ఈ దారి మనసైనది - 41 - అచ్చంగా తెలుగు

 ఈ దారి మనసైనది - 41

అంగులూరి అంజనీదేవి 


(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది.  జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా టూర్ వెళ్లి, ముగించుకుని తిరిగి వస్తారు. మెడికల్ కాలేజీ ఎక్సిబిషన్ కి వచ్చిన అనురాగ్ తల్లిదండ్రులకు అంతా తిప్పి చూపిస్తుంది దీక్షిత. ఆత్మహత్య చేసుకోబోయిన మన్వితకు  ధైర్యం చెప్పి, మామూలు మనిషిని చేస్తాడు  ధీరజ్. మన్విత నానమ్మను ధీరజ్ తన ఊరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ధీరజ్ ఆశయాన్ని నెరవేర్చే దిశగా అడుగులేస్తుంది వర్ధనమ్మ.)

అలాగే - లేని దెయ్యాల భయం వల్ల పునాదులు వెయ్యక ముందే భవనాలు ఆగిపోతాయి. ఇంకాస్త ముందుకు వెళ్లి గోడలు కట్టాక ఆగుతాయి, కొన్ని స్లాట్లు వేశాక ఆగుతాయి. అలాగే కొన్ని మొండి గోడలుగా మిగిలి పాడుబడిపోతాయి. అందులో చివరకి అందరూఅనుకునే దెయ్యాలకి బదులు జూదగాళ్లు, తాగుబోతులు స్థావరం ఏర్పరచుకుంటారు... ఈ బిల్డింగ్ విషయంలో ఇలా జరక్కుండా వుండాలంటే ...

            మీకా భయం వద్దు ... నా గురించి ఆలోచించేవాళ్లెవరూ లేరు. కనీసం నా వల్ల ఈ మంచి పని జరిగితే - భగవంతుడు నాకీ గొప్ప అవకాశాన్నిచ్చాడనుకుంటాను. ఇదిలా పాడుబడి పోకుండా ఇక్కడో మంచి హాస్పటల్ వెలిసి ఎందరో ప్రాణాలని కాపాడాలి... ఇది నా కల.అంది వర్దినమ్మ

            ఆమె చిన్న పిల్లకాదు అషామాషాగా మాట్లాడటానికి. అందుకే సత్యాదేవి ఇంకేం మాట్లాడలేదు.       వెంటనే హైదరాబాదులో వున్న భర్తకి ఫోన్ చేసి వర్థనమ్మ 'కల' గురించి సత్యాదేవి చెప్పింది. భార్య మాటలు విని వివేకానందరెడ్డి ఆశ్చర్యపోయారు. ఇది నిజమా? అన్నట్లు ఆసక్తిగా అడిగాడు. నిజమేనని చెప్పింది సత్యాదేవి.

            వివేకానందరెడ్డి ఎక్కువగా రోడ్డు కాంట్రాక్ట్ వర్క్ కోసం హైదరాబాద్ లోనే గడుపుతుంటాడు . ఇక్కడికి వచ్చే వీలు కాదు. అదే విషయం వర్థనమ్మకి ఫోన్లో చెప్పాడు. ఏదైనా తనతో ఫోన్లో చెబితే చాలని... అన్ని పనులు దగ్గరుండి చేపిస్తానని హామీ ఇచ్చింది వర్ధనమ్మ

            వివేకానందరెడ్డి మేస్త్రీకి ఫోన్ చేసి ... బిల్డింగ్ పని ఎప్పటిలా మొదలు పెట్టమని చెప్పాడు. అక్కడ నాన్న గారి ప్లేస్ లో వర్థనమ్మ వుంటుందని కూడా చెప్పాడు. ఆమె ఉత్సాహం చూస్తుంటే వివేకానందరెడ్డికి తండ్రి గుర్తొచ్చాడు.

• • • •

            వర్ధనమ్మ పర్యవేక్షణలో... బిల్డింగ్ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికలా సాగుతోంది.

ఆమె తన చిన్న తనంలో ... తండ్రి పొలంలో పనివాళ్ల చేత ఎలా పనులు చేయించే వాడో దగ్గరుండి చూసిన అనుభవం వల్ల ఇప్పుడుఇక్కడ పనివాళ్లతో అతి నేర్పుగా పనులు చేయిస్తోంది. రాత్రీ, పగలు అక్కడే గడుపుతోంది.

            అదమరిస్తే చాలు - ఇటుకలు, సిమెంట్, ఇసుకను దొంగతనం చెయ్యాలను కునే వాళ్లు ... ఇంటికెళ్లే ముందు వైరును చొక్కాలోపల పెట్టుకెళ్లే ఎలక్ట్రిషియన్లు అమెకు అక్కడ రెడ్ హేండెడ్గా పట్టుబడ్డున్నారుకాని.. అందరు ప్రచారం చేసినట్లు దెయ్యాలు కాని, బాపిరెడ్డి అత్మకాని ఆ చుట్టు పక్కలెక్కడా కన్పించడం లేదు. ఒక వేళ దెయ్యాలు, అత్మలు వున్నా... ఈ దొంగల కన్నా ప్రమాదకరమైనవి కావేమో!!

            ఎప్పటికప్పుడు మన్వితతో, ధీరజ్తో ఫోన్లో మాట్లాడుతూ ఏ పని ఎంత వరకు వచ్చిందో చెబుతూనే వుంది వర్ధనమ్మ, నానమ్మ చేస్తున్న పనిపట్ల వాళ్లిద్దరు అత్యంత ఉత్సాహం చూపిస్తున్నారు.

            బాపిరెడ్డి వేయించిన ఆ బిల్డింగ్ ప్లానింగ్ కూడా చాలా బావుంది. ఆదేలా వుందంటే ? ఎంటర్ కాగానే ఓ.పి. రూం, దానికి ఎదురుగా పేషంట్లు కూర్చోటానికి పెద్దహాల్. అక్కడే స్లిప్లిచ్చేక్యాబిన్... దాని పక్కన మెడికల్ షాపుకి అనుకూలంగా ఓ గది దానికి కాస్త దూరంలో ల్యాబ్.. అది దాటగానే పేషంట్లు కోసం వరుసగా పదిగదులు. ఆగదుల్ని ఆనుకొని బాత్రూలు ఎక్స్ సెట్రా...

            ఇన్ని రోజులు వర్ధనమ్మ వ్యక్తిత్వతం ... తండ్రి, భర్త, కొడుకు నీడలో నిర్ధారించబడ్డూ... ఏ చిన్న సంఘటన ఎదురైనా అది తన తప్పు వల్లనే, కావొచ్చు అనుకొని సర్దుకుపోతూ తండ్రికి, భర్తకి ,కొడుక్కే రాకుండా చివరకి కోడలికి కూడ భయపడూ బ్రతికింది. కారణం ఇంతకాలం తను చేసిన పనికి గుర్తింపు కాని, విలువకాని లేవు. కన్పించని బాధ మనుసు లోతుల్లో పుండై సలుపుతుంటే ... పైన అనుబంధపు పూతను పులుముకొని, ఉపశమనం పొందిన రోజులు కూడా వున్నాయి.

            కానీ ...ఇప్పుడు పాకాలకి వచ్చిన క్షణం నుండి ఆమె అనుభవించే అనుభూతి అక్షరాలకి అందనిది... దాటిపోయిన జీవితంలో తనుబాధపడుతూ గడపిన క్షణాలన్నీ ఇప్పుడు తిరిగొస్తే-ఇలాంటి మంచి పనులకి వాడుకునే దాన్ని కదా అనుకుంటుంది... ప్రస్తుతం చేస్తున్న పనిలో అలసిపోయినట్లు అనిపించినా ... ఇన్నేళ్లుకాళ్లు అరిగేల తిరిగి చేసిన పనుల కన్నా ఈ పనుల వల్ల అలసిపోవడంలో తృప్తివుంది.

                                                     *****

            కాలం ... ముంగిలి బుగ్గగిల్లే సంక్రాంతి ముగ్గులా సాగుతోంది.

            ధీరజ్ తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే హైదరాబాద్ వెళ్లాడు. ఎక్స్పీరియన్స్ కోసం అక్కడో మంచి డాక్టర్ దగ్గర వున్నాడు. అక్కడ నుండి రాగానే అతను పాకాలలో ప్రాక్టీస్ పెడతాడు. హాస్పటల్ కోసం కడుతున్న బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తి కావొస్తుంది. .

            అనురాగ్ హౌస్ సర్జన్ అయిన వెంటనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యటానికి స్టేట్స్ వెళ్లాలనుకుంటున్నాడు..

            దీక్షితకి ఏదో వెలితిగా అన్పిస్తోంది. ఐదుసంవత్సరాల నుండి అనురాగ్, తను కలిసి, మెలిసి స్నేహంగా, ప్రేమగా తిరిగారు. భావాలను పంచుకున్నారు. ఆశల్ని పెంచుకున్నారు. ఒకర్ని విడిచి ఒకరు వుండలేని స్థితికి వచ్చారు. ఇప్పుడతని ఎడబాటును వూహించుకొని తట్టుకోలేక పోతోంది.

            హౌస్ సర్జన్  టైమ్ అయిపోయింది. హాస్టల్ వెకేట్ చేసి ఇళ్లకెళ్లి పోతున్నారు.

            దీక్షిత, అనురాగ్-మెడికల్ కాలేజీకి దగ్గర్లో వుండే సిటీగ్రాండ్ హోటల్ కెళ్లి ... సెకెండ్ ఫ్లోర్లో వాళ్లిద్దరు అప్పుడప్పుడు ఇష్టంగా కూర్చునే ఓ మూలన వున్న సోఫాలో కూర్చున్నారు. ముందు టేబుల్ పై వున్న దీక్షిత చేయిపై చేయివేసి మాట్లాడుతున్నాడు అనురాగ్. అంత సన్నిహితంగా కూర్చోవడం వాళ్లకి కొత్తకాదు. కానీ అక్కడ వాళ్లను చూసే వాళ్లకు మాత్రం వింత...

            "ఇక్కడే పి.జి. చెయ్యండి ! నేను కూడా మీకు దగ్గర్లో జూనియర్ డాక్టర్గా వుంటాను. మీ వీలును బట్టి పెళ్లి చేసుకుందాం!అంది

            దీక్షిత. ఎంత చదివినా, ఎంత ఎదిగినా, నిత్యం పేషంట్లతో మునిగితేలినా ... పెళ్లి, భర్తా, పిల్లలు, వంటపని, పిల్లలపని, భర్తతో సంతోషం కావాలని వూహించుకునే సగటు అమ్మాయిల్లాగే దీక్షిత కూడా అలోచిస్తోంది. అనురాగ్ స్టేట్స్ వెళ్తే తనకి దూరమవుతాడేమోనన్న అనుమానం కూడా ఆమెలో వుంది. దూరమంటే వేరే రకంగా రాదు. ఒక్కరోజుకూడా అతన్ని చూడకుండా వుండలేని దూరం...

            దీక్షితను అర్థం చేసుకున్నాడు అనురాగ్.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages