మానస వీణ - 24
పి.యస్.యమ్. లక్ష్మి
తండ్రి కోమాలోకి వెళ్ళటంతో
రఘురాం ఆయన్ని హాస్పటల్ లో జేర్పించి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాడు. ఎంతయినా తన తండ్రి. తన భార్య ఆడపిల్లని కన్నదనే నెపంతో ఇంతకాలం ఎంత
బాధ పెట్టినా, తల్లి దండ్రులనే గౌరవ భావంతో వారిని ఎదుటపడి ఏమీ అనలేదు. తన కూతురు కనబడకుండా పోవటానికి వాళ్ళే కారణమా
అనే అనుమానం కూడా అతనికి ముందునుంచీ వున్నది.
అయితే సరిగ్గా తెలియకుండా నువ్వే నా కూతుర్ని మాయం చేశావు, నా కూతుర్ని తెచ్చివ్వు అనలేకపోయాడు.
అయినా అడిగే స్వతంత్రం తనకి తండ్రి ఎప్పుడూ ఇవ్వలేదు. ఏ వయసులోనైనా ఆయన చెప్పింది తను వినటమేగానీ,
తనూ ఒక వ్యక్తిత్వం వున్న మనిషిగా తనని ఎప్పుడూ ప్రవర్తించనియ్యలేదు
ఆయన అహంకారం, అధికారం.
తనని గారాబంగా పెంచి, తను కోరుకున్న శ్రావణిని వివాహం
చేసుకునేందుకు అంగీకరించారు కదా, ఇంక మిగతా విషయాలలో వారి
మనసు నొప్పింపజెయ్యటం ఎందుకని తనూ అంత తెగించలేదు.
కూతురు మాయమయిందని బాధ తనూ
భరించలేకపోయాడు. అమ్మా, నాన్నా, పాలేరు ఓబులేశూ అందరూ ఒక్కసారి ఊరెళ్ళారు. అమ్మ ఆరళ్ళనుంచి నాలుగు రోజులు శ్రావణికి ఊరట
దొరుకుతుందిలే అని సంతోషించాడు. వాళ్ళు
వెళ్ళిన రెండు రోజుల తర్వాత భళ్ళున తెల్లవారింది.
తన పక్కన ఉయ్యాలలో పాప కనిపించటంలేదని శ్రావణి ఆందోళనగా తనని లేపింది. మూడు నెలల పాప... తనంతట తను ఎక్కడికీ
వెళ్ళలేదు. వెంటనే ఇల్లంతా వెతికాడు.
పోలీసు కంప్లైంట్ ఇచ్చాడు. అన్ని
కార్యక్రమాలు యధావిధిగా జరిగాయి గానీ పాప కనబడలేదు.
పోలీసులు పాప దొరకగానే
కబురు చేస్తామని చేతులు దులుపుకున్నా రఘురాం తన ప్రయత్నాలు మానలేదు. పాపని వెతకటానికి అవకాశం వున్న ప్రతి మార్గంలో
వెళ్ళాడు. తనకి చేతనయిన ఏ ప్రయత్నమూ
ఫలించలేదు. శ్రావణి పరిస్ధితి రోజు రోజుకీ
దిగజారిపోవటంతో ఆమెని కనిపెట్టుకుని వుండటానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి
వచ్చింది. ప్రేమించి, పెళ్ళి చేసుకుని,
అందమైన జీవితమిస్తానని తనని నమ్మి వచ్చింది. శ్రావణి నమ్మకాన్ని వమ్ము చేశాడు తను. ప్రాణంలా ప్రేమించిన శ్రావణిని సంతోషంగా అట్టి
పెట్టలేక పోయాడు. తన తల్లిదండ్రులకి
ఆడపిల్లంటే ఇష్టం లేకపోవటంతో కేవలం ఆడపిల్లని కన్న పాపానికి జీవితమంతా ఏడుస్తోంది. అదే తన స్ధానంలో ఎవరన్నా వుంటే తల్లిదండ్రుల్ని
కాదని వేరే వెళ్ళేవాళ్ళే. భార్యని
పోషించుకోగలిగే సత్తా వున్నా తను, తల్లిదండ్రులు తన పట్ల
చూపించిన ప్రేమానురాగాలకి కట్టుపడి, కొడుకుగా తన బాధ్యత
గుర్తెరిగి వారు శ్రావణినెంత బాధ పెడుతున్నా శ్రావణిని ఓదార్చి సాధ్యమైనంత
సంతోషంగా వుంచటానికి ప్రయత్నించాడుగానీ, తల్లిదండ్రులకు
ఎదురు చెప్పలేకపోయాడు.
