పురాణ కధలు - బసవ పురాణం -14
పి.యస్.యమ్. లక్ష్మి
14 నాట్యసమత్తాండి కధ
పూర్వం కంచిలో నాట్యసమత్తాండి అనే భక్తుడుండేవాడు. ఆయన ఒకసారి శివాలయానికి వెళ్ళి అక్కడ తాండవ లింగమూర్తి దర్శనం చేశాడు. తాండవ శివుడు ఎలా వుంటాడో మీకు తెలుసుగా? ఒక కాలు నేల మీద మోపి, ఇంకొక కాలు ఆకాశానికి ఎత్తి, వంగిన నడుము .. ఆ భంగిమ చూసి గుడి పూజారితో ఆ భక్తుడిలా అడిగాడు.. “ఈ శివుని ఆకారమిలా వికృతంగా వుందేమిటి? ఒక కాలు నేల మీద, ఇంకో కాలేమో ఆకాశంలో, శరీరమంతా ఒక పక్కకి ఒరిగి వుంది. చేతులూరికే కదులుతున్నవి. పిడికిట్లో ఏదో పట్టుకున్నాడు. చెయ్యి కదిలినప్పుడల్లా అదేమిటో వింత ధ్వని చేస్తున్నది. కనులు మూసుకున్నాడు. మెడలో హారాలన్నీ చిక్కుబడి వున్నాయి. జుట్టు విరబోసుకున్నాడు. పక్కన పార్వతీ దేవి లేదు. ఆవిడో పక్కన కూర్చుని చూస్తున్నట్లున్నది. ఇవ్వన్నీ చూస్తే నాకు భయం వేస్తోంది. ఏమిటి ఈ శివయ్య పరిస్ధితి? ఎందుకీలా వున్నాడు? ఆయనకేమీ అనారోగ్యం చెయ్యలేదు కదా?” అని.
ఆ అమాయక భక్తుడు అర్చకుణ్ణి మరీ మరీ అడుగుతుండటంతో అర్చకుడు ఆ భక్తుణ్ణి మోసం చెయ్యాలనుకున్నాడు. “ఓ భక్తవరేణ్యా, నీకేమని చెప్పను? ఈ పరమేశ్వరునికి ఒక మహా వాత రోగం వచ్చింది. తగిన మందు పడకపోతే అది చాలా ప్రమాదమవుతుంది. తగిన ధనము లేక నేనివ్వలేక పోతున్నాను.” అనగానే ఆ అమాయక భక్తుడు పరుగున తన ఇంటికి పోయి తనకున్న ఆస్తినంతా తెగనమ్మి ధనము తీసుకొచ్చి అర్చకుడి చేతికిచ్చి “వెంటనే మందు చేసి ఇవ్వండి. ఈ రోగము త్వరగా తగ్గించండి. శివయ్య రోగం తగ్గితే నా భార్యా, పుత్రులు, నేను, మా జీవితాంతం మీకు ఊడిగం చేస్తూ వుంటాము.” అని వేడుకున్నాడు.
ఆ అర్చకుడు ఒక పొయ్యి పెట్టి, పెద్ద గిన్నె పెట్టి అందులో కొంత నూనె,
కొంత ఆముదము పోసి, ఆముదపాకులు, జిల్లేడు ఆకులు, ఇంకా కొన్ని ఆకుల పసరు తీసి
పోశాడు. బాగా మరిగించి దించి, వడగట్టి
దానిని ఆ భక్తుడి చేతికిచ్చి “ఇది నేను ప్రత్యేకించి తయారు చేసిన తైలము. దీన్ని మహా వాయు తైలము అంటారు. దీనికిదే మందు. నువ్వు ప్రతి రోజూ దేవుని శరీరానికీ తైలాన్ని
మర్దన చేస్తూ వుండు. జబ్బు నయమవుతుంది” అని చెప్పాడు.
ఆ భక్తుడు ప్రతి నిత్యము ఆ తైలాన్ని మృత్యుంజయుని శరీరానికి
మర్దించసాగాడు. కొన్నాళ్ళకా తైలము
అయిపోవటంతో తానే మరి కొంత తైలము ఆకు వసరులు కలిపి వండి, స్వామి శరీరానికి
రాయసాగాడు. ఇసుక మూటలతోను, వేడినీళ్ళల్లో
గుడ్డ ముంచీ కాపడం పెట్టేవాడు.
ఎన్ని చేసినా శివుడు కుదుటపడకపోయేసరికి విసిగి “ఇంక నీ రోగము ఈ
మందులతో నయం కాదు. ఇట్టి వాతములకు
మహామావియె తగిన మందు. మహామావి అంటే సలసల
మరిగే నూనెలో వుడికిన సర్వావయోపేత మానవ దేహపు మాంసం ముద్దకదా. నేనట్లాంటి మందివ్వకపోతే నీ రోగం తగ్గదు. కనుక ఇప్పుడే అట్లా అవుతాను” అని కాగుతున్న
పెద్ద గంగాళంలో నూనెలో దుముకబోతుండగా శివుడు ప్రత్యక్షమై, “వత్సా, నీ
భక్తికి మెచ్చాను. ఏదైనా వరం కోరుకో” అన్నాడు. ఈ భక్తుడు “స్వామీ, నా వరం
సంగతి తర్వాత. ముందు నీకీ రోగం ఎట్లా
వచ్చిందో అది చెప్పండి. ఇది ఎట్లా
మానుతుంది ముందీ రోగాన్ని తగ్గించుకుని నీ
ఆరోగ్యమైన శరీరాన్ని నాకు చూపించు” అన్నాడు.
దానికి ఆ పరమేశ్వరుడు, “నాయనా, ఇది రోగము కాదు. నేను మహా నటుడను. నాట్యము చెయ్యాలనుకుంటే నా ఆకారమిలాగే వుంటుంది. నేను జగన్నాటక సూత్రధారుడను. భూమియే నా నాట్యరంగము. అలాగే ఆకాశం కూడా. నేను తాండవమాడునపుడు నా అర్ధాంగి నా తాండవమునకు సాక్షియై చూస్తూవుంటుంది. అందుకే ఆవిడకి “మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి” అనే పేరు కూడా వుంది. ఒక్కోసారి సకల దేవతల ముందు కూడా తాండవమాడుతుంటాను. నేనెప్పుడు నాట్యము చేసినా పార్వతి నా ప్రక్కనే కూర్చుండి చూస్తూవుంటుంది. ఇది తాండవ వేషమేగాని రోగము లేదు. ఈ నా తాండవ రూపమును దర్శించినవారికి మరు జన్మలేదు. నీకూ మరో జన్మలేదు. నువ్వూ నాతో కైలాసానికి వచ్చి ఈ శరీరంతోనే నా సన్నిధిలో వుండు” అని ఆతనిని తనతో తీసుకుని వెళ్ళాడు శివుడు.
చూశారా, అమాయకంగానైనా శివుణ్ణి అంతలా నమ్మినవారికి మోక్షము తప్పక
వస్తుందని ఈ కధ నిరూపిస్తుంది కదా.
***
No comments:
Post a Comment