శఠగోపం షష్ఠిపూర్తి - అచ్చంగా తెలుగు

శఠగోపం షష్ఠిపూర్తి

Share This
శఠగోపం షష్ఠిపూర్తి
శ్రీదేవి మురళీధర్


శఠగోపం ముక్కోపి. మహా డాబు మనిషి. అందరూ తననే గౌరవించాలంటాడు. ఇంటిల్లిపాదికీ అతడంటే హడల్. తన మాటే చెల్లాలనే జగమొండి రకం. భార్యాబిడ్డలను అటుంచి, ముసలి తల్లిదండ్రులనే లెక్క చెయ్యడు. ఎవరినైనా ఎంత మాటైనా అనటానికి జంకడు. తలెగరేసి అహంకారంగా తిరుగుతూ ఉంటాడు. 

ఓ నాడు ఇంట్లో ముందు గదిలో సభ తీర్చాడు. అదొక అలవాటు అతగాడికి. ప్రతి చిన్న విషయానికీ మీటింగులు పెట్టి కుటుంబీకులను నానా మాటలూ అంటూ పీక్కు తినటం! ఈ సారి ఏం తెచ్చి పెడతాడోననుకుంటూ అంతా బితుకుబితుకు మంటూ గుమికూడారు. మహానాయకుడు జనాలను ఉద్దేశించి ప్రసంగించే ముందు గొంతు సవరించుకునట్టు గొంతు సరి చూసుకున్నాడు. గంభీరంగా ముఖం పెట్టి ఉపోద్ఘాతంగా అన్నాడు.. 'ఏళ్ళోస్తున్నై, ఏం లాభం? పెద్దా చిన్నా ఎవరికీ బుద్ధులు మాత్రం వికసించట్లేదు. ' 

ఎవరి మీదికి వ్యంగ్యబాణం ఎక్కుపెట్టాడో అర్ధం కాక ఎనభై పైబడ్డ తల్లీ, తండ్రీ దవడలు నొక్కుకుని ముఖాలు చూసుకున్నారు. అందరి కంటే చిన్నవాడు బాబిగాడు బుర్ర గోక్కున్నాడు. దగ్గుతెర మధ్య తల్లి ధైర్యం చేసి అడిగింది, 'మళ్ళీ ఏమొచ్చిందిరా గోపాయ్?' అని. ఒక్కసారిగా ఆవిడ మీద విరుచుకుపడ్డాడు శఠగోపం. 'ఏమొచ్చిందని మెల్లిగా అడుగుతున్నావా ? తినటం, దగ్గటం కాక నీకు వేరే ఏదైనా తెలుసా ? కాటికి కాళ్ళు చాచుకున్న పెద్దదానివి నువ్వు అడగవలసిన ప్రశ్నేనా అది ? అరవై వచ్చినై! నీ కొడుకు షఠగోపాచారికి వచ్చే వారానికి అరవై నిండి షష్ఠిపూర్తి అవుతుంది.

 ' 'శుభం, దీర్ఘాయుష్మాన్ భవ!' మనసారా దీవించారు తల్లిదండ్రులు. ' అప్పుడే అరవై వచ్చినై?' అనుకుంటూ. 'సడేలే సంబడం. మహా గొప్పగా దీవించార్లే ! అసలు షష్టిపూర్తి అంటే ఎంత ముఖ్యం, ఎంత గొప్ప. స్వజనులు, బంధుజనం అంతా కూడబలుక్కుని పెద్ద ఎత్తున పందిళ్ళు వేసి పండగ చెయ్యాలి, హెూమాలు, భోజనాలు, ఏర్పాటు చెయ్యాలి, అంతా కట్నాలు, కానుకలు చదివించాలి. ' వగరుస్తూ చెప్పాడు కడుపులో మాట. 

