జాతస్య ధృవో మృత్యుహుః
కనక దుర్గ
ఇవాళ రేపట్లో గేటెడు కమ్యూనిటీ అని కాకపోయినా, ఓవంద పైచిలుకు అపార్ట్మెంట్స్ లోవున్న అపార్ట్ మెంటది. ప్రత్యేకంగా అపార్ట్ మెంటుకు పేరయితే పెట్టారుకాని ఇప్పుడు అంతగా దానిగురించి అవసరంలేదు. కాకపోతే ఒకటి చెప్పాలి.అందులో వుంటోంది చాలావరకు పిల్లలు వేరే కంట్రీసు లో ఉంటూ తల్లిదండ్రులు వుంటున్నవాళ్ళు. కొంతమంది భార్యాభర్తలు యిద్దరూ జాబ్స్ చేస్తూన్న ఉద్యోగస్తులు ,సాఫ్ట్ వేరువాళ్ళు. పొద్దునపోయి సాయంత్రానికి వచ్చినా లైట్స్ వెలుగుతూ కళకళలాడుతూనే వుంటాయి యిళ్ళు.
మాఫ్లోరులోనే యిద్దరు ముగ్గురు వృధ్ధజంటలు ,ఓరెండు అపార్ట్‌మెంట్స్‌లలో కుర్రవాళ్ళు ,కుర్రవాళ్ళు అంటే మరీకాదు మధ్యవయస్కులు. ఒకదాంట్లో మాత్రం ఇంకా పెళ్ళిచేసుకోని కుర్రవాడు.పేరు శేఖరు. మిగతావాళ్ళకన్నా ఈశేఖరు మాత్రం తల్లో నాలికలా అందరి యోగక్షేమాలు కనుక్కొంటూ పెద్దవాళ్ళ మనసుల్లో మంచి స్థానాన్నే సంపాదించుకున్నాడు. రోజులు జరిగిపోతున్నాయి. ఎవరికేసాయం కావాలన్నా పిల్లలు దగ్గరలేని లోటు తెలీకుండా శ్రద్ధ కనపరచేవాడు. మధ్యవయస్కులు వున్నారుగాని వారిపనేమోవాళ్ళు. అప్పుడప్పుడు చిరునవ్వుల పలకరింపులు మాత్రమే. పలకరించటం ఆలశ్యం స్పందించే లక్షణమున్న నాకు నాపిల్లవాడి వయసున్న శేఖరు నాకు మరింతగా దగ్గరయ్యాడు.
వున్నట్టుండి ఒకరోజు ఏంచేస్తున్నారు ఆంటీ అంటూ లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. పనిలో వున్నారా ఆంటీ మీతో మాట్లాడాలి. కొంచెం సమయం యిస్తారా అన్నాడు. పరవాలేదులే పనులెప్పుడూ వుంటూనే వుంటాయి ఏమిటో చెప్పు అన్నాను. "ఆంటీ!! నేను చెప్పే విషయం వినిమీరు కోపగించుకోకూడదు. ఇక్కడ నాకున్న శ్రేయోభిలాషిగా పెద్దవాళ్ళు మీరే. సరేలే చెప్పు. ఎందుకీ ఉపోధ్ఘాతం. అన్నాను. ఆ! అదే ఆంటీ ,పిబ్రవరిలో పెళ్ళి చేసుకుందా మనుకొంటున్నాను. దానికి పెద్దలుమీరే. ఈపెళ్ళి అటు ఇటూ పెద్దవాళ్ళ కిష్టంలేదాంటీ. అయినా థైర్యం చేసి నిర్ణయం తీసుకున్నాను. ఆంటీ అయినా, సారిక, మంచిపిల్ల ఆంటీ మీరే చూస్తారుగా. నాతోపాటే పనిచేస్తోంది నేనంటే యిష్టపడుతోంది. మీఆశీశ్శులు, అండదండలు కావాలి ఆంటీ" అన్నాడు. ఒక్కసారిగా నామనసు సంకోచించింది. హాయిగా ఉత్సాహాన్ని తెలియజేయలేకపోయాను. నామటుకు నాకు యిలా పెద్ద లకు తెలీకుండా, ఇష్టంలేకుండా చేసికోవటం నాకు యిష్టం వుండదు. ఈరోజుల్లో పిల్లలు వాళ్ళిష్టమైనట్లు పెద్దల అంగీకారం లేకుండా నిర్ణయాలు తీసుకోవటం. "అంత పెద్దనిర్ణయం తీసుకున్నాక నేనెవర్ని. నాఅభిప్రాయంతో ఏంపని" అన్నాను. "అట్లాగాదు ఆంటీ 24 గంటలుమమ్మల్ని దగ్గరుండి గమనించేది అమ్మావాళ్ళకన్నా మీరే ఆంటీ. పెద్దవాళ్ళుగా కోపం తెచ్చుకోవటం తప్పుగాదు. ఆ చనువు అదీ మీకుంది.నన్ను నమ్మి నన్నుపెళ్ళిచేసుకోవటానికి సిధ్ధపడింది. మీరుచూస్తారుగా. మేము పెళ్ళిచేసుకొని వచ్చేసరికి మాకు హారతిచ్చి ,మొదటి ఆశీస్సులు మీరే యివ్వాలి. పెళ్లి స్నేహితుల అండదండలతో గుళ్ళో భగవంతుని సమక్షంలో, జరుగుతుంది. ఈవారం ఏర్పాట్ల తో కొంచెం హడావుడి గావుంటాను ఆంటీ" అనిచెప్పి వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిపోయిన తరువాత చాలాసేపు ఆలోచిస్తు వుండిపోయాను.అతని మంచితనం, కోపాన్ని పక్కకు పెట్టింది. ఈయన వచ్చి "ఏమిటి భోజనాలు అవీ లేవాఈపూట అనేదాకా అలా కూర్చుండిపొయాను. ఆ!విన్నారుగా ఆశేఖరు చెప్పింది. అదే ఆలోచిస్తున్నాను ఇప్పుడే వడ్డిస్తాను. అయినా మీరేం మాట్లాడరేం." అన్నాను. నేను మాట్లాడటానికేం వుంది. అక్కర లేకపోయినా అతనితో బాతాఖాని వేసి చనువు పెంచుకుందినువ్వు. అందుకే నీకుబాధ. నాకేం వుంటుంది. సార్ అంటే ఏం నాయనా అంటం అంతేగా. ముందూ అన్నంపెట్టు" అన్నారు. ఎప్పుడూ యింతే ఈమనిషి ఏదీ అక్కరలేదు, ఏమీపట్టించుకోరు అనుకుంటూ గొణుక్కుంటూ భోజనాల ప్రమేయంగా లోపలికి వెళ్ళాను.
అనుకున్నట్లుగానే ఇద్దరూ పెళ్ళిచేసుకొని పూలదండలతో వచ్చి మాకాళ్ళకు నమస్కారం చేశారు. ఏదో అనుకొన్నాను గాని సారిక బాగానేవుంది. ఈడుజోడుబాగానే వుంది. "వీరే మా ఆంటీ దంపతులు. ఇహనుంచి వీరే మనకిపెద్దదిక్కు." అనిపరిచయం చేశాడు మమ్మల్ని. ఆపిల్లగూడా "పిన్నిగారు ఒకరంటే ఒకరం యిష్టబడి పెద్దవాళ్ళనుకాదని పెళ్ళిచేసుకున్నాం. మాకు పెద్ద దిక్కై మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి" అంది. ఆమాటలు, నమ్రతగా పెద్దవాళ్ళను కాదనుకున్న బాధ ఆఅమ్మాయి మొహంలో, మాటలలో కనిపించి నన్ను కదిలించింది. "కొత్తదంపతులు కళ్ళనీళ్ళు ఎందుకు కాని చిలకా గోరింకల్లాగా ఒకళ్ళనొకళ్ళు అర్ధం చేసుకొని చక్కగావుండండి. పదండి" అంటూ ముందే ఏర్పాట్లు చేసినట్లుగా నాకుతోచినట్లు అలంకరించిన ఇంట్లో కి తీసుకెళ్ళిదిష్టి తీసి, హారతిచ్చి నాకు చేతనయిన విందు భొజనాలు పెట్టి బట్టలుపెట్టి ఆశీర్వదించాము.
