అనసూయ ఆరాటం - 3
చెన్నూరి సుదర్శన్
(ఏదైనా వ్యాపారం పెట్టాలని చూస్తున్న సమ్మయ్య, బుచ్చయ్య సలహా కోసం పంతులుని సంప్రదిస్తారు)
మేన్ రోడ్డుకు ఒక మడిగె కిరాయకు తీసుకుందాం. అందుల బట్టల దుకాణం.. కిరాణ దుకాణం పెడ్దాం. వరంగల్‌కెల్లి కిరాణ సామాను తీస్కచ్చుడు.. అమ్ముడు నేను సూసుకుంట. మీరు ఎప్పటి లెక్కనే బట్టలు తీసుకచ్చి అమ్ముండ్లి. ఇప్పటికిప్పుడే సెప్పాలని లేదు. మీరిద్దరు కలిసి ఆలోసన చెయ్యుండ్లి. మీరు సరే అంటే.. ఎప్పుదు రమ్మన్నా .. పచ్చి లెక్క వచ్చి వాలుత. పనులన్ని సూసుకుంట” అన్నడు లింగారెడ్డి.
“మరి నీ తమ్ముడు..?” అడిగిండు బుచ్చయ్య.
“మా తమ్ముడు పాలేరు పని సేత్తాండు మీకు తెల్సు గదా..!. మా ఇరవై గుంటల పొలాన్ని వాన్నే దున్నుకోమన్న. సదువబ్బ లేదు గాని.. వాడు బాగ కట్టబోతు. నాకే కాయకట్టం సెయ్యడం శాతనైత లేదని కరణం దగ్గర లెక్కలు రాసుడు నేర్సుకున్న”
“మరి ములుగుల దుకాణమంటే మాటలా పటేలా.. ధరావతు ఎంతంటరో.. కిరాయెంతంటరో.. మా దగ్గర ఉన్నదీ.. కోడి గుడ్డు మీద ఈకలున్నట్టేనాయె.. ” అన్కుంట సగం కాలిన సుట్టను చిన్న రాయి మీద నల్సిండు సమ్మయ్య. ఇది మా వల్ల కాని పని అన్నట్టు అతని ముకంల కన్పియ్యబట్టింది.
“సమ్మయ్య సేటూ.. మీరు ధరావతు సంగతి మర్సిపోండ్లి. మా కరుణం ములుగు మేన్ రోడ్డుల ఈ సందుల్నే ఒక పోర్షన్ కొన్నడు. ఎవ్వలకైనా మంచోల్లకు కిరాయకియ్యాలని సూత్తాండు. నేను మాట్లాడుత. మీరు బేఫికర్గ ఉండుండ్లి”
“ఐతే ఆ పనిల నువ్వుండు.. కిరాయ సంగతి చెప్తే మేము ఆలోసన సేసి ఏసంగతీ చెప్తం” అన్కుంట లేచి నిలబడ్డడు బుచ్చయ్య. సమ్మయ్య సుత ‘బుచ్చయ్య మాటే నా మాట’ అన్నట్టు తల్కాయె ఊపుకుంట లేసిండు.
లింగారెడ్డి సేతిల సెయ్యేసి తమకు ఇట్టమే అన్నట్టు భరోసా ఇచ్చిండ్లు.
***
లింగారెడ్డి ములాఖత్ అయిన తోడెం రోజులకే.. మంచి మూర్తం సూసుకొని ‘బూర బుచ్చయ్య & సబ్బని సమ్మయ్య’ కిరాణం మరియు బట్టల షాపు అనే పేరు తోని ములుగు మేన్ రోడ్డుల దుకాణం తెర్పిచ్చిండు లింగారెడ్డి.
శాలోల్లకు.. రెడ్డాయనకు బాగనే సోపతి కుదిరిందని ఊరోల్లంత ముక్కు మీద ఏలేసుకున్నరు. ఇదంతా లింగారెడ్డి తెలివితేటలని కొన్నాల్లకే తెల్సుకున్నరు.
దుకాణం సూత్తాంటే సూడబుద్ధైయ్యేటట్టు సదిరిండు లింగారెడ్డి. ముందర హాల్ల కొంచెం కిరాణం మందం ఉంచి.. మిగిలిందంతా బట్టల దుకాణం సేసిండు. ఎన్క అర్రల ఒక మూల.. కిరాణ సామాను ఇస్టోరు.. ఇంకో మూల వంట. ఇంటెంకాల హమాంఖాన.. పాయిఖానలున్నై. వండుక తినుడు.. దుకాన్లనే పండుడు...
నెల రోజులు గడ్సింది.
లింగారెడ్డి లెక్కలేసి తేల్చి సెప్పెటాల్లకు బుచ్చయ్య, సమ్మయ్య సేట్లు కనుగుడ్లు తేలేసిండ్లు. నమ్మబుద్ధిగాని లాభాలు. లేసి అమాంతం లింగారెడ్డిని కావలిచ్చుకున్నరు. కండ్లల్ల సంబురం తోటి నీల్లు నిండినై.
లింగారెడ్డికి జీతం గాకుండా లాభాల్ల ఏకాణ ఇస్సా కరారు చేసిండ్లు.
దుకాణాలకు మంచి పేరచ్చింది. అంతా లింగారెడ్డి దుకాణమే అనేటోల్లు. అయినా బుచ్చయ్య, సమ్మయ్యలు ఏమాత్రం నారాజు కాలేదు.
ఇప్పుడు వచ్చిన కట్టం వండుక తినుడు.
ములుగుల శాలోల్లకు కట్టిచ్చిన యాభై రెండిండ్లున్నై. అవి నిజానికి శాలోల్లకే కిరాయకియ్యాలె. కాని శాలోల్లకు తెల్వక.. రాక.. వాటిని ‘వీవర్స్ కాలనీ సొసైటీ’ మేనేజరు విశ్వనాథం ఎవ్వలకు పడితే వాల్లకు అమ్యమ్యాలు తీస్కోని కిరాయకిత్తాండు.
నెల, నెలా కిరాయలు వసూలు సేసి రశీదులిచ్చేది.. సొసైటీ చప్రాసి మైసయ్య.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment