ఆచారి. ఆర్.ఎం.పి. - అచ్చంగా తెలుగు

 ఆచారి. ఆర్.ఎం.పి.,

 (మాజొన్నవాడ కధలు)

టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)


ఆరోజు ఆదివారం. ఉదయం ఎనిమిది గంటలయింది. దేవళానికి వెళ్ళి అమ్మణ్ణి దర్శనం చేసుకుని వచ్చిన ఆచారిగారు ఇంట్లోకి వెళ్ళి కాఫీ పలహారాలు సేవిస్తున్నాడు. అప్పటికే ఆచారి ఇంటిముందు జనం పోగయ్యారు. వరుసలో అరుగుమీద కూర్చుని, కాంపౌండరు ఇచ్చిన వరుస నంబరు టోకెన్లు పట్టుకుని ముచ్చట్లల్లో పడ్డారు. ఆచారి తండ్రి రేబాలలో పచ్చకామెర్లకు మందు ఇస్తుంటాడు. ఆయన్ను రేబాల పెద్దాచారిగారంటారు. పెద్ద కొడుకు నెల్లూరు కాకర్లవారి వీధిలో ఇదే వ్యాపారం చేస్తున్నాడు. మన ఆచారి జొన్నవాడలో పచ్చకామెర్లకు మందు ఇస్తుంటాడు. మూలికలు, పసరు, మెడలో దండలు వేయడం ఆచారికి  వంశపారంపర్యంగా వస్తున్న ఆచారమే కాదు రహస్యం కూడా! మందేమిటన్నది ఎవ్వరికి చెప్పడు. వ్యాధి తీవ్రతను బట్టి మందు డోసు ఉంటుంది. ఆర్.యం.పి., బోర్డు పెట్టి  మామూలు వైద్యంకూడా చేస్తూ ఉంటాడు. తన వల్లకాని వ్యాధులను నెల్లూరు, మదరాసు, హైదరాబాదు పట్టణాల్లో ఉన్న కొంత మంది డాక్టర్లకు "రిఫర్" చేసి గొప్ప రిఫరల్ డాక్టరుగా కూడా పేరు గడించాడు. ఆయా కార్పొరేట్ హాస్పిటళ్ళ వారు భారీగానే కమీషను పంపుతూ ఉంటారని జనం చెవులు కొరుక్కుంటుంటారు. ఇవన్నీ కాక భార్య జొన్నవాడలో కాన్వెంటు స్కూలు పెట్టి మంచి ఆదాయం గడిస్తుంది. ఇన్ని పనులతో ఆచారికి క్షణం తీరిక ఉండదు. ఆ ఊరిపెద్దలు కూడా ఇతగాణ్ణి కలవాలంటే వాళ్ళు రావలసిందే! ఆఖరికి ఊరు ప్రెసిడెంటైనా సరే! వచ్చిన రోగులకు బి.పి. టెంపరేచర్, బరువు చూడడం, స్టెతస్కోపుతో పరిశీలించి… మందులు ఇవ్వడం స్వయంగా చేస్తుంటాడు. కాంపౌండరుకు గూడా ఏ విషయాలూ తెలీనీయకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. వచ్చిన రోగులoదరికి ఇంజెక్షన్  మాత్రం తప్పనిసరిగా చేస్తూ ఉంటాడు. విజిటింగ్ ఫీజు ఏభై రూపాయలైనా, బిల్లు మాత్రం అన్నీ కలిపి 300-400 రూపాయలవుతుంది. మెడికల్ రెప్రజెంటేటివ్‌లు వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీగా ఇచ్చే శ్యాంపిల్స్ కాక...వాళ్ళకు ఎంతో కొంత ముట్ట చెప్పి ఎక్కువ శ్యాంపిల్స్ లాగేసుకుంటూ ఉంటాడు. మాత్రలను పొడి చేసి ఆ చూర్ణాన్ని పొట్లాలలో కట్టి ఇస్తాడు. ఒకసారి శ్యాంపిల్స్ అమ్ముకుంటున్నాడని కొందరు  గొడవవడంతో ఈ పద్ధతికి శ్రీకారం చుట్టాడు. అప్పటినుంచీ ఆచారి వేసిన ఆ ప్లానుకు అడ్డూ ఆపూ లేకుండా పోయింది. అలా సాగిపోతోంది అతగాడి వ్యవహారం.