అక్కడికీ శ్రావణిని తనెంతో
ఊరడించాడు తమకింకా పిల్లలు కలుగుతారనీ. ఈ లోపల పాపని వెతకటానికి తను చేసే
ప్రయత్నాలన్నీ ఆమె మానసికంగా బాగున్నంతమటుకూ ఆమెకి చెబుతూ వచ్చాడు. ఎప్పుడయితే శ్రావణి అవి అర్ధం చేసుకునే స్ధితి
దాటిపోయిందో, ఆ ఆలోచనల భారం కూడా పంచుకునేవారు లేకపోయారు.
శ్రావణి పరిస్ధితిలో ఈ మధ్య
కొంచెం మార్పు రావటం గమనించాడు. దానికి
కారణం మానస అనే అనాధాశ్రమంలో వుంటున్న అమ్మాయి అని పనిమనిషి సరిత చెప్పింది. ఒకసారి ఆ అమ్మాయిని చూడాలి. నాన్న మాటకి ఎదురు చెప్పలేక ఇప్పటిదాకా
చూడలేదు. సరితకూడా మంచి మనిషి, శ్రావణి శ్రేయస్సు కోరే
మనిషి గనుక ఈ విషయం భూషణంగారిదాకా పోనియ్యలేదు.
తన తండ్రిలో ఈ మధ్య కొంచెం
మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆయనకి పక్షవాతం
వచ్చాక. మనవరాలిని వెతికించటానికి ఆయనా
తాపత్రయ పడుతున్నాడు. పాప మాయమవటానికి
ఆయనేగనక కారణమయితే, ఎలా మాయమయిందో ఆయనకి తెలిసి వుంటుంది. అందుకే ఆయన చేసే ప్రయత్నాలవల్లే పాప మళ్ళీ
దొరకాలి. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయని క్షణమొక
యుగంగా చూస్తుంటే, ఇంతలో ఆయన కోమాలోకి వెళ్ళారు. ప్రవాహంలో కొట్టుకు పోతున్నవాడికి దొరికిన దుంగ
దూరమయినట్లయింది అతని పరిస్ధితి.
ఆలోచిస్తున్న రఘురాం మనసులో
తళుక్కున ఇంకో ఆలోచన మెరిసింది. మానస
పరిచయంతో శ్రావణి కోలుకుంటోంది. మానసకీ ఎవరూ లేరు. అనాధాశ్రమంలో పెరుగుతోంది. మానస మేజర్ అయితే మాత్రం ఏమిటి. తాము ఆమెని దత్తత తీసుకుంటే. ఆ అమ్మాయి తమ దగ్గరుంటే శ్రావణి ఇంకా
కోలుకుంటుంది. శ్రావణిని ప్రేమించి పెళ్ళి
చేసుకున్నందుకు ఇప్పటికైనా ఆమెకి న్యాయం చేసిన వాడవుతాడు. ఇటు ఒక అనాధ బాలికకి కుటుంబం, తనవారు అంతా
దొరుకుతారు. ఆ అమ్మాయి బాధ్యతలు కూడా తామే
తీసుకుని చదువు చెప్పించి పెళ్ళి చెయ్యచ్చు.
ఇన్నాళ్ళకు ఒక మంచి ఆలోచన వచ్చిందనే తృప్తితోబాటు, తనని
అడ్డు పెట్టే తండ్రి ఇప్పుడేం చెయ్యలేడనే సంతోషం వేసినందుకూ బాధ పడ్డాడు తండ్రి
గురించి ఇలా ఆలోచించాల్సి వచ్చిందని.
ఆ ఆలోచన శ్రావణికి
చెప్పాలని లేచాడు. శ్రావణి హడావిడిగా
రావటం చూసి ఆగాడు. “ఏమిటి శ్రావణీ” అంటూ.
“మీ నాన్నగారిని
చూడటానికి ఆస్పత్రికి వెళ్దాం పదండి.
ఆయనకేమైనా తెలివి వస్తే పాప సంగతి చెబుతారేమో. మనం ఇంట్లో వుండటం కాదు..ఆస్పత్రిలోనే వుందాం
పదండి” చెప్పులేసుకుంటూ అన్నది శ్రావణి.
“శ్రావణీ, నాన్న పక్కనే ఎప్పుడూ ఒక నర్సు వుంటోంది.
నాన్నకి తెలివిరాగానే నాకు ఫోన్ చెయ్యమని ఆమెకి చెప్పాను. తప్పకుండా చేస్తుంది. నువ్వు కంగారు పడకు.”
“లేదండీ. ఆ నర్స్
వెంటనే ఫోన్ చేసినా మనం వెళ్ళేసరికి మావయ్యగారే పరిస్ధితిలో వుంటారో. నా కూతురు జాడ కనుక్కోవటానికి నేనిప్పుడు ఏ అవకాశం విడిచిపెట్ట దల్చుకోలేదు. మీరో నేనో ఎవరో ఒకళ్ళం ఎప్పుడూ మావయ్యగారి
దగ్గర వుండాల్సిందే పదండి.”
శ్రావణి చెప్పింది కూడా
నిజమేననిపించి ఇంకేమీ మాట్లాడకుండా బయల్దేరాడు రఘురాం.
***
భూషణానికి పక్షవాతం
వచ్చిందని వినగానే ఎసిపి దినేష్ కి సంతోషం, విచారం ఒక్కసారే కలిగాయి. ఎవరు చేసుకున్న కర్మ వారనుభవించక తప్పదని ఆయన
చేసిన దుర్మార్గాలన్నిటికీ శిక్ష అనుభవిస్తున్నాడు. ఒకటా రెండా ఎన్ని ఘోరాలు చేశాడు. కన్న బిడ్డ దూరమైన శ్రావణి, అన్ని రకాల హింసలు అనుభవించిన తన తల్లి గుండెకోతలు అంత తేలికగా
వదలవుగా. అవేనా!? ఎంతమంది తల్లులను హింసించాడో! ఇంకెంతమంది అనాధలను సృష్టించాడో!! అందుకే అనుభవిస్తున్నాడు
అనుకున్నాడు. భూషణం వల్ల అన్యాయం అయింది తనకి తెలిసి ముగ్గురు. తనూ, శ్రావణి, కృషీవలరావు. కృషీవలరావుకి భూషణం
మీద కక్ష తీర్చుకునే ఉద్దేశ్యంలేదు గనుక ఆయన ఏమైనా పట్టించుకోడు. కేవలం ఆ తల్లీ
కూతుళ్ళు కలిస్తే చాలు. శ్రావణిగానీ,
కొడుకుగానీ భూషణం మీద కక్షకట్టే వాళ్ళయితే ఇన్నేళ్ళూ, ఇంత అన్యాయం జరిగాక కూడా కలిసి వుండరు.
ఇంక తను. వాళ్ళలాగా తనూ భూషణం
చేసిన అన్యాయాన్ని మర్చి పోవాలా? ఎలా?? వాడి కోరిక అంగీకరించలేదని తల్లికి చెరగని మచ్చ
పడి, అర్ధాంతరంగా నిండు జీవితాన్ని బలి చేసుకుంది. తల్లిదండ్రుల ఆలనా పాలనలో అల్లారు ముద్దుగా
పెరగాల్సిన తను అనాధాశ్రమంలో దిక్కులేనివాడిగా బతకాల్సి వచ్చింది.
కానీ ఇప్పుడు భూషణం
పక్షవాతం వచ్చి కోమాలో వున్ననాడు. అలాంటి
మనిషిమీద తను కక్ష ఎలా తీర్చుకోగలడు? అసలు ఈ అకృత్యాలన్నింటికీ కారణం కేవలం భూషణం
ఒకడేనా, అతనికి తోడు ఇంకెవరన్నా కూడా వున్నారా? ఇంకా వేరే బలమైన కారణాలు ఏమీ
లేకుండా ఇన్ని అకృత్యాలు భూషణం ఒక్కడే చేశాడా?? భూషణాన్ని తను శిక్షించగలిగినా లేకపోయినా తన
మనశ్శాంతికోసమైనా ఈ కేసుని పూర్తిగా దర్యాప్తు చెయ్యకుండా వదల కూడదనుకున్నాడు
దినేష్. దర్యాప్తు వెంటనే మొదలు పెట్టాలనుకున్నాడు.
***
ఢిల్లీ ఆసుపత్రి లో
అపస్మారక స్ధితిలో వున్నాడు కృషీవలరావు.
యాక్సిడెంట్ లో తలకి పెద్ద దెబ్బ తగిలి రక్తం చాలా పోయింది. అయితే మంచి వాళ్ళకి మంచే జరుగుతుందనే నానుడి
నిజమైనట్లు సమయానికి ఆయన గ్రూపు రక్తం దొరకటం, తలకి ఆపరేషన్ చెయ్యాల్సి వచ్చినా దానికి
సంబంధించిన డాక్టరు ఆసుపత్రిలో ఆ సమయంలో డ్యూటీలో వుండటం, వగైరా
అన్నీ కలిసొచ్చి ఆపరేషన్ అయి ప్రమాదం నుంచి బయట పడ్డాడాయను. తర్వాత ఇంకా స్పృహలోకి రాలేదు. ఎన్ని మంచి పనులు చేశాడాయను. అవతల మనిషి తనకి తెలిసినా, తెలియకపోయినా, సహాయమడిగిన ప్రతి ఒక్కరికీ
చేశారు. ఆ పుణ్యం వూరికే పోతుందా.
ఆయన భార్య రత్నాంబకి కూడా ఆ
ప్రమాదంలో గాయాలు తగిలాయిగానీ అవి చిన్నవే కావటంతో, తన గురించి పట్టించుకోకుండా, ఆవిడ భర్త ఎప్పుడు స్పృహలోకి
వస్తాడా అని అక్కడే కూర్చుంది.
డాక్టరుకూడా ఆవిడకి తగిలిన
గాయాలకి కట్లు కట్టాక కావాలంటే
పక్క బెడ్ మీద కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ ఆవిడకి కృషీవలరావు అలా వుంటే అయోమయంగా
వుంది. ఎప్పుడూ ఉత్సాహంగా, హుషారుగా వుండే ఆయన అలా ఆసుపత్రి మంచం మీద పడుకోవటం ఆవిడకి బాధగా
వుంది. ఈయన ఎప్పటికి లేచి తిరుగుతారోనని
బెంగగా వుంది. కానీ భగవంతుడి మీద నమ్మకం
వున్న ఆవిడకి తన భర్తకి ఏమీ కాదనే ధైర్యం కూడా వున్నది. ఒకటా, రెండా... ఆయన చేసిన
మంచి పనులెన్నెన్ని. చేసిన పుణ్యం వూరికే
పోదు. ఆపద సమయంలో తప్పకుండా కాపాడుతుందనే
నమ్మకంతో, మొండి ధైర్యంతో అలాగే భర్త పక్కన కూర్చుంది.
ఇలాంటివి ఊహించేనా రెండు
రోజుల క్రితం చెప్పారు నా లాకర్ లో ఒక కవర్ వుంటుంది. ఎప్పుడైనా నాకేదయినా అయితే నువ్వు దానిని చూసి
అందులో వున్న విధంగా చెయ్యి అని చెప్పారు.
తను గాబరా పడి ఏమిటీ అప్పగింతలు అంటే పిచ్చిదానా, నేనేం నా
ఆస్తిపాస్తులు అప్పగించటంలేదు నీకు. నేను
నెరవేర్చాల్సిన బాధ్యత ఒకటి వున్నది. అది
వేరే వాళ్ళ విషయంలే... నువ్వు కంగారు పడకు.
ఆ బాధ్యత నేనే నెరవేరుస్తాను. ఏ
కారణం వల్లనైనా నేను పూర్తి చెయ్యలేకపోతే నువ్వు చెయ్యి. చిన్నదేలే కంగారు పడకు. ఇప్పట్నించీ ఆలోచించకు అన్నారు.
ఆయన సంగతి తనకి బాగా తెలుసు. ఏదైనా బాధ్యత తలకెత్తుకుంటే ఆరు నూరైనా చేసి
తీరుతారు. అయినా తమ విషయం
కాదన్నారుకదా. ఇప్పటినుంచి తను కంగారు
పడటం దేనికి. ఆయనే చూసుకుంటారు. లేకపోతే, అలాంటి పరిస్ధితే వస్తే అప్పుడే తను
కల్పించుకుంటుంది. ముందు ఆయన ఆరోగ్యంగా
వుంటే చాలు తనకి అనుకున్నది. అన్ని విధాలా కృషీవలరావుకి తగిన ఇల్లాలు రత్నాంబ.
ఈ ముగ్గురి కధ ఎలా
సాగుతుందో తర్వాత వాళ్ళు చెబుతారు.
(సశేషం )
No comments:
Post a Comment