్రం ప్రేమచూపించిన వారెవరూలేరు. తల్లిపోయాక ఒంటరిదయిన తన
జీవితంలోకి చల్లగాలిలా వచ్చాడు నాగరాజు. దేవుడా! ఈ ఆనందం కలకాలం నిలుపు. మనసులోనే
దేవుడిని కోరుకుంది.
“హాయ్!” అద్భుతాన్ని చూస్తున్న సరోజ ఒక్క కేక పెట్టింది. నాగరాజు గుండెలు నిండిన
ఆనందంతో నోటమాటే రాలేదు. లాంచీ ఎక్కి గోదావరిలో ప్రయాణం. లంకల్లో పెరిగే మడమొక్కలు,
గాలి పీల్చుకోవడం కోసం భూమిపైకి తిరిగి పెరిగిన వేళ్ళు అద్భుతమైన
అనుభూతి. మధ్య మధ్య మడమొక్కలతో కూడిన మట్టిదిబ్బలు చుట్టూ గోదావరి ఆ నీళ్ళల్లో ఈ
మొక్కల ప్రతిబింబాలు, అద్దంలో అందం చూసుకొంటున్నట్టు,
మధ్య మధ్య దీవులు, చీలిన గోదావరి పాయలు,
పక్కనే నాటుపడవలో ఒంటిమీద వట్టి గోచీతో వేటకొచ్చిన జాలరుల నవ్వులు,
మోటారులాంచి ముందుకు సాగుతుంటే తరుముకుంటూ వస్తున్న నీటి అలల
పరవళ్ళు. మన ఆంధ్రలోనే ఇంత అందమైన ప్రాంతాలున్నాయా అనుకున్నాడు.
“ఏయ్! ఇదుగో! ఇటు చూడు!”
సరోజ ఆనందం పట్టలేక కేకలు పెడుతూ చూపించింది. చేతి కందేంత దూరంలో
బొరియలలోంచి చిన్న చిన్న పీతలు, గమ్మత్తుగా వాటి డెక్కలు
ఎర్రగా ఉన్నాయి. పుట్ట పగిలినట్టు బయటికి వస్తూనే ఉన్నాయి. చాలా చిన్నవి బలే
అందంగా ఉన్నాయి.
నత్తలు, పాలపిట్టలు, కింగ్ ఫిషర్ పిట్టలు. ప్రకృతిలోనికి
ప్రయాణం. ఇంకా ముందుకిపోతే గోదావరి సముద్రంలో కలిగే అద్భుత దృశ్యం. నడి సముద్రంలో
కలిసి, నింగిలో కలిసి కను చూడగలిగినంత ఒకటే రంగు.
ఆనందంతో పిచ్చెక్కి పోవడమంటే ఏమిటో
అనుభవంలోకి వచ్చింది నాగరాజుకి.
సరోజ కళ్ళు ఆశ్చర్యంతో ఇంకా
పెద్దవయ్యాయి. “పోటుమీద ఉంది ఇంక ముందుకు వద్దు” అన్నాడు. లాంచీ నడిపేవాడు.
అందరూ ఒక్క పదినిమిషాలు అందులోనే
అక్కడక్కడే తిప్పవా అనిగోలచేసారు. అతడికి ఎంతో మందిని చూసిన అనుభవం ఉంది. తాము
నిత్యం చూసే ఈ ప్రాంతం జన్మలో ఒకసారిచూసే వీళ్ళని ఎంత వెర్రెక్కిస్తుందో అతనికి
తెలుసు.
“అవేమిటి? అవేమిటి? ఆత్రంగా అడిగింది దూరంగా పాతిన గడలు
చూపిస్తూ సరోజ.
“అవా! చూడండి, వాటికి వలలుకట్టారు, నీటి ఒరవడికి చేపలుపడతాయి
చేపలవేట” అన్నాడతను.
ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుందో లాంచీలో
ఉన్న ఒక అమ్మాయి అంది.
“మీరు ఒక్కరోజు కూడా
ఉండలేరిక్కడ. పగలు పదిమంది లాంచీలో చక్కగా కూర్చుని చూస్తున్నారు కనుక అందం
కనపడుతోంది. రాత్రి చీకట్లో కరెంటులేక పాములూ, తేళ్ళు,
మండ్రగబ్బలు, పురుగూ పుట్రా, ఎండా, వానా, చలీ, కట్టుకోవడానికి, కప్పుకోవడానికి బట్టలులేని ఈ జనంలా
ఒక్కరోజుకూడా బతకలేరు” నిరాసక్తంగా అన్నాడతను. అందరూ మనసులో
నిజమే కదా! అనుకుంటూ మౌనంగా ఉండిపోయారు.
నాగరాజు “చదువుకున్నావా?” అనడిగాడు. దగ్గర కోరంగి అను ఊళ్ళో
హైస్కూలు ఉంది. ఫ్రీ కనుక అక్కడ టెన్త్ వరకు చదువుకున్నాను. కాకినాడ వెళ్ళి రావాలి
కాలేజి చదువుకు. కాని మా నాన్న ముసలాడు. సాయంగా ఉండరా చిన్నోడా! అంటే ఉండిపోయాను.
అందరికీ ఆనందం పోయి కొంచెం గంభీరమైన
వాతావరణం అలుముకుంది.
“సారీ! మీ మూడ్
పాడుచేసినట్టున్నాను. దీనికేంగాని వచ్చినవాళ్ళందరూ పాటలు పాడండి సార్! అన్నాడు
కుర్రాడు.
అంత్యాక్షరి... అంత్యాక్షరి
అన్నారంతా.
చక్కగా మారింది వాతావరణం సరోజ కూడా
రెండు పాటలు పాడింది.
అలా ఆహ్లాదకరంగా టూరు ముగించుకొని
గూడు చేరాయి జంటపక్షులు. సరోజని రూములో దింపి నాగరాజు వెడుతుంటే సరోజ ఏడుపు ముఖం
పెట్టింది.
No comments:
Post a Comment