నెత్తుటి పువ్వు -35
మహీధర శేషారత్నం
(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన సరోజ అనే అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తాడు రాజు. బట్టల కొట్లో పనిచెయ్యనని చెప్పేస్తుంది సరోజ. ఒకరోజు లక్ష్మి రాజును సరోజ గురించి నిలదీస్తుంది. ఆమెను ఏమార్చి, సరోజ ఇంటికి వెళ్తుంటాడు రాజు. కడుపుతో ఉంటుంది సరోజ. ఆమెను మారేడుమిల్లి అడవులకు తీసుకు వెళ్తాడు రాజు. )
నాగరాజు ఆ రాత్రి నిద్రపట్టక చలం
మైదానం తీసి మళ్ళీ చదివాడు. అతనికి ఇదివరకెంతో నచ్చిన ఈ పుస్తకం మళ్ళీ చదివితే
అయోమయంగా అనిపించింది. ఒక స్త్రీకాని ఒక పురుషుడుకాని ఇద్దరు ముగ్గుర్ని ఎలా
ప్రేమించగలరు? ఇది ప్రేమా? లేక కామమా? రెండోమాట ఊహించడానికే నాగరాజుకి మనసు రాలేదు. తనకు లక్ష్మి అంటే ఇష్టమే.
పెళ్ళైన ఇన్నేళ్ళలో తాను ఆమెను, కాని ఆమె తనను కాని
నొప్పించలేదు. చిన్న చిన్న తగాదాలు కూడా రాలేను. కాని సరోజ అంటే ప్రేమ ఏర్పడింది.
ఇది అనైతికమా? అనే ప్రశ్న మనసులోకి వచ్చినా ఆమె నాది అను
భావన మనసుని నింపేస్తోంది. ఇలాంటి సంబంధాల్ని జనం ఏమంటారో తెలియనంత మూర్ఖుడు కాదు
తాను. ఎవరి దాకానో ఎందుకు? డ్యూటీ సమయంలో ఎన్నో కేసుల
విషయంలో తాను అన్నాడు. పోనీ డెలివరీ అయ్యాక బిడ్డని ఎవరో చెప్పకుండా లక్ష్మీనే
పెంచమని ఇచ్చి సరోజకి పెళ్ళిచేస్తే చేసిన తప్పును దిద్దుకున్నట్టవుతుందా? అసలు సరోజ ఒప్పుకుంటుందా? అసలు తాను ఉండగలడా?
ఇది సరోజని మోసం చెయ్యడం కాదా! వైవాహిక జీవితంలో భద్రత కాని
ప్రేమలేదా? అంతులేని ఆలోచనలతో నిద్రపట్టక పొర్లుతూనే
ఉన్నాడు. ఇంతలో బాత్రూంకని లేచిన లక్ష్మి ఏంటి ఇంకా పడుక్కోలేదు. ఏదో ఒకటి చదువుతూనే
ఉంటావు. వేళకు తినవు, వేళను నిద్రపోవు. పడుక్కో అంటూ
వెళ్ళిపోయింది. లక్ష్మి తిరిగి వచ్చేసరికి నాగరాజు నిద్ర నటించాడు. ఒకసారి
నాగరాజుకేసి తెరిపార చూసి ఏమిటో ఈ మనిషి అనుకుంటూ ఫాను స్పీడు పెంచి పడుక్కుంది
లక్ష్మి.
రాజేశ్వరికి అంతకాలం భర్తతో కలిసి ఉన్నా
విడిచి ఉండలేని అనుబంధం ఎందుకేర్పడలేదు? ఒకేచోట కలిసి
బ్రతుకుతున్నప్పుడు ఎంతో కొంత అనుబంధమేర్పడదా? పురుషుడు
సంపాదనచేసి సంసారాన్ని పోషించకుండా కేవలం స్త్రీనే పట్టుకు ఎలా వెళ్లాడగలడు.
స్త్రీ మాత్రం? తన గృహ బాధ్యలలో సతమతమవదా? అమీరు రాజేశ్వరి శరీరాన్ని ప్రేమించాడా? మానసిక
సౌందర్యాన్నా? అంత ప్రేమ ఉన్నప్పుడు రాజేశ్వరి మాతృత్వ
కాంక్ష నెందుకు గౌరవించ లేకపోయాడు. అదేం పొసెసివ్ నెస్.రాజేశ్వరిని ఒంటరిగా మీరా
సంరక్షణలో వదిలి అన్ని నెలలు ఎలా వదిలిపోగలిగాడు? ఇదేం
ప్రేమ. మళ్ళీ తను ఇంకొక స్త్రీని కోరుకుంటే రాజేశ్వరి బాధతోనే అమీర్ ఆనందం కోసం
తను వెళ్ళి బ్రతిమిలాడి తీసుకు వచ్చిందే? దీనికి సతీసుమతి
భర్తను తట్టలో కూర్చోపెట్టుకుని వేశ్యదగ్గరకు తీసుకు వెళ్ళడానికి భేదమేమిటి?
మళ్ళీ అమీరు తాను కోరుకున్న ఆమె తనపై విజృంభించడాన్ని ఎందు
కంగీకరించలేక తోసేసాడు. ప్రేమలో కూడా పురుషాధిక్యత ఉంటుందా? రాజేశ్వరిని
కాదని ఆమెని కోరుకుని లభించాక హీనంగా భావించాడు. అలాగే రాజేశ్వరిని అంతలా
ప్రేమించానన్న అమీర్ మీరాతో రాజేశ్వరి సాన్నిహత్యాన్ని ఎందుకంగీకరించలేక పోయాడు.
మీరాని కూడా రాజేశ్వరిని ప్రేమిస్తోందని తెలుసుకుని తనని తనే పొడుచుకు చచ్చిపోయాడు.
చివరకు రాజేశ్వరికి కాని, అమీర్! కాని దక్కిందేమిటి? ఆ క్షణంలో జీవించడమే జీవితమా? అమీర్ మరణంతో చలం ఈ
రకమైన ప్రేమలని సమర్థించినట్టా, తిరస్కరించినట్టవలేదా?
నాకను సన్నలలో నడవాలనే ప్రేమలో లాలిత్యం ఎక్కడుంది? యాసిడ్ దాడిలా లేదా? ఇప్పుడున్న ప్రేమికులలోని
పొసెసివ్ నెస్ ఇదే కదా! అమీర్ రాజేశ్వరిని కాని, మీరాని కాని
చంపకుండా తనని తనే పొడుచుకు చచ్చిపోయాడు ప్రేమ చావుని కోరుతుందా? రాజేశ్వరికి మీరాని దగ్గర చేసినవాడు తనే అను ఆలోచన ఎందుకు రాలేదు. ప్రేమ
గుడ్డిదా? చెవిటిదా?
ఆలోచనలలో నాగరాజుకి ఎప్పటికో
నిద్రపట్టింది.
*****
ఫోన్ మోగేసరికి నాగరాజు ఎవరు చేస్తారా? అని చూసుకున్నాడు. బావమరిది ఎక్కువగా చెయ్యడే? ఎందుకు
చేస్తాడా? అనుకుంటూ లిఫ్ట్ చేసాడు.
“హలో,
“ఊఁ! రాజుగారి ట్రిప్
బాగా జరిగిందా?”
గొంతునిండా వెటకారం.
‘ట్రిప్ ఏమిటి? ఎక్కడికి?” నాగరాజు గొంతు పొడారిపోయింది.
'అదేమిటి బావగారూ! మా
చెల్లెలు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మరో అమ్మాయితో ఎంజాయ్ చేసారే! ఆ గోదావరి
త్రిప్పు... అప్పుడే మర్చిపోయారా?”
“ఏం మాట్లాడుతున్నావ్?”
విసుగ్గా అన్నాడు నాగరాజు,
“మగాళ్ళం మనకిది మామూలే
బావా? మా చెల్లెలి కింకా చెప్పలేదులే. ఆహా! 'ఇది ఒకటి రెండు రోజుల ఏర్పాటా? సెకండ్ సెటప్పా అని
డౌట్ వచ్చి కాల్ చేసాను.”
“నువ్వేం చూసావో! నాకేం
తెలియదు?
బాగానే చూసాను, ఫేస్ బుక్ లో చూసాలే! మా ఫ్రెండొకడు మీ లాంచీలో ఉన్నాడు మీ ఖర్మకాలి. వాడు
పెట్టాడు వాడి ట్రిప్పు గురించి పాపం వాడికి తెలియదుగా మీరు లవ్ బర్డ్స్ అని”
గుక్క తిప్పుకోలేకపోయాడు నాగరాజు.
లక్ష్మి లేకపోతే ఏం తోచక వెళ్ళాను.
పక్క నెవరినీ కూర్చోవద్దు అనలేంగా!
కూర్చున్న పొజిషన్ బట్టి
తెలుస్తుందిలే బావా!
“మనాళ్ళా! బయటాళ్ళా!
అని సరే బై”
ఫోన్ పెట్టేసాడు.
ఒకవారం తరువాత లక్ష్మి అన్న మళ్ళీ
చేసాడు.
“లాహిరి లాహిరి
లాహిరిలో జగమే ఊయల ఊగెనుగా .... అయినా నాది గాడిద గొంతులే బావా! మీ సరోజ అయితే
బాగా పాడిందటగా! లక్కీ ఫెలోవి లే బావా! ఆవులాంటి మెత్తటి మా చెల్లి నీ ఆటలు
గ్రహించలేదులే కాని నే నొకణ్ణి ఏడిసానుగా ఇక్కడ ఏమంటావు?”
“నేనూ అదే మాట అంటాను
నువ్వొకడివి ఏడిసావు అని లక్ష్మి అన్నగా చెప్పుకునే అర్హతే నీకు లేదు.” ఒళ్ళు మండి కోపంగా అన్నాడు నాగరాజు.
“నిజమే అనుకో! కాని
ఇన్నాళ్ళు నీకు అర్హత ఉందనుకున్నాను. కాని నీకూ లక్ష్మి భర్త అయ్యే అర్హతలేదని
తెలుస్తోంది. అయినా ఇన్ని తెలుసుకున్న వాడిని ఇంకొంచెం కూపీ లాగలేనా?” వెటకారంగా అన్నాడు.
“నిజమే! పోలీసోడికంటే
క్రిమినలకే బ్రెయిన్ ఎక్కువ. ఫోన్ పెట్టెయ్. కోపంగా ఫోను పెట్టేశాడు నాగరాజు.
కాని ఫోన్ మళ్ళీ మోగింది మళ్లీ వాడే.
తియ్యాలి అనిపించలేదు నాగరాజుకి కాని నాన్ స్టాప్‌గా మోగుతుంటే విసుగెత్తి లేపాడు.
“బావగారు ఫోన్ పక్కన
పెట్టి పాపం మంచినీళ్ళు తాగడానికి వెళ్ళి ఉంటారు. గొంతు ఎండిపోయుంటుంది.”
ఎప్పుడూ తనతో మాట్లాడడానికి జంకే
వీడికి ఇంత ధైర్యమెలా వచ్చింది? వాడు చేసే వెధవ పనులతో
పోల్చుకుంటే తనది చిన్న తప్పు కిందే లెక్క
“ఏమిటి బావగారు మౌనంగా
ఉన్నారు? మాట్లాడండి సార్! ఏదో కహానీ చెప్పండి. మా
చెల్లెలికి చెప్పనులెండి. ఎందుకంటే అది పాపం కడుపులో బిడ్డ కోసం సంతోషంగా
ఉండాలిగా! కానీ కూపీతీస్తాను. ఉంటాను బై!” ఈసారి అతను
పెట్టేసాడు.
తన బావమరిది సామాన్యుడు కాడు.
రాజకీయనాయకులకు చెంచాగిరీ చేస్తూ మంచి చెయ్యడు కాని క్రిమినల్ మైండ్. ఇప్పుడెలా? నాగరాజు దిగాలు పడ్డాడు.
సాయంత్రం శంకరానికి ఫోన్ చేసాడు.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment