శ్రీరుద్రంలో విశేషాలు - 4
శ్రీరామభట్ల ఆదిత్య
వందే భూరథమంబుజాక్షవిశిఖం వందే శ్రుతీఘోటకం,
వందే శైలశరాసనం ఫణిగుణం వందేఽబ్ధితూణీరకమ్.
వందే పద్మజసారథిం పురహరం వందే మహాభైరవం,
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్...
ఐదవ అనువాకం:
"నమో॑ భ॒వాయ॑ చ రు॒ద్రాయ॑ చ॒ నమః॑ శ॒ర్వాయ॑ చ పశు॒పత॑యే చ॒.... " ఈ మంత్రంతో ఐదవ అనువాకం మొదలౌతుంది. ఈ అనువాకం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ అనువాకంలో మొత్తం 15 మంత్రాలున్నాయి. ఈ అనువాకంలో పరమేశ్వరుడే సృష్టికి మూలకారణంగా చెప్పబడింది. దుఃఖాలను, పాపాలను హరించేవాడిగా, అందరికీ ఆయనే యజమాని అని చెప్పబడింది. పరమేశ్వరుణ్ణి నీలగ్రీవుడని, భస్మమును కంఠమందు రాసుకున్నవాడని, జటాధరుడని, వ్యుప్తకేశుడని, సహస్రాక్షుడని, వంద ధనుస్సులు కలవాడని, గిరీశుడని, తేజోస్వరూపుడని, వర్షాలు కురిపించువాడని, బాణాలు చేతగలవాడని, చిన్నవాడని, పొట్టివాడని, పెద్దవాడని, బృహత్స్వరూపుడని, గుణనిధియని, వృద్ధుడని, అక్షయమైన కీర్తిగలవాడని ఈ అనువాకం కీర్తిస్తుంది.
సృష్టికి ముందు పరమేశ్వరుడే ఉన్నాడనీ, అందరికన్నా ప్రథముడని, సర్వవ్యాపియని, వేగంగా కదిలేవాడని, కదిలే జలధారలు, అద్భుతమైన తటాకాలలో ఉండువాడనీ, ప్రచండ వేగంతో వచ్చే అలల్లో ఉండువాడని, కదలని నీటిలోనూ ఉండువాడని, చిన్ననీటి ప్రవాహాలలో ఉండువాడనీ, ద్వీపాలలో ఉండువాడనీ ఈ అనువాకం కీర్తిస్తుంది.
ఆరవ అనువాకం:
" నమో᳚ జ్యే॒ష్ఠాయ॑ చ కని॒ష్ఠాయ॑ చ॒ నమః॑ పూర్వ॒జాయ॑ చాపర॒జాయ॑ చ॒" ఈ మంత్రంతో ఆరవ అనువాకం ప్రారంభం అవుతుంది. ఈ అనువాకంలో మొత్తం 15 మంత్రాలున్నాయి. ఈ అనువాకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో పరమేశ్వరుడి యొక్క రెండు పార్శ్వాలు మనం కనిపిస్తాయి. పరమేశ్వరుడే అందరికన్నా పెద్దవాడని, అందరికన్నా చిన్నవాడిని, అందరికన్నా ముందు పుట్టాడని, అందరి తర్వాత కూడా ఆయనే పుట్టాడని, అందరిలోనూ పరమేశ్వరుడే మధ్యవయస్కుడని, అందరికన్నా యవ్వనుడని, అందరిమధ్యలో ఉన్నాడని, అందరికీ పరమేశుడే మూలమని, భూమిపై జన్మించాడని, వేరే లోకాలలో పుట్టాడని, నరకములో శిక్షలు వేయువాడని, స్వర్గములో సుఖాలను ప్రసాదించువాడని, పొలాలలో, వనాలలో ఉండువాడనీ ఈ అనువాకం చెప్తుంది.
వేదాలలో కీర్తింపబడినవాడని, వేదాంతాలలో కూడా కీర్తింపబడినవాడని, అడవులలో చెట్టుగా ఉండువాడని, పొదలలో మొక్కగా ఉండువాడని, ధ్వని, ప్రతిధ్వని కూడా పరమేశ్వరుడే అని, వేగంగా ముందుకుకదిలే దళాలు, అత్యంతవేగముగల ఆశ్వికదళాలూ పరమేశ్వరుడే అని, వీరుడు, యోధుడు కూడా పరమేశుడే అని, కవచరక్షితుడని, రథారోహకుడని, శిరస్త్రాణము ధరించువాడని, మంత్రాలచేత రక్షింపబడువాడని, ప్రసిద్ధుడని, ప్రసిధ్ధమైన సైన్యం కలవాడని ఈ అనువాకం పరమేశ్వరుణ్ణి కీర్తస్తుంది.
నమః శివాయ...
ఇంకా వుంది...
No comments:
Post a Comment