*****

కాలం ఒకతీరుగా ఉంటే ఇంకేం? ఒకరోజు అమ్మణ్ణి దర్శనం చేసుకుని వస్తూ వస్తూ జొన్నవాడ నిండా "జనతా వైద్యశాల - జొన్నవాడలో త్వరలో ప్రారంభం - పేదలకు ఉచిత వైద్యం" అన్న గుడ్డ బ్యానర్లు ఉండడం చూసి కంగు తిన్నాడు. జనతా వైద్యశాల పెడుతున్నవారెవరో తెలీదు. వచ్చిన రోగులు కూడా పదే పదే ఆ విషయం అడుగుతూ ఉండడంతో చిరాకు మరీ ఎక్కువైపోయింది. "నాకేం దెలుసు? బ్యానర్లు పెట్టినవాళ్ళను అడగండి. ఫోన్ నంబరు కూడా లేదు గదా!" అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండు రోజులయింది. ఆసుపత్రి పెట్టేవాళ్ళెవరో తేలకపోవడంతో, ఇంక టెన్షన్ భరించలేక,  ఆరోజు సాయంత్రం చీకటిపడ్డాక తిన్నగా ప్రెసిడెంటు వెంకురెడ్డి గారింటికి బయల్దేరాడు. వెంకురెడ్డి వరండా లో కూర్చుని సుబ్బయ్య, శరభన్నలతో మాట్లాడుతూ ఉన్నాడు. అచారిని చూసి వచ్చిన వాళ్ళు "ఇంకొస్తాం రెడ్డీ.. చానా సేపయిండ్లా వచ్చి" అని వెళ్ళిపోయారు.

"ఆచారీ.. నువ్వొచ్చావంటే ఏదో పెద్ద మందలే ఉండుంటదే!... ఎంది కతా!" అని నవ్వాడు.

"ఏం లేదు రెడ్డిగారూ! మనూళ్ళో ఏదో జనతా వైద్యశాలని పెద్ద పెద్ద గుడ్డ బ్యానర్లు కట్టున్నాయి. ఎవరు పెడుతున్నారో తెలీదు అందుకనీ.." 

"ఓర్నీ పాసుగాల అదా ఇషయం. ఇట్ట గూకో చెప్తా! మనూళ్ళో...మిట్టమీద... అదివరకు వెంగటేశ్వర్‌రెడ్డనీ... బియ్యం వ్యాపారం జేసే వాడూ.. గవనంలేదా నీకూ.. మాక్కాస్తా దూరపు చుట్టరికంలే..ఇప్పుడు నెల్లూళ్ళో స్టవునస్పేటలో హోల్‌సేల్ వ్యాపారంలో ఉన్నాడూ.. ఆడి కొడుకు కదంటయ్యా! ఢిల్లీలో డాక్టరు జదివి వచ్చాడంట. కోడలు గూడా కాన్‌పుల డాక్టరంట. నెల్లూరు పొగతోటలో పెద్ద ఆసుపత్రి.  ఇక్కడ బీదా బిక్కీ కోసం ఒక చిన్న జనతా ఆసుపత్రీ.. పెడతా ఉండారు. మంచిదే గదా..."

"అయ్యా..రెడ్డిగారు బాగా డబ్బులు రావాలంటే నెల్లూరులో పెట్టుకుంటే మంచిది గదా! మళ్ళీ ఇక్కడెందుకు? వాళ్ళకు అనవసరపు ఖర్చు గాకపోతే!"

"ఇదిగో..ఆచారయ్యోరా! ఉన్న ఇషయం చెప్తా విను! వాళ్ళకి డబ్బులకేం చింతలేదు. కోట్లు వెనకేశారు. డాక్టర్లిద్దరూ ప్రేమ పెళ్ళంట. ఆళ్ళు మెడిసన్ చదువుతున్నప్పుడే.. ఒక చిన్న ఆసుపత్రి పల్లెలో కట్టి వైద్యం చెయ్యాలని.. ఏవేవో ఆలోచన్లంట. పోనీ దీనమ్మ బడవ..మనకెందుకు.. పేదలకు ఉచితంగా జేస్తానంటే ఛేదా మనకి? సరే పొమ్మని మన పంచాయితీ ఆఫీసే ఇచ్చినా ఆళ్ళకి... వచ్చే నెల మొదటి వారంలో ఆరంభం..మనూరికి ఎం.పి. ఎం.ఎల్.ఏ., ఎవరో మినిస్టర్లు..సినిమా యాక్టర్లు చానా మంది  వస్తారంట ఆరోజు.  నేను పెసిడెంటుగా స్టేజిమీద గూకుంటానంట. అదీ ఇషయం"  అని పెద్దగా నవ్వాడు.

"రెడ్డిగారూ! ఇన్నేళ్ళబట్టి ఈ ఊళ్ళో ఉన్నా.. ప్రజలకు సేవ జేసుకుంటున్నా.. ఆ ఆసుపత్రి బెట్టాక ఎవరన్నా వస్తారా నా దగ్గరికి"

"ఆచారీ. .చింతపడమాక.. నీ హస్తవాసి మంచిదని ఈ చుట్టుపక్కల .. ములుమూడి.. మినగల్లు.. పాతూరు.. పంచేడు.. అన్నారెడ్డిపాళెం.. బుచ్చితో సహా చెప్పుకుంటుళ్ళా… నీ గురించి చెప్పు? నీకేం పర్వాలేదులే..పో.. నీకాడుండే కాతాలు నీకుళ్ళా.. అనవసర బయాలు నీవన్నీ... నీ పొట్లాల వైద్యం.. నీ పచ్చ కామెర్ల మందేందో.. నీకు దప్ప రెండో కంటికి తెలుసా! ఎవరికి దెలవనప్పుడు ఇంకా ఈ  దిగులేందని.."

"సరే రెడ్డిగారూ..వస్తా.. ఏడవలేక నవ్వలేక ఒక్క చిరునవ్వు నవ్వి. ఇంటి దారి పట్టాడు ఆచారి బరువెక్కిన గుండెతో.

- ఒక నెల అనంతరం. ఊళ్ళోకి జనతా వైద్యశాల వచ్చిందనంగానే జనం తండోప తండాలుగా వెళ్ళి మందులు తెచ్చుకుంటున్నారు. ఆచారి దగ్గరికి పచ్చకామెర్ల మందు కోసం వారానికి ఒకరు ఇద్దరు వస్తున్నారు తప్ప రోగులెవ్వరూ రావడంలేదు. అప్పుడు భేష్ ఆచారి.. అన్నవాళ్ళే..ఆచారి ఉత్త డబ్బు మనిషని ప్రచారం చేయడం మొదలుపెట్టారు.  ఎలాగూ ఖాళీనే గనక పూర్తి సమయం కాన్వెంటు బళ్ళోనే గూర్చోని కాలక్షేపం జేస్తున్నాడు. 

ఒకసారి చెన్నైలో అన్న కొడుకు పెళ్ళని అందరం వెళ్దామంటే....కాన్వెంటు స్కూలు వదిలి రాలేనని..పైగా అప్పుడప్పుడూ విపరీతమైన కడుపు నొప్పి వస్తోందని చెప్పి ఇంట్లోనే ఉండిపోయింది భార్య అనసూయమ్మ. తన పుట్టింటి వాళ్ళు తప్ప ఎవరింటికి వెళ్ళాలన్నా ఏదో సాకు చెబుతుందని తెలిసిన ఆచారి నాలుగు రోజులు కాలక్షేపంగా ఉంటుందని ఒక్కడే  చెన్నై వెళ్ళాడు.

