పురాణ కధలు - బసవ పురాణం
సేకరణ: పి.యస్.యమ్. లక్ష్మి
15. మడివాల మాచయ్య కధ
నెప్పరిగె అనే చిన్న పల్లెలో మాచయ్య అనే శివభక్తుడుండేవాడు. ఆయన్ని అయోనిజుడు అంటారు. రజకుడు అవటంతో అందరూ అతన్ని మడివాల మాచయ్య అనేవారు. శివ భక్తిలో మాత్రం అతనిని మించినవారు లేరంటారు. వీర శైవుడు. జితేంద్రియుడు, జ్ఞాన సంపన్నుడు. న్యాయశీలుడు, దీన జనోపకారి. ఆయన చాకలి కులమున పుట్టినా, తన ప్రవర్తనచేత జ్ఞానంచేత, మహానుభావుడు అనిపించుకున్నాడు. ఆయన కళ్యాణపురమున బసవేశ్వరుని భక్తి, జ్ఞాన వైరాగ్యంబులు, జంగమ భక్తార్చన దీక్ష గురించి విని అక్కడికి వెళ్ళి ఆయనని చూసి, వారిచే సాక్షాత్తూ ఫాల నేత్రునిగా పరిగణింపబడి, సపర్యలనందుచూ అక్కడే వుండసాగాడు.
అక్కడ కూడా తన కులవృత్తియగు బట్టలుతకటం మానక శివ భక్తుల మాసిన బట్టలు శుభ్రముగా వుతికి వారికి అందచేసేవాడు. ఆ కాలంలో భక్తులందరూ మడి కట్టుకునే పూజ చేసుకుని భోజనం చేసేవారు. అందుకనే మాచయ్య బట్టలుతికే సమయంలో కూడా ఎవరినీ తాకక ప్రత్యేకంగా వాటిని వుతికేవాడు. మాచయ్య బలవంతుడు. ఆయనకి భక్తుల మడి గురించి తెలుసుగనుక ఆ బట్టలన్నీ తానే తీసుకెళ్ళి శుభ్రముగా వుతికిన బట్టలను తన తలపైన పెట్టుకుని ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో గంట పట్టుకుని, గంట వాయిస్తూ దోవ పొడుగునా ఇలా చెప్పుకుంటూ వచ్చేవాడు. “శివ భక్తుల మడి బట్టలుతికి తెస్తున్నాను. వీటి కేవిధమైన మైల కూడ సోకకూడదు. దగ్గరకు రాకండి. వస్తే నరికేస్తాను. దూరంగా పొండి. అడ్డం రాకండి” అని అంటూ, గంట వాయిస్తూ, కత్తి తిప్పుతూ, ఎవరి బట్టలు వారింటికెళ్ళి ఇచ్చేవాడు. ఈయన భక్తి ప్రపత్తులు విని బసవేశ్వరుడు, పుర జనులు ఈయన భక్తిని చాలా పొగిడేవారు.
అలా వుండగా ఒకసారి మాచయ్య వుతికిన బట్టలు తీసుకుని యధావిధిగా వస్తూండగా, ఒక మనిషి అతనికి పొరపాటున ఎదురు వచ్చి, తప్పించుకు పోయే సందు, సమయమూలేక అలాగే నిలబడిపోయాడు. మాచయ్య చెప్తున్న ప్రకారం అతని తల నరికాడు. అతని తల ఆకాశంలోకి ఎగిరిందిగానీ తిరిగి కింద పడలేదు, కనబడలేదు.
అది చూసిన ప్రజలు రాజు దగ్గరకు వెళ్ళి, “అయ్యా మీ పాలనలో మేమంతా సుఖంగా వున్నాము. కానీ నేడొక ఘోరము జరిగినది. ఒక చాకలివానిని పరమ భక్తుడని, అపర శంభుడని బసవేశ్వరుడు కీర్తిస్తున్నారుకదా. ఆయన వుతికిన బట్టలు తెస్తూ దోవ వెంట గంట వాయిస్తూ, కత్తి తిప్పుతూ ఎవరూ దగ్గరకు రాకండి, వస్తే తల నరుకుతానని పెద్దగా అరుస్తూ వస్తుంటే మనుషులేమిటి, పశు పక్ష్యాదులుకూడా భయపడి దూరంగా పోతున్నాయి. కానీ ఇవాళ ఒక అమాయకుడు తెలియక ఎదురెళ్ళి, తప్పించుకునే మార్గం లేక అలాగే నిలబడితే తలనరికేశాడు. ఆ తల పైకెగిరిందిగాని మళ్ళీ కిందకి దిగటం కనబడలేదు. ఈయన్ని ఇలా వదిలేస్తే ఇంకెంతమంది తలలు నరుకుతాడో. దేవరవారు ప్రజలకి తండ్రిలాంటివారు. తమరే దయతలచి ఈ వినాశనాన్ని ఆపాలి. లేకపోతే కొన్ని రోజుల్లోనే మన నగరంలో మనష్యులుండరు.” అని మొర పెట్టుకున్నారు.
రాజు బసవ మంత్రితో “చూశారా? మీరు ఒక చాకలివానిని శివ సమానుడిగా చూసి గౌరవిస్తే ఏమయిందో! ఇంకేమీ ఆలోచించకుండా అతనిని ఊరు విడిచి వెళ్ళేటట్లు చూడాలి. దానికి తగిన ఉపాయం ఆలోచించండి” అని చెప్పాడు.
బసవేశ్వరుడు “రాజా, మనవాళ్లు చెప్పిన మాటలు విని అపర శంభు అవతారమైన ఆయనను అనుమానించకూడదు. ఆలాంటి ఆయన ఒక మనుష్యుని చంపాడని మనం ఆయనని చంపే ప్రయత్నం చెయ్యకూడదు. పైగా అతని శిరస్సు ఇంకా ఆకాశంలోనే వుందని, కింద పడలేదని మనవాళ్ళు కూడా చెబుతున్నారు. అదే నిజమైతే మనం వేడుకుంటే అతను ఆ చంపిన మనిషిని బతికించవచ్చు” అని చెప్పాడు.
రాజుకి ఆ మాటలు రుచించలేదు. తన బంధువులను కొందరిని చేరదీసి “ఈ బసవన్న ఎప్పుడూ ఇలాగే చెబుతాడు. మీరు కొందరు కలసి ఆ మాచయ్య వచ్చే దోవలో మదగజాన్ని తీసుకు వెళ్ళండి. ఆయన తొలగమన్నా తొలగకుండా ఆయన సమీపానికి వెళ్ళండి. మద గజంతో ఆయనని తొక్కించి చంపండి” అని ఆజ్ఞ ఇచ్చాడు.
వారంతా రాజాజ్ఞని మీరలేక భయంతో అలాగే రాజు చెప్పినట్లు మాచయ్య వచ్చే దోవలో కాచుకున్నారు. మాచయ్య యధా ప్రకారము బట్టల మూట నెత్తిపై పెట్టుకుని కుడిచేతిలో కత్తితో, ఎడమ చేతిలో గంటతో అరుచుచూ వస్తుండగా మావటి వాళ్ళు ఏనుగుని మాచయ్య మీదకి దుమికించారు. మాచయ్య తన చేతిలో వున్న ఖడ్గంతో ఆ ఏనుగును ముందు తొండాన్ని తర్వాత అంతా ముక్కలు ముక్కలుగా నరికి ఆకాశంలోకి ఎగుర వేస్తూ అవి కిందపడి తను మైల కాకుండా జాగ్రత్తగా తప్పించుకుంటూ ఎవరి బట్టలు వారికి చేరవేశాడు.
సంగతి తెలిసిన రాజు బసవన మంత్రి దగ్గరకు వెళ్ళి తెలియక ఈ ఘోరం చేశాను. ఎలాగైనా ఈ ముప్పునుంచి కాపాడమని కోరాడు. బసవన మంత్రి, రాజా నేను చెబితే వినలేదు. శివ భక్తులకు చేటు చేయగలవారెవరూ లేరు. చంపబోయిన భద్ర గజం తానే చచ్చింది. పరమభక్తులకసాధ్యములేమీ లేవని నిరూపించుటకు మరియొక భక్తుని కధ చెప్పసాగాడు. దానిని తర్వాత తెలుసుకుందాము.
No comments:
Post a Comment