శిఖనరసింహ శతకము - పూర్వకవి
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం
కవి పరిచయము:
శిఖనరసింహ శతకము అను ఈ శకునశాస్త్రము పూర్వకవి విరచితము. కవి ఈ శతకములో ఎక్కడా తనగురించి చెప్పికొనలేదు. అందుచేత ఈకవి గురించి ఏసంగతులు తెలియుటలేదు. ఈశతకము బహుశా అహోబిల గిరియందు కొలువైన శిఖనరసింహస్వామిని ప్రార్థించుచు ఆస్వామి పేరున ఈశతకము రచించినట్లు పండితుల అభిప్రాయము. అయితే 1936 లో శ్రీ నేదునూరి గంగాధరం గారు అప్పటికి లభించిన అనేక ప్రతులను పరిశోధించి సంస్కరించి ప్రచూరించారు. ఇందులో ఈకవి వాడిన కొన్ని పదాలను బట్టి ఈ కవి బహుశా 17వ శతాబ్ధమునకు ఈవలి వాడుగా నిర్ణయించారు. ఈకవి అశ్వని దేవతలను ప్రార్థించుటచేత వైద్యుడై ఉండవచ్చును అని ఊహించవచ్చును.
శతక పరిచయం:
"శిఖనరసింహా" అనే మకుటంతో రచింపబడిన ఈశతకంలో 303 కందపద్యాలలో దాదాపు శకునశాస్త్రము అంతా చెప్పబడినది. ఈశతకంలో దైవప్రార్థన తో మొదల్లుపెట్టి శుభ, అశుభ శకునములు, చేష్టాశకునములు గౌళిపలుకులు, తుమ్ముల శకునములు, తొండపాటు ఫలములు, పాలపిట్టశకునము, అవయువముల అదురుపాటుఫలములు ఇత్యాది అనేక విషయములను పొందుపరిచారు. గౌరిపంచాంగము, పగటి రాత్రు ముహూర్తములు, ప్రయాణదినములకు వారశూలలు, రాహుకాలము, గుళికాలము మొదలైన విషయాలు కూడా ఈశతకములో మనకు దొరుకుతాయి.
ఇప్పుదు మచ్చుకి కొన్ని శకున ఫలితాలను చూద్దము
కొన్ని శుభశకునములు
కం. పంచమహా వాద్యంబులు
మించిన భేరీ ధ్వనులును మెఱవడి శబ్ధం
బంచిత శుభవాక్యములీ
క్షించిన శుభ శకునములగు శిఖనరసింహా!
(మెఱవడి=అనగా ఊరేగింపు అని దెశీయ వాడుక కర్నూలు ప్రాతంలో వాడుతారు)
కం. ఫలములుఁ గాయలుఁ బువ్వులు,
వెలయాండ్రును గన్నెపడుచు విప్రద్వయమున్
దెలుపన్నముఁ బాయసమును
జెలువగు శుభశకునములగు శిఖనరసింహా!
కొన్ని అశుభశకునములు
కం:పోవద్దన, బోనేలన
నేవచ్చెదనన్న నేడ కేగెద వన్నన్
బోవం గని చెఱగొడసిన
జీవములకు హాని యండ్రు శిఖనరసింహా!
క. కైనుండు గొడుగుకఱ్ఱయుఁ
బైనుండిన యుత్తరియము పాగాయైనన్
పైనంబు వేళ ధరఁబడ
సేనాలష్టంబు కలుగు శిఖనరసింహా!
(సేనా -బహు, అధికము, దేశీయపదము)
కొన్ని ప్రయాణ దినములు
కం. బలిచక్రవర్తి యంతటి
బలుఁడే చెడిపోయెఁ దదియ భార్గవుని దినం
బుల మానవు లిలఁ జెడరా
చెలువులు పరదేశమునను శిఖనరసింహా!
కం శ్రీముఁ డిడుములంబడె
వారక చవితియును భానువారము గూడన్
నేరక పయనంబై చని
శ్రీరామా యితరు లెంత శిఖనరసింహా!
కం. శనివారము షష్ఠినిఁ జని
పనివడి రావణుఁడు సెడెను బంధుసహితుఁడై
మనుజులు చెడు టబ్బురమా
చినయోబళగిరి విహార శిఖనరసింహా!
కొన్ని చేష్టా శాకునములు (దూతలక్షణము)
కం. నేస్తముగా వచ్చి మనుజులు
మస్తకమును ముట్టిరేని మానిత శుభమౌ
గస్తియగుం దలఁగోకిన
సిస్తౌఁగుడి చెవిని ముట్ట శిఖనరసింహా!
కం. భ్రష్టమగు నెడమ చెవియును
గష్టము మరణంబు రెండు కర్ణములంట
న్నష్ట మెడమ కన్నంటఁగ
శ్రేష్టము కుడికన్ను ముట్ట శిఖనరసింహా!
ఈవిధంగా ఇంటికి వచ్చిన దూత చేసే చేష్టల వలన జరిగే శుభాశుభ శకునాలను గుర్తించవచ్చును. వారు చేసే ప్రతి చేష్టాకు ఒక ఫలితం చెప్పబడినది
కొన్ని గౌళి పలుకుశకునములు (బల్లి శకునము)
కం. తలచుక ప్రార్థన జేసిన
వలపలి దిశ గౌళి పలుక వలనగు శుభముల్
ఇల పయినము కొఱగాదట
చెలివగు శుభకార్యమండ్రు శిఖనరసింహా!
కం. దాపల బల్కిన సకలము నాపదలగు పయనములకు నతిశుభమగున్
చూపరులకు దృష్టాంతము
శ్రీపతి పాదంబు లాన శిఖనరసింహా!
ఈవిధంగ ఏ ఏ సమాయాలలో బల్లి (గౌళి) పలికితే ఏమేమి ఫలములు కల్గుతాయో వివరంగా చెప్పబడినవి
కొన్ని వాక్య శకునములు
కం. ఒక పలుకు దనకు వమ్మగు
వికటంబగు సంధి రెండు విను జగడము మూ
డకటా నాలుగు జగడము
సికపట్లౌ సుమ్ముయైదు శిఖనరసింహా!
కం. ఆఱైతే శ్రేయస్కర
మేరీతిని జగడమేడు యెనిమిది మరణం
బారము ధన శుభఫలమగు
శ్రీరమణా తొమ్మిదిట శిఖనరసింహా!
కొన్ని తుమ్ముల శకునములు
కం. రెండుగఁ దుమ్మిన సఫలము
ఖండితముగ దుమ్మిచీఁదగా మరణమగున్
మెండుగఁదుమ్ముచు నడచిన
జెండును దోషములు నరుల శిఖనరసింహా!
కం. పసిబాల శిశువు లంజెయు
పసగల బాలింతతుమ్ము బంగారుసుమీ
వెస మాలకుంటి క్షుతమొన
సిన బహుకార్యసిద్ధి శిఖనరసింహా!
ఇదేవిధముగా తొండపాటు ఫలములు, బల్లిపాటు ఫలములు (దాదాపు 80 కంపద్యాలలో, సర్పర్శన శకునము (20 కందపద్యములలో), పిల్లి శకునము (12 కందపద్యాలలో), కుక్కల శకునము (17 కంద పద్యాలలో), నక్కల శకునము మొదలైన ఎన్నో విషయాలని ఈశతకంలొ మనం వివరంగా చదివి తెలుసు కొనవచ్చును.
కొన్ని కాకుల శకునములు
కం. ఒక్కటి దీర్చిన నిర్భయ
మక్కట శుభఫలము రెండు నట తీర్పంగన్
నిక్కముగ మూఁడు దీర్చినఁ
జిక్కును రాజ్యలక్ష్మి శిఖనరసింహా!
కం. తీరిచికట్టిన మరణము
తీలక మున్ గట్టెనేని దీనతఁగను వి
స్తారము కట్టినఁ దీర్చినఁ
శ్రీరమణా కార్యసిద్ధి శిఖనరసింహా!
కం వాయస శకునంబెంచిన
బాయక గడుమార్గమందు బనిలేదుసుమీ
యే యెడ నిలుపురిముంగల
శ్రీయలరు శుభాశుభములు శిఖనరసింహా!
కం కాకి తన తలను తన్నిన
ప్రాకటముగ గార్యహాని భయ మశుభంబున్
కాకులు గూళ్లును గట్టిన
చేకొని వఱపౌను నిజము శిఖనరసింహా!
కొన్ని పద్యములు అవయువ అదరుపాటు శకునములు గురించి చూద్దాము
కం. కుడిదిక్కు నదర శాంతం
బెడమ కణత మధ్యమందు నెడనడు నెత్తిన్
గనుకొను మృష్టాన్నంబును
చెడు కుడిచెంపదరెనేని శిఖనరసింహా!
కం. అడుగు పెదవి మృష్టాన్నము
కడులాభము గడ్డమదరఁగా ధనమబ్బున్
కుడిచెక్కి లెడమచెక్కిలి
చెడు చోరభయంబు లండ్రు శిఖనరసింహా!
కం. కుడి భుజమింతుల కౌగిలి
యెడమ భుజంబదర కీడు నిలపుత్రులకౌఁ
గుడిప్రక్క నెడమప్రక్కన
చెడు నగ్నిభయంబు లండ్రు శిఖనరసింహా!
ఈవిధంగా సంపూర్ణ శకునశాస్త్రాన్ని సులభంగా అందరికీ అర్థం అయ్యేరీతిలో కూర్చి శతకరూపం లో మనకు ఈ కవి అందించారు. ఇంతచక్కటి సతకాన్ని అందరూ తప్పక చదవ వలసినదే.
మీరూ చదవండి మీ మిత్రులచే చదివించండి.
***
No comments:
Post a Comment