****

ఆచారి చెన్నై వెళ్ళినరోజే అనసూయమ్మకు కడుపు నొప్పి ఎక్కువైంది. కషాయం, వాము నీళ్ళు..అవీ ఇవీ తాగి పడుకునింది. ప్రక్కరోజు ఉదయం స్కూల్లో పాఠం చెప్తూ క్రింద పడిపోయింది. పిల్లలందరూ భయపడ్డారు. ఆయా వాళ్ళను ఇళ్ళకు పంపించి.. జనతా ఆసుపత్రికి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఈ వార్త చెప్పగానే వెంటనే వాళ్ళు అంబులన్సు పంపి నెల్లూరు హాస్పిటలుకు తరలించారు. అనసూయమ్మ ఫోనులో ఆచారిని ఎన్ని సార్లు ప్రయత్నించినా లైన్లు కలవలేదు. దామరమడుగులో ఉన్న వాళ్ళ అమ్మానాన్నలను హుటాహుటిన పిలిపించింది. వాళ్ళు నెల్లూరులోనే ఉన్న ఆచారి అన్నయ్య వదిన వచ్చారు. అది అపెండిసైటిస్ ఆపరేషన్ అని అదే రోజు రాత్రి ఆపరేషన్ చేశారు.

రెండు రోజులు గడిచాక ఆచారి పొద్దున్నే నెల్లూరులో రైలు దిగి ఇంటికి ఫోన్ చేస్తే ఆ ఫోను ఆయా ఎత్తి విషయం చెప్పింది. ఆచారి తనఫోన్లో బ్యాలన్సు లేదని..రోమింగు లేదని చెప్పి గాభరాగా పొగతోట ఆసుపత్రి చేరాడు. అనసూయ క్షేమంగా ఉండడంతో కాస్తా కుదుటపడి నిదానంగా అన్ని విషయాలు తెలుసుకున్నాడు.

అప్పటికి రవుండ్స్ ముగించుకుని వచ్చిన డాక్టరును రూములో కలిశాడు. డాక్టరు ఇంకొక్క రోజు ఆలశ్యం అయితే చాలా ప్రాబ్లం అయేదని, గొప్పంతా ఆయాదేనని చెప్పాడు. రెండు/మూడు రోజుల్లో ఇంటికి వెళ్ళవచ్చునని, ఒక 10 రోజులు రెస్టు కావాలని  చెప్పగానే.. కన్నీళ్ళతో ఆచారి ధన్యవాదాలు తెలియజేశాడు. ఫీజు ఎంత కట్టాలి అనడిగిన దానికి డాక్టరు నవ్వేసి "కడుదురుగాని లెండి… వెళ్ళేటప్పుడు… తొందరేముంది. డబ్బులున్నాయా లేకపోతే తర్వాత కట్టండి" అనేసరికి వారి ఔన్నత్యానికి ఆశ్చర్యం వేసింది. తాను అపెండిసైటిస్ కేసులు రిఫర్ చేసినప్పుడు నెల్లూరులో పేరుమోసిన కార్పొరేట్ హాస్పిటల్ తనకు ఐదువేల చొప్పున ఇవ్వడం గుర్తొచ్చి..కనీసం ఫీసు ఏభైవేలైనా ఉంటుందని అంచనా వేసుకున్నాడు. డిస్చార్జ్ రోజున వాళ్ళ అంబులన్సులోనే ఇంటికి చేర్చారు. ఫీజు 10 వేలా చిల్లర అనేసరికి ఆశ్చర్యపోయాడు.  తనకు వాళ్ళకు ఉన్న తేడా స్పష్టంగా తెలిసింది.

****

ఏమండీ..ఈనాడులో ఈ ప్రకటన చూశారా! మన రెడ్డిగారి ఆసుపత్రికి ఫ్రంట్ ఆఫీసు మేనేజరు కావాలట. వైద్య రంగంలో నాలెడ్జి ఉన్నవారికి ప్రిఫరెన్సు అన్నారు. మీరు ప్రయత్నిస్తారా?” అన్న భార్య ప్రశ్నకు నవ్వి "ఊరుకోవే చాలుగానీ...మనకిస్తారా? ఏ రెడ్లకో ఇస్తారు" 

"అలా కాదండి డాక్టరు భార్య చాలా మంచిది.  నేను మాట్లాడతాను. ముప్పైవేలు జీతం అన్నారు"

"మాట్లాడినా వేస్టే.. వాళ్ళు రెడ్లకులానికే ప్రిఫరెన్సు ఇస్తారు. నాకు ఈ బడి ఉందిగదా కాలక్షేపానికి" అని నవ్వేశాడు. 

  నాలుగు రోజుల అనంతరం..అంబులన్సు డ్రైవర్ ఇంటికొచ్చి "డాక్టరు గారు మిమ్మల్ని ఒక సారి నెల్లూరుకొచ్చి కలవమన్నారు" అనేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఫీజు గురించా.. ఏవో ఖర్చులు మర్చిపోయానంటారా? ఆరోజే అంత తక్కువ ఫీజు అన్నప్పుడే అనుకున్నా" అంటూ భార్యతో విషయం చెప్పగానే "వెళ్ళండి వెళ్తే గదా తెలిసేది" అని లోలోన నవ్వుకుంది.  ఆచారి నెల్లూరు వెళ్ళడం ప్రక్కరోజు అక్కడ మేనేజరుగా చేరడమూ జరిగిపొయ్యాయి.

****

"ఆచారిగారూ.. హాస్పిటల్లో అందరికి పర్సనల్ ఫైల్స్, అటెండన్సు ముద్ర మిషన్ అన్నీ పెడుతున్నాం. అందువల్ల మీ సర్టిఫికేట్లు..ముఖ్యంగా మీ ఆర్.ఎం.పి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాపీలు తీసుకుని రండి.. రేపు" అన్న డాక్టరు ప్రశ్నకు మింగలేక కక్కలేక చూసి సరేనన్నట్టు తలూపాడు.

- ప్రక్కరోజు.."సార్.. నేను మెట్రిక్ మాత్రమే చదివాను. ఆర్.ఎం.పి రిజిస్ట్రేషన్ లేదు" అంటూ ఇచ్చిన మెట్రిక్ సర్టిఫికేట్ చూసి డాక్టరు ఆశ్చర్యంగా "వాట్?" అన్నాడు. ఆచారి ఏమీ మాట్లడకుండా నిలబడ్డాడు.

"మరి మీరు ఆచారి - ఆర్.ఎం.పి అని బోర్డు పెట్టారు కదా జొన్నవాడలో.."

"నిజమే ఆచారి ప్రక్కన ఉన్న ఆర్.ఎం.పి డిగ్రీ కాదు"

"మరి.."

"క్షమించండి. అది నా పేరు..ఆర్.ఎం.పి అంటే రేబాల మదుసూధన పురుషోత్తమాచారి. ఆచారి ముందు పెట్టి చివర ఆర్.ఎం.పి అని పెట్టాను అంతే!

"డాక్టరు డిగ్రీ లేకుండా అలా  డాక్టరు పేరు పెట్టుకోవడం నేరం కదా! ఆచారిగారూ.."

"నిజమే! నేను అలాంటి తప్పు  ఏమీ  చెయ్యలేదు కదా! నా పేరు ముందు డాక్టరు అని ఎక్కడా రాసుకోలేదు. ఆచారి ఆర్.ఎం.పి అని మాత్రమే పెట్టాను. ఆ వూర్లో అందరూ అలా నేను ఆర్.ఎం.పి డాక్టరు అనుకుంటే నా తప్పెలా అవుతుంది సార్! నాకు తెలిసిన వైద్యం చేశాను. హస్తవాసి మంచిదని నమ్మి అందరూ వచ్చేవారు." అని ఒక్క దండం పెట్టాడు.

డాక్టరుకు ఎమనాలో అర్ధంగాక అలా చూస్తూ ఉండిపోయాడు.


****


No comments:

Post a Comment

Pages