అనసూయ ఆరాటం - 4 - అచ్చంగా తెలుగు

                             అనసూయ ఆరాటం - 4 

చెన్నూరి సుదర్శన్ 


(ఏదైనా వ్యాపారం పెట్టాలని చూస్తున్న సమ్మయ్య, బుచ్చయ్య సలహా కోసం పంతులుని సంప్రదిస్తారు. శాలోల్ల దుకాణాలు కిరాయికి తీసుకోవాలని నిర్ణయించుకుంటారు)


పోలీసు రాజయ్యకు వరంగల్లు నుండి  ములుగుకు తబాదలా అయింది. అమీన్ సాబ్‌కు.. పోలీసోల్లో కోసరం కట్టిచ్చిన కోటర్స్ పోలీసు ఠాణ ఎన్కాల్నే ఉన్నై. కాని పోలీసులందరికి సరిపోయేన్ని కోటర్స్ లేవు. .  

సొసైటీ ఇండ్ల సంగతి తెల్సుకొన్నడు రాజయ్య. తను సుత శాలాయ్యనే.. అదే ధీమా తోటి జనానను తీసుకొని  ఒక ఇంట్ల సామాను తోటి దిగిండు. రాత్రంతా సామాను సదురుకున్నరు.

తెల్లారి పొద్దుగాలనే రాజయ్య తయారైండు. 

“సురేందర్.. నేను బడి టైంవరకత్త బాబూ.. నువ్వు జల్దిన తయారై వయ్యిలన్ని సదురుకో.. టీ.సి. పైలం” అని కొడుక్కు జాగ్రత్తలు చెప్పిండు. రాజయ్య చాయె తాగి ఠాణకు సైకిలు మీద బైలెల్లిండు. ఏడింటికల్ల ఠాణల హాజరేయించుకొని వచ్చి ఒక్కగానొక్క కొడుకు సురేందర్‌ను సర్కారు బల్లె ఆరో తరగతిల షరీకు సెయ్యాలనకున్నడు. 

ఠాణల అడుగు పెట్టేటాల్లకు అమీన్ సాబ్ ఎదురుంగ విశ్వనాథం కూకుండుడు సూసి అప్సోసయ్యిండు రాజయ్య. ముందుగాల అమీన్‌ సాబ్‌కు కింద కాలు కొట్టి కడక్ సలాం సేసిండు.

“అమీన్ సాబ్.. గీయ్ననే.. ఇల్లీగల్‌గా సొసైటీ ఇంట్ల సొచ్చిండు” సూపుడేలుతోటి రాజయ్యను సూయిచుకుంట షికాయత్ చేసిండు విశ్వనాథం.

“ఏం ససంగతి వన్నాటూ.. పోలీసువై ఉండి గట్ల తప్పుడు పని చేత్తవా.. కానూన్ తెల్సినోడివే గదా..” కొంచెం గరంగనే అడిగిండు అమీన్‌ సాబ్.

“సార్ నేను చేసింది ఇల్లీగల్ పని కాదు. బాజాప్త ఒక నెల ఇంటి కిరాయ ముందుగాల్నే కట్టి రశీదు తీస్కోని ఇంట్లకడుగు పెట్టిన” అన్కుంట కీసలకెల్లి రశీదు తీసి అమీన్ సాబ్ చేతికిచ్చిండు రాజయ్య.

అమీన్ సాబ్ రశీదు సూసిండు. రశీదు రాజయ్య కొడుకు సురేందర్ పేరు మీద ఉన్నది.  దాని మీద విశ్వనాథం దస్తఖత్ సేసున్నది. సొసైటీ మేనేజర్ అనే లబ్బరు టాంపు సుత ఉన్నది. విశ్వనాథం దిక్కు సూసిండు అమీన్ సాబ్. ‘దీని భావ మేమి తిరుమలేశా..’ అన్నట్టు. విశ్వనాథం నీళ్ళు నములిండు. మైసయ్య రశీదు ఇచ్చిన సంగతి విశ్వనాథానికి తెల్వదు. ముందుగాల్నే రశీదుల మీద సంతకాలు పెట్టే అలవాటు.

“సార్.. విశ్వనాథం చేసేటివి ఇల్లీగల్ పనులు. నేను వచ్చేటప్పుడే వరంగల్ల.. సొసైటీ సంగతంతా తెల్సుకొని వచ్చిన. విశ్వనాథం అసలు సొసైటీకి మేనేజరే కాదు. సర్కారు సొసైటీని రద్దు సేసి ఇండ్లను హాండవర్  సేసు కున్నది. శాలోల్లు ఏదైన సఘం పెట్టుకొని మొగ్గాలు పెట్టుకుంటమంటే  ఇండ్లను  సంఘం పేరు మీద వాల్లకే ఇయ్యాలని సర్కారు ఆలోసన. నోటీసులు సుత పంపిచ్చింది. కాని ఈ విశ్వనాథం శాలోల్లకీ సంగతి తెల్వనియ్య కుంట  నాటకాలడుతాండు. మైసయ్యకు కుక్కకు బొక్కోలె ఎంతో కొంత ముట్టజెప్పి వచ్చిన కిరాయలన్నీ తనే మేత్తాండు. కిరాయల కిత్తాండన్న సంగతి సర్కారుకు తెల్వదు.

రాత్రంతా ఇండ్లన్నీ తిరిగి ఒక్కొక్కల దగ్గర ఎంతెంత తీసుకొని ఇండ్లు కిరాయకిచ్చింది వాల్ల సంతకాలు తీస్కోని లిస్టు తయారు సేసి తీస్కచ్చిన.. సూడు అమీన్ సాబ్..” అని ఇంకో కీసలకెల్లి లిస్టు, సర్కారిచ్చిన నోటీసు తీసి అమీన్ సాబ్‌కిచ్చిండు రాజయ్య. 

విశ్వనాథం కుత్కె దగ్గర పడ్డది.. పిల్లి లెక్క జారుకుందామను కున్నడు. అమీన్ సాబ్ ముందల పెట్టిన షికాయత్ ధరఖాస్తు వాపస్ తీసుకుందామని చెయ్యి ముందుకు సాపిండు. 

“పహిలే అందర్ దాలో సాలాకు..” అని గట్టిగ హుకుం జారీ చేసిండు అమీన్ సాబ్. గరంగ సూసుకుంట లేచి విశ్వనాథం ముఖంమ్మీద లాఠీ తిప్పుకుంటకుంట పోలీసు బాసల తిట్టసాగిండు. 

రాజయ్యను ఇంకో ఇద్దరు పోలీసోల్లని తీస్కోని జీబుల విశ్వనాథం దొంగ ఆఫీసు మీద దాడి సేసిండు. దొంగ ఫైల్లు.. లబ్బరు టాంపులు.. జప్తు సేసి ఆల్మర్లకు.. ఆఫీసుకు సీల్లేయించిండు. కేసు నమోదు సేసిండు. 

విశ్వనాథం చేతికి హాత్కడీ పడిందని.. పోలీసు ఠాణల ఊసెలు లెక్కపెడ్తాండని..  శాలోల్లకు ఇండ్లిత్తాండ్లని ములుగు సుట్టుపక్కల పల్లెలల్ల సాటింపయ్యింది. 

(సశేషం)


No comments:

Post a Comment

Pages