రోజులు గడుస్తున్నయ్య. నేనూ గమనిస్తూనే వున్నాను. ఎక్కడో ఏమూలోవున్న శంక సారికని గమనించేటట్లు చేస్తోంది. నిజంగానే మంచిపిల్ల. అని నిశ్చయానికొచ్చాను. భార్యాభర్తలిద్దరూ మంచిమనసుతో అందరిలో కలివిడిగా వుంటున్నారు. శేఖరుకు తగినభార్య సారిక. వున్నట్లుండి ఒకరోజు "ఆంటీ ఆంటీ" అంటూ గబగబావచ్చాడు శేఖరు. వేరే కంట్రీసు లోవున్న అంతుపట్టని వ్యాధిని టివి లలో చూస్తూనేవున్నాము. ఈకరోనా మనదేశంలో కి కూడా వ్యాపించిందిట. ప్రభుత్వంగూడా హడావుడిగా రకలకాలచర్యలు చేపడుతోందిట. "జాగ్రత్తగా వుండండి, బయటకు వెళ్ళద్దు. ఏంకావాలన్నా నాకు చెప్పండి". అని హడావుడి గా చెప్పివెళ్ళాడు. ఇహరోజూ టి.విలలో ఎక్కడచూసినా యివే భీతి కలిగేటట్లుగా ప్రకటనలు, వార్తలు. ప్రభుత్వం లాక్ ఢౌను ప్రకటీంచింది ఒక ఊరినుంచి ఒక ఊరికి కదలటం కాని ఇల్లు దాటి అందునా 60 సంవత్సరాలు దాటినవారు అసలు కదలద్దని. జాగ్రత్తలతో హోరెత్తిపోతూ ఒకవిధమైన భయంతో టి వి లు గూడా ఆఫ్ చేసి కూర్చోటంగా వుంది. పిల్లలు ఫోనులలో కంగారుగా ఎలావున్నారని పరామర్శలు. పాపం శేఖరు అన్నీ చూస్తున్నాడురా. మీరెట్లా వున్నారని ఒకరినొకరు పలకరించుకోవటాలు. వేరేవేరే ఊళ్ళల్లోవున్న వారి గురించి ఆరాటాలు ,ఆందోళనలు. ఏమిచేయలేని నిస్సహాయతలో రోజులుగడుస్తున్నాయి. కడుపున పుట్టిన పిల్లలు దగ్గరగా వుంటే ఏంచేసేవాళ్ళో ఏమోకాని శేఖరు మాత్రం కాలు కదపనీయకుండా, గడప దాటనీయకుండా చూసుకుంటున్నారు. ఏనాటి జన్మబంధమోగాని. జన్మబంధమో రుణానుబంధమో. క్రమేపి భయాందోళనలు ఎక్కువైనాయి. ఎక్కడోవున్నవి సమీపాలలోకి రావటం, బంధువులను కోల్పోవటాలు చూడలేని అసహాయతలు, ఎన్నడూ వినని, కనని పరిస్థితులు బెంబేలు పరుస్తున్నాయి. ఇట్లాగే అనుకొంటూ శేఖరుతో ఒకరోజు "ఆశర్మగారు వాళ్ళు కనపడటంలేదు, ఊరేమన్నా వెళ్ళారా ఎట్లావెళ్ళారో" అన్నాను. "అలాగా కనుక్కొంటాను" అంటూ వాళ్ళ గుమ్మం ముందు నుంచొని శర్మగారు అని ఒకటికి రెండుసార్లు గా పిలిచినా పలకకపోయేసరికి లోపలికి వెళ్ళి తొంగిచూస్తే జ్వరంతో యిద్దరూ మూలుగుతూపడుకొని వుండటంచూసి "అయ్యో డాక్టర్ వద్దకు వెళ్ళారా మందులు వేసుకున్నారా" అంటూ గబగబా "పదండి" అంటూ డాక్టర్ దగ్గరకు తీసికెళ్ళాడు. డాక్టర్ ఏవోమందులు యిచ్చారు. వర్కఫ్రమ్ హోం తో ఇంట్లోనే వుండటంతో సారిక చేత వాళ్ళకు కావల్సిన సదుపాయాలు సమకూర్చాడు. దంపతుల మంచిమనసులను చూసి భగవంతునికి చేతులేత్తి నమస్కారం చేసుకున్నాను.. రెండురోజులైనా మార్పులేకపోవటం, పైపెచ్చు కొంచెం ఆందోళనగా అనిపించి ఆస్పత్రిలో చేర్పించాడు. వాళ్ళూ అన్ని టెస్టులు చేసి కోవిడ్‌గా నిర్ధారించారు. ఎవరినీ రానీయటంలేదు అయినా పాపం రోజు వాళ్ళపరిస్థితి కనుక్కొంటూనే వున్నాడు. ఓనెలరోజుల పోరాటానంతరం కొద్దిగా కోలుకొని డిశ్చార్జ్ అయి ఇంటికివచ్చి శేఖరు లేకపోతే ఏమయిపోయేవాళ్ళమో అని, కృతజ్ఞతలు ఎలాచెప్పాలో అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. "అయ్యో అలా అనకండి పెద్దవాళ్ళు భగవంతుని దయవల్ల బాగుంది . రెస్టు తీసుకోండి ఐసలే నీరసంగావున్నారు" అనివాళ్ళని నెమ్మదిపరిచాడు. రోజులు గడుస్తున్నాయి. "ఏమిటే శేఖరు ఈమధ్య దగ్గుతున్నట్లున్నాడు. ఎట్లావుంది అన్నిటికీ పాపం తిరుగుతున్నాడు" అన్నారు ఏమీపట్టించుకోని ఈయన. "నాయనా శేఖరు డాక్టర్ వద్దకు వెళ్ళిరండి సారిక ని గూడా తీసుకొని" అన్నారు. "ఏమిటి శేఖరు సారిక సరిగా కనపడటంలేదు?" అని అడిగాను. "ఏమిటో ఆంటీ ఈమధ్య ఎక్కువగా పడుకొంటోంది" అన్నాడు. ఇంతలో సారిక పెద్దగా దగ్గుతూ ఆయాసపడుతున్నట్లు గా అనిపించింది. "చూడు శేఖర్," అంటూనే వున్నాను. గబగబా లోపలికి వెళ్ళిన శేఖరు "ఆంటీ సారిక బాగా ఆయాసపడుతోంది, డాక్టర్ వద్దకు తీసుకెళుతున్నా" అని కేకపెట్టాడు. వెంటనే వెళ్ళాడు. వాళ్ళువెళ్ళారుగాని నాకే కాళ్ళు చేతులు ఆడటంలేదు. శేఖరు ఫోనుకోసం ఎదురు చూస్తున్నాను. సాయంత్రంఅయింది నాకు కంగారు ఎక్కువైంది. ఏమీ చేయలేకపోతున్నాను.
అంత ఫోను రింగ్ అయింది. ఈయనఫోను తీసి అయ్యో అలాగా జాగ్రత్త నాయనా ఫోనుచేస్తూవుండు అంటున్నారు. ఏమయిందండీ అన్నాను. పాపం అమ్మాయిని అడ్మిట్ చేయమన్నారుటే టెస్టు లు చేస్తున్నారట. ఇంతలో మళ్ళీఫోను ఆంటీ సారిక కీ కరోనాట. వెంటిలేటర్సు పెడుతున్నారు.
అయ్యో అదేమిటి నాయనా అంటూనే వున్నాను. ఫోనువదలి గబగబా శేఖరు అవతలికి వెళ్ళినచప్పుడు పరికిస్తున్నాను.శేఖరు పెద్దగా "సారికా" అంటూ ఏడుస్తున్న చప్పుడు. అయ్యో ఏంజరుగుతోంది. ఏమండి శేఖరు ఏడుస్తున్నాడండి నాకేంఅర్ధం కావటంలేదు. ఇంతలో అవతల ఎవరండి శేఖరు మీకేమవుతారు. సారీ అండి భార్యవెళ్ళిపోయిన బాధలో అతనికి కూడా కార్డియాక్అ రెస్టు అయింది. ఫారములో మీఅడ్రస్సే వుందండీ. డాక్టర్ చెప్పేమాటలు ఇంకేమీ నాచెవినబడటంలేదు. ఈగందరగోళానికి బయటకువచ్చి పరిస్థితి తెలుసుకున్న శర్మగారు దంపతులు నివ్వెరపోయి నించున్నారు..
భగవంతుని లీలలుఅర్థంకావు. ఆయన లెఖ్కేమిటో తెలీదు. లేకపోతే చిన్నపిల్లలు అందరికీ అంతచేసినవాళ్ళపట్ల భగవంతుని చిన్నచూపు. ముక్కపచ్చలారని పసిపిల్లలు.ఆయనకి మనసెట్లా ఒప్పిందో. పుట్టినవాళ్ళు గిట్టకమానరు. అందరు అనేమాటే. అయితే మటుకు మరీ యిట్లానా. ఏమిటో....ఏమిటి ...చేయటం.అయ్యో... జాతస్య ధృవో మృత్యుహుః
***
No comments:
Post a Comment