పురాణ కథలు -16 - అచ్చంగా తెలుగు
పురాణ కధలు - బసవ పురాణం
సేకరణ:    పి.యస్.యమ్. లక్ష్మి




16 ఇరువత్తుని కధ 

పూర్వం గరయూరనే గ్రామంలో ఇరువత్తు అనే ఒక శివ భక్తుడుండేవాడు.  అతడు ఆ చోడ రాజ్యంలో వున్న ప్రముఖ అరువది ముగ్గురు భక్తులలో ఇరవయ్యవవాడు.  అందుకనే అతనిని అందరూ ఇరువత్తు అని పిలిచేవారు.  అతడు సర్వసంగ పరిత్యాగి.  జంగమ పూజా తత్పరుడు.  ధన, బల సంపన్నుడు.  అతను ఒక గొప్ప శివ వ్రతం చెయ్యటానికి అతనంతట అతనే సంకల్పించుకున్నాడు.  ఆ వ్రతమేమిటంటే ఏ శివ భక్తుడికైనా ఎవరైనా ఎటువంటి అపచారం చేసినా ఆ అపచారం చేసినవారెవరైనా, జంతువైనా, మనిషైనా చంపెయ్యటమే.

ఒకసారి రాజుగారి పట్టపుటేనుగు కట్లు వదిలించుకుని బయటపడి మావటివారు అదిలిస్తున్నా లొంగక, ఎదురుపడ్డ జంతువులను, మనుషులను విసిరివేస్తూ ఆ పురాన్నంతా చిందరవందరగా చెయ్యసాగింది.  ఆ ఊరిలో ఒక శివ భక్తుడు శివ పూజకోసం పొద్దున్నే లేచి తోటలో సజ్జ నిండా పూలు కోసుకుని ఇంటికి వెళ్తుండగా ఆ ఏనుగుకు ఎదురు పడ్డాడు.  ఆ ఏనుగు అతనిని తన తొండముతో ఎత్తి తన దంతముల మధ్య వేలాడునట్లు వేసుకున్నది.  ఆ ఏనుగు దంతమొకటి గుచ్చుకుని అతనికి విపరీతంగా రక్తం కారి ప్రాణావసాన సమయంలో,  “శంభో శంకర మృత్యుంజయ, మృత్యు ముఖముననున్న నన్నుధ్ధరింపు”మని దీనంగా వేడుకున్నాడు.  ఆ రోదన విన్న ఇరువత్తు ఎవరో భక్తునికి ఏదో ఆపద వచ్చినట్లుంది వెళ్ళి చూద్దామని బయటకి వచ్చి చూశాడు.  ఏనుగు కోరల మధ్య చిక్కుకుని, తప్పించుకునే దోవ లేక అంతిమ దశలో వున్నాడా అన్నట్లున్న ఆ భక్తుణ్ణి చూశాడు.

వెంటనే ఇరువత్తు కొంచెము కూడా ఆలస్యం చెయ్యకుండా తన వ్రత నియమాన్ని పాటించి ఆ ఏనుగు తొండమును తన చేతిలోకి తీసుకుని లాగి మెడ వంచి దానిపైనున్న మావటిని ఒక్క దెబ్బతో చంపాడు.  మరొక గుద్దుతో ఆ మత్తేభము కుంభస్ధలముపై గుద్ది దానిని పడవేశాడు. కొమ్ముల నడుమ ఇరుక్కున్న ఆ భక్తుణ్ణి  రక్షించి అతనికి సపర్యలు చేయ సాగాడు.  రాజ భటులు  పట్టపుటేనుగు విధ్వంసాన్ని, ఇరువత్తు దానిని చంపటాన్ని రాజుగారికి తెలియజేశారు.

వెంటనే రాజు ఆ స్ధలానికి వచ్చి ఇరవత్తుకు సాష్టాంగ నమస్కారం చేసి  స్వామీ, నా పట్టపుటేనుగు భక్తుని పట్ల చేసిన అపచారము నాదిగానీ దానిది కాదు.  భృత్యులు చేసిన దోషములకు రాజు శిక్షార్హుడు.  జంతువయిన ఆ ఏనుగుకి ఏమి తెలుసు?  దానిని లొంగదీసుకో లేని నాది తప్పు.  ఈ భక్తుడు ప్రాణాపాయ స్ధితిలో వున్నాడు.  ఇతను బతుకుతాడోలేదో కూడా తెలియదు.  భక్తుడు ఈ స్ధితిలో వుండగా నేను బతికి వుండటం నా తప్పు.  నన్ను అంతం చెయ్యండి.  మీరలా చెయ్యకపోతే నా శిరస్సు నేనే ఖండించుకుంటానని గండ్ర కత్తెరతో తన తలను కత్తిరంచుకోబోతుండగా సాక్షాత్పరమశివుడు తన పరివారంతో సాక్షాత్కరించి, రాజు భక్తికి మెచ్చుకుని  నీ భక్తి సాహసాలకి నేను సంతోషించాను.  అని ఇరువత్తు వంక చూసి నీ ప్రతినకు, రాజ భక్తి, సాహసాలకు నేను సంతోషించాను.  నువ్వు, రాజు, కావలసిన వరములు కోరమన్నాడు.  

ఇరువత్తు అంతకు ముందే చచ్చిన ఏనుగును మావటివానిని బ్రతికించమని, ఆ భక్తునికి ఆరోగ్యాన్ని ప్రసాదించమనీ కోరాడు.  ఇరువత్తుగానీ, రాజుగానీ, తమకోసం ఏ కోరికలూ కోరలేదు.  భగవంతుడు వారికి సద్యో మోక్షమిచ్చి, మీరీ లోకంలో సుఖంగా బతికి తర్వాత నా లోకానికి వచ్చి నా గణములోని వారైయుంటారని వరమిచ్చి అంతర్ధానం చెందాడు.  ఈ కధని బసవేశ్వరుడు తన రాజుకి చెప్పాడు.

ఈ మారు ఇంకో కధ చెప్పుకుందాము.

***

No comments:

Post a Comment

Pages