'నిజమేస్మీ.. నువ్వు మాకు ఏనాడూ ఏదీ చెయ్యలేదు కాబట్టి తెలీదురా అబ్బీ. 'అన్నాడు ముసలి తండ్రి పాపం ఉబ్బసంతో ఆయాసపడుతూ. ' ఆరి ముసిలాడా, ఎంత మాటన్నావ్? ' అనుకుని ఒక లిప్తపాటు కంగుతిన్నా, వెంటనే తిప్పుకుని 'అదే మండేది. నీకు నేను చెయ్యలేదని కచ్చతో నాకు ఎవరూ చెయ్యకుండా చూస్తావా ?' తాటాకు మంటలా ఎగిరి పడ్డాడు శఠగోపం. 'అబ్బెబ్బే, లేనిపోనివన్నీ ఊహించుకోకురా. నీ పిల్లలు ఇంకా చిన్న వాళ్ళు.. సంపాదనాపరులు కారు నీ కోరికలన్నీ తీర్చటానికి. వాళ్లకి ఏనాడూ ఒక్క అక్కర కూడా చెయ్యలేదు పాపం. ' బాధ పడుతూ అన్నది తల్లి. 'పిల్లలు కాకపోతేనేం ? పెద్ద తలకాయలు మీరు ఇంకా ఉన్నారు కదా? మీరు దాచుకున్న డబ్బు పెట్టి చెయ్యండి. కొడుక్కి షష్ఠిపూర్తి అంటే ఎంతో ఆనందంగా మీరే ముందుకు రావాలి ' పట్టుదలగా అన్నాడు. అతడికి మండిపోతోంది ఒక్కరూ తన షష్ఠిపూర్తికి విలువ ఇవ్వటం లేదని. 

నిట్టూర్చాడు తండ్రి, 'మా బొంద, మా దగ్గర ఏముందిరా బూడిద... కడుపు కట్టుకుని మీ అమ్మ కూడబెట్టిన పదివేలు, నేను పైసాపైసా దాచి పోగుచేసిన పదిహేనువేలూ.. ' 'మరింకేం? పాతికవేలు ఉంచుకుని బీద అరుపులు అరుస్తారెందుకు? అవే పెట్టి చెయ్యండి, ఏదో సర్దుకుంటాను '

'నీకు తెలియనిదేముందిరా. ఉన్నట్టుండి మేమిద్దరం హరీమంటే నీకు భారమని మా తదుపరి ఖర్చుల కోసం దాచి ఉంచాము. అవి మాత్రం తియ్యము గాక తియ్యము'. 'ఏడ్చినట్టుంది. ఎప్పుడో మీరు పోతారని ఇప్పుడు నాకు షష్ఠిపూర్తి చెయ్యం పొమ్మంటే ఎట్టా? ఛీఛీ, ఇలాంటి లేకి తల్లిదండ్రుల్ని ఇచ్చావేమిరా భగవంతుడా!' అన్నాడు అక్కసుతో. 'మధ్యలో ఆయన జోలికి మాత్రం పోకు, లేనిపోని పాపం. ఇదుగో మా మాట విను. ఆ నాడు చక్కగా తలంటినీళ్ళు పోసుకుని, దేవుడికి కొబ్బరికాయ కొట్టి, నీకు ఇష్టమైన గారెలు, పరమాన్నం తిను.. ' ఒళ్ళు మండిపోయింది షఠగోపానికి. 'మా స్నేహితుడు చెంగాల్రావు షష్టిపూర్తి బావామరుదులు, మరదళ్ళు కలిసి ఆర్భాటంగా చేశారు. ఏమే, మొద్దుమోహమా! కనీసం మీ అన్నలనీ, చెల్లెళ్ళనీ కలిసి జరిపించమను.. ' ఒక పక్క ఈ మాట రానే వస్తుందని భయంతో బిక్కచచ్చిన భార్య మీదికి దుమికాడు. 'మీకు పుణ్యముంటుంది. వాళ్ళను దయతలిచి వదిలిపెట్టండి. బక్క ప్రాణాలు, వాళ్ళ దగ్గర ఏముంటుందని, గుమాస్తా బతుకులు ' చేతులు జోడించి ప్రాధేయ పడింది ఆండాళ్. 

' ఎందుకు చెయ్యరు? ఇంటికి పెద్ద అల్లుణ్ణి. చేసే తీరాలి' 'నిజమే కానీ వాళ్ళకు స్తోమత లేదు. ' 'ఓహెూ, ఏ స్తోమత ఉంది? పిలిస్తే వచ్చి తేరగా తిని పోయే స్తోమత మాత్రం ఉన్నదీ? ' 'బాబ్బాబు పిలవకండి. పిలిచిన ప్రతిసారీ కట్నాలు చదివించలేక చస్తున్నారు'. 'అయితే విను.... నా షష్టిపూర్తి చెయ్యని అత్తగారిల్లు నాకు లేనట్టే ' శపించాడు. 

ముసలి తల్లిదండ్రులు ఈ అఘాయిత్యపు మాటలకు చెవులు మూసుకున్నారు. గోడవారగా కూర్చుని చూస్తున్న పిల్లల వంక పరీక్షగా వేటగాడిలా చూసాడు. 'అవునొరే. రెండో క్లాసులో మీ స్నేహితులకు చదువు చెప్పినట్టు గుర్తు. అందర్నీ కూడేసి మా నాన్నకు షష్ఠిపూర్తి చేయించవలసిందని చెప్పు" 'ఏమో నాన్నా.. వాళ్ళ నాన్నలు మాకు కూడా అప్పుడప్పుడు చదువు చెప్పేవాళ్ళు ఒకటి రెండు సార్లు జీతాలు కూడా కట్టారు. రేపు వాళ్ళు కూడా మా నాన్నలకు షష్ఠిపూర్తి చేయించమని అంటే మాకు ఇబ్బంది, నీకు ఇబ్బంది.. ' 'వాళ్లకు మీరెందుకు చేయించాలిరా?' 'అదే మాట వాళ్ళ నాన్నలు కూడా అంటారేమో... ' 'అంటే? వాళ్ళ నాన్నలకు నాకూ సాపత్యమా ? నేనేమిటి నా తెలివేమిటి?' ఊగిపోతూ అన్నాడు. '

మేము ఎవ్వరినీ అడగం నాన్నా. చదువు కోసం, కూటి కోసం, అడగవచ్చు. పుట్టినరోజుల కోసం ఎవ్వరినీ దేబిరించం. అందరూ మమ్మల్ని, కాదు, నిన్ను చూసి నవ్వి పోతారు. ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నిన్ను మేము ఏదీ అడగట్లేదు కదా, మమ్మల్నీ నువ్వు వేధించకు. పదండిరా చదువుకోవాలి' అందరినీ లేపి కూడదీసుకుని లోపలికి వెళుతున్న పెద్ద కొడుకు వైపు మింగేసేలా చూసాడు శఠగోపం. ఆ తిరస్కారం అతడు జీర్ణించుకోలేక పోయాడు. 

విసవిసా నడవాలోకి నడిచి మడత కుర్చీలో కూర్చుండి పోయాడు. 'వరసగా ఇరవై మూడేళ్ళ నుండి పద్నాలుగు ఏళ్ళ వరకు ఐదుగురు పుట్టుకొచ్చారు కుచేల సంతానం. కనీ, పెంచి, ప్రయోజకుల్ని చేస్తున్న తండ్రికి షష్ఠిపూర్తి జరిపే దిక్కు లేదు. ఎందుకూ ఇంత బలగం నన్ను ఆశ్రయించుకుని? శకునపక్షుల్లాంటి ముసలి తల్లి దండ్రులు, పుట్టింటి పక్షపాతి భార్య, పనికిరాని సంతాన గోపాలం. అరవై ఏళ్ళకే కావలసినంత వైరాగ్యం వచ్చింది. వీళ్ళందరి రోగం కుదిరేట్టు ఇల్లు వదిలి కాశీకి పోతాను. ఇందరుండి ఏం సుఖం? ఏమి పెద్ద కోరిక కోరాను? ఒక షష్ఠిపూర్తి పండగ. అసలు అదొక కోరికేనా ? ఛీ. ఇందరుండి షష్టిపూర్తి జరిపించుకోలేని బతుకు ఎందుకు ? ఇల్లొదిలి పోతే గానీ ఈ ముసలి పీనుగులకూ, చిన్న గాడిదలకు, పెళ్ళాం పక్షికీ విలువ తెలిసి రాదు. అంతే. ' ఇలా పరిపరి విధాల తలపోయుచున్నవాడై, ఆ మరునాడే 'జై పరమేశ్వరా, ఇదుగో వస్తున్నా' అంటూ కాశీకి వెళ్ళే రైలు ఎక్కాడు శఠగోపం . 

--------------------------------------------------------
ఆసుపత్రి మంచం చుట్టూ అందరూ గుమి కూడి ఉన్నారు.. 'నాన్నా, ఎలా ఉంది నాన్నా 'అంటూ ఆందోళనగా పిల్లలు. 'ఏమండీ, ఇలా చూడండి, నేను మీ ఆండాళ్ ని. 'అంటూ ఏడుపు ముఖంతో భార్య, 'ఒరే గోపాయి, మమ్మల్ని మట్టి చెయ్యకుండా ఎక్కడికిరా బయలుదేరావు"అంటూ లబోదిబో మంటున్న తల్లిదండ్రులు, 'బావగారు, కాస్త నెమ్మదిగా ఉందా? ఇదుగో అంతా ఇక్కడే ఉన్నాము'అంటూ బావమరుదులు, మరదళ్ళు, కాశీకి వెళ్ళే రైలు ఎక్కగానే గుండె నొప్పిగా ఉండటం లీలగా జ్ఞాపకం వచ్చింది. 

'ఎక్కడ ఉన్నాను?కాశీలో లేనా? మీరంతా నన్ను వెదుక్కుంటూ కాశీకి వచ్చారా?' నీరసంగా అడిగాడు. 'కాశీ లేదూ రామేశ్వరం లేదు. షష్టిపూర్తి చెయ్యలేదని అలిగి బండెక్కావు. గుండె నొప్పి వచ్చి రైలు కదలక ముందే దింపి మాకు కబురు చేశారు. నేను రైల్వేలో రిటైర్ అయ్యాను కాబట్టి, ఆ పరిచయంతో రైల్వే ఆసుపత్రిలో చేర్చాము. పెద్ద ఆపరేషన్ చేయించి నిన్ను దక్కించుకున్నాము. పెద్ద గండమే గడిచింది. ' అన్నారు తల్లిదండ్రులు.

 'అమ్మో పెద్ద ఆపరేషనే?అరవై ఏళ్లకే? ' అరిచినంత పని చేశాడు శఠగోపం. 'అవునురా. ఇవాళే నీ షష్ఠిపూర్తి. ఇంతకీ నీ ఆపరేషన్ కోసం మేము దాచుకున్న డబ్బు తియ్యక తప్పనే లేదు. నీ ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా. 'అన్నాడు తండ్రి. 'నీ బావమరుదులు, మరదళ్ళు, శక్తి కొద్దీ తలొక చెయ్యి వేశారు పాపం. ' అన్నది తల్లి. 'పిల్లల స్నేహితులు కూడా తలా కాస్త తెచ్చి ఇచ్చారు' 

షఠగోపానికి కళ్ళనీళ్ళు తిరిగాయి. ఎంత బాధ పెట్టినా అంతా తన చుట్టూ చేరి కాపాడుకున్నారు. 'ఎంత తప్పుగా ఆలోచించాను ! ఆడంబరాలకు, ఆర్భాటాలకు, అందరూ తవ్వి, తలకెత్తలేదని కోపగించుకున్నాను. అవసరానికి అడగకుండానే అంతా ముందుకొచ్చి అండగా నిలబడ్డారు. నా షష్టిపూర్తికి అంతా కలిసి నాకు ప్రాణదానం చేశారు. ఎంత అదృష్టవంతుడ్ని! '

అలా జరిగిందండీ షఠగోపం షష్టిపూర్తి!!!

No comments:

Post a Comment

Pages